స్మరణిక

పరిమళాలు మిగిల్చిన మాలతి

23-ఆగస్ట్-2013

ఒక యుగం ముగిసిపోయింది . ఒక రచనా కురువృద్ధు రాలు తెరమరుగయిపోయారు. 84 సంవత్సరాలు సాహితీ ప్రపంచపు సామ్రాజ్ఞి చాలిక సెలవంటూ తరలిపోయారు.

బాల్యంలోనే ప్రమదావనాలు చదివి వ్యక్తిత్వాన్ని దిద్దుకున్న నేను ఆవిడ శిష్యురాలిని. నిన్నటి వరకూ కూడా ఆవిడ పాత కెరటాల్లో ఓలలాడటం, నన్ను అడగండి అంటూ చెప్పే జవాబుల్లో లోకాన్ని దర్శించటం ఇప్పుడిప్పుడు జరుగుతున్నట్టే ఉంది. ఆవిడ ప్రతి నవలా ఎన్నిసార్లో చదివి ఉంటాను .

“అమ్మాయ్ , నేర్చుకుంటూ నలుగురికీ చెప్పడమే నేను చేస్తున్న పని. నీ చుట్టున్న ప్రపంచానికి నీ రచన ఒక మార్గదర్శి కావాలి, ఒక దీపం కావాలి . ఒక చేతి కర్ర కావాలి. ఒక ఊతమవాలి” ఈ నాలుగు మాటలూ నాకు శిరోధార్యం. అవే నాకు వెలుగు బాట.

మాలతీ చందూర్ కృష్ణా జిల్లా లోని నూజివీడు లో 1930 లో జన్మించారు. ఆమె తల్లిదండ్రులు జ్ఞానాంబ,వెంకటేశ్వర్లు.వీరు ఆరుగురు సహోదరులు. అందరికంటే ఆమె చిన్నది. వారు ఉండే ఊరికి, రైల్వేస్టేషనుకు దూరం 13 మైళ్ళు. హనుమాన్‌జంక్షన్‌ కూడా అంతే దూరం.. దివాణం పక్కనే నేను చదివిన ఎస్‌ఆర్‌ఆర్‌ పాఠశాల ఉంది. ఆమె బాల్యం అధికభాగం నూజివీడులోనే గడిచింది, 8వ తరగతి వరకు ఎస్‌ఎస్‌ఆర్‌ పాఠశాలలోనే చదివారు.

ఆ ఊర్లో ఎనిమిదవ తరగతి పూ ర్తి కాగానే చదువుకోవడానికి ఏలూరు వెళ్ళారు. అక్కడ వారి మామయ్యగారి(చందూర్) ఇంట్లో ఉండి చదువుకున్నారు. ఏలూరు లోని వల్లూరు సెయింట్‌ థెరిస్సా స్కూల్లో ఇంగ్లీషు మీడియంలో చేరారు. అప్పుడు చందూర్‌ గారి ద్వారా ఆవిడకు డి.కామేశ్వరి, ఆనందారామం, అరవిందాచారి, సక్కుబాయి వంటి వారితో పరిచయం ఏర్పడింది. ఏలూరులో వారున్న ఇంటికి దగ్గరగా ‘కథావీధి’ అనే సాహిత్య పత్రిక ఉండేది. అక్కడికి శ్రీశ్రీ, విశ్వనాథ సత్యనారాయణ, కృష్ణశాస్తి, నండూరి సుబ్బారావు, వెంకటచలం, కావలి లక్ష్మీనరసింగం మొదలైన వారు వచ్చేవారు. అప్పుడే వీరందరినీ ఆమె చూడడం జరిగింది. 1947లో ఆమె, చందూర్‌ గారు జిటి ఎక్స్‌ప్రెస్‌ ఎక్కి మద్రాసు చేరుకున్నారు. సెంట్రల్‌లో దిగి ఒంటెద్దు బండెక్కి జార్జిటాన్‌లో అద్దె ఇంటికి చేరుకున్నారు. 1947 చివర్లో ఆమె, చందూర్‌ గారు వివాహబంధం తో ఒక్కటయ్యారు. మద్రాసు కు వచ్చిన తరువాతే పైవేటు గా ఎస్‌ఎస్‌ఎల్‌సి పూర్తి చేశారు. ఇంత కు మించి పెద్ద చదువులేం చదవలేదు. 1949లో ఆమె రచనా వ్యాసంగం ప్రారంభమైంది. అప్పట్లో రేడియో లో ఆమె రచనలను చదివి వినిపించేవారు. ఆ రోజుల్లో ఎగ్మూర్‌లో ఉన్న రేడియో స్టేషన్‌కు వెళితే ఒక సాహితీ సభకు వెళ్ళినట్లుండేది. అక్కడే ఆచంట జానకిరాం, బుచ్చిబాబు, జనమంచి రామకృష్ణ, రాజమన్నార్‌, మునిమాణిక్యం నరసింహారావు వంటి వారిని ఆమె దగ్గరగా గమనించే అవకాశం కలిగింది. 1952 నుంచి రచనా వ్యాసంగంలో తీరిక లేకుండా గడిపారు. 1948 నుండి 64 వరకు పురసవాక్కంలో అద్దె ఇంట్లో ఉండేవాళ్ళు. ఆ తరువాత ప్రస్తుతమున్న వారి ఇంట్లోకి మారారు. అప్పటి నుండి అక్కడే ఉంటున్నారు.

ఆంధ్రప్రభ సచిత్ర వారపత్రికలో 1952 నుండి ఆడవారి కోసం ప్రమదావనం అనే రెండు దశాబ్దాలకు పైగానే నడిపారు.. ఈ శీర్షికలో వంటలు, వార్పులే కాకుండా ఇంగ్లీషు నవలలను పరిచయం చెయ్యటం, విదేశాలలో తిరిగి వచ్చిన వారి చేత వారి అనుభవాలు రాయించటం మొదలైనవి చేస్తూ ఆడవారికి ఒక సలహాదారుగా ఉండి, వారి ప్రశ్నలకు సమాధానాలు ఇచ్చేవారు.. ఈమె ప్రచురించిన వంటల పుస్తకాలు ఎంతో ఉపయోగకరంగా ఉండేవి తెలుగులో పాతిక దాకా మహిళా ప్రధాన నవలలు రాయటమే కాక 300 కు పైగా ఆంగ్ల రచనలను తెలుగులో పరిచయం ‘పాత కెరటాలు’ శీర్షికన స్వాతి మాసపత్రికలో ప్రచురించారు. నవలా రచయిత్రిగా, మహిళా వృత్తాలపై కాలమిస్టుగా అనేక పురస్కారాలు అందుకొన్నారు . 70వ దశకములో కేంద్ర సెన్సారు బోర్డు సభ్యురాలిగా పనిచేసిన ఈమె తాను చూసే తమిళ సినిమాలను అర్ధం చేసుకోవటానికి తమిళ భాష నేర్చుకున్నారు. ఈ ఆగస్టు 21 న చెన్నైలో ఈమె క్యాన్సర్ వ్యాధి తో కన్ను మూసారు.