కవిత్వం

ఉత్సవం..

ఏప్రిల్ 2014

అలసిన దేహంలోంచి మొలుచుకు వచ్చి
చిగురాకులా ఓ నవ్వు

కాసింత సేదదీరి తెప్పరిల్లి తనలో తాను
మళ్ళీ మొలకెత్తినట్టు

నువ్వంటావు ఆ పోపు వాసన తగిలితే
తుమ్ములొస్తాయి దూరంగా పో అని

కానీ వంటిల్లు ఓ విశ్రాంతి మందిరం
కాకూడదనేముంది

కాసింత తేనీరు వెచ్చగా గొంతులో వంపుకొంటే
నరాలన్నీ మరలా మేల్కొన్నట్టు

నిన్ను నువ్వు కూడదీసుకొని కూడబలుక్కుని
మరల ఒకసారి తేనెలా మెరవడానికి

కుదురు చేసుకోవాలే కానీ ప్రతి చట్రంలోను
ఓ జీవన ఉత్సవాన్ని నింపుకోగలం కదా?