కవిత్వం

మెలకువను మింగిన రాత్రి

26-ఏప్రిల్-2013

కనురెప్పల కావల దాగిన ప్రతిబింబాలను
నలుపు తెలుపు రేఖా చిత్రాలుగా మార్చుకొని…

గాలిపటాన తోక చివర అతికించి
నల్లని ఆకాశాన ఎగురవేద్దామని…

తోకను కత్తిరిస్తూ ఓ తోక చుక్క తన దేహ
కాంతిని ఓ క్షణమిచ్చి మాయమయింది…

ధడాలున నేలనంటుతూ కల చెరిగిపోని
వర్ణ చిత్రంగా ఆ పచ్చ గడ్డి కొసలపై మెరుస్తూ….

రాతిరంతా కురిసిన వాన
తడి ఆరని బురద మట్టిలో ఇంకిపోతూ…

రెక్క తెగిన పక్షి ఒకటి ఈ కాగితాన్ని
ముక్కున కరచి కుంటుకుంటూ…

చిరిగిన జెండా గుడ్డనే ఎగురవేస్తూ తూటా
దిగబడ్డ కాలితో ఓ యువకుడు పరుగులెడుతూ…

నెత్తురంటిన ముఖంతో ఖిన్నుడై
ముఖం చాటేసిన చందమామ ఆకు చాటున దాగుతూ…