ప్రత్యేకం

జయభేరి మూడవ భాగం – కవిత్వం నాకేమిస్తోంది?

ఏప్రిల్ 2014

కవిత్వం నాకేమిస్తోంది? 

కవి మిత్రులకు నమస్కారం!

వాకిలి ఆహ్వానాన్ని మన్నించి జయభేరి కవి సమ్మేళనంలో చేరిన కవులందరికీ స్వాగతం.

అదాటున ఎదో గుర్తొచ్చి నవ్వుకుంటాం. కొన్నిటిని గుర్తుతెచ్చుకునీ మరీ ఏడుస్తాం. ఏమిస్తుందని ఒక జ్ఞాపకాన్ని పురిటి నొప్పులుపడుతూ మళ్ళీ మళ్ళీ కంటాం? బాధ, సంతోషం, ఒక వ్యక్తావ్యక్త ప్రేలాపన? అసలు ఎందుకు ఆలోచిస్తాం? ఈ ఆలోచనా గాలానికి ఎప్పుడూ పాత జ్ఞాపకాలే ఎందుకు చిక్కుకుంటాయి? ఎందుకు అనుభూతుల్లోకి వెళ్లి కావాలనే తప్పిపోతుంటాం? అసలు ఎందుకు ఆలోచిస్తాం అన్నదానికి సమాధానం దొరికితే, ఆ సమాధానమే “కవిత్వం నాకేమిస్తోంది?” అనే ప్రశ్నకు సమాధానం అవుతుందా?

అసలు కవిత్వం నాకేమిస్తోంది? నేను కవిత్వం ఎందుకు రాస్తున్నా? తెలియని ప్రపంచపు లోతుల్ని కనుక్కోవడం కోసమా, లేక, నాలో నాకు తెలియని లోతుల్ని కనుక్కోవడం కోసమా? ఎవరికోసం ఈ కనుక్కోవడాలూ, గుర్తు తెచ్చుకుని వెక్కి వెక్కి ఏడ్వడాలు? అత్యంత సంక్లిష్టమైన అనుభూతులను పలవరించడం ఎవరికోసం? కవిత్వం నాకు సంతోషాన్నిస్తుందా లేక దుఃఖం మిగులుస్తుందా? అసలు “కవిత్వం నాకేమిస్తోంది?”

జయభేరి కవి సమ్మేళనంలో మొట్టమొదటి టాపిక్, “కవిత్వం నాకేమిస్తోంది?”. ఈ టాపిక్ పై మీ స్పందన రాయండి.


శైలజామిత్ర గారి స్పందన:

మొదటగా కవిత్వం నాకు ఆనందాన్ని ఇస్తోంది. సమకాలీన సమాజం లో నన్ను నన్నుగా నిలబెడుతోంది . అయితే కవిత్వ స్వరం ఎలా ఉండాలి? ఏది రాస్తే కవిత్వం అవుతుంది అనే అంశంపై అనేక చర్చలు జరుగుతున్నాయి . ఎవరికీ వారు ఇదే కవిత్వం అనే ధోరణి సాగుతోంది. ఇటీవల ఒక కవి సమాజాన్ని శాసించలేని కవిత్వం ఉన్నా ఒకటే లేకున్నా ఒకటే. ప్రేమ కవిత్వాలు , వ్యక్తిగత కవిత్వాలు కవిత్వం అనిపించుకోదు అని ఆవేశంగా అన్నారు. నేను అందుకు సమాధానంగా ఎవరు రాసింది వారికి కవిత్వం . నా ధోరణి నాది . మీ ధోరణి మీది. ఒకరిది కవిత్వం కాదు అనడానికి , మరొకరు రాసేదే కవిత్వం అని పొగడానికి మనమెవరం? అనేది నా ఆలోచన. చూద్దాం రేపటి తరం చిక్కని కవిత్వం తో ముందుకు వస్తోంది. వారే నిర్ణయిస్తారు కవులెవరో? కవిత్వం ఏదో ?


నరేన్ (గరిమెళ్ల నారాయణ) గారి స్పందన:

తరచి చూసుకుంటె: పిల్లనగ్రోవి(మురళి) ఉదటం తెలిసిన ఒక మూగవానికి (లేదా) ఒక కాపరి కి, ఆ కళ ఏమిస్తుందో కవిత్వం కూడా నాకు అదే ఇస్తోంది.

తెలియని సంతృప్తి…శతాబ్దాల కాలం పాటూ అనేక పుటలని ఓపికగా దాటుకుంటూ బతికినట్టి అనిర్వచనీయమైన అనుభూతిని ఇస్తోందనిపిస్తోంది.

ఉదాహరణకు, నయాగరా జలపాతాన్ని చూసినప్పుడు…దాని జల్లులో తడిసి ముద్దైనప్పుడు పొందిన అనుభూతి…ఆ అనుభవాన్ని ఒక కవితగా ( ‘ బందీ’ ఈమాట) వ్రాసుకున్నాక పరిపూర్ణమయ్యిందనిపించింది.

అలాగే లోకాన్ని వీడిపోయిన ఆత్మీయమైన మనుషులను, కనుమరుగైపోయిన సందర్భాలనూ కూడా, సజీవంగా దాచుకునే వెసులుబాటునూ (ఫోటోల కన్నా ఎక్కువగా) కవిత్వం కల్పించింది.


నిషిగంధ గారి స్పందన:

చాలాసార్లే కూర్చుంటాను రాయాలని.. సమయాన్నే కాదు, చిందరవందర ఆలోచనల్లేని మనసునీ కూడా తోడు పెట్టుకుని.. కుదరదు.. రెండు మూడు పదాల కంటే ముందుకి జరగదు!
సంతోషమో.. బాధో.. కోల్పోయిన తనమో.. గుండె అంచుల్నిండి రాలినప్పుడూ… సరైన పదాలు వాటిని పట్టుకోగలిగినప్పుడే కవిత్వం అనేదేదో నాకు రాయడానికి వస్తుంది!

అనుభూతీ, ఆలోచనల మిశ్రమమా కవిత్వమంటే.. సరిగ్గా తెలీదు కానీ, ఏం చెప్తున్నానో తెలీకుండానే అంతా చెప్పేసుకుని, బరువు దించేసుకున్న ఒక పక్షీక లాంటి తేలికతనం కవిత్వం ఇస్తుంది నాకు.. సమూహంలో అప్పుడప్పుడూ అత్యంత అవసరమయ్యే ఏకాకితనం కూడా కవిత్వం వల్లనే దొరుకుతుంది!


సాయి పద్మ గారి స్పందన:

హ్మ్మ్.. ఉహూ.. ఇవ్వటం అనేవరకూ వస్తే , కవిత్వంతో బిజినెస్స్ లా అనిపిస్తుంది కాబట్టి, ఏమీ లేదు అనిపిస్తుంది. కానీ కవిత నన్ను మెచ్చుకున్న విధానం చూస్తే అహాన్ని ఇహాన్ని ఎంత సంతృప్తి పరుస్తోందో కదా పాపం అని కవిత్వం మీద జాలేస్తుంది.

ఏది కవిత్వమో నాకు తెలీదు.. ఏ వచనమూ..నేను రాసిన దానితో సహా గుర్తుండదు. కానీ , మాటకీ , నిశ్షబ్దానికీ మధ్యన ఏదో మీడియేషన్ కవిత్వం చేస్తోందనే అనిపిస్తూ ఉంటుంది ..

ఎప్పుడంటే.. గొంతుదాటని మాట, పెదవి దాటని ప్రేమ, శరీరం దాటని అనుభూతి… కాన్షస్నెస్ లేకుండా రాసిన కొన్ని అక్షరాల మూటల్లో , తాయిలంలా అపురూపంగా కనబడినప్పుడు ..

హమ్మా.. కవిత్వమా .. ఏదో ఉంది అని అప్పుడు అనిపిస్తుంది.. ఇప్పటికి ఇంతే ..!


స్వాతీ శ్రీపాద గారి స్పందన:

చాల్లెండి , నవ్విపోతారు! కవిత్వం నాకివ్వడమేమిటండీ బాబూ, ఎంత సేపూ ఎంతొస్తే అంత లాభం అంటూ తీసేసుకోడమేనా ? నేనేమిస్తున్నాను అనే ఆలోచనే వద్దా ?
మదిలో మల్లెల తలపులను ఎందుకు విరబూస్తున్నారని అడగదమా? అపచారం అపచారం .ఎన్ని జాతుల మల్లెలో విశ్వమంతా వికసించి పరిమళభరితం చేస్తుంటే వాటిని అడుగుతున్నామా ఎందుకు పుయ్యాలనిపిస్తో౦ది మీకని? ఒక్క నీటిబొట్టు సన్నని వెలుతురు కిరణాన్ని సప్తవర్నాల్లో ఆవిష్కరిస్తుంటే దాన్ని అడుగుతున్నామా ఏం కనుక్కుందామని ఇన్ని హొయలు పోతున్నావని? నవ్వుల రవ్వలు మెరిసినా కన్నీటి బిందువులు చి౦దినా , నేను కీ మనకూ మధ్య రహదారి కదా అది. బాధపడి కొత్తతరాన్నో , కావ్యాలనో ప్రసవి౦చనిదే లోకమెక్కడ సాహితీ లోకమెక్కడ?పుడుతూనే మనకున్నది ఒకేఒక్క సంపద మనసేగా ? ఆలోచనా అనుభూతీ లుప్తమైన జీవితం ఒక జీవితమేనా? నా ఉనికి కవిత్వం, నాఊపిరి కవోత్వం నేనే కవిత్వం అందుకే నా ప్రతిభావానా కవిత్వానికి నేనే ఇస్తున్న అప్పుడే విరిసిన పూలుగానో అనాలి రగిలిన జ్వాలగానో సుకుమారపు సుతిమెత్తని మాటగానో , మనలో మన మాట మనది ఇచ్చే చేయ్యేగాని పుచ్చుకునేది కాదు.


కెక్యూబ్ వర్మ గారి స్పందన:

కవిత్వం నాకు ప్రతి క్షణం నన్ను నేను సంభాళించుకొని నేలపై నిటారుగా నిలబడే స్థైర్యాన్నిస్తుంది. నాకై నేను రాసుకుంటున్నప్పుడు వాక్యం పూర్తయిన ప్రతిసారీ పారే నీటిలో ముఖం కడుక్కున్న అనుభూతినిస్తుంది. అలాగే మిత్రుల కవిత్వం చదివేటప్పుడు పరకాయ ప్రవేశం చేస్తూ మరల మరల తరచి చూసుకొని చిగురాకులాంటి కొత్తదనాన్ని గుండెకు హత్తుకుంటాను. ఈ క్రియ ప్రక్రియల వలన నాకు నేను పునరుద్దీపమౌతుంటాను. జీవితమే యుధ్ధమైన సమయంలో కవిత్వం ఆయుధం కావడం యాధృచ్చికం కాదు కదా? మనుషులుగా జీవించాల్సిన సమయంలో హృదయ సంభాషణకు కవిత్వం ఓ వాహిక కదా?