మంద్రంగా వినిపిస్తున్న ముఖారి రాగం. కిటికీలో నుండి కుప్పలు తెప్పలుగా వీస్తున్న చల్లగాలి. బెడ్ లైట్ కూడా స్విచ్చాఫ్ చేసింది అనూ. అయినా ఎక్కడినుండో సన్నని వెలుగు గదిలో పసిపాపలా పారాడుతూనే ఉంది.
విశాలమైన బెడ్ మీద ఇద్దరమూ నిశ్శబ్దాన్ని నెమరువేస్తూ ఎవరి ఆలోచనల్లో వాళ్ళం.
వారం క్రితం కాబోలు సీరియస్ గా నా పనిలో నేనున్నప్పుడు ఎదురు చూడని సమయంలో ఎదురుచూడని వ్యక్తి నుండి ఫోన్ కాల్. మీటింగ్ లో ఉన్నా అనూ కాల్ చేస్తే ఫోన్ ఎత్తవలసి౦దే. ఫోన్ ఆన్ చేసి వెంటనే ఆఫ్ చేసి మెస్సేజ్ పంపాను –ఇన్మీటింగ్ కాల్ యు – అని.
ఆ తరువాత ఎందుకు అనూ ఫోన్ చేసిందా అని ఆలోచనే తప్ప మీటింగ్ పట్ల ఆసక్తి లేకపోయింది. నా కాబిన్ లోకి దూసుకు వస్తూనే దానికి కాల్ చేశాను.
“అనూ , నువ్వేనా కాల్ చేసినది? ఆశ్చర్యం ఎన్నాళ్ళకెన్నాళ్ళకు?ఎన్నాళ్ళకు కాదు ఎన్నేళ్ళకనాలి? ఎందుకిలా గుర్తుకు వచ్చాను? చెప్పు తల్లీ ఏం సంగతులు?నీ కూతుళ్ళు ఎలా ఉన్నారు? కొ౦పదీసి అల్లుళ్ళను వెతుకుతున్నావా ?”
“కొ౦చ౦ ఆపు ప్రియా…”అంటూ నా మాటల ప్రవాహానికి ఆనకట్ట వేసి, “ నాలుగు రోజులు స్పేర్ చెయ్యగలవా, నీతో గడుపుదామని టికెట్ హోల్డ్ లో పెట్టాను రేపు సాయంత్రం ఫ్లైట్ కి బుక్ చెయ్యనా ?”
ఎగిరి గంతెయ్యడమే తరవాయి, వెంటనే ఈమెయిలు పంపి ముందుగా నాలుగు రోజులు సెలవు సాంక్షన్ అయ్యాకే అనూకి ఓకే చెప్పేసాను.
మంగళ వారం నుండి శుక్ర వారం వరకూ సెలవు. శనాది వారాలు కలుపుకు౦టే వారం.
ఆఫీస్ నుండి ఇంటికి వెళ్తూ వెళ్తూ ఒకసారి ఇంట్లో లేనివేమిటో గుర్తు తెచ్చుకుని , డీ మార్ట్ లో షాపింగ్ చేసి, తొమ్మిదింటికి ఇంటికి వచ్చి ఫ్లాట్ తలుపు తీస్తుంటే ఓ పక్కన వేళ్ళాడుతున్న విండ్ చైమ్స్ మెత్తగా స్వాగతం పలికాయి. నాదైన ప్రపంచానికి తిరిగి వచ్చిన అనుభూతి.
తలుపు ఓపెన్ చేస్తూనే ఎదురుగా పూలతోటలా వాల్ పేపర్. దానిముందున్న సోఫాలో విశ్రాంతిగా వాలి బాగ్స్ టీపాయ్ మీదు౦చి ఒక సారి ఫోన్ చెక్ చేసుకున్నాను.
అన్నీ పనికి రాని మేస్సేజేసే’ ఫ్రిజ్ తెరిచి చల్లటి నీళ్ళు గ్లాస్ లోకి వ౦పుకుని తెచ్చుకున్నాక. టీవీ ఆన్ చేసాను గాని ఆలోచనలన్నీ అనూ చుట్టూనే.
ఎప్పటి స్నేహం ఇద్దరిదీ.స్కూల్ రోజులనుండి సాగి సాగి కాలేజిలోనూ కలసి చదువుకుని అయిదారేళ్ళు ఉద్యోగంలో స్థిరపడ్డాక పెళ్లి తొ అన్నీ వదులుకుని వెళ్ళిన అనూ, నా స్నేహాన్ని మాత్రం వదులుకోలేదు. అవును అప్పుడో ఇప్పుడో కనీసం వారానికోసారైనా ఫోన్ చేసి మాట్లాడుకునే వాళ్ళం. ఇద్దరు అమ్మాయిలైనా తన సౌకుమార్యాన్నీ నాజూకుతనాన్నీ అలాగే కాపాడుకుంది. చూస్తూండగానే సంవత్సరాలు పదులుగా మారి ఇరవై రెండేళ్ళు. అవును ఇరవై రెండేళ్ళు.
క్రితం సంవత్సరమే శౌర్య ఎమెస్ చేసేందుకు అమెరికా వెళ్ళాడు. శౌర్య ఒక్కడే తన కంటి వెలుగు. అక్కడికీ అనూ చెప్తూనే ఉండేది “నువ్వొట్టి బోలా మనిషివే అందరినీ ఇట్టే నమ్మేస్తావు జాగ్రత్త ప్రియా’ అంటూ. కాని చంద్రను ప్రాణం కన్నా ఎక్కువగా నమ్మింది, ఏడాదిన్నర కలసి బ్రతికాక మిగిలినది శౌర్య. ఎక్కడికి వెళ్ళిపోయాడో ఈ విశాల ప్రపంచంలో వెతకడం ఎలాగ ? ఎక్కడని వెతకాలి? చూస్తూ చూస్తూ ఇరవై రెండేళ్ళు గడచిపోయాయి. అప్పుడో ఇప్పుడో వచ్చిపోయే మేఘాల మాదిరి జ్ఞాపకాలు ఇలా వచ్చి ఓ జల్లులా కురిసి వెళ్ళిపోతాయి.
పాసింగ్ క్లవుడ్స్. ఎక్కడా స్థిరంగా ఆగవు. మనసు మళ్ళి౦చుకు౦దుకు లేచి కిచెన్ లోకి నడిచాను.
ఉదయం హడావిడిగా తాగి సింక్ లో వదిలేసిన కాఫీ కప్పు , ఓ మై గుడ్ నెస్ పాలు ఫ్రిజ్ లో పెట్టలేదు, ఎలా ఉంటాయో –కాస్తే గాని తెలియదు, పాలు సిం లో పెట్టి ఒకసారి ప్లాట్ఫాం తడిగుడ్డతో తుడుచుకున్నాక టీ కెటిల్ తీసుకుని నీళ్ళు పట్టి స్టౌ మీదపెట్టి బాల్కనీలోకి అడుగు పెట్టాను. అప్పుడే విచ్చుకుంటున్న మల్లెలు. చెట్టుకున్నవి నాలుగైదే అయినా స్ప్రే చల్లుకున్నట్టు గుభాళి౦పు. మళ్ళీ అనూ గుర్తుకు వచ్చి౦ది. మోకాళ్ళు దాటిన బారెడు జడలో ఎప్పుడూ రె౦డు మూరల మల్లెదండ ఉండాల్సి౦దే.
“పాపం ఆపూలనె౦దుకలా తలల్లో పెట్టుకుని హింసిస్తావు?” పుష్పవిలాపం గుర్తుకు వచ్చి అడిగే దాన్ని.
“నీకేం తలుసు? జుట్టుకు పూలు ఎలా అందమో పూలకు చక్కని జుట్టే అందం” అనేది.
నా పూ బాలలనోసారి తడిమి చూసుకుని వెనక్కు వెళ్లేసరికి కేటిల్ లో నీళ్ళు సగం మరిగిపోయాయి.
పాలు మరుగుతున్నాయి –విరగలేదు. బుజ్జి రైస్ కుక్కర్లో బియ్యం కడిగిపెట్టి టీ కప్పుతో బయటకు వచ్చాను. రేపు అనూ వస్తుంది. ఇన్నేళ్ళ తరువాత ఎందుకి౦త అర్జంట్ గా రావాలనుకు౦టో౦ది. ఏమో…
ఇద్దరు అమ్మాయిలూ చక్కని చెక్కిన పాలరాతి బొమ్మల్లా ఉంటారు. మరీ ఒక ఏడాదే తేడా నేమో కవలల్లానే అనిపిస్తారు. ఎవరు చూసినా కళ్ళు తిప్పుకోలేని అందం. ఇల్లూ పిల్లలూ మొగుడే జీవితమని మనసా వాచా నమ్మిన తనకి ఇప్పుడిలా ఎందుకు గుర్తుకు వచ్చానో!
సరే ఎలాగూ వస్తోందిగా, నా తలబద్దలు చేసుకోడం అవసరమా అనుకుంటూ నాపనిలో నేను నిమగ్నమైపోయాను.
అనుకున్న సమయానికి అనూ రానే వచ్చి౦ది.
పలకరి౦పులూ, పరామర్శలూ, వెచ్చని కంటి చెమరి౦పులూ అన్నీ ముగిసి ఇంటికి వచ్చి తాగడం తినడం ముగించి ఇప్పుడిలా పడక చేరి …
“అనూ, ఎన్నేళ్ళు గడిచిపోయాయి? అయినా నిన్న మొన్న మనం హాస్టల్లో గడిపినట్టుగానే ఉంది. చెప్పు, ఏ విషయం నిన్నింతలా కదిలించి నా వరకూ తీసుకు వచ్చి౦ది”
చేతిని చాపి నా చెయ్యి లాక్కుని చెక్కిలి కానించుకు౦ది అనూ.
ఒక నిమిషం పాటు అలా ఉ౦డిపోయాక నెమ్మదిగా, మెత్తగా మాట్లాడటం మొదలు పెట్టింది.
“ఎప్పుడు ఎక్కడ ఎలా ఈ అసంతృప్తి ఆరంభమై౦దో చెప్పలేను కాని అయిదారేళ్ళుగానో ఆపై మాటేనో… సన్నగా అస్పష్టంగా మొదలైన బాధ ఇది.
పిల్లలకు వారి చదువుల్లో సాయపడలేను.
“నో మమ్మీ .. మీకు తెలియదు. ఇది ఇలాకాదు.” వీ కాన్ డూ’ అంటారు. సమయం మారిపోయే కొద్దీ చదువుల విలువా మారిపోతుందేమో.
అటు పిల్లలకు కాని ఇటు ఆయనక్కాని నా ఎం టెక్ చదువే గుర్తు రాదు.
పెళ్లి మాటల సమయం లోనే ఉద్యోగం పెద్దగా అవసరం లేదు. వచ్చిన దానిలో సర్దుకు౦దా౦ – అన్న రోజున మరో ఆలోచనే రాలేదు నాకు. ఇరవై నాలుగ్గంటలూ నా ఇల్లు, మా ఆయన , నా పిల్లలు ఇంతకన్నా మరో ఆలోచనే రాలేదు. పిల్లలకూ నాకూ మధ్యన కాస్త కాస్త దూరం పెరుగుతున్నదని అనుకున్నాను కాని పిల్లలకు రాం కూ నాకూ మధ్యన ఒక అగాధం మొలుస్తున్నదనుకోలేదు. ఏళ్ల తరబడి రాం ఏం చెప్తే అదే వేదం. ఇంట్లో అన్ని నిర్ణయాలూ తనవే. తను బయటి ప్రపంచంలో తిరుగుతూ ఉంటాడు తనకే బాగా తెలుసుననుకునే దాన్ని. పిల్లలు ఇలా టీనేజీ లో ప్రవేశిస్తూనే అలా నాకేమీ తెలీదనే స్థాయికి వచ్చేసారు. ‘మన’నుండి ఇష్టాలు ‘నాకు’ ఎప్పుడు మారిపోయాయో తెలియనే లేదు.
ప్రియా ఈ ప్రేమ అనే ఊబిలో దిగి నన్ను నేను కోల్పోయానని అనిపిస్తోంది. నా ఉనికిని , నా ఇష్టాఇష్టాలను, చివరకు నన్ను నేనే . ఈ విషయం గమని౦చే౦దుకు కూడా రె౦డూ మూడేళ్ళు పట్టింది. మొదట్లో ఉదయం లేచి ఏం చెయ్యాలో తెలిసేది కాదు. డైటింగ్ లు పాలుతాగరు, ఏమీ తినరు. లంచ్ పాక్ లు ఫాషన్ కాదు. రాం ఆలస్యంగా పడుకుని ఆలస్యంగా లేచి గబగబా రెడీ అయి నిమ్మరసం తాగి ఆఫీస్ కి వెళ్తాడు.
అందుకే ఉదయం ఆరుకే మెలుకువ వచ్చి పది వరకూ ఏమీ తోచక నేనే రెండు సార్లు కాఫీ తాగి కాలు గాలిన పిల్లిలా ఇల్లంతా తిరిగేదాన్ని. తరువాత్తరువాత లేచి ఏ౦చెయ్యాలని అటుదొర్లి ఇటుదొర్లి ఎనిమిది దాటాక లేవడం … ఎక్కడికి పోయిందో ఆ సిస్టమాటిక్ జీవితం? ఇష్ట౦ వచ్చినప్పుడు లేవడం ,ఇష్టం వచ్చినప్పుడు నిద్రపోడం. ఏదుంటే అది తినడం? ఒక్కోసారి ఏమీ తినాలనిపి౦చక రోజుల తరబడి ఏమీ తినకపోడం …. వీటన్నింటి మధ్యా ఒకటి నాకు అర్ధమయింది.
ఎవరిప్రపంచం వాళ్లకు లేనప్పుడు జీవితం భారమవుతుంది. అర్ధ రహితమవుతు౦ది. ఆ క్రమ౦ లో చివరకు జీవితేచ్చ లేకు౦డా పోతు౦ది”అనూ స్వర౦లో వణుకు. చప్పున లేచి కూచుని దాని తల నా వళ్ళోకి లాక్కున్నాను.
“ఇంత నిరాశా నిస్పృహల్లో నేను గుర్తు రాలేదా అనూ “
“కాదు ప్రియా నన్ను నేనే తెలుసుకోలేకపోయాను.ఇప్పుడిలా చెప్తున్నాను కాని , ఇప్పటికైనా ఇలా మనసు విప్పి చెప్పుకోకపోతే ఏ బలహీన క్షణం లోనో ఆత్మ హత్య చేసుకు౦టానేమో అనిపించే ఉన్నఫళంగా నీకోసం పరుగెత్తుకు వస్త”
“వద్దు అనూ ఇంకేమీ చెప్పకు , నేను తట్టుకోలేను ప్లీజ్”
నిద్రపోకపోయినా ఒకరిచేతుల వెచ్చదనం నుండి మరొకరి అ౦తరంగంలోకి ప్రవహించే భావ లహరిలో మూగవోయాము.
పొద్దున్నలేస్తూనే ఇద్దరం కాఫీ తాగి ఓగంట జాగింగ్ కి వెళ్ళాము. అమ్మో అయ్యో అంటూనే నాతొ పాటు పరుగెత్తి౦ది అనూ. ఇద్దరం కలిసి వంట చేసుకుని సరదాగా ముఖేష్ పాటలు వింటూ రోజంతా గడిపాము.
సాయంత్రం బిర్లా మందిర్ కి వెళ్లి దీపాలు వెలిగాక నెక్లెస్ రోడ్ మీద నడక సాగిస్తూ అడిగాను, “ రామ్ మంచి వాడేగా”
“అవును రాముడు మంచి బాలుడే” నవ్వింది అనూ.
“అతనితో జీవితాన్ని ప౦చుకున్నావ్, సంవత్సరాలకొద్దీ సహజీవనం చేశావు. అతనితో నీ అంతర్మధనం చెప్పుకోలేకపోయావా?”
అనూ కాస్సేపు నిశ్శబ్దంగా వుంది. హుస్సేన్ సాగర్ నీటి అలలపై తేలుతున్న నెలవంకను చూపుతూ –“నిజమే ప్రియా, కాని ఇప్పుడు అలా అనిపించట౦ లేదు. అదిగో ఆ
నెలవంకను చూడు, నిజంగా నీళ్ళ మీద గంతులేస్తున్నట్టే ఉందిగా. కాని నిజాని అ౦దు కోలేన౦త దూరం. ఇప్పుడు మాఇద్దరి అనుబంధం అలాగే అనిపిస్తుంది.చాలా సామీప్యంలో ఉన్న భ్రమ , కాని నిజానికి ఎంతో దూరం, నేనతనికి ఒక హోదా ను. ఎంటెక్ చదివిన కేర్ టేకర్ ను. వండిపెట్టే వంట మనిషిని ఒక పితృత్వాన్ని ఇవ్వగల కారకాన్ని, చివరికి ఏ అర్ధ రాత్రో కావాలనిపించినపుడు కోరిక తీర్చే యంత్రాన్ని”
“అనూ … పొరబడుతున్నావు రాంకి నువ్వంటే చాలా ప్రేమ, నువ్వు కష్టపడటం అతనికి ఇష్టం లేకపోయి౦ది.”
“అలా అనే నన్ను నేను మభ్యపెట్టుకున్నాను, ఒక్క మాట చెప్పనా ప్రియా, అతని స్పర్శ కూడా నాకిప్పుడు కంపరం అనిపిస్తోంది” అనూ స్వరంలో కన్నీళ్లు. ఆ రాత్రి పది గంటల వరకూ అక్కడే తిరిగి కామత్ లో డిన్నర్ చేసి ఇంటికి వచ్చాం. లేట్ గా పడుకున్నామేమో మంచి నిద్రలో౦చి వైబ్రేషన్లో ఉన్న అనూ ఫోన్ డ్రెసి౦గ్ టేబుల్ మీద సన్నటి షార్ప్ సౌ౦డ్ మేల్కొలిపి౦ది.అనూ వంక చూసాను, మంచినిద్రలో ఉంది.
అప్రయత్నంగానే ఫోన్ ఆన్సర్ చేద్దామని నొక్కాను.
“ఎన్నాళ్ళు నాకీ పనిష్మెంట్ రేపు సాయంత్రం వచ్చెయ్యి, నువ్వులేకపోతే నాకేం తోచదు. ఐ వాంట్ యూ”మరో మాటకు అవకాశ ఇవ్వకుండా పెట్టేశాడు రాం.
ఆ తరువాత మరి నిద్ర రాలేదు నాకు అనూ సమస్యకు పరిష్కారమేమిటో ఆలోచిస్తూ.
***
పది రోజుల తరువాత మెయిల్ చెక్ చేసుకు౦టు౦టే కొత్త సెండర్ పేరు దగ్గర ఆగిపోయాను.
వెన్నెల సిరి.
అవును చాలా సార్లు కాలేజి లో ఉన్నప్పుడు ఆ పేరుతో కధలో కవిత్వమో రాస్తూ ఉండేది అనూ.
ఆత్రంగా మెయిల్ ఓపెన్ చేసాను.
ప్రియా,
నిజంగానే అక్కడున్న నాలుగు రోజుల్లో నాకు నాలుగు యుగాలకు కావలసిన బలాన్నిచ్చావు. ముఖ్యంగా నాలో పేరుకు పోతున్న సెల్ఫ్పిటీ ఎంత ప్రమాదకరమో ఎంత బాగా చెప్పావు. ఒక్క మాటకూ నన్ను సపోర్ట్ చెయ్యకుండా ఒక్క సలహా ఇవ్వకుండా.
నిజమే పెళ్లిపేరిట నన్ను నేను త్యాగం చేసుకున్నాననుకున్నది నేనే. రాం ఒక్కరోజూ ఉద్యోగం చెయ్యమనీ వద్దనీ అనలేదు. పిల్లలు ఇల్లు అంటూ నన్ను నేను మభ్య పెట్టుకున్నదీ నేనే. మేమంతా ఉద్యోగాలు చేసి ఏం సుఖ పడ్డాం. దానికేం తక్కువ ఉద్యోగం చేసేందుకు అని అమ్మ అంటే కామోసనుకున్నాను కాని ఉద్యోగం వ్యాపకం ఏదో తక్కువైతేనే చెయ్యాలా అని అనుకోలేదు.
నిజమే. మీ పనిమనిషి కూతురికి కాదే నువ్విచ్చిన బ్రెయిన్ వాష్ అది నాకే అనిపించింది.
మొగుణ్ణి వదిలేసి వచ్చిన కూతురికి కాస్త నచ్చజెప్ప మని నీ వద్దకు తెచ్చినప్పుడు ఆ రోజున నీ మాటలు నాకు బాగా గుర్తున్నాయి, ఎందుకు వదిలి వచ్చేశావని అడగలేదు ఆ పిల్లను. ఎంత వరకూ చదువుకున్నావని అడిగావు, రోజంతా ఏం చేస్తావని అడిగావు. మొగుడి ప్రతిపనీ, చివరకు కాళ్ళజోళ్ళు కూడా పాలిష్ చేసిస్తానని చెప్పక మరో మాట అడిగావు. నీకోసం నువ్వు నీకు నచ్చినపని ఏమీ చెయ్యడం లేదెందుకని అడిగావు. ఇంటర్ చదువుకున్నానన్నావు, కనీసం ఒక పుస్తకమయినా చదువుకు౦దామనో ఏదైనా చిన్నగా చెయ్యవచ్చనో అనిపించలేదా అని అడిగిన మాట నాకే తగిలింది.
అవును, నేనూ అంతేగా అనుకున్నాను.
“నిన్నుపట్టి౦చుకోడ౦లేదంటావు. నిన్ను నువ్వే పట్టి౦చుకోక మరొకరినెలా అంటావు?
అయినా చెట్టంత మనిషిని నీ గుప్పిట్లో పెట్టుకోవాలని ఆరాటం కాకపొతే అతని జీవితం అతనూ నీ జీవితం నువ్వూ నచ్చిన విధంగా బతుకుతూ కలిసి ఏ౦చెయ్యాలో , విడివిడిగా ఎవరికీ వారు ఏం చెయ్యాలో తెలుసుకోకపోతే ఎలాగ? జీవితం సినిమా కాదు. కలగలపు కూరలా అన్నీ ఒకటిగా చూసేందుకు. అదొక తేనే పట్టు. ఏ అరకు ఆ అరే.కాని అందరూ కలిసి దాంట్లో తేనే నింపాలి. జీవితమూ అంతే. ఎవరి జీవితో వారిదే కాని అన్నీ కలిసే ఉంటాయి. ఏకత్వంలో భిన్నత్వ౦” అన్నావు.
మనను మనం శూన్యం చేసుకోడం ఎంత తేలిక , అయితే ఆ శూన్యన్ని౦చి బయట పడతామా లేక అందులో ఉక్కిరి బిక్కిరై ఊపిరి విడుస్తామా అన్నది మన చేతుల్లోనే ఉ౦దన్నావు.
జీవితం లో ప్రతి ఘట్తమూ, ప్రతి వ్యక్తీ ఒక పాసింగ్ క్లవుడ్. కాస్సేపు ఓ జల్లుకురిసి వెళ్లి పోయేవే అన్నావు. నిజమే మనమూ మన వ్యక్తి గత ఆనందమూ మన చేతుల్లోనే ఉంది.
మన ఉనికి లోనే ఉంది.
అన్నింటినీ కలగలిపి కాక దేనికి దాన్ని చూడాలని తెలుసు కున్నాను. ఇల్లు వేరు, పిల్లలు వేరు , సమస్యలు వేరు అనుబంధాలు వేరు. అవును వేటికవి ఎక్కడికక్కడ నిలుపు కోవాలి, వ్యక్తిత్వంతో సహా. అన్నింటి సమన్వయమే తీనే పట్టు.
పాసింగ్ క్లవుడ్స్ ను అలాగే చూడాలి తప్ప ఆద్యంతం అందులో తల్లీనమైపోతే మిగిలేది ఇదే.
థాంక్యూ రా ప్రియా”
***
అనూ కూడా ఒక పాసింగ్ క్లౌడేనా ..ఏమో, మరి.
**** (*) ****
యెంత బాగున్నదో !! నిజం . చక్కటి క ధ . ఈ పేపర్,ఆన్ లైన్ క ధ లు చది వే ది ,చదువు కు న్న వారు .వారి సమస్య ఇల్లా గే వుంటై . మంచి గా తట్టి లే పారు .
సంధ్య గారూ థాంక్ యు
“అయినా చెట్టంత మనిషిని నీ గుప్పిట్లో పెట్టుకోవాలని ఆరాటం కాకపొతే అతని జీవితం అతనూ నీ జీవితం నువ్వూ నచ్చిన విధంగా బతుకుతూ కలిసి ఏ౦చెయ్యాలో , విడివిడిగా ఎవరికీ వారు ఏం చెయ్యాలో తెలుసుకోకపోతే ఎలాగ?”
ఇలాటి మంచి సందేశాత్మక వాక్యాలు చాలా ఉన్నాయ్ . ప్రస్తుత సమాజంలో విద్యాధికులైన చాలామందిలో ఉన్న సంఘర్షణను రెండే పాత్రలతో (కనుపించని పాత్రలు కొన్ని ఉన్నా) చాల బాగా చూపడంతో పాటు సున్నితంగా మందలిస్తూ కర్తవ్యాన్ని బోధించారు. అభినందనలు.
విజయ్ గారు థాంక్ యు
కథా రచన పొయెటిక్ గా వుంటం మూలాన నాకు నచ్చింది. సెల్ఫ్ పిటీ జీవితాన్ని పీల్చి పిప్పి చేస్తుంది. జాగ్రత్త అనే సూచన ఇచ్చారు.
బావుంది కథ.
అభినందనలు.
బాగా స్టడీ చేసావు దమయంతీ థాంక్ యు
తనకేమి కావాలో తను తెలుసుకోవడంలోనే సగం జీవితం గడిచిపోతుందెమో.. చాలా బాగుందండీ కథ..
థాంక్ యు లక్ష్మి గారు
స్త్రీ జీవితంలో శూన్యంగా అనిపించే ఓ ఘట్టాన్ని అంశంగా తీసుకుని రాసిన ఈ కథ చాలా బావుంది.
జ్యోతిర్మయీ థాంక్ యు
కధ చాలా బావుంది … ఒంటరితనం మనిషి జీవితాన్ని ఎలా ప్రభావితం చేస్తుందో చాలా చక్కగా వివరించారు.
స్నేహం పట్ల మీకు ఉన్న గౌరవం కధలో చాలా చక్కగా ఓదిగి పోయింది. ఆద్యంతం కధ,కధనం రెండు చాలా చక్కగా ఉన్నాయి. #VeeraReddyKesari
http://teluguoneradio.com/archivesplayer.php?q=19062&host_id=36