ప్రత్యేకం

కళింగాంధ్ర తీర్ధ ప్రసాదాలు- చింతకింది శ్రీనివాసాం’తరంగాలు

జనవరి 2014

చింతకింది శ్రీనివాస రావు, ఉత్తరాంధ్ర సాహిత్యంతో పరిచయం ఉన్న అందరికీ , రావి శాస్త్రి , పతంజలి సాహిత్యాలతో పరిచయం ఉన్న ప్రతీ వారికీ కొత్తగా తెలిసిన పాత పేరు. శ్రీనివాస్ గారు జర్నలిస్ట్ , నానీ ప్రక్రియ పై రీసెర్చ్ చేసిన సాహిత్య శాస్త్రవేత్త, “నానీల నాన్నగారు’ ఆచార్య ఎన్. గోపీ గారిచే ప్రశంశలు పొందిన రచయిత. పైగా , అతని భాషలో చెప్పాలంటే “ అక్షరాన్ని , అమ్మనీ ప్రేమించని వాళ్ళనీ, శత్రువులు లేని వాళ్ళనీ, గట్టిగా ఏడవని వాళ్ళనీ , చూస్తే నాక్కాస్త భయం తల్లీ ..!!”

పై ఒక్క ముక్క చాలు శ్రీను బాబు అంటే ఎటో సెప్పతానికి.. పుట్టడం అగ్గురారం లో పుట్టినా బాగా చోడారం ( చోడవరం ) బాగా తలకేక్కేసిన మనిషి శ్రీనివాస రావు . అతని మాటల్లో – ‘ పుట్టగానే ఒక రోజు కుయ్ కయి మనలేదమ్మా, ఇక వీడు బతకడు పాతి పెట్టేద్దాం , వంటలన్నా చేసుకోవచ్చు అని , అగ్రహారం అంతా డిసైడ్ అయిపొయింది , మా అమ్మ మాత్రం వీడు బతుకుతాడు, వెంకన్న బాబు పేరు పెట్టుకుంటాను .. థాట్ .. మీరెవరు, నా పిల్లాడ్ని ఇమ్మనటానికి అని తెగేసి చెప్పేసిందమ్మా …! అదిగో అలా బతికీసినాను “ అంటూ నవ్వేస్తారాయన. ఆరోజు నుండీ నాకు తిరుగులేదు. జన్మనిచ్చిన తల్లి అలా అంటే , రచయితగా మరో జన్మనిచ్చింది నా భార్య సునీత అంటారు ఆయన .. “ ఇద్దరు పిల్లల్ని, గవర్నమెంట్ టీచర్ గా ఉద్యోగాన్ని సమర్ధించుకుంటూ , నేను జర్నలిస్ట్ గా ఎన్ని ప్రయోగాలు చేసినా , నన్ను భరిస్తూ .. పో..నీ ఇష్టం వచ్చినట్టు రాసుకో అనటం మళ్ళా జన్మే కాదమ్మా” అంటారు నిరాడంబరంగా. అవునా అని ఆలోచిస్తుండగా మళ్ళీ ఇలా చెప్పాడు శీను బాబు.. “ నాకో గజం స్థలం లేదమ్మా.. చోడారంలో ..కానీ ఊరంటే అదేనాకు .. ఒక్కోసారి వేల్లలేకపోతే .. మా వూరి బస్సుని ముట్టేసి వచ్చేస్తా ఒక్కసారి .. ..చింతకింది కథల్లో మట్టివాసన గుమ్మున తగుల్తుంది మనకి .. ఈ మాటలతో ..!

అదిగో అలా మనం మర్చిపోయిన కొత్త కొత్త కేరక్తర్ల తో , ఉత్తరాంధ్ర కే పరిమితమైన పత్యేక యాసతో రాసే రచయిత బహుశా శ్రీనివాసరావు గారే అనటంలో సందేహం ఏమీ లేదు . మీరు కవిత్వం రాయరా అని అడిగిన మాటకి .. మళ్ళీ చోడారం వెళ్ళిపోతారు ఆయన .. “ అమ్మా.. నీకో విషయం తెలుసా .. మా వూళ్ళో రిక్షావాడిని .. ఎంట్రా అంత చార్జీ .. దగ్గరే కదా అని అంటే.. కంటికి దగ్గరే గాని కాలికి దూరమే బాబయ్యా .. అంటాడు .. ఇంతకంటే బడుగు జీవి బాధను తెలిపే గొప్ప కవిత్వం చెప్పలేక కథల్లోకి దిగిపోయాను .. ‘ అంటారాయన ..! ఒక్కసారి ఫెడీమని కొట్టినట్టు అనిపిస్తుంది , రోజువారి మనం చూసే జీవితాల్లో ఉన్న , హాస్యం, విషాదం అన్నీ కలిపి గుండెని పట్టేసినట్టు ఉంటుంది.

మీరు కథలు ఎలా రాస్తారు ? అని అడిగాను .. దానికి ఆయన “ మెదడ్లో రెండు వందల ఎభైయ్యో వాక్యం వచ్చి కూర్చొని, పిచ్చేక్కిస్తుంది తల్లీ .. మరి తప్పదు అన్నారు .. “ నవ్వకుండా ఉండలేం ఆయన మాటలకు ..!కానీ ఆలోచిస్తే.. అతని రచనల్లోని ఎక్కువ వాక్యాలు భావస్ఫోరక మాండలీక కావ్యాలే ..!

శ్రీనివాసరావు గారి రచనలు ఒకెత్తు అయితే, సాహిత్యం సంగీతం మీద ఆయన కున్న మమకారం మరో ఎత్తు. సరదాగా ఒక ప్రశ్న వేసాను.. ఈ జల్మకీ శీను బాబులా పుట్టేసీ.. ఎదిగేసీ.. ఒకటే రాసీసి జనాల్ని ఎడిపించీసి , నవ్విన్చేస్తున్నావ్ గానీ బావ్.. మరో పాలి పుట్టాక ఏటి కత ? “

దానికాయన మరి శీను బాబు కదా .. “ అదేటమ్మా .. అలగనీసినావ్… సాలూరు రాజేశ్వరరావు గారింట్లో వంటవాడి గా రుమాలేసీసాను గాదేటి …!” జెట్ స్పీడ్ లో వచ్చేసింది రిప్లై .. రసాలూరు సాలూరు వారి గాత్రం అంటే అంత మక్కువ మరి.. !

రావిశాస్త్రి, పతంజలి, నామిని సాహిత్యాలని నమిలి మింగీసి, కొండనక, కోననక, పుట్టలూ గుట్టలూ ఎక్కేసి (సాక్షిలో పాత్రికేయునిగా , ప్రస్తుతం పబ్లిక్ పత్రిక ఎడిటర్ గా ) కష్టాలని అవల్రయిట్ గా ఈది అవతల పారేసిన ఆడ కూతుళ్ళ జీవితాలని “ అలివేణీ ఆణిముత్యమా “ అని రాసేసి దానికి ఎన్నో అవార్డు లను అందుకున్న చింతకింది వారి కీర్తి లో మరో నెమలీక ( అదేనండీ కలికి తురాయి టైప్ అన్నమాట ) ప్రతిష్టాత్మక పీపుల్ ఫస్ట్ లాడ్లీ – జెండర్ సెన్సిటివిటీ అవార్డు.

ఈ అవార్డ్ వచ్చిన సందర్భంగా , అభినందిస్తే కూడా .. మళ్ళీ చోడారం ఆవహించింది శీను బాబుకి .. “ ఇలా పెద్ద ఉద్యోగంలో చేరానని, అవార్డు వచ్చిందని నా స్నేహితుడికి చెప్పగానే అతను ఇలా అడిగాడు.. నీ కింద ఎంతమంది పనిచేస్తారు ? అని .. షుమారు ఏభై అని నేను చెప్పగానే .. అయితే వంద కళ్ళు నీ వైపే ఉంటాయన్నమాటరొరేయ్ శీనూ. జాగ్రత్త రొరేయ్ ..!!”

వంద కళ్ళు మాత్రమే కాదు, మాండలీకాన్ని, మానవత్వాన్ని ఇష్టంగా చదివే ప్రతీ పాఠకుడి కళ్ళూ మీ వైపే ఉంటాయని .. సవినయంగా మనవి చేస్తూ సాయి పద్మ చేస్తున్న చిన్న పరిచయం ..!