అనువాద కథ

వీపు

నవంబర్ 2014

బ్రిటిష్ కధా చక్రవర్తి అనదగిన ఎచ్ ఎచ్ మన్రో “సాకి” అనే కలం పేరుతొ విశ్వవ్యాప్తంగా చిరపరిచితుడు. గొప్ప కధా శిల్పం అసమాన ప్రతిభ స్వంతం చేసుకున్న అతను అక్యాబ్ బర్మాలో పుట్టారు. ఫ్రాన్స్ లో మరణించే సమయానికి అతని వయసు 46 సంవత్సరాలే! రెండేళ్ళ బాల్యంలోనే తల్లిని పోగొట్టుకున్న మన్రో ఇంగ్లండ్ లోని అమ్మమ్మ ఆలనాపాలనలో పెరిగి పెద్దయాడు.

సాకి అనే కలం పేరు ఎలా వచ్చి౦దన్న దానిపై భిన్న అభిప్రాయాలున్నాయి. ఒమర్ ఖయ్యాం రుబాయత్ లలో పానపాత్ర అందించే స్త్రీ పాత్ర అని కొందరు, ఆ పేరు గల సౌత్ ఆఫ్రికన్ కోతి అనికొందరు భావించేవారు.

వ్యంగ్యం ఒక వైపు హాస్యం మరో వైపు పదునుగా ఉన్న రెండంచుల కత్తిలాంటివి అతని రచనలు. మర్యాదను అతిక్రమించిన తీవ్రమైనవిమర్శ అతని ఆయుధం. మొదటి సారి చదివినప్పుడు హాస్యం అలరిస్తుంది కాని మళ్ళీ మళ్ళీ చదివినప్పుడే సాకి భాష, దాని సౌందర్యాన్ని ఆస్వాదించగలరు. కొ౦దరు అతన్ని ఓ హెన్రీ తో మరికొందరు డోరతీ పార్కర్ తోనూ పోల్చినా సాకి ఒక అసాధారణ అద్వితీయ రచయిత. అతనికి సాటి అతనే తప్ప మరొకరు ఎప్పటికీ కారు.

Hector Hugh Munro (SAKI) రాసిన “The Background” అనే కథకు నా అనువాదం ఇప్పుడు చదవండి.

 


వీపు


“ఆ మాటలే౦టో ఆ చిత్రాల పరిభాష ఏమిటో ఒక్క ముక్క అర్ధమయి చస్తేనా ? వర్ణించడం మొదలు పెట్టిందా అయిపోయినట్టే , మాటలు పుట్టగొడుగుల్లా పుట్టుకు వచ్చినట్టు“ క్లోవిస్ తన జర్నలిస్ట్ మిత్రుడితో అన్నాడు.

“అరె నీకు చెప్పలేదా? హెన్రీ డెప్లిస్ కధ చెప్పాననుకున్నానే ? “ వెంటనే అన్నాడా మిత్రుడు.

క్లోవిస్ తల అడ్డంగా ఊపాడు

హెన్రీ డెప్లిస్ లక్జే౦బర్గ్, డచ్ నివాసి . బాగా ఆలోచించి ఆలోచించి ఒక కంపెనీలో సేల్స్ మాన్ గా చేరాడు.ఉద్యోగ రీత్యా తరచూ దేశం దాటి కూడా వెళ్తూ ఉండేవాడు.

ఓసారలాగే ఉత్తర ఇటలీలో ఓ చిన్న నగరంలో ఉన్నప్పుడు ఇంటి నుంచి ఒక వార్త వచ్చింది. ఎక్కడో దూరపు బంధువొకడు పోవడం తో ఇతనికి కాస్త ఆస్తి వారసత్వంగా వచ్చిందని.

అది హెన్రీ డెప్లిస్ ఆర్ధిక స్థితి గతుల దృష్ట్యా కూడా అంత పెద్ద మొత్తమేమీ కాదు.

కాని ఎప్పటి నుండో ఉన్న కోరిక మాత్రం బయటకు తన్నుకు వచ్చింది. ఈ కాస్త దుబారా పెద్ద ప్రమాదమేమీ కాదని అనుకున్నాడు. ప్రఖ్యాత స్థానిక పచ్చబొట్టు కళాకారుడైన శ్రీయుతులు పిన్సిని ఆండ్రూస్ గుర్తుకు వచ్చాడు. అతన్ని ప్రోత్సహించి, స్థానిక కళాపోషణ చెయ్యడం వైపు అతని ఆలోచనలు సాగాయి. ఇటలీలో శ్రీయుతులు పిన్సిని గారు పచ్చబొట్టు కళ లో అత్యంత నైపుణ్యం గల మేధావి, కానీ అతనిపై మూకుమ్మడిగా దండెత్తిన పరిస్థితుల ప్రాబల్యం వల్ల, కటిక దారిద్ర్యం లో ఉండటం వల్ల ఇతనిచ్చే ఆరువందల ఫ్రా౦కుల మొత్తానికి అతని వీప్మీద మెడనుండి నడుం వరకు “ఇకేరస్ పతనం” అనే చిత్రాన్ని పచ్చబొట్టుగా వేసేందుకు ఆనందంగా ఒప్పుకున్నాడు.

చివరికి ఆ చిత్రం పూర్తయ్యే సమయానికి శ్రీ హెన్రీ డెప్లిస్ కొంచం నిరాశపడ్డా , చూసిన వాళ్ళంతా దాన్ని పిన్సిని గారి అద్భుత కళాఖండమని మెచ్చుకోడంతో చాలానే తృప్తి పడ్డాడు. ఇకేరస్ పతనం అంటే అదో కోట, ముప్పై సంవత్సరాలు యుద్ధం చేసి వాలెన్స్టెయిన్ దాన్ని సాధి౦చ గలిగాడనీ అనుకున్నాడు కాని గ్రీకు పురాణాల్లో ఇకేరస్ తన తండ్రి డేడలస్ తయారు చేసిన కొవ్వు, పక్షి ఈకలు కలిపిన రెక్కలతో విజయవంతంగా ఎగిరి, తండ్రి హెచ్చరికలు మరచిపోయి సూర్యుడి దగ్గరగా వెళ్ళడంతో వాక్స్ కరిగిపోయి సముద్రంలో పడి మునిగిపోతాడు—అదీ ఇకేరస్ పతనం చిత్రం.

అది పిన్సిని అద్భుత కళాఖండమే కాదు చివరిది కూడా. డబ్బు తీసుకునే లోగానే ఆ ప్రముఖ కళాకారుడు జీవితాన్ని వదిలి వెళ్ళిపోయాడు. దేవదూతలను చెక్కిన శవపేటికలో పాపం అతను తన అభిమాన కళను కొనసాగి౦చే౦దుకు ఆ చెక్కిన బొమ్మలు ఏ మాత్రం అవకాశ౦ ఇవ్వలేదు మరి.

అయితే పిన్సిని భార్య ఆరువందల ఫ్రా౦క్ లు పుచ్చుకు౦దుకు సిద్ధంగా ఉంది. కాని హెన్రీ డేప్లిస్ జీవనంలోనే పెద్ద సంక్షోభం తలెత్తి౦ది. చిన్న చిన్న ఖర్చుల ఒత్తిడితో ఆ డబ్బు కాస్త కాస్త అదృశ్యమై వైన్ బిల్లు ఇతర అప్పులు చెల్లి౦చాక కేవల౦ 430 ఫ్రాంక్ లు మాత్రమే మిగిలింది. ఆమె గట్టి గట్టిగా అరిచి 17౦ ఫ్రా౦క్ లు తగ్గి౦చడ౦ చిన్న విషయం కాదనీ, పైగా కీర్తి శేషుడైన తన భర్త చివరి కళాఖండం విలువ తగ్గించడమేమిటనీ వాదించారు. ఇలా సాగుతూ ఉండగానే సరిగ్గా వారం రోజుల్లో మరింత ఖర్చు చేసి ఆ డబ్బు మొత్తాన్ని కుదించి 405 ఫ్రాంక్ లకు తెచ్చాడు డేప్లిస్. ఆవిడ కోపం ఆగ్రహంగా మారి ఒళ్ళుమండి భర్త కళాఖ౦డ౦ అమ్మకాన్ని రద్దు చేసి౦ది. అయితే డేప్లిస్ ను విభ్రా౦తికి గురిచేసే వార్త—ఆవిడ ఆ కళాఖ౦డాన్ని బర్గామో మున్సిపాలిటీకి బహుకరించడం , ఆ మునిసిపాలిటీ దాన్ని బహు కృతజ్ఞతతో స్వీకరించడం.

సాధ్యమైనంత అనామకంగా అక్కడి నుండి తప్పుకోవాలనుకున్నాడు డేప్లిస్. తన వ్యాపార లావాదేవీ ల కోసం రోమ్ వెళ్ళిపోతే అక్కడ ఆ చిత్రం కనుమరుగైపోతు౦దనీ దాన్ని పెద్దగా ఎవరూ గుర్తించరనీ అనుకున్నాడు.

కాని అతను మోస్తున్నది మరణించిన ఒక మేధావి భారం. ఒకసారి ఆవిరి స్నానం కోసం ఆ పార్లర్ కారిడార్ లో ఉన్న అతన్ని ఉత్తర ఇటలీ దేశం వాడైన ఆ పార్లర్ యజమాని హడావిడిగా డ్రెస్ లోకి తోసినంత పని చేసాడు . బెర్గామో మునిసిపాలిటీ అనుమతి లేకుండా “ఇకేరస్ పతనం “ అనే గొప్ప కళాఖండాన్ని ఇలా జనాలకు ప్రదర్శించడం అతనికి నచ్చలేదు. విషయం మరింత విస్తృత౦గా గుర్తింపు పొందడంతో, ప్రజల ఆసక్తి , అధికారిక భద్రతా పెరిగింది, హెన్రీ డేప్లిస్ వేడిగా ఉండే సాయంత్రాలు ఒక మామూలు సముద్ర స్నానం, లేదూ నదీ స్నానం చెయ్యాలన్నా మెడ వరకూ ఉన్న బట్టలు వేసుకుంటే తప్ప వీల్లేక౦డా పోయింది.

తర్వాత బెర్గామో అధికారులు, ఉప్పు నీరు కళాఖండానికి హానికరం కావచ్చన్న ఆలోచన రాడం తో ఏ పరిస్థితులలో నూ సముద్ర స్నానం కూడదని ఒక శాశ్వత కోర్ట్ నిషేదాజ్ఞ తెచ్చుకోడంతో పాపం అప్పటికే చిత్రవధ అనుభవిస్తున్న డేప్లిస్ కి ఆ యోగమూ లేకు౦డాపోయి౦ది. మొత్తానికి అతని సంస్థ యాజమాన్యం తమ కార్యకలాపాల కోసం అతన్ని బోర్దాక్స్ పరిసర ప్రాంతాలకు వెళ్ళమనగానే అతను ఎంతగానో ఆనందించాడు . అయితే అతని ఆనందం హఠాత్తుగా ఫ్రాంకో ఇటాలియన్ సరిహద్దు వద్ద అమాంతం ఆగిపోయింది . అధికారిక శక్తి శ్రేణి అతని నిష్క్రమణ నిరోధించింది, ఇటాలియన్ కళ ఎగుమతి నిషేధిస్తున్న కఠినమైన చట్టం మరింత కఠినంగా గుర్తు చేశారు ఆ అధికారులు.

“దౌత్య షరతులను, విధానాలను గూర్చి చర్చించేందుకు ఏర్పరచిన సమావేశము లక్జెంబర్గ్ ఇటాలియన్ ప్రభుత్వాల మధ్య జరిగి, ఒకానొక సమయంలో యూరోపియన్ పరిస్థితి గొప్ప ఇరకాటం లో పడింది కూడా . కానీ ఇటాలియన్ ప్రభుత్వం బలంగా నిలబడి హెన్రి డేప్లిస్ ఉనికి తో కాని అతని ఆస్తిపాస్తులతో కాని తమకు ఈషణ్మాత్రపు ఆసక్తి కూడా లేదని, కాని ప్రస్తుతం బెర్గామో మున్సిపాలిటీ ఆస్తి అయిన ఇకేరస్ పతనం ( కీ శే పిన్సిని ఆండ్రూస్ చేసినది ) ఎట్టి పరిస్థితుల్లో దేశం వదిలి వెళ్ళరాదనే నిర్ణయంలో మాత్రం దృఢ౦గా ఉ౦డిపోయి౦ది.

“కాలక్రమేణా ఆ ఉత్సాహం సద్దుమణిగినా , దురదృష్టవ౦తుడైన డేప్లిస్ రాజ్యాంగ బద్ధంగా ఒక అచేతన స్థితిలో ఉన్న సమయాన కొన్ని నెలల తరువాత మరోసారి ఒక తీవ్రమైన వివాదానికి కేంద్ర బి౦దు వయాడు .ఆ ప్రసిద్ధ కళాఖండ౦ పరిశీలనకు బెర్గామో మున్సిపాలిటీ నుండి అనుమతి పొందిన ఒక జర్మన్ కళా నిపుణుడు, అది నకిలీది అనీ పిన్సినీ చేసినది కాదని బహుశా అతను తన వయసు మళ్ళిన దశలో ఉపాధి కోసం తన వద్ద చేర్చుకున్న ఏ విద్యార్థి తోనో చేయించి ఉంటాడని ప్రకటించాడు. ఈ విషయం మీద డేప్లిస్ సాక్షాధారం ఏ మాత్రం విలువలేనిది .ఆ డిజైన్ రూపకల్పన దీర్ఘ ప్రక్రియ సమయంలో సూదుల నొప్పి తెలియకుండా అతను వాడుకగా వాడే డ్రగ్స్ మత్తులో ఉన్నాడు . ఒక ఇటాలియన్ కళా పత్రిక ఎడిటర్ , జర్మన్ నిపుణుడి అభిప్రాయాలను సాక్ష్యం లేనివిగా తోసిపుచ్చి అతని వ్యక్తిగత జీవితం ఏ ఆధునిక ప్రామాణికానికీ అనుగుణంగా లేదని నిరూపించడానికి నడుం కట్టాడు పూర్తి ఇటలీ ,జర్మనీ మొత్తం ఈ వివాదం లో కి వచ్చి చేరాయి , మిగిలిన యూరోప్ అంతా ఈ తగువులో తలదూర్చి౦ది. స్పానిష్ పార్లమెంట్ లో నూ ఈ తగువుల తుఫాను దృ శ్యాలు చోటు చేసుకున్నాయి , పారిస్ లో ఇద్దరు పోలిష్ స్కూల్ పిల్లలు వారి అభిప్రాయం తెలపడానికి ఆత్మహత్య చేసుకున్నారు. యూనివర్శిటీ ఆఫ్ కోపెన్హాగన్, (తర్వాత అక్కడికక్కడే ప్రమాణాలు పరిశీలించడానికి ఒక కమిషన్ ను పంపడంతో పాటు ) జర్మన్ నిపుణుడికి ఒక బంగారు పతకం అందజేసి౦ది.

“ఈ సమయంలో అంతకు ముందుకన్నా ఏ మాత్రం మెరుగ్గాలేని దశలో ఉన్న ఆ మానవ శరీరం ఇటాలియన్ అరాచకవాదిగా మళ్ళడం పెద్ద ఆశ్చర్యకరం ఏమీ కాదు. అతను ఒక ప్రమాదకరమైన ,అవాంఛనీయ విదేశీయుడిగా కనీసం నాలుగు సార్లు సరిహద్దు వరకు తీసుకు వెళ్ళారు కాని , ప్రతి సారీ ఇకేరస్ పతనం (పిన్సిని ఆండ్రియాస్, ఇరవయ్యో శతాబ్దం గా ఆపాదించబడింది) కారణంగా వెనక్కు తిరిగి తెచ్చారు. తరువాత ఒక రోజు జెనీవాలో ఒక అరాచకవాదుల కాంగ్రెస్ సమావేశంలో చర్చల మధ్య , తోటి అరాచక వాది కోపంలో నిండు బాటిల్ ఆమ్లాన్ని అతని పైకి విసిరే సరికి, అతను ధరించిన ఎర్ర చొక్కా ఆ ద్రావకం ప్రభావాన్ని తగ్గించినా, ఇకేరస్ పతనం ఆనవాలు పట్టలేనంతగా శిధిలమైపోయింది.

దాడి చేసిన వాడిని తోటి అరాచక వాది పై చేసిన దాడికి తీవ్రంగా మందలించి, ఒక జాతీయ కళా సంపద ను రూపు మాపినందుకు ఏడు సంవత్సరాల జైలు శిక్ష విధించారు . ఆసుపత్రి నుండి బయటకు వచ్చిన తక్షణమే హెన్రి డేప్లిస్ అవసరం లేని విదేశీయుడిగా సరిహద్దు దాటించారు.

“పారిస్ ప్రశాంత వీధులలో, ముఖ్యంగా ఫైన్ ఆర్ట్స్ మంత్రిత్వశాఖ పరిసరాల్లో, మీరు నిరాశా నిస్పృహలతో అణగారి, చూపులలో ఆత్రుతతో కనిపించే అతన్ని చూస్తూనే ఉంటారు . అతని కోసం కాస్త సమయం వెచ్చి౦చ గలిగితే లక్షె౦బర్గియన్ యాసతో అతను “వీనస్ డి మీలో” కోల్పోయిన చేతులలో ఒకటి తానేననీ భ్రమను పోషి౦చుకుంటూ ఫ్రెంచ్ ప్రభుత్వాన్ని అతనిని కొనుగోలుకు ఒప్పించాలనీ చెప్తాడు. మిగతా విషయాల కొస్తే అతను పూర్తి ఆరోగ్యవంతుడే మరి.

Painting credit: http://en.wikipedia.org/wiki/Landscape_with_the_Fall_of_Icarus