ఒక్కొక్క అక్షరమే
తడబడుతూ తత్తరపడుతూ
కొత్తగా రెక్కలుమొలిచిన కపోతంలా తారట్లాడుతుంది.
ఆనంద పరవశాల పన్నీరు చినుకులలో
ఒక తుళ్ళింతగా తడిసి
పెను తుఫాను విశాదపు జడివానలో ముద్ద ముద్దై
చూపుల వెచ్చదనానికే కందిపోయే సుకుమారమవుతూ
ఆకు చాటు తొలి పువ్వు నవ్వులా
రంగ ప్రవేశం చేస్తుంది
వింత వింత శబ్దాలను తాగితాగి
లోలోపల ఇమిడిపోలేని భేషజాలు భళ్ళున గుమ్మరిస్తూ
నైర్మల్యాన్నీ శ్వేత వర్ణాన్నీ ఆదర్శాల రంగులధూళిలో
పొర్లించి పొర్లించి
లోలోపల సజీవత సైతం ఖాళీ చేసి పోయిన
తోలు బొమ్మై మిగులుతుంది అక్షరం
అడుగడుగునా చప్పట్ల దరువుకు అలవాటుపడి
చీటికీ మాటికీ మెప్పుదల మేకతోళ్ళలో అణిగిఅణిగి
పులకింతల నిశ్శబ్ద సమాధుల మీద
ప్రదర్శనల జాతరై కొత్త మొహాన్ని తొడుక్కుంటుంది అక్షరం
ఎవరిదారిన వారు తమతమ ప్యూపాల్లోకి ఒదిగిపోయాక
శబ్దాలూ రాగాలు మాటుమణిగి
రంగులు కడిగేసుకున్న అహం
అర్ధరాత్రి సూర్యోదయాన కళ్ళు తెరిచాక
అదృశ్యమైన అంతః కరణ వెయ్యి వేళ్ళు ఎత్తి చూపుతూ
నువ్వునువ్వంటూ నిందిస్తే
అక్షరాలూ రాలిన పూరేకులవుతాయి.
అహాలూ అహంకారాలూ కుమ్మరి మట్టిలా తొక్కేసిన సంస్కారం
నడివీధిన నగ్నంగా కాట్లాడే కుక్కలవుతాయి
ఎప్పుడో స్పృహ వచ్చి తప్పు తెలిసి
పశ్చాత్తాప పు వెలుగులు పరచుకునే సరికి
అనాగరికపు మట్టిలో దుమ్మూధూళీ లో దొర్లిదొర్లి
ఊదారంగు పులుముకున్న ఉదాసీనతకు ఉరివేసుకుంటాయి
అప్పుడు ఊపిరందని మహామహులు
చచ్చిన శవాలను భుజానవేసుకు
అమ్మకాలకు క్యూ కడతారు.
ఆకు చాటు తోలి పువ్వు నవ్వుల…& చచ్చిన శవాలను భుజాన వెసుకొని…అన్న పదాలు నచ్చాయి స్వాతి గారు.
అహాలూ అహంకారాలూ కుమ్మరి మట్టిలా తొక్కేసిన సంస్కారం
నడివీధిన నగ్నంగా కాట్లాడే కుక్కలవుతాయి
కవిత బాగుంది, ఈ వాక్యాలు ఎందుకో తేడాగా అనిపిస్తున్నాయి..మరోసారి చూడండి మేడమ్ !