కవిత్వం

బెంగ

09-ఆగస్ట్-2013

సౌకర్యాలు వడ్డించిన జీవితం
కళ్ళముందరే ఉన్నా
నోట్లో నీళ్ళూరడం మాట దేవుడెరుగు
తలతిప్పి చూసేందుకే వెగటుగా ఉంది

నిలువెల్లా దిగులు పేరుకున్న మనసు
అటు తెగించి వర్షించనూ లేక ,
ఇటు బరువును నిలవరించనూలేక
ఉండీ ఉండీ శ్రావణ మేఘమవుతోంది

నిస్సంశయంగా నిరామయంగా
కన్నతల్లి చీర కుచ్చిళ్ళ వెచ్చదనంలో
పదిలంగా తలదాచుకున్న బాల్యపు తమి
ఎన్నాళ్ళైంది మాతృ భూమి పచ్చని చేతుల్లో ఒదిగి

గాలి పరవళ్ళతో పోటీ పడినా
సప్త సముద్రాల ఎల్లలు కొలిచి గర్వపడినా
కాలి స్పర్శకైనా తగలని పరాయినేల
నల్లకళ్ళద్దాలు దాచేసిన చూపులైనా
ఎలా ఒలకబోస్తాయి ఓదార్పుల శీతలాలు

మబ్బు ముసిరితే చాలు
చుట్టూ చుట్టూ తిరిగే పసిపిల్లలై
మారం చేసే తూనీగల గుంపులు
కళ్ళురిమి పళ్ళుకొరికి బెదిరించే
నింగి తల్లి …….ఎక్కడ వెతుక్కోను

చిరు చీకట్లు ఇంకా
వెలుగు పిల్లలను పొదగకముందే
నిద్ర దుప్పట్లు విదిలించుకు
కాళ్ళూ చేతులూ సవరించుకుంటున్న
ఏకాంతపు రహదారులపై
అడుగులు కదిపితే చాలు
దారంతా అరవిరిసిన పున్నాగల స్వాగతాలు
ఆనందం తొలకరిస్తూ అప్పుడొకటీ ఇప్పుడొకటీ
నడినెత్తిన వాలే పరిమళాలు

పెదవులపై వెయ్యి వెలుగులు ఉదయించినట్టు
చిరునవ్వుల చిరకాలపు పరాచికాలు
అక్కడో ఇక్కడో ఆగి పెనవేసుకున్న వేళ్లనుండి
అంత రంగాల్లోకి ప్రవహించే ఆత్మీయతలు
ఎదురొస్తున్న రోజు రోజంతా
సంపెంగలూ సన్న జాజులూ కలగలిపిన ఊహలు
ఆఘ్రాణిస్తూ గడిపేందుకు పునాదులు

దారిదారంతా పరచుకున్న పలకరింపులు
అడుగడుక్కూ రేపటి ఆశ లను సాగు చేసే
రైతు మిత్రులు
కాస్సేపు నడి రోడ్డుమీద మగరాయడిలా
గిల్లిదండూ గోటీలూ ఆడుకున్న
బాల్యపు ఆటపాటల వీధుల్లోకి
మరికాస్సేపు ఎప్పుడో పూసిన కలల
పూల వనాల్లో ఇంకా తిరుగాడుతున్న
తుమ్మెదల హోరులోకీ
ఇంకాస్సేపు తీపి మధువులు రహస్యంగా దాచుకున్న
లోలోపలి తేనే పట్టు అరల్లోకీ వెళ్ళి వస్తే కదా
ఈ క్షణాలు నవరస భరితమయేవి?

ఇవన్నీ అక్కడ భద్రంగా తాళం వేసి
తాళం చెవి అక్కడే వదిలేశాక
ఇక్కడ మిగిలిందేమిటి ఏ దృశ్యమూ ఏర్పరచలేని
రెటీనా కోల్పోయిన గాజు ముక్కలా ?

మెత్తటి ఆప్యాయతల పట్టు పరుపులపై నడిచినా
అది ఆంప శయ్యలాగే ఉంది.
దిగులుదిగులుగా
నీళ్ళింకి పోయిన సముద్రమయిపోయినట్టు బెంగగా ఉంది

కళ్ళనిండా
పసుపు రాసి బొట్టుపెట్టుకున్న నా పచ్చని గడప
ఆ గడప చుట్టూ అల్లుకున్న జీవిత ఘడియలూ
ఇంటి ప్రతి అణువునా నాటిన అనుభూతులూ
సుడి తిరుగుతున్నాయి
బెంగ టిల్లిన మనసు ఎక్కడ కాస్త ఆగుతుంది గనక?