కవిత్వం

దాహపు నది

09-ఆగస్ట్-2013

కళ్ళలో నిలవని దుఃఖం
గుండె దోసిట్లో

శూన్యమైన మనసు మబ్బు
కుండలా నిశ్చలంగా

మౌనపు రంపపు కోతకు
ఎద గురవుతూ

దేహం నిలువెల్లా గుంజకు
కట్టినట్టుగా రెక్కలు తెగిపడి

కలవని కూడలి మధ్య
ఆగిన నడక

తెరమీద నలుపు తెలుపు
అలల నీడలు

ఉగ్గబట్టిన శ్వాస నిట్టూర్పు
ఆఖరి చరణం

దాహపు నది గొంతులో
క్షణ క్షణం ఇగిరిపోతూ

ఇసుక పరచుకున్న రాదారి
మధ్యలో తెగిపడి

అసంపూర్ణ వాక్యాన్నిపద్యం
చేసే విఫలయత్నం…