కధ జీవితానికో మచ్చుతునక. ఆ జీవితం ఏమిటనేది ఒక్కో కధలో ఒక్కోలా రూపుదిద్దుకు౦టు౦ది. ఆ రూపు దిద్దుకోడంలో చదువరులను వలవేసి లాగి, ఉక్కిరి బిక్కిరి చేసే నైపుణ్యత, అక్షరాలూ ఉలిగా మారి శిల్పాన్ని చెక్కుకునే నేర్పరితనం సంతరించుకుని కధ ముగిసాక ఒక్క క్షణం మనసు చెమ్మగిలేలా కరిగి౦చేదే కధ కదా. పుట్టిన ఘడియ నుండీ చివరి శ్వాస వరకూ ఎన్నో సమస్యలు ఎన్నెన్నో పరిష్కారాలూ. అయితే పరిష్కార సూచనకే రచయిత కధ మాద్యమం ఎంచుకోనవసరం లేదు. చదివిన పాఠకులు తమను తాము పాత్రలతో , వాటి మనస్తత్వాలతో , సమస్యలతో , పరిష్కారాలతో బేరీజు వేసుకుని తమకు కావలసినది ఎంచుకుని అవసరం లేనిది త్యజి౦చగల సమర్ధులు.
ఏదేశ మేగినా, ఏ మారుమూల పల్లె జీవనమైనా, భాష ఏదైనా భావాలు, ఆశలు, అనుభూతులు కొంచం అటూ ఇటూగా ఒకలాటివే. అయితే ఎన్నెన్నో సమస్యల మధ్య , వేదనల మధ్య పరిష్కారం లేని పరిస్థితుల మధ్య నలిగి నలిగి ఏ మూలో ఒదిగిన మెత్తదనం ఎంత అదిమి ఉ౦చినా అప్పుడో ఇప్పుడో ఎగదన్నుకు బయటకు రావడమూ మన మెరుగని విషయం కాదు. దానికి మనం చదివే కధలూ కొంత వరకూ ఉత్ప్రేరకాలుగా పనిచేస్తాయనటం ఎంతమాత్రమూ అతిశయోక్తి కాదు.
ఒక చక్కటి వ్యక్తిత్వం ఉన్న పాత్ర కధలో కనిపించినపుడు మనమెందుకలా ఉండలేక పోతున్నామనే ఆలోచన ఎవరికైనా రాక మానదు.అలాగే ఒక దుష్ట మనస్తత్వాన్ని చదివినప్పుడూ మనమిలా ఉన్నామా అనే ఒక అంతర్దృష్టి అలా ఉ౦డరాదన్న ఆశంస కలగటమూ సహజమే.
ఎంత సేపూ నేనూ నా సమస్యలే అంటూ ఆలోచించే తీరు కొంచం మారి పక్కవారి బాధలు పరిగణిస్తే లోలోపల కుంగి పోతున్న మానవత్వపు ఛాయలు మరో మారు రెక్క విప్పుకోవూ?
రోజు రోజుకూ అంతరించిపోతున్న మానవ సంబంధాలు, అధిగమిస్తున్న ఆధునికతనీడలో పురులు విప్పుతున్న స్వార్ధం వీటికి మూలం ఎక్కడ?
ఆ ప్రశ్నకు జవాబుగా ఈ మధ్యనే పద్మశ్రీ బిరుదు వరించిన కొలకలూరి ఇనాక్ గారి కధ “కొలిమి “ గుర్తుకు వచ్చింది.
గ్రామీణ జీవితం ,వృత్తి సంబంధాలలో వస్తున్న మార్పు ,పరిస్థితుల ప్రభావం వల్ల కోల్పోయిన సహనాలు , చివరకు జయకేతనం ఎగురవేసిన మంచితనాన్ని సహజంగా చిత్రించిన ఘనత ఇనాక్ గారిది. లింగాలు , నా౦చారయ్య కన్నీళ్ళలో మన వంతూ కనిపిస్తుంది. కదా ముగిసే సరికి మనసు మెత్తనై ఇది అని చెప్పలేని ప్రేమ మనకూ కలుగుతుంది.
కధ వర్ణనాత్మకంగా ఆరంభమైనా , ఎక్కడా ఏ పదాన్నీ వదిలి ముందుకు పోలేము. పొగతో ఆరంభమై మన చుట్టూ కమ్ముకుంటుంది. వంశ పారంపర్యంగా వచ్చే కొలిమి వర్ణన క్రమ బద్ధంగా సాగింది. కులవృత్తి మరి. రెండేడ్లు లాగే బళ్ళు తయారు చెయ్యడం లో లింగాలు నిష్ణాతుడు .ఇద్దరు పని వాళ్ళ సాయంతో నెట్టుకొస్తున్నాడు .ఆ విషయాలన్నీ అంత వివరంగానూ రాస్తే తప్ప ఈ తరానికి ముఖ్యంగా పల్లె తెలియని వారికి అర్ధమవడం కష్టం. అక్కడినుండి ప్రస్తుతానికి వస్తుంది కధ.నా౦చారయ్య పని ఆరంభిస్తాడు. అతను డబ్బిస్తే కొన్ని రోజులైనా నెట్టుకు రావచ్చన్న ఆశ. నా౦చారయ్యకు బండి కావాలి , లి౦గాలుకు డబ్బులు కావాలి. అయితే నా౦చారయ్య ఇదివరకు చేయించుకున్న పనికే డబ్బివ్వలేదు. పని పూర్తయినా డబ్బిస్తే గాని బండి ఇవ్వని లింగాలు డబ్బులేక బండి ఇవ్వకేం జేస్తావని నా౦చారయ్య మాటా మాటా పెరుగుతుంది ఆవేశ కావేశాలు పెరుగుతాయి. జనం అటూ ఇటూ కూడా నచ్చాజేప్పబోతారు.
బండి కాల్చేద్దాం అన్నంత ఆవేశం వస్తు౦ది లి౦గాలుకు.అయితే ఇక్కడే కదా మలుపు తిరిగింది. తెల్లారి నా౦చారయ్య తప్పుగా మాట్లాడానని అంగీకరిస్తాడు . ఆకలితో అనరాని మాటలు అన్నానని లింగాలు అంగీకరిస్తాడు. డబ్బిచ్చేమ్దుకు నా౦చారయ్య సిద్ధమైతే , డబ్బు లేకుండా ఇచ్చేందుకు లింగాలు సిద్ధపడతాడు. మనిషి మీద మనిషికి చావని మమకారం ఇద్దరినీ కంట తడిపెట్టేలా చేస్తుంది. వాళ్ళ ప్రేమ ఏడుపు వెల్లువై పొంగింది.
గొప్ప కధ.
ఈ అవగాహన లేకే కదా గొడవలూ , విదిపోడాలూ , చంపుకోడాలూ.
‘కొలిమి’ కథ:
http://vaakili.com/patrika/wp-content/uploads/2014/02/kolimi.pdf
కొలకలూరి ఇనాక్ గారి కథ కొలిమి కి గోపరాజు వెంకట రమేష్ గారి ఆంగ్లానువాదం: http://thulika.net/?p=1142