కవిత్వం

రాతి బొమ్మల కొలువు..

26-జూలై-2013

మాటలన్నీ నిశ్శబ్దాన్ని కావలించుకొని
గొంతు దాటని స్వరమేదో మూగగా ఆలపిస్తూ..

పారుతున్న నదీ పాయ ఒక్కసారిగా
ఇసుక తిన్నెలోకి జారిపోతూ

అరచేతుల గుండా ప్రవహించిన
విద్యుత్ వేలి చివరనే ఆవిరవుతూ

ఒక్కో క్షణం వానలో తడిసిన
మట్టి గోడలా కరిగిపోతూ..

ఎండుటాకును తాకిన వాన
తడి జారిపోతూ…

జ్నాపకాలేవి మిగుల్చుకోలేని
నీ నిస్సహాయత

నీ మౌనపు భారాన్ని మోయలేని
నా అసహాయత

ఎదురెదురుగా కూలబడ్డ
రాతి బొమ్మల కొలువు..