1
నిద్రరాని రాత్రి, గది తలుపులు తెరిచి
కదలని చలిగాలి నింపిన బెలూనులాంటి ఆరుబయట నిలబడ్డాను
చుట్టూ చల్లదనం జీవితం తాకినట్టు తాకుతోంది
తల ఎత్తి చూస్తే చీకటిపుష్పం చుక్కల పుప్పొడి రాల్చుతోంది
నక్షత్రాలకీ నాకూ మధ్య సముద్రంలా పొంగుతోంది నిశ్శబ్దం
దూరమైన తల్లీబిడ్డల్లా ఒకరినొకరం చూసుకొన్నాము
ఆకాశమూ, నేనూ
2
నేను దాచుకొన్న వజ్రాల్లా మెరిసే ప్రశ్నలని
మళ్ళీ బయటకు తీసి చూసుకొన్నాను
సృష్టి అంటే ఏమిటి, నేను అంటే ఏమిటి
జీవితమంటే ఏమిటి, మృత్యువంటే ఏమిటి
జవాబు ఉందా వాటికి, నిజంగా అవసరమా
ప్రశ్నల తరువాత నాలో మేలుకొనే నిశ్శబ్దమే జవాబా
నిశ్శబ్దం నాలో ఉందా, నిశ్శబ్దంలో నేనున్నానా
3
చలికి ఒణికిన గాలితెర ఒకటి మళ్ళీ జీవితం తాకినట్టు తాకివెళ్ళింది
అద్దంలాంటి ఆకాశంలోకి ప్రశ్నలన్నీ పక్షుల్లాగా ఎగిరిపోయాయి
ఈ రాత్రి ఎంత బావుంది
ఈ చల్లదనమూ, ఆకాశమూ ఎంత బావున్నాయి
నక్షత్రాలూ, వాటి నడుమ ప్రవహించే నల్లనినదీ ఎంతబాగున్నాయి
వీటన్నిటినీ చూడటమెంత బాగుంది
చూడటమనే అనుభవాన్ని పంచుతోన్న జీవితమెంత బాగుంది
4
నిదురిస్తే మళ్ళీ మేలుకొంటానా, మరణిస్తే మళ్ళీ పుడతానా
ఇపుడే చూడగలిగినంత చూసుకోవాలి
నా మెలకువ బెలూనును చాతనైనంత నింపుకోవాలి
ఈ విశాలమైన ఆకాశంతో, నక్షత్రాలతో, చలిగాలులతో
అన్నిటి వెనుకనుండీ దాగుడుమూతలు ఆడుతోన్న పసిపాపలాంటి జీవితంతో
ఇపుడే చూడగలిగినంత చూసుకోవాలి
నా మెలకువ బెలూనును చాతనైనంత నింపుకోవాలి.. beautiful poem sir.
very good poem sir….
‘నక్షత్రాలూ, వాటి నడుమ ప్రవహించే నల్లనినదీ ‘ – padaalu baagunnaayi. abhinandanalu.
poem bagundi b.v.v. prasad gaaru…
ఎన్నో భావాలతో నిబిడీకృతమైన నక్షత్రాలవలెనే
మనసనే ఆకాశంలో మేల్కొన్న పదతరంగాలతో ప్రవహించే నది ఈ ముచ్చటైన కవిత!
సరళమైన ప్రశాంత కవిత్వం,.బాగుంది ప్రసాద్ గారు,..
‘దూరమయిన తల్లీబిడ్డల్లా ఒకరినొకరం చూసుకొన్నాము ఆకాశమూ నేనూ.’ తేలికగా ‘బాగుంది ‘ అని చెప్పే వాక్యాలు కావు ఈ కవివి.ఆ వ్యక్తికరణే మాటలు ఆగిపోయిన స్థాయి నుంచి మొదలవుతుందేమో.