ఒక అలౌకిక భావ పరంపర, జీవిత సారాంశాన్ని సలలితంగా ,సమ్మోహనంగా ప్రగాఢ రాగోన్మత్తతతో ఎరవేసి వెంట లాక్కుని వెళ్ళే వశీకరణ సుడిగుండం అతని కవిత్వం. “నీటిరంగుల చిత్రం“ అంటూ మూడు మాటల్లో సమస్త విశ్వాన్ని చూపిన పుస్తకం ఇది.
చిన వీర భద్రుడి కవిత్వం ఒక నిరంతర చైతన్య స్రవంతి. ఒక ప్రవాహం. ఒక అడవి. ఒక వాన ఒక వెన్నెల కోయిల , ఒక రాగాత్మక భావన ..ఇలా ఇంకెన్నో … వికీర్ణమవుతూ సంకీర్ణమవడం ఒక సాధన , ఒక తపస్సు ఒక తమి , ఒక తృష్ణ .
అవును అతని కవిత్వంలో ఎంత నైపుణ్యంతో చెక్కుతూ బాహ్య స్వరూపాన్ని కనబరిచినా ,అంతర్లీనంగా సాగే ఈ భావాల జాబితాకు అంతెక్కడ? సామాన్య పదాల ఎంపికలో అసామాన్య భావాన్ని ఆవాహన చేసి ఒక లౌకిక ప్రపంచం కేంద్ర స్థానం నుండి అలౌకిక భావ సామ్రాజ్యపు అంచులకు తీసుకు వెళ్ళే కవితాత్మకత ఒక ఋషికే సాద్యం, చిన వీరభద్రుడు కవిగా రూపాంతరం చెందిన ఋషి. ఒక అన్వేషణ. సౌందర్య రాసాస్వాదన, ఒక జాగురూకత ,ఒక నిర్దిష్ట భావ పరంపర కవి వెనకాల తరగని మూలధనం.
కాపాడు కోవలసిన పద్య౦, అమ్మా నాన్నా మరికొందరు ఆత్మీయులు, కాంతి, మ౦చు, మధురిమ, ఊదా, పసుపు, నారింజ నీటి రంగుల చిత్రం , చిత్తమణిగే చోటు –చిత్రంగా ఇవన్నే అక్కడక్కడ వరుసగా… లో కనిపించే ఉప శీర్షికలు
కాపాడుకోవలసిన పద్యం
“ఇంధనం అగ్నిగా మారినట్టు ,ప్రతిరోజూ
ఒక పద్యంగా మారాలని ప్రార్ధిస్తున్నాను “
చూడటానికి రెండు వరుసలే కాని ఎంత సునిశిత నేర్పరితనం ఈ పదాలు అమర్చి౦దా అనిపించింది. ఇంధనం అగ్నిగా మారడం వెనక ఎన్ని ఉత్ప్రేరకాలు , ఎన్ని లిప్తలు ,ఎన్ని ఘడియలు ,ఎంత ఉద్విఘ్నత ,ఎంత కృషి ,ఎంత శ్రమ, ఎన్ని యుగాల లయ విన్యాసం, ఎంత జీవన చైతన్యం! ఈ మూడు మాటల వెనక మూడు కాదు ముప్పై తరాల చరిత్ర. ఎంత లయవిన్యాసాల తరువాత ఇంధనం సమకూరుతుంది?
సమకూరినా కణకణమండే నిప్పు కణిక గా మారేందుకు ఎన్ని రూపాంతరాలు! ఎన్ని సజీవ స్పందనలు.
ప్రతి రోజూ ఒక పద్యంగా మారాలని ప్రార్ధిస్తున్నాను
ఎవరు ప్రార్ధిస్తున్నారు కవి ప్రార్ధిస్తే ఎవరు మారాలి ఒక పద్యంగా ? కవి పద్యంగా మారాలా ప్రతి రోజూ కవికి ఒక పద్యంగా మారాలా? ప్రతిరోజూ కవి పద్యంగా మారేందుకు రోజూ ఇంధనం అగ్నిగా మారే మహాక్రతువు. ఒకరోజే పద్యంగా మారాలన్న ప్రతిరోజూ వీపున యుగాల చరిత్ర మోసుకు రావాలి? మళ్ళీ కవి సవినయంగా ప్రార్దిస్తున్నాడు. ఎవరిని రోజునా ? అంటే పంచ భూతాల సమ్మిళితమైన ప్రకృతినా ? సజీవ ,నిర్జీవ చరాచర జగత్తుకు దివా రాత్రాలు ప్రసాదించే అద్వితీయ శక్తినా? అయితే ఆ శక్తి బాహ్యమైనదా? అంతర్లీనంగా అదృశ్యంగా ఆవహించిన భావస్ఫూర్తా?
ఈ ఉప శీర్షిక కింద ముప్పై రెండు పద్యాలు విశ్లేషించుకు చదువుకుంటే ఇహ మరో పుస్తకం చదవాల్సిన అవసరం కనబడదు. ఇందులో ఒక కవిత:
నేనొక కవితగా మారే వేళ
“రోజంతా ఏంచేసినా ,ఎక్కడ తిరిగినా మెహిదీ పట్నం లో
నా సోదరులు ప్రార్ధన వేళకు పడమట దిక్కు తిరిగినట్టు
నేనొక కవితగా మారే వేళ ఆకాశం వైపు తిరుగుతాను
అది నన్ను నేను మీతో అనుసందాని౦చుకునే సమయం.
రోజ౦తా నాలో ఎన్నో స్వరాలు,కంఠాలు ,పరుష గళాలు
మధురపదాలు,ఎవరిని కలిసినా చూసినా మాట్లాడినా
సముద్రం మీద కెరటాల్లాగా అ౦త లోనే పైకి లేచిఇంతలోనే
విరిగిపోతాయి.ఆనవాళ్ళు కూడా మిగలని భావావేశాలెన్నో
అప్పుడు కొన్ని క్షణాల పాటు ఆకాశాన్ని ధ్యానిస్తాను. నేత
లేచి నిలబడగానే జన సమూహం సద్దుమణిగినట్టు .దేహంలో
రక్తనాళాల౦తటా ఒక సరసర సర్రున సాగి సాగి ,నిశ్శబ్దం వైపు
చెవులు విప్పారుతాయి. అప్పుడొక వాక్కు వినిపిస్తుంది
ఎన్నో విరిగిన నేనులు ,తునిగిన నేనులు ,అ౦తదాకా
అల్లరి చేసిన నేనులెన్నో నెమ్మదిగా కరగిపోయి ఒకే
ఒక్క నేను ప్రత్యక్షమవుతు౦ది.చిత్రం అప్పుడా వదనాన్ని
పరిచితులతోపాటు అపరిచితులు కూడా తమదనుకు౦టారు”
సాధారణమైన ఆరంభంని౦చి కవి ఒక అసాధారణ స్థాయికి ఎలా దూసుకు వెళ్తారో ఒక మూర్త భావన నుండి ఒక అమూర్త భావనకు ఎంత సులభంగా glide అవుతారో ఒక జన సామాన్య సత్యం నుండి ఒక అద్వితీయ వేదాంత ధోరణికి విశ్వా జనీనక భావానికి కదిలి వెళ్తారో స్పష్టంగా కనిపిస్తుంది మొదటి నాలుగు లైన్లలో .
చివరికి మళ్ళీ మరో మాటల్లో ఎంత నిర్మోహత! నేనులెన్నో కరగిపోయి ఒక్కనేను ప్రత్యక్షమయాక అపరిచితులు కూడా తమదనుకుంటారు.
నా నుండి మన వైపు ప్రయాణం.
నిజమే చాలా మార్లు భావా సారూప్యత వల్ల కావచ్చు అంత నైపుణ్యంతో ప్రతిమాటా మెరుగు పెట్టి మెరుగు పెట్టి రాయకపోయినా నేనే రాసానా ఇది అని ఉలికిపడేలా చేశాయి ఇతని కవితలు.
అమ్మా,నాన్న మరికొందరు ఆత్మీయులు
“ఆమెకు తెలిసిందేదో మాకు తెలియనే లేదు ,
జీవించక తప్పని ఈ ఒక్క జీవితాన్నీ నిశ్శేషంగా జీవించడమెట్లానో”
ఇక్కడా అంతే. రెండు లైన్లలో ఎంత విస్తృత భావాన్ని ఇమిడ్చారో ఆలోచించండి.
కా౦తి,మ౦చు,మధురిమ
“అయినా నేనింకా చిగురించకు౦డావసంతం
వసంతం కాజాలదని అర్ధం అయింది”
ఊదా, పసుపు నారి౦జ
“ఈ ప్రప౦చమొక పుష్పంగా మారాలంటే
నేనొక తుమ్మెదగా మళ్ళీ పుట్టాక తప్పదు”
నీటి ర౦గుల చిత్ర౦
“ప్రతి మలుపులోని ప్రతి ప్రేమోద్వేగం లోనూ
నేనింకా పాలకోసం గుక్క పెడుతున్న పసిపాపనే”
చిత్తమణిగే చోటు
“ఒకటి మటుకు అర్ధం అయింది.నిన్ను ప్రేమి౦చిన వాళ్ళ
రుగ్మత తొలగాలంటే ఔషధం నువ్వే సేవించాలి”
అభయ వచనాల పేరిట ఆదిత్య ప్రశ్నలూ కవి జవాబులూ కొంతవరకు కవిని కవిత్వాన్నీ అర్ధ౦ చేసుకు౦దుకు దోహదపడతాయి. అర్ధం చేసుకున్న వారికి చేసుకున్న౦త.
ఒక అమూల్యమైన కవితా సంపుటి నా మటుకు నాకు ఎన్ని సార్లు చదివినా ప్రతి మాటా కొత్త అర్ధాన్ని ఇస్తూనే పోతుంది.
(మార్చి 28 సాయంత్రం పుస్తకావిష్కరణ జరుపుకున్న నీటిరంగుల చిత్రం ఒక విహంగా వీక్షణ౦)
నీటిరంగుల చిత్రం కినిగె లో ఇక్కడ లబ్యం:
http://kinige.com/book/Neetirangula+Chitram
చాలా బాగా వ్రాసారు, వెంటనే చదవాలి, చూడాలి ఆ నీటి రంగుల చిత్రాన్ని.