కవిత్వం

కవిత ఎలా ఉండాలి ?

జనవరి 2013

 

స్ఫటికం లా… అంది నిశ్చల సరస్సు మెరుస్తూ

నాలా ఉదాత్తంగా — గంభీరంగా పలికింది మహావృక్షం

నిరాఘాటం గా ప్రవహించాలి — గలగలలాడింది సెలయేరు

సద్యః స్ఫురణ కలిగిస్తూ జీవం తొణికిసలాడాలి — కూని రాగాలు పోయింది పిట్ట

సువాసనలతో మత్తెక్కించాలి — ఝుంకరించింది తుమ్మెద

మనసు దోచుకోవాలి — నవ్వింది సీతాకోక చిలుక

రమణీయం గా ఉండాలంటేనో ? అడిగాయి పూలు

లోతుగా సారవంతంగా ఉండాలి — ఘోషించింది లోయ

కొంత రాజసం కూడా ఉండాలి — ప్రతిధ్వనించాయి కొండలు

ఆహ్లాద పరచాలి సుమా— గుసగుస లాడింది వేసవి తెమ్మెర

కరిగిపోతూ ఆలోచనలు గిలకొట్టాలి — గలగలమన్నాయి శిశిర పుటాలు

 

ఇకనేం అని రమణీయ ప్రకృతి నడుమ

భావావేశంతో గబగబా బరికేశాను

సగర్వంగా నా కవిత్వాన్ని అంకితం ఇద్దామని.

 

ప్రకృతి ఒక్కసారి భళ్ళున పగలబడి నవ్వింది

 

ఓరి మూర్ఖాగ్రేసర చక్రవర్తీ !

ప్రకృతి అంతరంగాన్ని అవిష్కరించడం అంత సులువుట్రా?

శాశ్వతత్వపు చిరు శ్వాస అందులో ఏదిరా?