కవిత్వం

ఆట

17-మే-2013

ఆకాశం చదివేసిన పాత పుస్తకం
చంద్రుడు ఎన్నేళ్ళు వచ్చినా
అదే వేషం వేసే ముసలి కథానాయకుడు
కనుమరుగైన తారల స్థానాన్ని
మళ్ళీ అటువంటి తారలే భర్తీ చేస్తాయి
ఇరు సంధ్యలు ఒకే నృత్యాన్ని
క్రమం తప్పకుండా ప్రదర్శిస్తాయి.

రాత్రి, పగళ్ళు కలిపి కుట్టిన జలతారు వస్త్రాలు
ఋతువులు మారి మారి వచ్చే వాటి అంచులు.

చుట్టూ మంచు కప్పబడినప్పుడు
చెట్లు యోగ ముద్ర దాలుస్తాయి
అది కరిగాక అదే చెట్ల మీద
అవే పువ్వులు వలస పక్షుల్లా వచ్చి వాల్తాయి
అవే వానలు, అవే ఎండలు
అలాగే కురిసి, మెరుస్తాయి
రాలే ఆకుల మీద అవే రహస్య హస్తాలు
రంగురంగుల సంతకాలు చేస్తాయి.

మళ్ళీ యోగ నిద్ర.

ఎడతెగని ఏమార్పూలేని ఈ ఆటని
ఏమాత్రం విసుగులేకుండా
అనంతకాలం ఆడాలంటే
ఎంత బాలుడై ఉండాలి!