ఫస్ట్ పర్సన్

వర్గసమాజాన్ని గుర్తించాలి

ఫిబ్రవరి 2013

విరసం వ్యవస్థాపక సభ్యురాలు  క్రిష్ణాబాయిగారు  ప్రస్తుతం విశాఖలో వుంటున్నారు. క్రిష్ణక్కగా అందరికి సుపరిచితం.  చిన్న నాటి నుండే వామ పక్ష ఉద్యమాలతో కుటుంభానికి వున్న అనుబందంతో విప్లవ రాజకీయాల పట్ల అవగాహనతో ఆత్మీయంగా కలసి పనిచేస్తున్నారు. విరసం ఏర్పడిన నాటి నుండి సభ్యురాలుగా వుంటు కార్యదర్శిగా కూడా పని చేసారు. విరసంను నిషేధించిన కాలంలో ఆమె కార్యదర్శిగా వున్నారు. మహిళా సంఘాలు చేస్తున్న ప్రతి కార్యక్రమంలోను తను భాగస్వాములవుతూ ఇప్పటికీ తన బాధ్యతను నిర్వర్తిస్తున్నారు. విరసం తీసుకు వచ్చిన కొడవటిగంటి సంపుటాలు సమగ్రంగా రావడానికి వీరి కృషి కూడా ప్రధాన కారణం. సాహిత్యం, ఉద్యమం రెండు రంగాలలోను తన పాత్ర ఆదర్శనీయం.

కృష్ణక్క ఈ నెల మన ‘ఫస్ట్ పర్సన్.’

 

ఇప్పటి దినచర్య:

 

 

ఇంట్లో రిటైర్డ్ లైఫ్. అంటే వంటపని లాంటివి లేకుండా పేపర్లు చదవడం, సాహిత్యం చదవడం, వచ్చిన మిత్రులతో చర్చా గోష్టి.

 

ఇప్పటి కాలక్షేపం:

 

ఇంటికి వచ్చిన మిత్రులతో చర్చా గోష్టి. ఇటీవల స్త్రీలపై జరుగుతున్న దాడుల గురించి, వాటి పట్ల సమాజం స్పందించే తీరును చర్చించడం. సమాజం వీటిని ఎదుర్కునే పరిస్థితులపై చర్చ.

 

ఇటీవల స్త్రీలపై పెరిగిన దాడుల పట్ల మీ స్పందన:

 

ఇతర దేశాలలో ఇంతలా స్త్రీలపై ఇటువంటి దాడులు లేవు కదా. భారతదేశం స్రీని గుర్తించింది, పూజించింది, కీర్తించింది అని చెప్పుకుంటాం. కానీ మన దేశంలోనే ఈ దారుణాలు అధికంగా జరగడం తీవ్రంగా కలచి వేస్తోంది. ఆకలికన్నా కామ దాహం ఎక్కువయింది. ఢిల్లీ సంఘటనపై హరగోపాల్ గారు ఒక మాటన్నారు ” ఆ అమ్మాయి మెడికల్ విద్యార్థిని కాబట్టే ఇంత స్పందన వచ్చిందని “. కానీ అది నాకు సమ్మతం కాదు. ఈ దారుణంలో ఆ అమ్మాయి తీవ్రంగా దాడి చేయబడడం,  తన మానంపై రాక్షసంగా జరిగిన దాడి, ఆ తరువాత నేరస్థులు ప్రవర్తించిన తీరు పట్ల తప్పక ఇంతకంటే ఎక్కువ స్పందనే అవసరం. ఇటీవల నేను ఆంధ్రజ్యోతిలో చెప్పినట్లు బెజవాడ-విజయవాడగా మారిన పరిస్థితి గురించి ఓ మాట, అప్పట్లో మేము సైకిల్ పై కాలేజీకి వెళ్తుండగా బెజవాడలో సీతారామ భక్త సమాజం వాళ్ళు వెంటపడి అల్లరి చేస్తే నేను అప్పట్లో కమ్యూనిస్ట్  పార్టీ వారి కోలనీ ప్రజాశక్తి నగర్ లోని విద్యార్థి సంఘ కార్యాలయంలో రిపోర్టు చేస్తే వాళ్ళు వచ్చి వాళ్ళకి దేహ శుద్ధి చేసి బుద్ధి చెప్పారు. ఇప్పుడు విజయవాడగా మారిన తరువాత ఆయేషాపై అలాగే ఇంకా అనేక దారుణాలు స్త్రీలపైనా, విద్యార్హ్తినులపైనా జరుగుతున్నా స్పందించే వారు కరువవడం బాధగా వుంది.

 

సాహిత్యంలో స్త్రీ:

 

గురజాడ ఆధునిక స్త్రీని కలగన్నాడు. ఆధునిక స్త్రీ అంటే ఏమిటి, ఎలా వుండాలన్నది తన రచనల ద్వారా తెలియ చెప్పాడు  నా చిన్నప్పుడు నా చేతిలో చలం పుస్తకం చూసిన చండ్ర రాజేశ్వర రావుగారు ఆయన బూతు రాస్తాడు తీసి అవతల పారేయి అని అన్నారు. ఇది కమ్యూనిస్టులు అప్పట్లో చేసిన తప్పే. జ్నానం తెలిసిన తరువాత ఎంత పొరపాటు చేసామో తెలిసింది. ఇప్పటికీ నాకే కాదు నేటి సమాజానికి కూడా చలం స్త్రీ,. మ్యూజింగ్స్, ప్రేమలేఖలు, బిడ్డల శిక్షణ ఆరాధ్య గ్రంధాలు. చలం స్త్రీ లిబరేషన్ గురించి బాగా చెప్పాడు. ఆయన తరువాత ఆయన శిష్యులు, అనుచరులు ఫాలో కాలేదు, తెలుసుకోలేదు. ఇది అన్ని చోట్లా వుంది.

 

ఇతర దేశాలలో అక్కడి స్త్రీల జీవనాన్ని నిశితంగా పరిశీలించిన ఉప్పల లక్ష్మణ రావు గారి అతడు ఆమె నవల నాకు చాలా ఇష్టం. ఇది డైరీ ఫార్మాట్ లో రాసింది. ఒకే సంఘటన పట్ల ఇద్దరి స్పందన ఎలా వుందనేది చెప్పారు. ఇది ఎందుకో కారా మాస్టారికి నచ్చలేదు.  అరసంలో కవిత్వం వచ్చినంతగా కథా, నవలలు రాలేదు. విరసంలో వర్గ సమాజంలో స్త్రీ ఎట్లా వుందనేది మాత్రమే వస్తోంది. అలాగే అమ్మ – విప్లవయుగం అని గద్దె లింగయ్య గారు రాసిన నవల  నాపై చాలా ప్రభావం వేసింది. ఇది ఉద్యమాలలోని స్త్రీలపై రాసింది. కాంగ్రెస్ సోషలిస్ట్ పార్టీపై నిషేదం వచ్చినప్పుడు మా అమ్మ ఇవి రెండుపుస్తకాలు గడ్డి వాములో దాచి పెట్టారు.  ఆనాడు కమ్యూనిస్ట్ పార్టీలలో కూడా స్త్రీ పాత్ర తక్కువగా వుండేది. కుటుంబానికే పరిమితమయ్యేది. మాపై అప్పటి ప్రజా నాట్యమండలి వారి బుర్రకథలు చాలా ప్రభావం వేసాయి. ఆ వాతావరణం ఇప్పటి సమాజంలో లేకపోవడం విషాదం.

 

అస్తిత్వ వాదాల పట్ల అభిప్రాయం:

 

అస్తిత్వ వాదాలు నాకు నచ్చవు. దళిత వాదం తీసుకు వచ్చిన ఆత్మ గౌరవ పోరాటాలు కావాల్సినవే. స్త్రీవాదం అనేది పురుషుడు స్త్రీ అనే వర్గ వైరుధ్యం కరెక్ట్ కాదు. వర్గ సమాజాన్ని గుర్తించకుండా ఎవరికి వారు చేసే వాద ప్రతివాదాలు, ఉద్యమాల ప్రభావం సమాజం మార్పుకు దారి తీయదు. విరసంపై వాటి ప్రభావం అంతంత మాత్రమే.

 

ఇటీవల నచ్చిన కథ:

 

ఈ మధ్య రాస్తున్న సామాన్య కథలంటే ఇష్టం. బాగా రాస్తోంది. గొప్పగా వచ్చాయని చెప్పుకునే కథలేవి లేవన్నదే నా అభిప్రాయం. ఇటీవల కాశ్మీర్ వెళ్ళినపుడు అక్కడ కలిసిన బష్రత్ పీర్ అనే జర్నలిస్ట్ (న్యూయార్క్ లో పనిచేస్తున్నాడు) రాసిన గాయపడిన సౌందర్యం బాగా నచ్చిన నవల. రాజకీయపరంగా కూడా.

 

సమాజంపై ముఖ్యంగా రేప్ వంటి నేరాలపై చట్టాల ప్రభావం:

 

నేరం చేసిన వాళ్ళని ఆలశ్యానికి ఆస్కారం లేకుండా కఠినంగా శిక్షిస్తే కొంత భయం వస్తుంది. ఆ పరిస్థితులలో కఠిన చట్టాలు అవసరమే. న్యాయవ్యస్థ త్వరితంగా స్పందించాలనేది నా అభిప్రాయం.

 

స్త్రీలపై దాడుల పట్ల సమాజం ఎట్లా స్పందించాలనుకుంటున్నారు?

 

పిల్లలకు చిన్నప్పటినుండే ఆడ పిల్లలపట్ల ప్రేమగా ఆత్మీయంగా మైత్రీభావం కలిగేట్టు కుటుంబ పెంపకం వుండాలి. అప్పట్లో Moral lessons వుండేవి. అవి ఇప్పటి పాఠ్యాంశాలలో లేవు. కార్పొరేట్ చదువులు రేంకులకే పరిమితం కావడం, విద్యావ్యవస్ఠ విలువలను బోధించక పోవడం సమాజంపై తీవ్ర ప్రభావం వేస్తోంది. విద్యావ్యవస్థ మంచిగా లేదు. వ్యాపార ధోరణిలో మునిగిపోయింది. ఇవన్నీ చిన్న చిన్న విషయాలుగా వుంటున్నాయి. మనుషుల పట్ల అప్యాయత, ప్రేమ తక్కువై ఆర్థిక విషయాల పట్ల మోజు పెరిగిపోయింది. ఇది మంచి పద్ధతి కాదు. విద్యార్థి ఉద్యమాలు తగ్గిపోవడం నేటి పరిస్థితికి కారణం. కావున సమాజంలో విద్యార్థి దశనుండే స్త్రీ పురుషుల పట్ల మంచి అవగాహన కలిగి వుండే వాతావరణం కల్పించే విధంగా కుటుంబ వాతావరణంలో కూడా మార్పు రావాల్సిన అవసరమెంతైనా వుంది. నేటి ఆధునిక నెట్ ప్రపంచం సెన్సార్ లేని విధానం వలన, సినిమాలలో వస్తున్న అశ్లీల ధోరణి సమాజంపై అధిక ప్రభావాన్ని చూపుతున్నాయి. సెన్సార్ బోర్డు వారికే వీటి పట్ల అవగాహన లేక పోవడం దారుణం. వ్యాపార ధోరణి నుండి మార్పు రావాల్సిన అవసరముంది. విద్యార్థి యువజన సంఘాలు బాగా పని చేయాల్సిన అవసరముంది. సమాజం బాధ్యత తీసుకోవాలి.