మూడేళ్లుగా ఎదురుచూస్తున్న కెక్యూబ్ వర్మ కవిత్వం మొత్తానికి ఇప్పుడు పుస్తక రూపం దాల్చింది. ఎప్పటినించో రాస్తున్న కవే అయినా, ఈ మూడేళ్లలో వర్మ తనదయిన గొంతు విప్పి, తన కవిత్వ వాక్యాల కింద వర్మ అని సంతకం అక్కర్లేకుండానే ‘ఇది వర్మ రాసిన వాక్యం’ అనే గుర్తింపు సాధించుకున్నాడు. వర్మ కవిత్వం చదువుతున్నప్పుడు వొక ఫైజ్ అహ్మద్ ఫైజ్ గుర్తొస్తాడు. వొక దార్విష్ గుర్తొస్తాడు. వొక నెరూడా మన మధ్యలోంచి నడిచి వెళ్తున్నాడనిపిస్తుంది. సున్నితమయిన ప్రేమనీ, కర్కశమయిన యుద్ధాన్ని రెండీటినీ గానం చేస్తున్న కవి వర్మ. అతని కవిత్వ సంపుటి ‘రెప్పల వంతెన’ కవిత్వ ప్రేమికులకు వొక ఈవెంట్! ఈ పుస్తకం కబుర్లు ఇవిగో!
ఇదీ వర్మ నేపధ్యం:
నెలవంక వెనకాల నడక…
మా నాన్నగారు తన 18వ ఏట ఆంధ్ర దేశం చేరిన కేరళీయులు. ఆయన మా వూరు పార్వతీపురం వచ్చేసరికి యోగిగా వున్నారు. ఇక్కడ అందరికీ ఇప్పటికీ బాలయోగి, బాలసాధువు గారి పిల్లలుగానే మేము పరిచయం. ఆయన తన 31వ సం.లో ఇక్కడి దగ్గరి గ్రామం విక్రమపురంలోని తెలుగింటమ్మాయి మా అమ్మ కంచమ్మను ప్రేమ వివాహం చేసుకున్నారు. అమ్మకు భక్తి పాటలంటే చాలా ఇష్టం. ఎప్పుడూ శ్రావ్యంగా ఆలపిస్తూ మమ్ములను నిదురపుచ్చేది. కథలు చెప్పేది. ఇదే నాకు మొదట సాహిత్యం పట్ల ఆసక్తిని కలిగించింది. నేను ఆగస్టు 22, 1965న జన్మించాను. మేము నలుగురు అన్నదమ్ములం, ఇద్దరు అక్క చెల్లెండ్రు. తన వెనక ఏ ఆస్థి లేని ఓ సాధువుగా మా నాన్నగారి కుటుంబ జీవనం మొదలూ తుదీ అలానే కొనసాగింది. తను ఆయుర్వేద వైద్యం చేస్తూ ఇంత పెద్ద సంసార సాగరాన్ని ఒంటి చేత్తో ఈదారు. వైద్యవృత్తి వలన సంపాదించింది ఆయన దగ్గరకు వస్తే నయమవుతుందన్న మాట మాత్రమే. ఏనాడు మమ్మల్ని పస్తులుంచలేదు. యోగిగా వున్నా ఆయన విగ్రహారాధనకు వ్యతిరేకంగా వుండే వారు. ప్రతి విషయాన్ని హేతుబద్ధంగా ఆలోచించమని ప్రోత్సహించేవారు. యిక్కడి యువకులకు దేహ దారుఢ్యం గురించి తెలియజేసిందాయనే. 1983లో ఇక్కడి పట్టణ సి.పి.ఐ. కార్యదర్శిగా పనిచేసి కారల్ మార్క్స్ శత వర్థంతి సభలు జరిపారు. అలా ఆయన దగ్గరకు వచ్చే మిత్రుల ద్వారాను ముఖ్యంగా లంక సత్యనారాయణ గారు అందించిన వామ పక్ష సాహిత్యం ఆ రాజకీయాలపట్ల ఆసక్తిని కలిగించింది. సత్తిబాబుగా పిలుచుకునే ఆయన నాకు మొదటి గైడ్. ఈయన రోడ్ ఏక్సిడెంట్లో చనిపోవడం నాకు మొదటి షాక్.
1987లో తెలంగాణా ప్రాంతంలో ఉద్యోగం చేస్తూ బదిలీపై మా వూరు చేరిన ఓ మిత్రుని ద్వారా నాకు అజ్ఞాత కార్యకర్తతో పరిచయమై అప్పటినుండి ఆ సాహిత్య రాజకీయాల వెంట పయనం కొనసాగుతు వచ్చింది. ఉద్యమాలతో పరిచయం, వివిధ సంఘాల సభలు సమావేశాలకు హాజరుకావడం అణగారిన వారి హక్కుల గొంతు బాలగోపాల్, కామ్రేడ్ చలసాని ప్రసాద్, కామ్రేడ్ .క్రిష్ణాబాయి, వి.ఎస్.క్రిష్ణ, అప్పన్న దొర గారు, జగన్నాధ స్వామి, రామ్మూర్తి, ఢిల్లీరావుల సాన్నిహిత్యం, ఆత్మీయతలతో చైతన్యవంతమయ్యాను. ముఖ్యంగా క్రిష్ణమ్మ నన్ను తమ కొడుకులా ఆదరించారు. సాహిత్యం అందిస్తూ లేఖల ద్వారా సందేహాలను తీరుస్తూ నాలోని వెలితిని దూరం చేసే వారు.
1997 లో చోడవరంలో జరిగిన కవిత్వ వర్క్ షాపు కవితా వీక్షణంకు హాజరు కావడం నాకు ఓ గొప్ప అవకాశం. అక్కడే శివారెడ్డి, దర్భశయనం, సిధారెడ్డి, తిరుపతిరావు, కొప్పర్తి వంటి సీనియర్లుతో పాటుగా అనేక మంది యువకవులతో ఆలోచనలను అనుభూతులను పంచుకోవడం వారి వారి కవిత్వ జీవన నేపథ్యాలను వినడం వెలుగునిచ్చి కొత్త దృష్టినిచ్చింది. అధ్యయనం పట్ల ఆసక్తిని పెంపొందించింది. శివారెడ్డి గారు నా ఉత్తరానికి జవాబుగా రాస్తూ నాకు ఆంగ్ల పదంలో becoming అంటే యిష్టం అన్నారు. అది నాకు మంత్రమయింది. నిబద్ధత ఒక్కటే కాదు నిమగ్నత అవసరాన్ని తెలిపింది.
మొదట పౌరహక్కుల సంఘంతో మొదలై ఆ తరువాత 1997 లో శ్రీకాకుళంలో క్రిష్ణమ్మ ప్రోత్సాహంతో విరసంలో పడాల జోగారావు గారితో పాటు చేరాను. జోగారావు గారి సాన్నిహిత్యం, కవల కవి సోదరులు రాం రవిల పరిచయం నాలో సాహిత్యం పట్ల మరింత మక్కువను పెంచి కవిత్వం పట్ల ఆసక్తిని రేకెత్తించింది. అరుణతారలో జంఝావతి కలం పేరుతో నా రాతలు అచ్చయ్యేవి. ఆంధ్రజ్యోతి ఆదివారం అనుబంధంలో రెండు కవితలు రావడం కాసింత నిబ్బరాన్నిచ్చింది. శ్రీకాకుళం యూనిట్ మిత్రులు రౌతు బంగారినాయుడు (సువర్ణముఖి), బమ్మిడి జగదీశ్వర రావులు నన్ను ఆత్మీయంగా తమ సహోదరునిలా ఆదరించారు. వీళ్ళిద్దరూ తమ జీవన ప్రస్థానానికి హైదరాబాద్ చేరడం చాలా నిరాశను కలిగించింది. 1998 ఆగస్టు 8న జరిగిన కోపర్ డంగ్ ఎదురుకాల్పులలో ఉద్యమంలోని ప్రజా యుద్ధ వీరులను కోల్పోవడం అశనిపాతమయింది.
విరసంలో శ్రీకాకుళం జిల్లా కన్వీనరుగా కొనసాగుతూ వచ్చాను. స్థానిక మిత్రులలో చాలా మంది విరసంకు దూరమయ్యారు. వారి సొంత పనులకు ఉద్యమాన్ని సంస్థ పలుకుబడిని వాడుకునే అవకాశం రాకపోవడంతో వారు దూరమవడానికి ప్రధాన కారణమయ్యింది. ఆ తరువాత జోగారావు గారూ నేనే మిగిలాం. 2006 జూన్ లో నా మొదటి కవితా సంకలనం వెన్నెలదారి కా. వి.వి. ముందుమాటతో అచ్చయింది. కా. వి.వి.జైలు గది నుండి నాకోసం మాట రాసి పంపడం నాకిప్పటికీ ఉద్వేగానికి గురిచేస్తుంది. ఈ క్రమంలో జోగారావు గారు తన కుటుంబంలోని అశాంతి తనను ఆత్మహత్యకు ప్రేరేపించడంతో ఉన్న ఆ ఒక్క స్నేహమూ దూరమయ్యింది. ఒంటరిగా మిగిలి పోయాను.
ఇక్కడ నా సొంత కుటుంబం గూర్చి కొన్ని మాటలు, నాకు 24 సం.లకే నన్ను యిష్టపడ్డ జ్యోతితో ప్రేమ వివాహం జరిగింది. తను నా కార్యాచరణకు ఎప్పుడూ అడ్డు చెప్పలేదు. తనే ముందుగా ఉద్యోగంలో చేరడంతో ఆర్థికంగా కూడా సహకరిస్తూ నా ప్రయాణాలకు తోడ్పాటునిచ్చేది. పంచాయతీ రాజ్ శాఖలో గ్రామాభివృద్ధి అధికారిగా పనిచేస్తూ వస్తున్నా. మాకు ఇద్దరు పిల్లలు. సాగర్., రాహుల్. పెద్దవాడు విజయవాడ సిద్దార్థ మెడికల్ కళాశాలలో ఎం.బి.బి.ఎస్., చిన్నవాడు విశాఖలో బి.టెక్ చదువుతున్నారు. పెద్దవాడికి సాహిత్యమంటే ఆశక్తి వుంది. 2011 అక్టోబరు 28న నాన్నగారు పరమపదించడం నాకు తీరని లోటును మిగిల్చింది.
ఈ ఒంటరితనాలే సమూహంలో వున్నా తీరని వెలితిని నా కవితలలో అంతర్లీనంగా వెంటాడుతున్నాయి. విరసం పట్ల ఎంతో ప్రేమ వున్న కౌముది, జనార్థన్ ల అమరత్వం, చర్చల ముందు తరువాతి వాతావరణం చాలా ప్రభావాన్ని వేసింది. దేనిని కోల్పోయామో అది ఓ స్వప్నంగా తోసిరాజేయలేక గుండె గూడులో పేరుకుంటున్న గుబులును దూరం చేసే సాన్నిహిత్యం కరువుగా యిలా మిగిలా.
2009లో ఇంట్లో కంప్యూటర్ ప్రవేశం. పిల్లలిద్దరూ బయట చదువులకు పోవడం యింట్లో ఇద్దరమే మిగలడం యిదో వ్యాపకంగా మారి అంతర్జాలంలో అనేక మంది మిత్రులు కావడం బ్లాగింగ్, ఫేస్ బుక్ ద్వారా తెలుగు సాహితీరంగంలోని కవులు కథకులతో పరిచయాలు మొదలయ్యాయి. ఇక్కడే నాకు కవి, రచయిత అఫ్సర్ సార్ పరిచయమయ్యారు. నా రాతల పట్ల ఆదరణను చూపి వర్మా ఈ కవిత బాగుంది. ఇక్కడ ఈ పదం లేకపోయినా పర్వాలేదు అని చెప్తూ కవిత్వం పట్ల తనకున్న ప్రేమను పంచారు అఫ్సర్. ఈ కవితా సంకలనంలోని కవితలన్నీ ఈ రెండేళ్ళలో రాసినవే ఎక్కువగా వుంటాయి.
ఇదీ నా జీవన సాహిత్య నేపధ్యం.
కవిత్వమెప్పుడూ నన్ను నగ్నంగా మీముందు నిలబెడుతుంది…
అద్దం ముందు నేనెప్పుడూ అపరిచితుడినే..
కాలానికి ఎదురీదే అక్షరమై సాగే జీవన పయనంలోని ఒడిదుడుకుల రాపిడినందలి సలపరం ఇష్టమైన వాణ్ణి..
ఇది కవిత్వమో నా కలవరింతో ఓ దాహార్తితో మొదలైన గానం ఎప్పుడూ ఓ అసంపూర్ణ పద్యంలా విరిగి విరిగి పడుతూనే వుంది…
తుదిలేని ఈ పయనం ఈ చివరాఖరి అట్టతో కప్పబడ రాదని ఆశ….
అంతరంగంలోని అలజడి ఆగ్రహం ఆవేదన ఆర్తి రెప్పల వంతెనగా ఇలా మీముందుకు…
అఫ్సర్ గారి ముందు మాట నుంచి కొంత భాగం:
అలికిడిలేనితనం మీద ఆగ్రహ వాక్యం వర్మ!
ఉన్నట్టుండి ఏ అలికిడీ లేకపోతే మరీ బెంగగా వుంటుంది.
వొక మాటకీ, వొక నవ్వుకీ, వొక విధమయిన ప్రశాంత ఉద్వేగపూరితమయిన సంభాషణకీ అలవాటు పడిన తరవాత వున్నట్టుండి ముసురులా కమ్ముకొచ్చిన మౌనం మరీ భయపెడుతుంది కూడా! మళ్ళీ అంతలోనే చిగురంత ఆశ ఎందుకనో మెరిసి నల్ల మబ్బుల్ని తరిమేసి, ముసురు పట్టుకున్న ఆకాశంలో వొక సూర్య రేఖ సూటిగా వెలిగి, ఆ నీరెండ నిచ్చెన మెట్ల మీదుగా సంతోష చంద్ర శాల వొకటి తలుపు తెరుచుకుంటుంది. జీవితంలో ఇలాంటి అనుభవం వొక దాని వెనక వొక్క సరే కలగవచ్చు. లేదంటే, రెండూ జమిలిగా కలిసిమెలిసి మనల్ని ముంచెత్తవచ్చు. ఇంకా కొన్ని సార్లు వొకే వొక్క క్షణంలో అరక్షణం అలికిడిలేని తనమూ , ఇంకో అరక్షణం అలికిడీ అనుక్షణిక వేగంతో మెరిసి విస్మయంలో పడేయవచ్చు. కానీ, వొక్క కవిత్వంలో మాత్రమే ఈ రెండీటీ మధ్యా దోస్తీ సాధ్యమని వర్మ అక్షరాల వెంట నడుస్తూ నడుస్తూ వెళ్తే అర్థమవుతుంది.
వర్మ ‘రెప్పల వంతెన’ మొదటి కవిత నించి చివరి కవిత దాకా రెండుమూడు సార్లు చదువుకుంటూ మననం చేసుకుంటూ వున్న గత కొన్ని రోజుల్లో ఈ రెండు స్థితుల మధ్య అటూ ఇటూ రాకపోకలు సాగించాను నేను.
వర్మ కవిత్వంలో వొక అంతుపట్టని అలజడి వుంది. దానికి వొక సున్నితమయిన లయ వుంది. వర్మ కవిత్వంలో వొక లోతు తెలియని ఆందోళన వుంది, దానికి ఆకారమిచ్చే వొక భాష కూడా వుంది. అటూ ఇటూ వూపిరాడనివ్వని రెండు పరస్పర భిన్నమయిన పరిస్తితుల మధ్య వంతెన కట్టుకుని దాని మీద సహనంగా, నిబ్బరంగా నిలబడి కాలంతో కరచాలనం చేసే స్నేహపూరితమయిన దృష్టి వర్మ సొంతం. ఈ స్నేహ దృష్టి వల్ల అతని కవిత్వంలో నిరాశ, మృత్యువూ, చీకటీ…ఇలాంటి అననుకూల/ ప్రతికూల స్థితులన్నీ వేరే భాష మాట్లాడతాయి. నిరాశని ఆనుకొని వొక వెలుగు రేఖా, మృత్యువుని అంటిపెట్టుకుని వొక తీవ్ర జీవన కాంక్షా, చీకటి అంచు మీదనే వొక వెలుతురు పిట్టల సమూహమూ కనిపిస్తాయి.
జీవితాన్ని మృత్యువు కోణం నించి కాకుండా, మృత్యువుని కూడా జీవితం కోణం నించి చూసినప్పుడు మాత్రమే ఇది సాధ్యమవుతుంది. నా కాలేజీ రోజుల్లో నాకు నచ్చిన వొకే వొక అద్భుతమయిన వాక్యం: “జీనా హై తో మర్నా సీఖో. కదం కదం పర్ లడ్నా సీఖో.” (జీవించాలి అనుకుంటే మరణించడమూ నేర్చుకో, అడుగడుగునా పోరాడడం నేర్చుకో). ఇది చాలా తేలిక పదాలతో కట్టిన వాక్యం. కానీ, దాని బలం ముందు వొక మహాకావ్యం కూడా చిన్నబోతుంది. వర్మ కవిత్వంలో మరణానికి సంబంధించి అనేక పార్శ్వాలు కనిపిస్తాయి. కొన్ని పార్స్వాలకు వ్యక్తిగత సరిహద్దులూ, ఇంకా కొన్ని పార్స్వాలకు సామాజిక/ఉద్యమ కోణాలూ వుంటాయి.
కానీ, అన్నిటికంటే బలంగా విన్పించే స్వరం వొకటి వుంది. అది మృత్యువు కన్నా భీకరమయిన isolation గురించి – చిలీ మహాకవి నెరూడా వొక సందర్భంలో అంటాడు: our most intense experience of impermanence is not death, but our own isolation among the living. వర్మ కవిత్వం చదువుతున్నప్పుడు దూరంగా ఎక్కడి నించో ఆ నెరూడా గొంతుక కూడా వినిపిస్తూ వుంటుంది. సమూహంలో వుండే వొంటరితనాన్ని గురించి ఇటీవలి కాలంలో అత్యంత బలంగా చెప్పిన మన తెలుగు కవుల్లో వర్మ ప్రముఖంగా వినిపిస్తాడు.
వర్మ గారు, అభినందనలు, రెప్పలవంతెన కవితాలోకంలో గొప్పగా ప్రకాశించాలని కోరుకుంటున్నానండి,..
మీ ఆత్మీయ స్పందనకు ధన్యవాదాలు భాస్కర్జీ…
congrats varma
వర్మ గారు
మీ రెండవ కవితా సంకలనం ” రెప్పల వంతెన ” వెలువడిన సందర్భంగా సంతోషిస్తూ అభినందనలు తెలియజేస్తున్నాను.
మామయ్య దగ్గర నుండి ఒక కాపీ తీసుకుని చదువుతాను.
Congratulations!
ధన్యవాదాలు నాగరాజు గారు, రాజేష్, జాన్ హైడి కనుమూరి సార్…
Hearty congratulations dear varma! chala rojulninchee memoo edirir choosamu mee kavita sankalanam kosam!
వర్మ గారు బాగునది నేపథ్యం
కినిగె.కాం లో వర్మ గారి “రెప్పల వంతెన” ఇక్కడ లభిస్తుంది!
http://kinige.com/kbook.php?id=1450&name=Reppala+Vanthena
Nice review…
I love the intensity and the in depth ripples Varma ji’s poetry creates!
‘వెలుగు’ సంస్థ నిర్వాహకులు, గురజాడ ప్రగాఢ అభిమాని రామినాయుడు గారు ‘రెప్పల వంతెన’ చదివి ఇలా ఉత్తరం రాసారు.
ప్రియతమా!
మీ ‘ఆర్తి’ కి వందనాలు,
ముడికి అందని తెగిన దారం గదా బతుకు.
వెంటాడుతుంది. వేటాడుతుంది.
అలా అని గాయం తెలుస్తుందా? సలుపు తప్ప.
గాయం అనుభవాల పుట్ట.
“అత్మానుభవం అయితే గాని తత్వం బోధపడదు” (గిరీశం)
అది వేరే కథ గానీ, వేళ్ళకింత తడి చేసుకుంటే తప్ప దారానికి పురెక్కించడం కుదరనిపని. అదిగో ఆ పురి పెడుతున్న దగ్గరే మనిషికి మనిషిని దూరం జేస్తున్నాం. అది సోక్రటీస్ తోనే మొదలయిందా? అంతకు ముందెన్ని జీవాలు? ఇప్పుడెన్నో? ఇంకెన్నో?
“ఆదీ అంతంలా తెలియకుండా వుందే?” (మళ్ళీ గిరీశమే)
ఆరిపోతున్న బతుక్కి ఇంత తడి అందించిన ‘రెప్పల వంతెన’ కి ఆహ్వానం…
మీ
రామినాయుడ్ని,
14/02/13.
మీ జీవిత, సాహిత్య నేపథ్యం పంచుకున్నందుకు నెనర్లు. బాగుంది. మీరు మళ్ళీ కొత్తగా పరిచయమైనట్టుగా అనిపించింది. పుస్తకావిష్కరణ సందర్భంగా మరోసారి శుభాకాంక్షలు.
congratulations sir
dear Varma garu,
Congratulations brother. i am P.Venkata Ratnam, Panchayat Secretary(Village Development Officer) working at Vangalapudi, Seethanagaram Mandal, East Godavari District. meeru saahitya ramgamlo velugonduthunnanduku abhinandanamulu. i am 1989 batch VDO. please go through my web pages.
http://vangalapudi.webs.com/
http://villagedevelopmentofficers.webs.com/
http://facebook.com/vangalapudi.village/
http://generalbodymeetings.blogspot.in/
with Regards. . .
P.Venkata Ratnam
ratnampv@yahoo.com
+91 9849184081