ఏ రాజకీయాలకూ తావీయకుండా అరణ్యంలో సాగిపోయే ఒక సెలయేరు తన చుట్టూ ఏర్పడి ఉన్న ప్రకృతితో పాటూ… ప్రతి రోజూ తన వద్దకు వచ్చి దప్పిక తీర్చుకునే జంతు మరియు పక్షి జీవుల కు దాహం తీర్చడం మొదలు ఎంతో సన్నిహితంగా వాటి కదలికలు, సొగసులు, ఒక దానితో మరొకటి కలబోసుకునే కబుర్లు, పాడుకునే పాటలు, వాటి మధ్య చోటు చేసుకునే చిన్న చిన్న పొరపొచ్చాలు/పోట్లాటలు, దినదినం కనిపించే వాటిలోని వైరుధ్యాలు మున్నగు అనేక సహజ సమాజ/సందర్భ/వస్తువుల సందర్శనాన్ని తనదైన ధోరణిలో మనతో పంచుకుంటే ఎలా ఉంటుందో రవిశంకర్ గారి కవిత్వం కూడా అలా ఉంటుంది. ఏ మాయా మర్మం తెలియని బాల్యంలో మనం చేసిన అల్లరిని, చేష్ఠలను మన తల్లిదండ్రులో, తాతబామ్మలో చెబుతుంటె పొందిన ఆశ్చర్యకరమైన పులకింతను రవిశంకర్ గారి కవిత్వం చదివినప్పుడు పొందటం సహజమైన సాధారణం. ప్రవాసం లో ఉండి కూడా తనలోని కవితా మాధుర్య జల ఆగిపోకుండా (లేదా) ఆ జ్వాల ఆరిపోకుండా వేసవి వానంత అపురూపమైన కవిత్వాన్ని పండించి పంచి ఇస్తున్న విన్నకోట రవిశంకర్ గారితో ముఖాముఖం – డా. నారాయణ గరిమెళ్ళ:
1. నమస్తే రవిశంకర్ గారు!
“శిల్పి తన శిల్పాన్ని తెలుసుకున్నట్టుగా నెమ్మది నెమ్మదిగా నన్ను తెలుసుకోవాలి….
నా సాహచర్యం కోసం సముద్రంతో స్నేహం చెయ్యడానికి కావలసినంత ఓర్పు కావాలి….”
అని ‘స్వభావ చిత్రం’ కవితలో మీరు చెప్పినా కూడా, ఈ రోజు మీ మరియు/మీ కవిత్వ స్వభావ చిత్రం గురించి విపులంగా తెలుసుకోవాలని సాహసం చేస్తున్నాము. కుండీలో కుదించేసిన మర్రి చెట్టు గురించి ఎంత ఆవేదనతో కవిత్వం చెప్పారో, ‘వేసవి వాన’లో ఒక మండుటెండలో చల్లని-నీరు తాగిన పరవశం లాంటి మాధుర్యాన్ని కూడా అంతే భావావేశం తో చిలకరించారు. రెండోపాత్ర తో విస్తృతంగా కవితా సౌరభాన్ని పంచి ఇచ్చారు. నిరాడంబరంగా అనిపించే మీ కవిత్వంలో నూరేళ్ళకు సరిపడా జీవిత సౌందర్యాన్ని, ఆటుపోటులని పొందికగా, ఓపికగా ఒక పక్షి గూడు కడుతున్నప్పటి తదేకత తో పదిలపరుస్తున్నారనిపిస్తుంది. వాకిలి పాఠకుల కోసం మీరు మాతో అభిప్రాయాలను పంచుకుంటున్నందుకు ధన్యవాదాలు.
మీ కవిత్వంలో సహజమైన సార్వజనీనత, ‘అవును కదా’ అనిపించే మమేకత్వం ఉంటుందని ఇలాంటి విషయాలు చెప్పకనే చెబుతాయి. మీరు ఎన్నుకొనే కవితా వస్తువు మొదలు, చెప్పే విధానం, దగ్గరయ్యే తత్వం ఇవి మీ కవిత్వానికి నీరు, నారు, వృక్షం ఐన విధానం, మొత్తంగా మీ కవిత్వ నేపధ్యం గురించి వివరంగా చెప్పండి.
మానాన్నగారు విన్నకోట వేంకటేశ్వరరావుగారు రెవెన్యూ డిపార్టుమెంటులో పనిచేసేవారు. ఆయనకు, కవిత్వం మీద, పుస్తకాలు చదవటం మీద అభిమానం ఉండేది. ఆయన విద్యార్థి దశలో ఉండగా, అప్పటి పత్రికల్లో వచ్చిన వివిధ కవుల పద్యాలనుండి తనకు నచ్చిన వాటిని “తెనుఁగుతోట” అనే పేరుతో సంకలనంగా చేసారు. దానిని పరిమితమైన ప్రతులతో 2010లో ప్రచురించినప్పుడు, సాహితీమిత్రులనుంచి మంచిస్పందన వచ్చింది. నాన్నగారు సేకరించినవి, పిల్లలకి ప్రైజులుగా వచ్చినవి పుస్తకాలనేకం ఇంట్లో ఉండేవి. ఇంట్లో అందరికీ చదివే అలవాటు ఎక్కువే. బెనారస్ హిందూ యూనివర్సిటీలో ప్రొఫెసర్గా పనిచేసే మా పెద్దన్నయ్య, వేసవి శెలవల్లో ఇంటికొచ్చినప్పుడు, తలా ఒక పుస్తకం చేతిలో పట్టుకుని ఎప్పుడూ చదువుతూ ఉండే మమ్మల్ని చూసి, “ఇది ఇల్లుకాదు, reading room with attached kitchen” అని కోప్పడి, ఏదో ఒక ఆట వైపుకి మళ్ళించేవాడు. మొత్తానికి ఇంట్లో అందరికీ సాహిత్యాభిలాష ఉంది. నాలా ఒకరిద్దరికి రాసే అలవాటు కూడా ఏర్పడింది. “అరుదైన క్షణం” కథల సంకలనం వెలువరించిన నా సోదరుడు రామచంద్ర కౌండిన్య మంచి కథకుడు.మీ అభిమానానికి ధన్యవాదాలు. ముందుగా నా నేపథ్యం గురించి, తొలిరచనలగురించి కొంత వివరిస్తాను. మా పూర్వీకులు కరణాలు కావటంవల్ల, ఎప్పట్నించో మాది చదువుకున్న కుటుంబమేగాని, వారిలో కవులెవరన్నా ఉన్నారా అన్నది నాకంతగా తెలీదు. ఇరవై సంవత్సరాల కాలవ్యవధిలో జన్మించిన ఎనమండుగురు పిల్లల్లో కడపటివాడిని కావటంవల్ల, నేను మా తాతగారి తరంలో ఎవరినీ చూడలేదు. మా నాన్నగారి తోబుట్టువుల్లో కూడా కొందర్ని నేనెరుగను. ఐతే, మా నాన్నగారి పినతల్లి కొడుకైన గురుజాడ రాఘవశర్మగారు మాత్రం నాకు తెలిసినవాళ్ళలో కవిగా ప్రసిద్ధులు. “పెదనాన్నగారూ, మీకెన్నేళ్ళండీ?” అని అడిగితే, “నా వయస్సెంతరా, పదేళ్ళు – అంతే” (10X7 అన్నమాట!) వంటి చమత్కారాలు చేసేవారు. అలా అడిగినందుకు అమ్మ కోప్పడినా, చమత్కారం చేసే అవకాశం వచ్చినందుకు బహుశ ఆయన సంతోషించే ఉంటారు. ఆయన రాసిన ముకుందమాల పద్యాలు అమ్మతన పూజలో చదువుకొనేదంటే, అవి జనరంజకమైనవే అయుంటాయి. ఆయన “కృష్ణా, వాసుదేవప్రభూ!” అనే మకుటంతో రాసిన శతకం ఇంట్లో ఉండేది. స్వాతంత్ర్య సమరయోధునిగా ఉన్న అనుభవంతో ఆయన సంకలనం చేసిన జాతీయ గీతాలు విలువైన పుస్తకం.
పుస్తకాలు చదివేవాడినిగాని, నాకు పద్యాల మీద ప్రత్యేకమైన ఆసక్తి అంటూ ఏమీ ఉండేదికాదు. నాన్నగారు భాగవతం నుంచి, శతకాలనుంచి నేర్పించిన పద్యాలు వచ్చేవి, అంతే. కాని, హైస్కూలులో చందస్సు నేర్చుకున్నప్పుడు, ఎందుకో నాకు పద్యాలు రాయాలనే కోరిక కలిగింది. గణాలు గుణించుకొంటూ కొన్ని పద్యాలు, ఆపై ఖండికలు రాసాను. రేడియోలో సమస్యాపూరణలు ప్రయత్నించటం కూడా ఆరోజుల్లో చేసిన పనే. పదవతరగతిలో ఒక దేశభక్తిగేయం రాయటం, మా టీచరొకామె దానికి ట్యూనుకట్టి స్వాతంత్ర్యదినంనాడు పిల్లలతో పాడించటం గుర్తుండిపోయే అనుభవం. ఇంటర్లో చేరాక, కాకినాడ పి.ఆర్.కాలేజీలో ఉన్న సాహిత్య వాతావరణంవల్ల ఈ ఆసక్తి మరింత పెరిగింది. మా సంస్కృతోపన్యాసకులు పేరాల భరతశర్మగారు అవధానాలు చాలా బాగా చేసేవారు. నన్ను అవధానాల్లోకి మళ్ళించాలని కొంత ప్రయత్నం చేసారుగాని, అది ఫలించలేదు. ఏదైనా కొంత కృషిచేస్తే ఆశుపద్యాలు చెప్పగలిగేవాడినేమోగాని, ధారణ నావల్ల ఎప్పటికీ సాధ్యపడి ఉండేది కాదు. కాని, నేను కవిని కావాలని ఆయన సహృదయంతో ప్రోత్సహించారు. వారింటికి కరుణశ్రీ వచ్చినప్పుడు, నాతో పాదాభివందనం చేయించి, “కవివి కమ్మని దీవించండి” అని చెప్పారు. హిందీ లెక్చరరు అన్నపురెడ్డి శ్రీరామరెడ్డిగారు, ప్రిన్సిపాలు కటకం పురుషోత్తంగారు కూడా ఎంతో అభిమానంతో ప్రోత్సహించేవారు. ఆ రోజుల్లో శిఖామణి, చైతన్యప్రసాద్ అక్కడ తెలుగు బీ.ఎ చదువుతూ ఉండటంవల్ల వాళ్ళ స్నేహం లభించింది. వాడ్రేవు చినవీరభద్రుడు వేరే కాలేజీలో చదివేడుగాని, బయట తరచు కలిసేవాళ్ళం. కాకినాడ రోజుల్లో నేను సన్నిహితంగా మెలగిన సాహితీ మిత్రులు ఇంద్రప్రసాద్, జయంతి శ్రీనివాస్, సరస్వతుల కృష్ణమోహన్, ద్విభాష్యం వెంకటేశ్వర్లు, నా సోదరుడు ఫణీంద్ర మొదలైనవారు.
ఆ రోజుల్లో గేయాల్లాంటివి కొన్ని రాసేవాడిని. వాటిలో “వృద్ధాప్యం” అనే శీర్షికతో రాసిన గేయం ఒకటి భారతి 1981 ఫిబ్రవరి సంచికలో వచ్చింది. ఇది అచ్చయిన నా మొదటి కవిత. ఇటీవల వేరే దేనికోసమో భారతి పాత సంచికలు తిరగేస్తుంటే, ఇది కనిపించి ఆశ్చర్యపరిచింది. ప్రారంభ యౌవనంలో ఉన్న యువకుడు వృద్ధాప్యం గురించి రాస్తే ఎలా ఉంటుందో అలాగే ఉంటుంది ఆ కవిత. అదే కాలంలో ఆనందజ్యోతి అనే కొత్త వారపత్రిక మొదలైతే, దాని తొలిసంచికల్లో ఒకదానిలో “బుచ్చిబాబు గుండు” అనే నా హాస్య కథ ఒకటి ప్రచురించారు.(ఆ పత్రిక ఎక్కువ రోజులు నిలబడలేదని వేరే చెప్పనక్కర్లేదనుకుంటాను!) ఆ తరువాత నేను పత్రికలకి రచనలు పంపటం చాలా తగ్గించాను. బద్ధకంతోబాటు, నచ్చవేమో అనే భావం కొంత, మన కవిత్వాన్ని వాళ్ళెందుకు జడ్జ్ చెయ్యలనే అహంభావం కొంత ఉండేవి అప్పట్లో. 93లో నా మొదటి కవితాసంకలనంలో వచ్చిన కవితలు చాలా వరకు అముద్రితాలే. దాని గురించి రాసిన చేరాతలు వ్యాసాన్ని చేరా గారు “ఇంత అరుదైన కవి దాదాపు ఒక దశాబ్దం పాటు ఎక్కడ అజ్ఞాతవాసం చేసినట్టు?” అని ముగించారు. ఒక సంపాదకవర్గం నా కవితల్ని కోరి ఆదరించటమనేది ఈమాట వచ్చాకే మొదలయింది. అందుకే, గత పుష్కర కాలంగా నేను రాసిన కవితల్లో చాలా వరకు ఈమాటకే పంపుతూ వచ్చాను.
కవిత్వ సృజన ప్రక్రియ, అందులో సార్వజనీనత, వ్యక్తిగత అనుభవాల సాధాణీకరణ, అనావిష్కృతమైన అనుభవాల్ని గుర్తించటానికి కవికి కావలసిన నేర్పు మొదలైనవాటి గురించి నా అభిప్రాయాల్ని కవిత్వీకరణ పేరుతో ఇదివరకు రాసిన వ్యాసాలలో ఉదాహరణలతో వివరంగా పేర్కొన్నాను. ఇప్పటికీ అభిప్రాయలలో మార్పు లేదు.
2. చిన్న పిల్లలకు ఉండేంత సౌకుమార్యాన్ని తనలో ఎప్పుడూ కాపాడుకోవడం కవికి చాలా అవసరమనిపిస్తుంది. ముఖ్యంగా మీ కవితలలో తాజాదనం, దృష్టికోణం ఎంతో ఆశ్చర్యంగా కొట్టొచ్చినట్టు కనిపిస్తాయి.
హోళీ, పాప మనసు, ఉడాన్, పోలికలు, వసంత సమరం , మూడు పువ్వులు, వేసవి వాన ఇలా అనేక మీ కవితలను ఇందుకు ఉదాహరణలుగా చెప్పవచ్చును.
ఇది భావ కవులకు, విప్లవ కవులకు, ఆధ్యాత్మిక కవులకు అందరికీ వర్తిస్తుందంటారా? కవుల ప్రత్యేక దృష్టికి, దృశ్య పరంపరలను ఆవిష్కరించే వారి తత్వాలకు మూలమైన విషయాలు మీ అభిప్రాయంలో ఏమై ఉంటాయి?
దానిని సౌకుమార్యం లేదా అమాయకత్వం అనేకంటే, ఒక వస్తువునిగాని, సంఘటననిగాని వేరేవారు చూడని కోణంలో చూడటమని చెప్పుకోవటం సమంజసంగా ఉంటుంది. చిన్నపిల్లల్లో ఈ గుణమే మనకు ఆశ్చర్యం కలిగిస్తుంది. మాకు దగ్గర్లో ఒక గుజరాతీ వృద్ధ దంపతులున్నారు. వాళ్ళ దగ్గరికి డేకేర్ కోసం ఒక మూడేళ్ళ పిల్లవాడు వస్తూంటాడు. వాళ్ళ ఇంట్లో పెద్ద సైజు వినాయక విగ్రహం ఒకటి ఉంటుంది. ఆ విగ్రహంలో అభయముద్ర చూపే చేతిని చూసి, వాడు high five ఇమ్మని అడుగుతున్నట్టుగా భావించి, మాటిమాటికీ వెళ్ళి తన చేతిని కలిపి high five ఇస్తూ ఉంటాడు. దేవుని ప్రతిమలో తనను కన్నుగీటి ఆటకు పిలిచే స్నేహితుణ్ణి చూడగలిగిన పిల్లవాడి చూపులాంటిదే కవికి కూడా అవసరమనుకుంటాను. అది రాజకీయమా, ఆథ్యాత్మికమా, సౌందర్యారాధనా అనేదానికంటే, కవి దానిని ఏ కోణం నుంచి చూస్తున్నాడు, ఎలా ఆవిష్కరిస్తున్నాడు అన్నది ముఖ్యం. ఈ దృష్టిని కాపాడుకోవటానికి కవికి సాధన, నిజాయితీ, తేలిగ్గా కవిత రాసిపడేద్దామన్న ప్రలోభం లేకపోవటం వంటివి అవసరం.
3. ‘ఇస్మాయిల్ గారి శిష్యుడు ‘ అని మిమ్మల్ని అనుకోవడం తెలుసు. ఇస్మాయిల్ గారి తొ కవిత్వ సాంగత్యం, శిష్యరికం మరియు మీపై అతని ప్రభావాన్ని చెప్పండి. అతనితో పాటూ మిగిలిన కవుల ప్రభావం మీపై ఎలా ఉంది? మీకు అత్యంత ఇష్టమైన కవులు, వారి కవిత్వం గురించి చెప్పండి.
ఇస్మాయిల్ గారి శుశ్రూష చేసిన మాట వాస్తవమే. ఐతే ఆయన నన్నుగాని, అసలు ఎవరినైనాగాని తన శిష్యునిగా భావించారా అన్నది సందేహమే. ఎందుకంటే, ఆయనకు అటువంటి వాటిపై నమ్మకం లేదని నాకనిపిస్తుంది. ఒక కవికి ఎటువంటి లేబులూ తగిలించటం ఆయనకిష్టం ఉండదు. వాటిలో ఫలానావాడి శిష్యుడనే లేబిల్ కూడా ఒకటి కావచ్చు. ఆయన నా మొదటి పుస్తకానికి ఎంతో అభిమానంతో ముందుమాట రాసారు. కాని, పరోక్షంలో ఎక్కడైనా నా ప్రస్తావన తెచ్చేవారా అన్నది తెలీదు. ఆయన ఇంట్లో ఒక పెద్ద హాలుండేది. అందులో ఒక వైపు కృష్ణశాస్త్రిగారి పటం కింద ఉన్న కుర్చీలో ఆయన కూర్చునేవారు. నేను వెళ్ళినప్పుడల్లా, దానికి ఎదురుగా ఉన్న గోడకి ఆనించిన కుర్చీలో కూర్చునే వాడిని. ఈ రెంటికి మధ్య దూరం బాగానే ఉంటుంది. ఆయన పక్కన కూర్చుని మాట్లాడటానికి చాలా సంవత్సరాలే పట్టింది. ఒకసారి, ఆకెళ్ళ రవిప్రకాష్ చెప్పాడు – సంభాషణలో రవిశంకర్ పేరు వస్తే, ఇస్మాయిల్గారి కళ్ళు మెరుస్తాయని. అది విన్నప్పుడు మాత్రం సంతోషం కలిగింది.
ఇస్మాయిల్ గారి కవిత్వం గురించి నా అభిప్రాయాలు నేనిదివరకు రాసిన వ్యాసాల్లో వివరంగానే చెప్పాను. ఆయన భాషలో పాటించిన నిరాడంబరత కంటే, పదచిత్రాల నిర్మాణంలో ఆయన చూపిన కొత్తదనం, చరాచర సృష్టిలో భాగమైన వివిధ అంశాల మానవీకరణ ద్వారా ఆయన వాటిపై చూపిన ప్రేమ, వాతల్యం నన్ను బాగా ఆకర్షించాయి. ఇస్మాయిల్గారి కవిత్వం పరిచయం కాకముందు, కృష్ణశాస్త్రిగారి కవిత్వం బాగా ఇష్టపడేవాడిని. కృష్ణశాస్త్రి గారు పదాల ఎంపికలో పాటించే నైపుణ్యం, ఆయన కవిత్వంలో అంతటా పరుచుకొని ఉండే దుఃఖం నాకు బాగా నచ్చేవి. కృష్ణశాస్త్రిగారికి జీవితంలో తనకు ఎదురైన ఎడబాటు, దుఃఖం కవిత్వమైతే, ఆయన శిష్యులైన ఇస్మాయిల్గారికి కలయిక, స్నేహం, తన చుట్టూ కళ్ళు మిరిమిట్లు గొలుపుతూ ఎదురయ్యే జీవితోత్సవం కవిత్వమయ్యాయి. ఈ విషయంలో ఆయనపై చలం ప్రభావం ఎక్కువగా ఉందనినిపిస్తుంది. తిలక్ కవిత్వం కూడా ఇష్టమేగాని, ఆ ఇష్టం ఏర్పడటానికి కొంత సమయం పట్టింది. ఆయన కవితల్లో ఉండే పొడవైన వాక్యాలు, అక్కడక్కడ ఎదురయ్యే శబ్దాడంబరం నాకు ఇబ్బందిగా అనిపించేవి. ఐతే, కొంత వయసు వచ్చాక, తిలక్ కవిత్వం మీద విపరీతమైన అభిమానం ఏర్పడింది. ఒక దశలో “నువ్వు లేవు నీ పాట ఉంది” కవిత పూర్తిగా కంఠస్థం చేసాను. వయసుతో మన ఆలోచనల్లో వచ్చే మార్పుని, ముఖ్యంగా గతాన్ని తలుచుకుంటే కలిగే మెలాంకలీని, మొత్తంగా జీవన గమనంలో అనివార్యమైన మానవ వైఫల్యాన్ని తిలక్ అత్యంత అద్భుతంగా చిత్రించాడు. అందుకే, కొత్త తరాలు ఆయన కవిత్వాన్ని అందుకోవటం, ఆస్వాదించటం చూస్తుంటే ఆనందం కలుగుతుంది.ఏ కవినైనా అభిమానించటమేగాని, పూర్తిగా ఒకరి ప్రభావంలో కవిత్వం రాయటం ఎప్పుడూ జరగలేదు. పదాల ఎంపికలో జాగ్రత్త పాటించటం, ఒక్క వ్యర్థపదం కూడా రాకుండా క్లుప్తత సాధించటానికి ప్రయత్నించటం, పదచిత్ర నిర్మాణంలో కొత్తదనానికి కృషిచెయ్యటం వంటివాటిలో పై వారినుంచి నేర్చుకున్నాను. ఐతే, వస్తువు ఎంపిక, దానిని నిర్వహించటంలో నాకు తోచిన పద్ధతినే అనుసరించాను. మానవ స్వభావం, మనుషుల మధ్య సంబంధాలు, వయసుతో బాటు మనలో వచ్చే మార్పులు వంటివి నాకు ముఖ్యమైన వస్తువులయ్యాయి.. నిజానికి ఇస్మాయిల్ గారు కవిత్వంలో కూడదని చెప్పే అనేక అంశాలు – సెంటిమెంటు, పురాజ్ఞాపకాలు, తాత్విక చింతన, దుఃఖం వంటివి నా కవిత్వంలో ఎక్కువగానే కనిపిస్తాయి.
4. ఇస్మాయిల్-అవార్డ్ కి ముందు, తరువాత మీ కవిత్వంలో అదనపు బాధ్యత, ఇతర మార్పులేవైనా వచ్చి వుంటే చెప్పండి. మీ కవిత్వానికి వచ్చిన ఇతర అవార్డులు, పురస్కారాలు, అనుకోని విధంగా వచ్చిన స్పందనలు, అభినందనలు వివరాలు చెప్పండి.
ఇస్మాయిల్ గారి పేరు మీద అవార్దు రావటం, అదీ నాలాగే ఆయన కవిత్వాన్ని అభిమానించే కవి మిత్రులు ఇవ్వటం నాకు ఆనందం కలిగించింది. నా కిష్టమైన కాకినాడ పి.ఆర్.కాలేజీలో దాని నందుకోవటం ఎంతో గౌరవంగా భావించాను. ఐతే, దానివల్ల ప్రత్యేకంగా బాధ్యతల్లో మార్పు వచ్చినట్టుగా అనిపించలేదు. ఎప్పుడూ రాసినట్లుగానే, నా కవితా వ్యాసంగాన్ని కొనసాగించగలిగితే చాలు. నా మూడు పుస్తకాలకీ పాఠకుల నుంచి స్పందనలు మంచివే వచ్చాయి. ఏదైనా కవిత నన్నేమాత్రమూ ఎరగని ఒక సామాన్య పాఠకునిలో పలికితే, అంతకంటె సంతృప్తి కలిగించే అంశం వేరేదీ లేదు. అదే నేను ఎక్కువగా కోరుకుంటాను. ఈ అవార్డు తప్పించి, నాకు వచ్చిన ఇతర పురస్కారాల వంటివేమీ లేవు. నేను దూరంగా ఉండటంవల్ల, పత్రికల్లో ఎక్కువగా ప్రచురించకపోవటం వల్ల అక్కడివారి రేడార్పై నేను కనిపించే అవకాశం చాలా తక్కువ.
5. ఒక్క భోపాల్, శివకాశి కవితలు తప్ప బాహ్య సంఘర్షణలకు, వార్తలకు, విజయాలకు, కల్లోలాలకు, కరువుకు, పోరాటాలకు, అతివృష్ఠి, అనావృష్ఠి తదితర విషయాలకు సంబంధించి మీ కవితలు చదివిన గుర్తు లేదు. నా ఎరుకలో ఇందిర మరణం మొదలు, సెప్టెంబర్ పదకొండు దాడులు, మొన్న మొన్నటి కేదార్నాథ్, ప్రత్యేక రాష్ట్ర ఉద్యమం వరకు ఇలాంటివేవి మీ కవిత్వంలో తొంగిచూసినట్లు అనిపించదు. అవి ఉండాలని ఏ నియమమూ లేదు. కానీ, ఆయా కాలాల సాహిత్యాలలో ఆ నాటి పరిస్థితులు, కుదిపేసిన విషయాలు అంతర్లీనంగా ఒదిగే అవకాశాలు ఉండటం కొంత సహజం కూడా కదా! కవిత్వంలో సమాజ పరిణామాలు, ప్రస్తావన, బాహ్య విషయాలపై స్పందన ఇవి ఎంత భాగం పోషిస్తాయంటారు?
ఏదైనా గొప్ప విపత్తు జరిగి, వందలు వేల సంఖ్యలో జనులు బాధపడుతున్నప్పుడు, నాకు కూడా విపరీతమైన బాధ కలుగుతుందిగాని, దానిగురించి పద్యం రాయాటానికి మనస్కరించదు. అటువంటి పరిస్థితిలో బాధితులకి ప్రత్యక్షంగానో, పరోక్షంగానో సహాయం చెయ్యటం ఉత్తమం. అది వీలుకాకపోతే, వారి గురించి కోసం కన్నీరుకార్చి, వారి కష్టాలు గట్టెక్కాలని భగవంతుణ్ణి ప్రార్థించటం మధ్యమం. మిగతా చర్యలకంత ప్రాధాన్యతలేదని నాకనిపిస్తుంది. చాలా యేళ్ళ క్రీతం, Reader’s Digestలో ననుకుంటాను, ఒక జర్నలిస్టురాసిన కథనం చదివాను. అత్యాచారానికి గురైన ఒక మైనరు బాలిక స్టోరీని కవర్ చెయ్యటానికి అతనిని పంపిస్తారు. ఆ పిల్ల ఈ జర్నలిస్టుల్ని చూసి భయపడి, దూరంగా పోవాలని ప్రయత్నిస్తూ ఉంటుంది. వీళ్ళు కెమెరాలతో, పొడవాటి మైకుల్తో, శాటిలైట్ డిష్లు అమర్చిన వాహనాలతో ఆమెను వెంబడిస్తారు. ఆ పిల్లకు జరిగిన అన్యాయం, ఆమె పడుతున్న క్షోభ తన కెరీర్ను అభివృద్ధి చేసుకోవటానికి సోపానాలుగా ఉపయోగపడతాయనే ఆలోచన అతనికి ఒకరకమైన అపరాధభావాన్ని కలిగిస్తుంది. విపత్తుల గురించి కవిత్వం రాయాలంటే నాకు కూడా అటువంటి అపరాధభావమే కలుగుతుంది. జర్నలిస్టుకైతే అది విధి నిర్వహణలో భాగంగా సమర్థనీయమే. అటువంటి నిర్బంధమేమీలేని కవికి మర్నాటికల్లా ఒక స్టేట్మెంటులాంటి కవిత రాసి చేతులు దులుపుకోవలసిన అవసరమేముందో నాకర్థం కాదు. ఇటువంటి కవితలు పత్రికల్లో ప్రచురించిన కవులెవరైనా, దానికి పారితోషికం లభిస్తే, కనీసం అదైనా బాధితులకి పంపుతారా అని అప్పుడప్పుడూ నేననుకుంటూ ఉంటాను. అలా చేస్తుంటే మంచిదే. అంటే, డబ్బే ప్రధానమని కాదు నా ఉద్దేశం. బాధలో నిజాయితీ ఉండటం ముఖ్యం. ఏదియేమైనా, ఒక కవి ఎంత పెద్ద అంశం గురించి కవిత్వం రాసాడన్నదానికన్నా, ఎంత చిన్న విషయం గురించి కవిత్వం రాసాడన్నదానికి నేను ప్రాధాన్యత నిస్తాను. వార్తా పత్రికల్లో రావటానికి అనువైన విషయాల గురించి రాయటానికి ఎలాగూ వార్తాపత్రికలున్నాయి. మన రాజకీయాభిప్రాయాలు నలుగురికీ తెలియాలనుకుంటే, అవే పత్రికల్లో వ్యాసాలో, లేఖలో రాసుకోవచ్చు. సకలాభిప్రాయాలూ కవిత్వంలోనే చెప్పాలన్న చాదస్తం కూడా అనవసరం. ఎవరి దృష్తీ పడని, ఇతరులంత తేలికగా గుర్తించలేని అంశంపై తన కవిత ద్వారా వెలుగు ప్రసరించటంలోనే కవి ప్రతిభ దాగుంటుందని నా అభిప్రాయం. ఒకవేళ, ఏదైనా బాహ్య సంఘటన ఎన్నో రోజులు మనసులో ముల్లులా సలిపి, ఎప్పటికో ఒక పద్యంగా రూపుదిద్దుకుంటే, వార్తాపత్రిక చూపలేని మరొక కోణాన్ని అది ఆవిష్కరించ గలిగితే అప్పుడు దానికి కొంత విలువ ఉంటుంది. భోపాల్ మీద కవిత రాయటానికి నాకు దాదాపు ఐదు నెలలు పట్టింది. అందులో మల్టీ నేషనల్సుని విమర్శించటంలాంటి రొటీన్ థీం కాకుండా, తన ప్రాణాలిచ్చినా, బిడ్డని రక్షించుకోలేని మాతృమూర్తి ఆక్రోశం వినిపించటం ద్వారా అక్కడి హ్యూమన్ ట్రాజెడీని ఆవిష్కరించే ప్రయత్నం చేసాను. మల్టీనేషనల్స్ ప్రస్తావన లేనందువల్ల, అందులో లోతులేదని పుస్తకావిష్కరణ సభలో శివారెడ్డిగారు వ్యఖ్యానించటం నా కప్పట్లో కొంత బాధ కలిగించింది. కాని, ఎవరి లోతులు వారివని అనుకుంటే సరిపోతుందేమో. నేను లోతనుకునే దానిలో దిగితే వేరొకరికి కాలి మడమలైనా తడవకపోవచ్చు. వాళ్ళు లోతనుకునే దానిలో దూకితే, నా మోకాళ్ళ చిప్పలు బద్దలు కావచ్చు. ఎవరి దృక్పధం, అవగాహన వారిది.
6. ఇప్పటికే వెలువడిన మీ సంకలనాలు కుండీలో మర్రిచెట్టు, వేసవి వాన, రెండో పాత్ర గురించి సంక్షిప్తంగా చెప్పండి. వీటిలో మీరు అత్యంత అనుభూతికీ, ఉద్వేగానికీ లోనై వ్రాసిన కవితల గురించి, మీ మనసును ఇప్పటీకీ హత్తుకుపోయిన విషయాల గురించి పంచుకోండి.
బిడ్డల మధ్య లాగానే, ప్రచురించే పుస్తకాల మధ్య కూడా ఎడం పాటించటం కవికి, కవిత్వానికీ ఆరోగ్యకరంగా ఉంటుంది. నేను ప్రచురించిన మూడు పుస్తకాల్లో ఒక పుస్తకానికి, మరొక పుస్తకానికి మధ్య దాదాపు 8 సంవత్సరాల విరామం ఉంటుంది. కవిత పూర్తి చెయ్యటానికి, దానిని ఎక్కడైనా ప్రచురించటానికి మధ్య కూడా కొంత విరామం అవసరం. నేను కవిత పూర్తి చేసాక, సాధారణంగా దానిని కొన్ని రోజుల వరకు పక్కన పెడతాను. కవిత రాసిన వెంటనే ఉండే ఉత్సాహం చల్లారిన తరువాత కూడా అది బాగుందనిపిస్తే, అప్పుడు ఎక్కడికైనా పంపించే ఆలోచన చేస్తాను. “కుండీలో మర్రిచెట్టు” పుస్తకానికి అనూహ్యంగా చాలా మంచి స్పందనే వచ్చింది. దాని మూలంగా అనేకమంది కవి మిత్రుల పరిచయం పొందే అవకాశం కలిగింది. ముఖ్యంగా ఆర్.ఎస్.సుదర్శనం గారి వంటి గొప్ప విమర్శకులతో పరిచయం ఏర్పడింది. ఇది మొదటి పుస్తకం కావటం, పది, పదిహేనేళ్ళ కాల వ్యవధిలో రాసిన పద్యాలు అందులో ఉండటం వల్ల వాటిలో నాకు గుర్తుండిపోయే కవితలు చాలానే ఉంటాయి. ముఖ్యంగా అమ్మ పోయిన కొత్తలో రాసిన పద్యం (జ్ఞాపకం), మిత్రుడి మరణం తరువాత రాసిన పద్యం (రామప్ప సరస్సు), నిద్ర గురించి రాసిన పద్యం (నిద్రానుభవం), నా స్వభావం గురించి రాసిన అనావిష్కృతం వంటివి అనేకసార్లు గుర్తుకు వస్తాయి. ఇందులో కవితలన్నీ ఇండియాలో ఉండగా రాసినవి, ముఖ్యంగా విద్యార్థి దశ, యౌవన దశను ఇవి ప్రతిబింబిస్తాయి. ఇకపోతే వేసవివాన లో ఎక్కువభాగం కవితలు ఇండియాలో రాసినవే అయినా, కొన్ని ఇక్కడ రాసినవి. ఇందులో మా అమ్మాయి పుట్టిన మూడవరోజు రాసిన “పోలికలు” నాకు బాగా ఇష్టమైన కవిత. దుఃఖంలో ప్రైవసీని గురించి రాసిన వ్యక్తిగతం అనే కవిత, మార్పు అనే శీర్షికతో మారని విషయాల గురించి రాసిన కవిత ప్రత్యేకమైనవిగా భావిస్తాను. శృంగారానుభవాన్ని గురించి రాసిన సుఖానంతరం, అనుభవం అన్న కవితలు కూడా నాకిష్టమైనవే. రెండో పాత్ర పుస్తకంలో కవితలన్నీ ప్రవాస జీవితంలో రాసినవే. అందులో టైటిల్ కవిత ప్రత్యక్షంగా చూసిన అనుభవం గురించి రాసినా, చిన్నపిల్ల ఉన్న ఏ తల్లికైనా అది వర్తిస్తుంది కాబట్టి, సంతృప్తినిస్తుంది. ఒక వ్యతిరేక భావాన్ని తీసుకుని(“మిత్రులు లేకపోయినా ఫరవాలేదు కాని, శత్రువు లేకుండా బతకటం కష్తం”, “పరిత్యాగి కావటానికి వదులుకోవలసిందేమీ లేదు, సంసారికే సర్దుబాటు కావాలి” వంటివి) దానిని నిరూపించే విధంగా సాగిన కవితలు నిర్వహణా పరంగా కష్టమైనవి. రెండో పాత్ర గురించిన సమీక్షలో హెచ్చార్కె ఈ విషయాన్ని గుర్తించి, ప్రస్తావించటం నాకు సంతోషం కలిగించింది.
7. భవిష్యత్ లో రాబోయే మీ కవిత్వం గురించి చెప్పండి. మీరు చేరుకున్న శిఖరాలు ఏవనుకుంటున్నారు? చేరుకోవలసినవి ఏవి? పరోక్షంగానైనా చెప్పండి.
“గడచినదే ఆయువు” అన్నట్టు, ఇప్పటివరకు రాసినదే కవిత్వం. ముందుముందు ఎలా రాయాలి, ఏయే కొత్త ప్రయోగాలు చేయాలి అన్నదాని మీద బృహత్తర ప్రనాణాళికలేవీ ప్రస్తుతం లేవు. ఐతే, రూపపరంగా నా కవితల్లో ఎక్కువ వైవిద్యం చూపించలేకపోయాననే విమర్శ ఒకటుంది. దాని విషయంలో ఏమైనా మార్పు చెయ్యగలనేమో ప్రయత్నిస్తాను. ఏ అదృష్టం వల్లనో ఏర్పడిన ఈ కవిత్వకాంక్ష నిలచి ఉండాలని, ఇదివరకు ఎక్కడో రాసినట్టు, ఈ జల ఆగిపోకుండా, ఈ జ్వాల ఆరిపోకుండా కాపాడుకోవాలనేదే నా ఆకాంక్ష. ఏవో శిఖరాలు చేరుకోవాలనే ఆశలూ పెద్దగా లేవు. చివరిదాకా నేను రాసిన కవిత్వం ఏ అజ్ఞాత పాఠకుని మదిలోనో పలుకుతూ ఉంటే అంతకంటె ఆశించవలసినదేమీ లేదు.
8. వామపక్ష కవిత్వం, ఆ భావజాలం గురించి మీ అభిప్రాయాలు తెలుసుకోవచ్చునా? చెప్పండి.
యువకునిగా ఉన్నప్పుడు అప్పటి మిత్రుల ప్రభావంవల్ల వామపక్ష భావాల వైపు మొగ్గు ఉండేది. ఇస్మాయిల్ గారు కమ్యూనిష్టు వ్యతిరేకని తెలుసు. ఆయన రాజకీయాభిప్రాయాలతో ఏకీభవించకుండానే, ఆయన కవిత్వాన్ని అభిమానించటమన్నది అప్పట్లో నా పద్ధతి. మార్క్సిజం సూత్రాలు, fascination అనే పదం విడివిడిగా తెలుసుకున్న కొత్త రోజులు కావటంతో, ఒకసారి రెండిటినీ కలిపి ఆయన దగ్గర మార్క్సిజం నన్ను fascinate చేస్తోంది అని చెబితే, “fascinate చెయ్యటానికి మార్క్సిజమేమన్నా ఆడదా?” అని నవ్వారు. “బాగా చదువు. నీ బుర్రతో ఆలోచించి ఏది మంచిదో తెలుసుకో.” అని చెప్పారు. వామపక్ష భావాల ప్రభావంతో కొన్ని కవితలు కూడా అప్పట్లో రాసాను. కుండీలో మర్రిచెట్టులో “పడుచు కెరటాలు” అన్న కవిత అలారాసినదే. ఒకసారి పురిపండా అప్పలస్వామిగారున్న సభలో ఆ కవిత చదివితే, ఆయన దానిని మెచ్చుకున్నారు. ఈ ప్రభావం కొంతకాలం నిలిచింది. కాని, విచిత్రమేమిటంటే, విప్లవ రాజకీయాలకి ఆటపట్టయిన ఆర్యీసీ వరంగల్లో చదువుకోవటానికి నేను చేరాక, మార్క్సిజం మీద అభిమానం నెమ్మదిగా సడలిపోయింది. తమకు వ్యతిరేకమైన భావాలపట్ల వారు చూపించే అసహనం, విప్లవ సాంప్రదాయాల్ని పాటించటంలో వాళ్ళు కనబరిచే మూఢభక్తిలాంటి పంతం నాకు ఆశ్చర్యం కలిగించేవి. ఒక చిన్న కాలేజీ కేంపస్లో అధికారం దక్కితేనే (అదీ విద్యార్థుల అంగీకారంతో గెలిచినది కాదు ) ఇంత నిరంకుశ పద్ధతుల్ని అమలుచేస్తున్నారంటే, రేపు ఇలాంటివాళ్ళకు దేశం మొత్తంగా అధికారం లభిస్తే, పరిస్థితి ఎంత భయంకరంగా ఉంటుందో ఊహించలేమనిపించేది. దేశంలోని అన్ని ప్రాంతాల విద్యార్థుల్నీ ఒక చోట చేర్చి నెహ్రూగారు ఆర్యీసీల నేర్పాటు చెయ్యటంలో ఉద్దేశం, అందులో ఒక మినియేచర్ ఇండియా కనిపించి వారికి సుసంపన్నమైన భారతీయ సంస్కృతి గురించి అవగాహని ఏర్పడుతుందని. ఐతే, ఇక్కడ మాత్రం వీళ్ళ పుణ్యమా అని ఇండియా మాట దెవుడెరుగు, ఒక మినియేచర్ రష్యాయో, చైనాయో, నార్త్ కొరియాయో కనిపించి, అటువంటి దేశాల్లో నివసిస్తే ఎలా ఉంటుందో అనుభవ మయింది. ప్రభుత్వాలెంత భ్రష్టుపట్టి పోయినా ఫరవాలేదుగాని, మౌలికమైన ప్రజాస్వామ్య విలువల మీద, స్వేచ్చగా అభిప్రాయాలు తెలిపే హక్కు మీద నమ్మకంలేని రాజకీయ వ్యవస్థను నేనెంత మాత్రమూ అంగీకరించలేను.
9. వర్తమాన కవులకు, సాహిత్యకారులకు, అనువాదకులకు మరియు వాకిలి పాఠకులకు స్థాయి సాధించిన కవిగా, నేడు వస్తున్న కవిత్వం మరియు రావల్సిన కవిత్వాల గురించి మీ సూచనలు, మరియు అభిప్రాయాలు చెప్పండి.
మీరన్నారుగాని, ఇతరులకు సలహాలిచ్చేంత స్థాయి నాకు ఉందనుకోను. కాకపోతే, మిత్రవాక్యంగా ఒకటి రెండు మాటలు మాత్రం చెప్పగలను. తక్కువ సమయంలో ఎక్కువ కవితలు రాయాలనే ఉత్సాహం కంటె, ఎక్కువ సమయం తీసుకుని తక్కువ రాయటం మెరుగు. ఏ కవితలోనైనా కవి నిజాయితీ, తనదైన స్వరం వినపడాలి. కవి గొప్ప తాత్వికుడో, స్థితప్రజ్ఞుడో కానక్కర్లేదు. మనుషులకి సామాన్యంగా కలిగే కష్టసుఖాలకి మనిషిగా తన స్పందనని ప్రభావవంతంగా ఆవిష్కరించగలిగితే చాలు. కవికైనా, పాఠకునికైనా కవిత్వం పునఃపునః సందర్శించవలసిన అపురూపమైన పెన్నిధి. అందువల్ల ఏ కవితకైనా, తక్షణ స్పందన కోసం ఆరాట పడటం, వాటికి అతిగా విలువనివ్వటం వంటివి అవసరంలేదేమో. సోషల్ మీడియా, వెబ్ పత్రికలు ఎక్కువైన ప్రస్తుత సందర్భంలో ఇది బాగా గుర్తుపెట్టుకోవలసిన అంశం. నా ఉద్దేశంలో కవిత్వ సృజన, ఆస్వాదన ప్రజాస్వామ్య ప్రక్రియలు కావు. అంటే మెజార్టీ అభిప్రాయానికి అనుగుణంగా సాగేవి కావు. అవి రెండూ వ్యక్తిగతమైనవి. కవిత్వమనేది, కవికి పాఠకునికి మధ్య జరిగే ప్రత్యేకమైన సంభాషణ. ఇందులో ఎవరి అనుభవం వారిది. కవిలో ప్రతిభ, నిజాయితీ ఉన్నంత వరకు అవి ఎప్పుడో, ఎక్కడో, ఎవరి మనసులోనో పలకక మానవు. అటువంటి నమ్మకమే కవిని, కవిత్వాన్ని బ్రతికిస్తుంది.
ధన్యవాదాలు రవిశంకర్ గారు!
-గరిమెళ్ళ నారాయణ
దేవుని ప్రతిమలో తనను కన్నుగీటి ఆటకు పిలిచే స్నేహితుణ్ణి చూడగలిగిన పిల్లవాడి చూపులాంటిదే కవికి కూడా అవసరమనుకుంటాను. – Straight expression!
‘వేసవి వాన ‘ పుస్తకంలో ఎన్నో మంచికవితల ద్వారా విన్నకోట రవిశంకర్ గారు పరిచయం. మరోసారి ఇలా ఆయన గురించి ఇంకా తెలుసుకోవడం సంతోషంగా ఉంది.
A Good Interview!
Excellent interview
కవిత్వం మీద మంచి అవగాహన కలిగించే ఇంటర్వ్యూ. చాలా బాగున్నదండి.
చాలా విస్తారంగా వుంది. హ్యూమన్ సైకాలజీ మీద ట్రీటైస్ లాగా అనిపించింది. ఎన్నో కొత్త విషయాలు తెలిసేయి.
చాలా బావుంది రవి. సరిగ్గా మీ పక్కగా కూర్చుని మీతో మాట్లాడుతున్నట్టే ఉంది. వరంగల్ ఆర్యీసీలో అప్పట్లో రేడికల్స్ అధికారంలో ఏర్పడిన రాజకీయ వాతావరణాన్ని గురించి మీరు చెప్పింది అక్షర సత్యం.
తెలుసుకుంటూ , తెలుసుకుంటూ .. ఉన్నట్లుగా .. ఉండి, హటాత్తుగా తనలోని మధనాన్ని , సున్నితంగా చెప్పే ఒక ముఖాముఖీగా ఉన్నది .. ఈ ఇంటర్వ్యూ .. బాగుంది రవి గారూ .. ముఖ్యంగా కవిత్వానికీ , శిష్యరికానికీ సరి పడని ఒక వాతావరణాన్ని , ఇస్మాయిల్ గారితో మీ పరిచయాన్ని , చెప్పటం ద్వారా చెప్పేరు .. చాలా బాగుంది .
ముఖాముఖీ గా మొహమాటాలు ,దాపులు ,మూతలు లేకుండా తన అభిప్రాయాల్ని చెప్పిన రవిశంకర్ గారు అభినందనీయులు.,కవితత్వమెరిగి ప్రస్నలదిగిన నారాయణ గారు మీ ఇంటర్వ్యు బాగుంది .
గుడ్ ఇంటర్వ్యూ
ఏదో సీదా, సాదాగా కాకుండా, ఏదో అర గంటలో నాలుగు ప్రశ్నలు అడిగేసి సరి పెట్టకుండా, ఎంతో సమయమూ, ఆలోచనా, నిజంగానే కవి గురించి లోతుగా తెలుసుకోవాలి అనే తపనతో గరిమెళ్ళ నారాయణ గారు ఆప్తుడు విన్నకోట రవిశంకర్ కవి హృదయాన్ని అనేక కోణాల నుంచి ప్రతిభావంతంగా ఆవిష్కరించారు. ఇది మూడు, నాలుగు సార్లు చదివి చాలా నేర్చుకున్నాను. ఇద్దరికీ నా ధన్యవాదాలు. అభినందనలు.
-వంగూరి చిట్టెన్ రాజు
వంగూరి ఫౌండేషన్ ఆఫ్ అమెరికా
చాలా బావుంది.
“ఇస్మాయిల్ గారు కమ్యూనిష్టు వ్యతిరేకని తెలుసు. ఆయన రాజకీయాభిప్రాయాలతో ఏకీభవించకుండానే, ఆయన కవిత్వాన్ని అభిమానించటమన్నది అప్పట్లో నా పద్ధతి.” అప్పట్లోనైనా అది ‘తెలుసు’ కదా, ఆప్త మిత్రుడా! రవీ! అనుకూలతే కాదు వ్యతిరేకత కూడా వాదమేనని మీకు తెలుసు కదా?! మరి అందరిలో ‘వాదా’లున్నాయనే నా వ్యాసంలో వాదాలొద్ధనే ఆయనలో వాధం వుంది అని చెప్పడానికి కొట్టొచ్చినట్టు కనిపించే ఉదాహరణ ఇస్మాయిల్ కాబట్టి ఆయన పేరు ప్రస్తావిస్తే మీకూ మీ గుంపుక అంత కోపమెందుకు వచ్చినట్లు? ఆయన మీ సొంత ఆస్తియా? దీనికి మీరు జవాబివ్వరు. మీవంతా సీమింగ్లీ పాజిటివ్ జీవితాలు. అయినా జవాబిస్తారేమో, కాస్త సాంత్వన దొరుకుతుందేమోనని… గరిమెళ్ల గారు, ఇంటర్వ్యూ చాల బాగుంది. రవి చాల నిజాయితీగా మాట్లాడారు.