పడుగు

నిఖార్సైన కవి నర్సింహారెడ్డి

ఫిబ్రవరి-2014

ఉన్నతీకరించబడ్డ మాట కవిత్వ రూపమైతె, మెరుగైన సమాజం కోసం వ్యాప్తి చేసే భావధార దాని సారమౌతుంది. ఛలోక్తులు, చమక్కులు, తిట్లు శాపనార్థాలు తాత్కాలికంగా కవిత్వంగా చెలామణీ కావచ్చు.పేరు తేవచ్చు.కాని కవిత్వాన్ని సీరియస్‌గా తమ జీవితంలో భాగం చేసుకున్న కవులు భావజాలపరంగా, తాత్వికంగా తమని తాము వ్యక్తీకరించుకుంటరు. తమ కవిత్వం క్యారెక్టర్‌ను విశదపరుస్తరు.తెలుగు సాహిత్యంలో బాలగంగాధర తిలక్‌, పఠాభి, శ్రీశ్రీ,దాశరథి లాంటి అనేకమంది కవులు చెప్పుకున్నట్టు ఇగో మన ఏనుగు నర్సింహారెడ్డి కూడ చెప్పుకుంటున్నడు. ఆర్తి, నిజాయితీ, రాయకుండా ఉండలేనితనం ఈ కవిని ఇట్లా చెప్పుకునేట్టు చేస్తున్నవి.
‘వాదాల్లేని సృష్టించుకున్న వివాదాల్లేని

క్షణ క్షణం తగులుతున్న తాకుడురాళ్ళ పురులనుపరస్పరం సహకరించుకునే సమూహాల్లేని పజ్జెమే

ఒక్కొక్కటే పేనుకుంటూ కట్టిపడేస్తుంది

ఇక నాలో కొత్త ఆశల్ని పూయిస్తుంది’

అని కవిత్వం జీవితంలో ఎట్లా అంతర్బాగమైందో తెలుపుతడు.’కవిత పిచ్చోడని కసిరినారు నన్ను’ అంటూ వాపోతూనే

‘ఒదగకపోతే ఒంచుతా

వినకపోతే విరుస్తా

వ్యాకరణాలు రొదపెట్టనీ

పద్యాన్ని హృదయానికి

పర్యాయపదం చేస్తా’ నంటూ లక్ష్యప్రకటన చేస్తడు.

మృదువైన, సున్నితమైన భావప్రకటనతో సమాజం గురించి సూటిగా, స్పష్టంగా వ్యాఖ్యానించడం నర్సింహారెడ్డి కవిత్వ లక్షణం.60 వ థకంలో పల్లెలో పుట్టి పెరిగి, పట్టణానికొచ్చి పైచదువులు (ఖ.జు.ఆనీ.ఈ.) చదువుతున్న సమయంలో కవిత్వం నర్సింహారెడ్డిని ఆవహించింది.అమ్మగా నాన్నగా ద్విపాత్రాభినయం చేసి తన్ను తీర్చిదిద్దిన ఏనుగు లక్ష్మమ్మ కష్టాల్ని దూరం చేయాలని, అందుకు తాను ఉద్యోగం సంపాదించుకోవాలని తపిస్తున్న కాలంలో నిరుద్యోగం మీద పుంఖాను పుంఖంగా కవిత్వం రాసిండు. క్వాలీఫైడ్‌ల మొర,క్యూ కవిని కలవర పెట్టినయి. అప్పుడప్పుడూ నిరాశ బాకులా దిగేది. ‘సమాజం పుస్తకాన్ని తిరగేసి చదవలేనందుకు’ కలిగిన బాధను కవిత్వంలోకి ఒంపుకుంటడు.

‘కలలు పగిలి పోవచ్చు

పాఠకుని చేరని కావ్యంలా

నువ్వలా కళ్ళల్లో వత్తులు వేసుకొని

గోడమీద సున్నెం పట్టెలా చారగిలబడకు

నేనసలే రాకపోవచ్చు

అమ్మా! ఎదురు చూడకు’

అంటూ తల్లికి ఆఖరి లేక రాసుకుంటడు.దు:ఖం కళ్ళెను ఎల్లబోసుకుంటడు.అందుకే ‘పల్లె చేతుల్తో నగరవాతావరణంలోకి పట్టుకొచ్చిన తాజా కవిత్వం’ నిరుద్యోగిలా మా ఇంటికొచ్చింది అంటాడు ఎన్‌.గోపి.మానవ సంబంధాల పట్ల ఆర్తిగల్ల కవి

సరియైన వయసులో పెళ్ళికాకపోవడాన్ని కూడ హృద్యంగా చిత్రిస్తడు. విఫల ప్రేమలకు విలపిస్తడు. యాంత్రీకరించబడ్డ సంబంధాలని చూసి ‘రోజూ కలుసుకుంటున్న అపరిచితులమం’ టూ వాపోతడు.

తొంభయవ థకం తెలంగాణ సమాజంలో అనేక మార్పుల్ని తీసుకొచ్చింది. ప్రపంచీకరణ దేశానికి పట్టుకొమ్మలైన

పల్లెల్ని మింగేసింది.’కనిపించని ఈ కుట్రల్లో పల్లె కన్నీరు పెట్టింది’. అర్బనైజేషన్‌ పల్లెల్లో ప్రధానంగా వున్న వ్యవసాయాన్ని కుంగతీసింది.ప్రజాస్వామ్య ప్రహసనం ముగిసింది. ప్రభుత్వాలు బహుళజాతి కంపెనీల రిమోట్‌తో నడవడం మొదలైంది. సంపన్న దేశాలు ప్రపంచబ్యాంకు, డబ్లుటివో వాటిని ముందుపెట్టి ఈ నాటకం నడిపిస్తున్నవి.వ్యవసాయం ,దానిమీద ఆధార

పడ్డ చేతివృత్తులు ద్వంసమైనవి.పల్లె వల్లకాడుగా మారింది.

‘అప్పులోల్లు పైసలడిగితే ఎట్లరాని

పొట్టకూటికోసం గింజలెట్టులనుచు

వెరచి రైతుబిడ్డ ఉరికొయ్యకూగెరా’

అంటూ ‘ప్రపంచబ్యాంకు బాకు పల్లెబొండిగ తెంచిన’ వైనాన్ని చిత్రిస్తడు కవి. ‘బహుళజాతి మాయ బలితీసుకొని పోయిన ‘ తీరును ఎరుకపరుస్తడు.

‘చెరువు నోరు తెరిసె చెల్క కన్నీరింకె

చుక్కనీరు లేదు దుక్కిదున్న

తేటతెల్లమాయె తెలగాణ యవుసమ్ము’

అంటూ వ్యవసాయ దుస్థితిని తెలుపుతడు.తెలంగాణ పల్లెల్లోని సకల పార్శ్వాలను చూపుతడు.శ్రమైకజీవన సంస్కృతి తన ప్రాభవాన్ని కోల్పోవడంతో పల్లె బతుకును హీనంగా చూసే పరిస్థితి ఏర్పడింది. అందుకే, ‘పల్లె బతుకు మాది పాడుగాను’ అనే మకుటంతో ‘మట్టిపాట’ను గానం చేసిండు కవి. ఛందోబద్ధ పద్యాలు తెలంగాణ మాండలికం వల్ల అందాల్ని సంతరించుకున్నవి.

తెలంగాణ పల్లె దుంఖమంతా నర్సింహారెడ్డి కవిత్వంలో కనిపిస్తది.స్వతహాగా తను రైతుబిడ్డ. అందుకే,

‘పీఠభూమిలో నాగలి కర్రు కింద

నీటిమట్టం కూడ

నిర్దయగా జారుకుంది’

అంటూ వ్యవసాయ దుస్థితిని కవిత్వం చేస్తడు. ‘నీటినుంచే ప్రాణం పుట్టిందని పంటచేల పారవశ్యాలతోనే సమస్త రంగాల బతుకు బండ్లు పరుగులు తీస్తాయని’ ఎరుకున్న కవి, ఆ నీటిని తోడడానికి కావాల్సిన విద్యుత్తు లేమి పట్ల కలత చెందుతడు.

తెలంగాణ పల్లె దుస్థితికి కారణమైన నయావలపవాదాన్నే కాకుండా, అంతర్గత వలసవాదం మీద యుద్ధం ప్రకటిస్తడు.610 జీవోని ప్రశ్నిస్తడు. ‘వాళ్ళు కష్టపడుతర్‌ సార్‌’ అంటూ సీమాంధ్రుల  దోపడి మీద సెటైర్‌లు విసురుతడు.

‘పనిలేకపోవడమంటే జీవితము పెద్దగా లేకవోవడమే’ నంటూ శ్రమైక జీవన ప్రాశస్త్యాన్ని గుర్తుచేస్తడు.కల్లోని కుంటలో నాన్నని కలవరిస్తడు.

‘కాలానికి ఆరబెట్టిన

నీటిరంగుల వర్ణచిత్రంలా

నాన్న నాకొక అస్పష్ట జ్ఞాపకం’ అంటూ కలత చెందుతడు. పరాయీకరణ నర్సింహారెడ్డిని కూడ నోస్టాల్జియాలోకి

నెట్టింది. అందుకనే కల్లోని కుంటని,కాడమల్లె చెట్టుని, ఊరునీ పలవరిస్తడు. ‘ఇక్కడో ఊరుండేది ఎవరైనా చూపిస్తారా?’ అంటూ గడుసుగా ప్రశ్నిస్తడు.

రెవెన్యూ డిపార్టుమెంట్‌ కు సంబంధించిన సమస్యలమీద,సహృదయులైన సహోద్యోగులమీద మీద కవిత్వమల్లుతడు.

ప్రభుత్వాధికారిగా ఉంటూనే అసౌఖ్యానికి గురైనవాళ్ళ పక్షాన నిలబడడం కొందరికి గొప్ప విషయంగా కనిపించవచ్చు, కాని

అది అనివార్యం అవుతది. గౌరవప్రదమైన వృత్తిగా భావించే డాక్టర్లు, లాయర్లు కూడ రోజువారీ కూలీల కింద మార్చబడ్డ ఈ

వవస్థలో ఏదో ఒక ధృవాన్ని చేరుకోవడం అనివార్యమౌతుంది. నర్సింహారెడ్డి కవి కాబట్టి ప్రజా ధృవాన్ని చేరుకున్నడు.

మృదువైన, స్పష్టమైన, సూటితనం నర్సింహారెడ్డి కవిత్వశైలిలో కనిపిస్తది.తెలంగాణ నుడికారపు సొగను మరింత అందాన్ని అద్దుతది. అక్కడక్కడ వ్యంగ్యం, దెప్పిపొడుపు సాధికారికంగా జతకడ్తవి. అలతి పదాలతో ప్రతీకలను, అలంకారాలను విస్తృతంగా వాడతడు.

‘వెన్నెల మెరువడానికి గోడల అద్దాల్ని వెతుక్కుంటుంది’

‘తల్లులు-మాసిన పిల్లల నెత్తుల్లోంచి పేన్లు ఏరి కుక్కినట్లు

పక్షలు-కొమ్మల రెక్కల నడుమ గండుచీమల్ని ఏరి పారేస్తున్నవి’

 

‘ఫైళ్ళంటే కాగితాలు ఎంత మాత్రం కావు

జోడించబడిన చేతులు’

‘గుట్టను తాకిన మబ్బుల్తో

రంగుల గుడారమేసిన ఆకాశపు’

 

‘చెట్లు పిట్టల దుప్పట్లను తీయనే లేదు

చెరువు కమలం పెదవులతో నవ్వనే లేదు’

 

‘తలస్నానం చేసి తుడుచుకోవడం చేతకాని

పసిపిల్లల సమూహంలా చెట్లు’

 

నర్సింహారెడ్డిలోని భావుకతకు ఇట్లాంటి నిదర్శనాలు ఎన్నైనా ఇవ్వవచ్చు. అట్లే ‘పొద్దూకి వచ్చిన వాన పొద్దూకి వచ్చిన చుట్టంలాపోనే పోదు’ ‘చెడిపి రాస్తున్న(చెరిపి కాదు)’ ‘తొవ్వదారానికి’ ‘నడమంత్రం’ ‘పల్లె బొండిగ’లాంటి తెలంగాణ నుడికారపు మెరుపులు కవి ప్రతిభకు నిదర్శనాలు.  అట్లాగే కవిత్వంలో ప్రయోగాలు చేయడం కూడ నర్సింహారెడ్డి ఇస్టపడుతడు.ఛందోబద్ద పద్యాలతో కూడిన ‘మట్టిపాట’ ,రుబాయీలు మనకు అదే చెప్తాయి.

అయితే,నర్సింహారెడ్డి అంత్యప్రాసల లౌల్యం వదిలించుకోవాలె.ఎత్తుగడ,ముగింపులకు ప్రాధాన్యత ఇవ్వాలె.ప్రతీకల ప్రీతితోటి వచ్చిన అస్పష్టత తొలిగించుకోవాలె. మరింత కవిత్వం రాయాలె. నిఖార్సైన కవిగా నిలబడాలె.

 

 పేరు: ఏనుగు నర్సింహారెడ్డి

జననం: 6 ఎప్రిల్‌ 1968

కల్లోనికుంట, రామన్నపేట (మండలం),నల్లగొండ జిల్లా

ఎస్‌.ఎస్‌.సి.:1983 చిట్యాల

ఇంటర్‌: 1985 రామన్నపేట

బి.ఎ.: 1989 నల్లగొండ

ఎం.ఎ.:ఉస్మానియా

ఎం.ఫిల్‌.:తెవివి-తులనాత్మక సాహిత్యం

M.A. పి.హెచ్‌.డి.:తెవివి-తులనాత్మక సాహిత్యం

రచనలు- 1992 నుండి సీరియస్‌గా కవిత్వం పత్రికలలో

వ్యాసాలు,విమర్శలు,సమీక్షలు 1998నుండి

ప్రచురణలు: కవిత్వం

సమాంతర స్వప్నం-1995

నేనే-2002

మట్టిపాట-2008

కొత్తపలక-2013

నవల- ‘పగిలిన గుండెలు’ డైలీ సీరియల్‌గా నల్గొండ డైలీలో 1988 రెండు నెలలు