కవిత్వం

రోజుల బొమ్మలు

17-మే-2013

పగలంతా కాలం నదిలో
దృశ్యాలు, ముఖాలు, ఉద్వేగవలయాలు ప్రవహించిపోతాయి
నది ఒడ్డున చెట్టులా నిలిచి
నదిమీద వల విసిరినట్టు నా చూపుల్ని విసిరి జీవనసారాన్ని సేకరించుకొంటాను.
సాయంత్రమవుతుంది
నా రోజులపత్రాలు సాయంత్రంలాగే రంగులుమారి చీకటిలో రాలిపోతాయి

మరొకరోజుని రాల్చుకొన్న చెట్టునయి
చీకటితో నల్లబడిన కాలం నదిలో నా ప్రతిబింబం జాడ వెదకబోతాను
చెట్టూ, నదీ, ప్రతిబింబమూ, చీకటీ ఒకటే దిగుల్లోకి తమని కోల్పోతాయి

తమ స్వభావాల్ని మరిచి
తన ప్రతిబింబాలలోకి నది తానే ప్రవహిస్తుంది
చెట్టు ప్రతిబింబం చెట్టులోకి ప్రవహిస్తుంది
సమస్తాన్నీ దాచవలసిన చీకటి సమస్తంలో దాగొంటుంది

జీవితం పసిపాప ఇవాళ్టి పగటిబొమ్మని పట్టుకొని
‘ఇది కూడా నే కలగన్న బొమ్మకా’దని శూన్యంలోకి విసిరేసి
చిరంతన శాంతిలో కొత్తబొమ్మని కలగంటుంది