కథ

రంగ పిన్ని ఆకాశం

జూలై 2013

నాకు రంగ పిన్ని అంటే చాలా ఇష్టం, ఎంత ఇష్టమంటే అమ్మ కన్నా ఇష్టం . అమెరికా నుంచి సెమిస్టర్ break కోసం ఇండియాకి వచ్చిన మర్నాడే , పిన్ని ఇంటికి వెళ్ళాలి అన్నంత ఇష్టం . అమ్మ చంపేస్తుందని ఆగాను గానీ, లేదా అక్కడే దిగేదాన్ని. అందుకే అమ్మ చెప్పిన మాట విని , తాగుతున్న ఫిల్టర్ కాఫీ గొంతులో గరళం అయిన ఫీలింగ్ వచ్చింది . ” రంగ విషయం ఏమీ తెలీదురా .. మారిపోయింది పూర్తిగా, నాకేం నచ్చలేదు ” అన్నది అమ్మ. ” అదేంటమ్మా అలా అంటావ్? రంగ పిన్ని ఏం చేసింది? బాబాయితో ఏమన్నా గొడవా ? ” నా ఆదుర్దా స్వరానికి, అంతకన్నా అసహనంగా సమాధానం ఇచ్చింది అమ్మ – ” అతనితో గొడవేమో గానీ, ఈవిడే విచిత్రంగా ప్రవర్తిస్తోంది, అర్ధం కాని మాటలు మాట్లాడుతూ.. అస్తిత్వం అంటుంది, పోనీ ఇక్కడకి రా అంటే రాదు, తన సమస్య తనే పరిష్కరించుకుంటాను అంటుంది . విసుగెత్తి, ఫోన్ చేయటం, మాట్లాడటం మానేసాను !”

నాకెందుకో, అమ్మ స్వరం నచ్చలేదు.. స్వరం వెనుక , తెలీని ఈర్ష్య ధ్వనించినట్టయి ఎందుకో ఆశ్చర్యం అనిపించింది. ఏదీ నచ్చలేదు, తాగుతున్న కాఫీ, అమ్మ మాట, వాతావరణం అన్నీ ..! నేనేమీ అనలేదు. తొందర పడదల్చుకోలేదు. నెమ్మదిగా అన్నాను `” కనుక్కుందాం లే ` అని , ఆ మాటతో శివంగిలా చూసింది అమ్మ నా వైపు – ” నేనేం చెప్పినా నీకు అర్ధం కాదు కదూ .. ఇదిగో ప్రవీణా , ప్రతీ ఇంటికీ కొన్ని విషయాలూ, పద్ధతులూ ఉంటాయి. అలాగే ప్రతీ మనిషికీ కొన్ని సాంప్రదాయపు విలువలు కూడా, అలాంటి విషయాల్లో నువ్వు ఎక్కువగా కల్పించుకోకు. అప్పుడు నిన్ను అనరు, నీకు నేర్పి పెట్టానని నన్ను అంటారు. పిన్ని గురించి నువ్వు ఎక్కువ ఓ ఇదయిపోవటం నాకు నచ్చదు. నాన్నగారికి కూడా “- ఖండించిపడేసింది అమ్మ , నాన్నగారి పేరు కూడా సాయం తీసుకుంటూ. ప్రేమతో `వీణా’ అని పిలిచే పిలుపు నుండి , ప్రవీణ కి ప్రమోషన్ రాగానే అర్ధం అయింది విషయం ఏదో సీరియస్ అని . నేను అవునూ కాదూ అన్న టైప్ లో తలూపి అక్కడకి తప్పించుకున్నాను .

రంగ పిన్ని – రంగనాయకి , మా అమ్మకి ఏకైక చెల్లెలు. అమ్మకీ తనకీ ఒక ఆరేళ్ళ వయసు తేడా ఉంది . కానీ, ఇద్దరి పెళ్ళిళ్ళు ఒక సంవత్సరం తేడాలో అయ్యాయి. దానికి రంగ పిన్ని అందం, గుణగణాలు కారణం అని మా బంధువులందరి సామూహిక తీర్మానం . రంగ పిన్ని పిల్లలు ప్రదీప్తి, అరుణ్ నాకంటే చిన్నవాళ్ళు. ఇద్దరూ హాస్టల్స్ లో ఉండి చదువుకుంటున్నారు. ఇంట్లో అయితే చెడిపోతారు అని రంగపిన్ని భర్త, CA కృష్ణమాచారి గారి నిశ్చితాభిప్రాయం. ఆయనో ఛార్టర్డ్ అకౌంటెంట్. జీవితాన్ని, బాధ్యతలనీ చక్కగా తూకంగా నడిపే కుటుంబం.

ఇక రంగ పిన్ని- అందం, అణకువ, సాంప్రదాయం, విలువలు,చక్కటి పాట, అమృతం లాంటి వంట, మంచి ఆతిధ్యం, ప్రేమ ఇవన్నీ మిక్సీ లో వేసి నిన్ను బ్రహ్మ సృష్టించాడు పిన్నీ, నీలా ఉండాలి ఎవరైనా .. అన్నాను ఒకసారి . పిన్ని నవ్వేస్తూ- ” మంచితనం, అణకువ అంత బరువు ప్రపంచంలో ఇంకేదీ లేదు నాన్నా … నాలా వద్దు , నీకు నచ్చినట్టు ఉండాలి అని అనుకో !” అన్నది .
ఇలాంటి ఎన్నో, చెరుపు మరుపు సంఘటనలు తలచుకుంటూ, నిద్రపోయాను అనిపించాను. రంగ పిన్ని వాళ్ళు, మేము ఉన్నది ఒకటే సిటీ అయినా, సుమారు ఇరవై కిలోమీటర్ల దూరం , రెండు గంటల ట్రాఫిక్ తలచుకుంటూ, ” పొద్దున్నే వెళ్లిరావాలి వాళ్ళ ఇంటికి !” అనుకుంటూ, కలత నిద్రలోకి ఎప్పుడు జారుకున్నానో గుర్తే లేదు.

***

రంగ పిన్ని వాళ్ళ అపార్ట్మెంట్ ముందు ఆలోచిస్తూ నేను – డోర్ కి ఒక ప్రక్కన క్రోం ప్లేట్ తో C.A కే.కృష్ణమాచారి , ప్రక్కన బాబాయి డిగ్రీలు, అధికార హోదా .. రెండోవైపు ఒక అట్ట మీద నీట్ గా కట్ చేసి , రంగుల స్కెచ్ పెన్ తో, చేత్తో రాసిన పేరు ` రంగ నాయకి, మ్యూజిక్ టీచర్ , క్లాసు వేళలు- పొద్దున్న 6-10 సాయంత్రం 6-8 ” ఒకటే సారి రెండు ప్రపంచాల పరిచయం లా అనిపించింది. లోపల నుండి బిలహరి రాగం స్వర జతి ” పలుమారులుగా రవమున నిన్ , పిలచిన పలుకవు అలుగకు రా .. కరివరదా మరి మరి నా ..” శృతి బద్ధంగా చిన్నా పెద్దా గొంతుల కోరస్ వినబడుతోంది . కాలింగ్ బెల్ నొక్కాలా వద్దా అన్న సందేహంలో నేను – ఓహ్ ప్రవీణా నువ్వా? అని వెనుకనుండి వినబడగానే ఆశ్చర్యపోతూ ,వెనక్కు తిరిగాను. వెనుకాల బాబాయి చేతినిండా సంచీలతో, కొన్ని తాజా కూరలు, ఇంకా బ్రెడ్ లాంటివేవో తొంగి చూస్తున్నాయి వాటిల్లోంచి . ” రా రా ` అంటూ కొంచం నవ్వుతూ, లోనకి పిలిచారు బాబాయి. అయన వెంట ఇబ్బందిగా నేను – చివరి సారి బాబాయి తలుపు తీసింది ఎప్పుడా అని ఆలోచించుకుంటూ. కొంచం ముభావంగా ఆయన – మీ పిన్ని కోసం కదూ? – తను ఆ గదిలో ఉంది..!” అని చెప్పి లోనకి వెళ్ళిపోయారు , నా సమాధానం , పలకరింపు దేనికోసం ఎదురు చూడకుండా ..!!

సరే నని , పిన్ని గది లోకి ప్రయాణం . అది మూడు బెడ్రూమ్స్ ఇల్లు . ఒకటి ఎప్పుడూ బాబాయి ఆఫీస్ కం బెడ్రూమ్ గా వాడటం అలవాటే, అలాగే హాల్ లో సగం కూడా ఆయన కోసం వచ్చేవాళ్ళకి . ఒకటి గెస్ట్ రూమ్ . ఇంకోటి పిల్లలు , పిన్ని ఉండేవాళ్ళు . ఇప్పుడా గెస్ట్ రూమ్ పిన్ని టీచింగ్ రూమ్ గా మార్చినట్టు ఉంది . కొంతమంది స్కూల్ యూనిఫారం లలో , కొంతమంది రకరకాల డ్రెస్ లలో పిల్లలు ఉన్నారు , ఇద్దరు టీనేజ్ అమ్మాయిలూ, ఒక ఇద్దరు ఆంటీలు కూడా . వాతావరణం ఉత్సాహంగా ఉంది, మధ్యలో నవ్వుతూ విరబూసిన పువ్వులా రంగ పిన్ని. ఎప్ప్పుడూ ఫ్రెష్ గా , అందంగా కనిపించే పిన్ని, ఇవాళ ఇంకా అందంగా, ఆహ్లాదంగా ఉన్నట్టు అనిపించింది. నుదుట పూజ చేసి పెట్టుకున్న అడ్డబొట్టు, తను ఎప్పుడూ పెట్టుకొనే తిలకం నిలువుగా, కింద కుంకుమ బొట్టు తో ఏంటో వింత శోభ గా ఉంది . సంగీత పాఠం చెపుతూనే, నన్ను వోప్రక్కగా కూర్చోమని సైగ చేసింది. వెంటనే తను పాఠం లో పూర్తిగా లీనమైపోయింది. పూర్తి క్రమశిక్షణ తో, అందర్నీ ఒకేలా చూస్తూ, పెద్దవాళ్ళు తప్పు పాడినా, సున్నితంగానే అయినా , నిక్కచ్చిగా కరక్ట్ చేస్తున్న పిన్నిని చూస్తూ టైం ఎంత అయిందో తెలియనే లేదు .

“ఏంటి వీణా.. అంత దీర్ఘాలోచన ..!” అని పిన్ని నవ్వుతూ, కుదిపేదాకా ” హ.. పిన్నీ, క్లాస్ అయిపోయిందా ? ” అంటే ..” ` అయిపోయిందిరా .. కాఫీ తాగుతావా ? ` అంటూ, అదే గదిలో అప్పటిదాకా నే గమనించని కర్టెన్ జరుపుతూ , అప్పుడే చూసా – కర్టెన్ వెనుకాల , పొందిగ్గా అమర్చిన చిన్న వంటిల్లు , ఆ బెడ్ రూమ్ బాల్కనీ ని కలిపేస్తూ, చిన్న యుటిలిటీ కూడా. ` ఏంటి పిన్నీ ఇదంతా .. మరి నీ వంటగది, మిగతావి , ఏదేదో విన్నాను ??’ నిన్నటినుండీ సాగుతున్న మధనం – ఒక్కసారి విస్ఫోటనమా , అన్నట్టు ప్రశ్నల్లా వర్షించాయి.

పిన్ని ఫకాల్న నవ్వింది – `చూసావా నువ్వుకూడా నీ వంటగది ఏమైపోయిందో అని గాభరా పడ్డావు, ఆడవాళ్ళు , వంటగది రెండూ ఒకటేనా ? ” అడిగింది పిన్ని కాఫీ అందిస్తూ.

” అహహ.. కాదు పిన్నీ, అమ్మ ఏదో చెప్పింది , నువ్వు ఏదో కొత్త పని చేసావు అని, ఎవరిమాటా వినటం లేదని ..!!” నసుగుతూ నా గొంతు నాకే తెలీని సంకోచం ధ్వనిస్తూ..!

“అవన్నీ చెప్పేముందు , నీకో మాట చెప్తాను వీణా – రాసిపెట్టుకో ఎక్కడైనా ” మనలా మనం బ్రతకటం యుద్ధం కన్నా తక్కువేమీ కాదు, కానీ .. మనవాళ్ళు మనల్ని అర్ధం చేసుకుంటారు అనుకోవటం మాత్రం మన సంకుచిత మనస్తత్వం , అసలు మనవాళ్ళు అనే పరిధి మారాలి అని నాకు అనిపిస్తుంది ” అన్నది పిన్ని. సోషల్ సైకాలజీ లో మా ప్రొఫెసర్ చెప్పిన మాటలు గుర్తొచ్చాయి, – చాలా మటుకు భావ విప్లవాలు కేవలం అసహనాలుగా మిగిలిపోవటానికి కారణం , మనలో ఉన్న అవగాహనా లోపం, మనకి తెలిసిన చిన్న పరిధిలోని మనుషులు మనల్ని అర్ధం చేసుకొని , ప్రేమించి, మన నిర్ణయాలు ఆమోదించాలి అనుకోవటం – అంటారు ఆయన . ఇంచుమించు పిన్ని చెప్పింది అదేగా ..!

పిన్ని సాలోచనగా చెప్పటం మొదలెట్టింది – ” నా వయసు ఇప్పుడు నలభై వీణా, పెళ్లి అయి ఇరవై రెండేళ్ళు. నా వయసు పద్ధెనిమిది పెళ్ళికి . ఏమీ తెలీదు. అక్క అంటే గౌరవం. అమ్మ, నాన్న అంటే ప్రేమ, గౌరవం. చేసుకోమన్నారు . నీకు మంచి భవిష్యత్ ఉంది చేసుకో అని. పెళ్ళికి మీ బాబాయి CA పరీక్ష తో కుస్తీ పడుతున్నారు. చిన్న ఉద్యోగం. అది నాకేనాడూ ఇబ్బంది కలిగించలేదు . ఇబ్బందల్లా మీ బాబాయి ప్రవర్తన తోనే, సాంప్రదాయం మూటకట్టి ఆ వాసెన తీయకుండా పెంచారు మా అత్త మామలు.సాంప్రదాయం లో చాలా హింస ఉంటుంది వీణా , అది పూజల వెనుక, ఆచారాల వెనుక దాగిఉంటుంది . అవసరం అయినప్పుడు , పూజసామాను తోమినట్టు, భార్య లేదా కోడలు ని ఆ భారం ఎలా తలకెత్తు కోవాలో చెప్తారు, వాళ్ళని వీలైనంత తోముతారు .భార్య అంటే ఒక ఇన్స్ట్రుమెంట్ , అదే సుఖానికీ., మిగతా పనులకీనూ. పెళ్ళయి ఆరేళ్ళ దాకా మాకు వేరే బెడ్ రూమ్ తెలీదు. లేదని కాదు , వేరే బెడ్ రూమ్ మేము వాడకూడదు. హాల్లో నలుగురి మధ్య పడుకొని, రాత్రి ఆయన పిలిచినప్పుడు వెళ్ళాలంటే సిగ్గుతో, అసహ్యంతో, ప్రాణం పోతున్నట్టు ఉండేది . అది కూడా తలుపులు వేసుకోకూడదు. జారవేయాలి. మా అత్తగారు ఎదురుగా హలో మంచం వేసుకొని పడుకొనేవారు. ఏ నిమిషాన ఎవరి కంట పడతామో అన్నట్టు సాగిన సాంసారిక జీవనం లో , ఎలా అయితేనేం ఇద్దరు పిల్లలు పుట్టేసారు. మా అత్తగారు కాలం చేసారు. కానీ, వాళ్ళు నేర్పినవి ఆయనలో పూర్తి సజీవంగా ఉన్నాయి అని తెలుసుకోనేసరికి నాకు , ఇదా నేను అనుభవిస్తున్న జీవితం అనిపించింది. సంగీతం నేర్చుకున్నాను. కానీ పాడకూడదు , పాట భోగం వాళ్ళది . చక్కగా రాయగలను, కుట్లు, అల్లికలు వచ్చు, ఎవరికీ ఏదీ చేయకూడదు, ఎందుకంటె ఒక CA భార్య గా నాకా అవసరం లేదు . నీకేమీ రాదు , నేను దయ తలచి చేసుకున్నాను అంటే, అంతకంటే దయగా నవ్వాలి. ఇంతోటి అందానికి , నీకు నిక్కు ఎక్కువ అంటే, నిజమేనేమో అని ఆలోచనలో పడాలి. పిల్లల మధ్యలో పడుకున్నా, పిలిచినప్పుడు వెళ్ళాలి. ముఖ్యంగా అతని సుఖం అయిపోయిన తర్వాత వచ్చేయాలి. ఎదురు తిరిగితే , ఏంటీ వాదన? ఎవరున్నారు నీకు? ఎవడ్నో చూసుకొని ఇలా మాట్లాడుతున్నావా ? నిజానికి అతను మాట్లాడే మాటలు అబద్ధాలు అని అతనికి కూడా తెలుసు. కానీ నిజాన్ని, లాజిక్ ని ఎలాగో ఒకలాగా కంట్రోల్ చేయాలి. ఎలా ? పూర్వకాలం అయితే, పురాణ కధలు చెప్పేవారు. ఇప్పుడు అవి అవుట్ డేటెడ్ అయిపోయాయి. నీకు బాధ్యతలేదు, ఆడదానివి కాదు… ఇలాంటి ఏదో ఒక వాదన కావాలి. ఒక కారక్టర్ అస్సాసినేషన్ కావాలి. మనం అది పట్టుకొని నెలల తరబడి ఎమోషనల్ గా ఉంటాం కదా…! ఒక వాషింగ్ మెషిన్ , ఫ్రిజ్ , ఏసీ కి ఎమోషన్స్ ఉండకూడదు కదూ …!” ఒక్కసారి భోరుమంది పిన్ని . గడ్డకట్టిన ఆ ఆవేదన చూసి నాకు మాట రాలేదు … తన మదిలో ఉన్నది అలజడి అనుకున్నాను, సునామీ అని గమనించి .

బాత్రూం లోకి వెళ్లి మొహం కడుక్కొని వచ్చి కూర్చొని మళ్ళీ మాట్లాడింది రంగ పిన్ని- ” నేను చాలా ఆలోచించాను వీణా ? ప్రతీ నిమిషం, ఇంట్లో ఒక అందమైన వస్తువు లాగ గడిపి, గడిపి అలసిపోయాను. వచ్చేవాళ్లకి మర్యాదలు, ఇన్ని రకాల వంటలు, పిల్లలకి బెస్ట్ పెంపకం, … వీటన్నింటి విలువ – ఒక మంగళ సూత్రం , అంతే అనిపించింది. నాకంటూ ఫ్రెండ్స్ లేరు . అందరికీ మిసెస్ కృష్ణమాచారి . నాపేరు కూడా ఆయన సర్కిల్ లో ఎవరికీ పెద్దగా తెలీదు. అసలా అవసరమే లేదు . ” – ఏదో ఆలోచిస్తూ ఆగిపోయింది పిన్ని .

అంటే పిన్నీ.. నువ్వు ఎప్పుడూ , బాబాయి గురించి ఏమీ చెప్పలేదు ..? – నా సంకోచపు ప్రశ్న
చిన్నగా నవ్వింది పిన్ని – ” పెళ్ళైన ఇన్నేళ్ళలో సంవత్సరానికి ఒకసారి కంటే ఎక్కువ కొట్టలేదు వీణా నన్ను, ఆ విషయం వోప్పుకోవాలి. చాలా వాదనలు, ప్రపోజల్సూ, నా కోరికలూ ఒక చెంపదెబ్బ తో నిశ్శబ్దం అయిపోయేవి . నిజంగా దానికన్నా, నన్ను ఎక్కువగా బాధ పెట్టేవి చాలా కేజువాల్ గా అతను వాడే ` ఆడ ముండ, ఆడ లంజ” లాంటి పదాలు. అతన్ని బ్రతిమాలుకున్నాను, అత్తమామల దగ్గర నుండీ , మీ అమ్మ దాకా అందరికీ చెప్పుకున్నాను. అందరూ ఒక్కో కారణం చెప్పారు, బయట పని స్ట్రెస్ అన్నారు, అలవాటు అన్నారు, ఇంకా ఏవేవో అన్నారు. నువ్వు మారితే , అతనికి కోపం తగ్గుతుంది అన్నారు. ప్రశ్నించ వద్దన్నారు. అన్నీ చేసాను. తిరుప్పావై నేర్చుకోవటం దగ్గరనుండీ , గోదా కళ్యాణాలు జరిపించటం వరకూ..! ఏదీ వదలలేదు. అతని వైష్ణవం పూర్తిగా ఈ ఆడ ముండ భుజాల మీదే..! అతనేం మారలేదు. కొట్టటం తగ్గించాడు కదా, సర్దుకుపో అన్న మనవాళ్ళ కి చెప్పటానికి నా దగ్గర సమాధానం లేదు ..!” అతను తెచ్చిన ప్రతీ పుస్తకం నేను కూడా చదివాను వీణా.. వెర్బల్ అబ్యూస్ భరించటం , తాపులూ తన్నులూ కంటే తక్కువేం కాదు ..! నరనరం కోసేసినట్టు ఉంటుంది. ఏదీ కనబడదు.. మనసులోని తడి ఆరదు కూడా..!! కొట్టినందుకు ఏడుస్తానా, లేదా ఆ బూతుల మాటలకా ..ఇంకా సందేహమే” – తనలో తనే మాట్లాడుకుంటున్న పిన్ని, ఎన్ని సంవత్సరాల వేదన !

ఇంకా నేను ఏదో చెప్పేలోగా పిన్ని మాట్లాడుతోంది, అతి మంద్రం నుండి, మార్దావాన్నీ ,అణకువనీ విదిలించుకున్న స్వరంలా – ” బాధ పడితే, భరించలేకపోతే, వదిలేయ్.. అంటారు మీ అమ్మావాళ్ళు. ఎవరు, ఎన్నాళ్ళు తీర్చగలరు మన బాధల్నీ, మనం ఇన్నేళ్ళు మోసిన బరువునీ ? ఇదే మాటతో, నువ్వు వదిలేయగలవు, నీకు పొగరు ఎక్కువ అనే ఒక ట్యాగ్ లైన్ కూడా ! నేనే కాదు మనసులో లేని బంధాన్ని ఎవరైనా వదిలేయగలరు వీణా.. సగం పైన కాపరాల్లో, శరీరమే తప్ప మనసు పంచుకొనే బంధాలు ఎన్ని ఉన్నాయి?’
వేసవి కాలంలో ఆగి ఆగి వీచే వెచ్చనిగాలిలా ..మళ్ళీ మాట్లాడుతోంది పిన్ని- ” కానీ, కధల్లో, నవలల్లో రాసినట్టు , ఈ జీవితంలో ఇరవై రెండేళ్ళు గడిపిన తర్వాత , నేనెందుకు అన్నీ త్యాగం చేసి వెళ్లిపోవాలి వీణా ? ఆమె అన్నీ వదులుకొని ఉత్సాహంగా తూర్పు వైపు ప్రయాణం చేసింది – అని రాస్తే నాకు వొళ్ళు మండుతుంది. నేను , నా ,శ్రమ, యవ్వనం, కష్టం .. పిల్లల్ని పెంచటంలోనూ, ఈ ఇంటిని మెరిపించటం లోనూ గడిపేశాను. ఇప్పుడు నాకింకో పని రాదు. బయట దొరికే పనికి నా క్వాలిఫికేషన్ సరిపోదు . పిల్లలకి ఇలాంటి జీవితం ఇవ్వలేను . ఇన్నాళ్ళూ ఆయన నన్నీ జైలు లో పడేసారు. దీనికి అతన్నే కాపలాదారు గా చేస్తే, అనే ఆలోచన వచ్చింది. ప్రదీప్తి తోనూ, అరుణ్ తోనూ విడివిడి గా , కలిపి కూడా మాట్లాడేను. నేను అనుభవించిన జీవితం కొంత వాళ్లకు తెలుసు. ఈ నిశ్శబ్దాన్ని , కుటుంబ గౌరవం అనుకుంటూ కాపాడటంలో వాళ్ళు కూడా ఎమోషనల్ గా ఎంతో వ్యధ ని ఇన్వెస్ట్ చేసారు “- ఖంగుమంది పిన్ని స్వరం .

ఆశ్చర్యంగా చూస్తున్న నా వైపు చూస్తూ – ” అవును వీణా.. మేము చాలా ఇన్వెస్ట్ చేసాం . మీ బాబాయి ఛార్టర్డ్ అకౌంటెంట్ కదా , ఆ మాత్రం లెక్కలు మాకు కూడా రాకపోతే ఎలా ? అందుకే అందరం కలిపి బేరం పెట్టాం. నేను ఈ ఇంట్లోనే ఉంటాను. నాకు నచ్చినట్టుగా, పూర్తి స్వేచ్చతో. ఎక్కడికి వెళ్ళాలంటే వెళ్తాను. రావాలంటే వస్తాను. మేము బయట ప్రపంచానికే కుటుంబం. ఇంట్లో ఇద్దరు మనుషులం. నా సంపాదన వేరు, అతనిది వేరు. ఎవరూ ఎవరికీ లెక్కలు చెప్పం. కానీ, అతనికేదన్నా నాతో పని కావాలంటే మాత్రం , పర్మిషన్ తీసుకొని చేయాలి. నాకు నచ్చితే చేస్తాను, లేకపోతే లేదు. ఉదాహరణకి, పార్టీలు లాంటివి. తన భార్య తనతో సఖ్యంగా ఉంటోంది అనే బ్రాండ్ ఇమేజ్ అతనికి కావాలంటే దానికి ఖర్చు అవుతుంది.

మొదట అరిచారు, బెంబేలేత్తారు. పిల్లల్ని, నన్ను వదిలేస్తాను అన్నారు. నేను లీగల్ గా అప్రోచ్ అవుతాను అని చెప్పాను. ఏ కారణం లేకుండా, మమ్మల్ని వదిలేస్తే, ఎంత ఇచ్చుకోవాలో ఒక లాయర్ ఫ్రెండ్ ద్వారా విశదంగా చెప్పించాను. ఆగాడు. ఆలోచనలో పడ్డాడు. అతనికి సంపాదించటం, నన్ను అదిలించటం తప్ప ఇంకేమీ రాదనీ కొంత అర్ధం అయింది. నీకన్నీ నేర్పాను నేను? ఇప్పుడు నీలుగుతున్నావు అన్నాడు. కాదు.. ఇన్నాళ్ళు నలిగాను ఇప్పుడే నెగ్గుతున్నాను అన్నాను నేను ” గుక్క తిప్పుకోటానికా అన్నట్టు ఆగింది పిన్ని .

“సో.. ఇది మనవాళ్ళ కి నచ్చలేదు వీణా.. నేను అరిచి, గోలపెట్టి, ఏడిచి, నెత్తి మీద చెంగు తో పుట్టింటికో, మీ అమ్మ దగ్గరికో రావాలని ఆశించారు అందరూ. అది జరగాకపోఎసరికి , రంగ కి పొగరు. అందంగా ఉంటుందని, పిల్లలు చెప్పిన మాట వింటారని .. సో ఇదమ్మాయి కధ ” ఆగింది పిన్ని.

“కానీ.. పిన్నీ.. ఇలా ఎన్నాళ్ళు ” కొంచం అయోమయ స్వరం లో నేను
“జరిగినంత కాలం వీణా.. infact .. మొదటినుండీ , వొంటరి గానే పెంచాను నేను పిల్లల్ని . డబ్బులు తప్ప అతనేం చేయలేదు . నా శరీరాన్ని అనుభవించాడు, మనసు ఎప్పుడూ వొంటరి గానే ఉంది. అది అలవాటై పోయింది. కాబట్టి ఇప్పుడు లభించిన స్వేచ్చ .. నా సంగీతం, మొదటి సారి నాదో లోకం, పిల్లలు, పెంచుకొనే మొక్కలు. ఫోన్ చేసి ఆప్యాయంగా పలకరించే ప్రదీప్తి, అరుణ్ లూ.. ఓహ్ . ఇంకేం కావాలి వీణా ..??”

“ఇంకో మాట వీణా.. మీ బాబాయి చెడ్డవాడు కాదు. సాంప్రదాయం తానే మోయాలనుకొని వొంటరి గా మారిన మగాడు. అప్పుడప్పుడూ జాలి వేస్తుంది. ఎప్పుడూ ప్రేమ మాత్రం వేయదు . అతని ఇన్వెస్ట్మెంట్ పాలసీ డబ్బు మీద, నాది శ్రమ , ప్రేమ ల మీద నిర్మితం అయ్యాయి. రెండూ కలవవు. నా వరకూ నాకు ఇది మంచి సొల్యూషన్. ఇదే గొప్పది అని నేను చెప్పటం లేదు. కానీ.. మంచితనం, అణుకువ , సాంప్రదాయం ఇలాంటి తట్టలు నెత్తి మీద నుంచి దించితే .. ఆ సుఖమే వేరు .. అంతకంటే ఇంకేం చెప్పలేను …”
ఇంకేం చెప్పనక్కరలేదు కూడా.. !!

ఒక గంట తర్వాత పిన్నికి బై చెప్పి వస్తున్నపుడు .. ” తన నేమ్ ప్లేట్ అనబడే అట్ట ని ఆప్యాయంగా తడిమేను. నా వెనుక సన్నగా నవ్వుతూ, చేయూపుతూ పిన్ని. ఎంతైనా రంగ పిన్ని రంగ పిన్నె… అందుకే తానంటే నాకంత ఇష్టం. రంగ పిన్ని అంటే నాకు అమ్మ కంటే ఇష్టం…!! అణకువకి బ్రాండ్ ఇమేజ్ నుండి , తనకంటూ చిన్ని ఆకాశాన్ని ఎర్పరచుకోగలిగిన ప్రతీ రంగనాయకి .. నాకెంతో ఇష్టం ..!! *