హోకా హే

మనస్సు చురకత్తి: లియొనార్డ్ పెల్టియర్

నవంబర్ 2015

తెరలు తెరలుగా గూడు అల్లుతోంది నిరంకుశత్వం, ఒక అస్తిత్వం చుట్టూ. కట్టుదిట్టం చేస్తోంది ప్రతి కదలికనూ, ప్రతి శ్వాసనూ. ఆ దిగ్బంధంలోనే ఒక సన్నని కదలిక. ఆ కదలిక లోంచి నిరంతరంగా వెలువడుతున్న సన్నని రాగం ప్రత్యర్థి గుండెల్ని అదరగొడుతోంది పొలికేకై; నేనింకా వున్నానంటూ. ఈ కదలిక అంటే నిరంకుశత్వానికి భయం. అందుకే ఇప్పుడిక ఏ భేషజాలు లేకుండా, అందరి కట్టెదుటే ఇంకా గట్టి పొరలు పొరలుగా ఇనుప తెరలు కప్పుతూనే వుంది. నిరంకుశత్వానికి తెలుసు తాను బంధించింది ఒక ఇక్తోమిని అని. పట్టు వదిలేస్తే తనకే ప్రమాదమని.

ఈ ఇక్తొమీకి అతని అమ్మా నాన్న పెట్టిన పేరు లియొనార్డ్ పెల్టియర్. అతన్ని యునైటెడ్ స్టేట్స్ ప్రిజనర్ నంబర్ 89637-132 అని పలకరిస్తున్నాయి జైలు గోడలు, ముప్పైఎనిమిదేళ్లుగా. అవును, మీరు సరిగ్గానే చదివారు – సరిగ్గా ముప్పైఎనిమిదేళ్లు!!

అన్నేళ్లుగా జైల్లో వున్నాడంటే ఎంత పెద్ద నేరం చేసి వుంటాడో కదా? ఒక్కటి కాదు, అతను ఎన్నో నేరాలు చేశాడు. ఇదిగో నేరాల చిట్టా:

1. తన నేటివ్ అమెరికన్ అస్తిత్వం పట్ల ప్రేమ, బాధ్యత కలిగివుండడం.

2. అస్తిత్వ పోరాటాల్లో పాల్గొనడం, ఎయిమ్ (AIM – American Indian Movement) లో ఒక నాయకుడు కావడం.

3. నేటివ్ అమెరికన్ ప్రజలకు కేటాయించిన రిజర్వేషన్లలో పోలీసు దౌర్జన్యాలనుంచి తనవారిని రక్షించుకోవడానికి ప్రయత్నించడం….. అహా, అతను చేసిన అసలు నేరం ముందు ఇవేమంత పెద్ద నేరాలు కాదు. అసలు నేరం అతను నేటివ్ అమెరికన్ అయ్యుండడమే. అతను, అతనిలాంటి నేటివ్ అమెరికనులు పుట్టకముందే వాళ్లకు జైలులో కాస్త స్థలం కేటాయించబడుతుంది. 1970ల్లో అదీ నేటివ్ అమెరికనుల పరిస్థితి. ఇప్పటికీ పెద్ద మార్పులు లేవు అనడానికి లియొనార్డ్ పెల్టియర్ ఇంకా జైల్లో వుండడమే నిదర్శనం.

సరే, అతన్ని జైల్లో పెట్టడానికి ప్రభుత్వం పై కారణాలు చూపించలేదు కదా?

ప్రభుత్వం పెట్టిన కేసు గురించి తెలుసుకునే ముందు ఎయిమ్ గురించి తెలుసుకోవాలి.

నేటివ్ అమెరికనుల భూమిని స్వాధీన పర్చుకున్న తరువాత, అమెరికన్ ప్రభుత్వం వారిని రిజర్వేషన్లలోకి తోలింది. అటు తరువాత నేటివ్ అమెరికనుల అస్తిత్వానికే ఎసరుపెట్టింది. అస్సిమిలేషన్ పేరిట నేటివ్ అమెరికన్ పిల్లలను తల్లిదండ్రుల నుంచి బలవంతంగా లాక్కెళ్లి బోర్డింగ్ స్కూళ్లలో చేర్చడం వంటి కార్యక్రమాలు చేపట్టింది. ఈ బోర్డింగ్ స్కూళ్లలో పిల్లలందరికీ జుట్టు కురుచగా కత్తిరించి, పాశ్చాత్య దుస్తులను తొడిగి బాహ్యరూపమే కాక మానసికంగా కూడా వారిని తమ సంస్కృతినుంచి దూరం చెయ్యాలని ప్రయత్నించింది . పిల్లలు మాతృ భాషలో మాట్లడితే సబ్బుతో నోరు కడిగించడం, క్రిస్టియానిటీని వారిపై రుద్దడం, వారి ఆచార వ్యవహారాలను పాటించకుండా కట్టుదిట్టం చెయ్యడంతో పాటు వాటి పట్ల ఏహ్య భావాన్ని కలిగించడం లాంటి ఎన్నో క్రూరమైన పద్ధతులు మొదలెట్టింది. ఈ ఊబిలో కూరుకుపోకుండా కొంతమంది బయటపడిగలిగారు. వారిలో కొంతమంది మిన్నెసోట రాష్టృంలోని మిన్నియాపొలిస్ నగరంలో 1968 లో ‘ఎయిమ్’ సంస్థను స్థాపించారు. నేటివ్ అమెరికనుల సార్వభౌమత్వం, అమెరికన్ ప్రభుత్వంతో కుదుర్చుకున్న ఒప్పందాలకు సంబదించిన సమస్యలు, సంప్రదాయాల పునరుద్దరణ వంటి వాటితో పాటు నేటివ్ అమెరికనుల పై పొలీసు దౌర్జన్యాలకు, రేసిజానికి వ్యతిరేకంగా నిలబడాలన్న ఉద్దేశంతో ఎయిమ్ ను స్థాపించినా, నేటివ్ అమెరికనుల ఆర్థిక స్వాంతంత్ర్యం దాని ప్రధాన ధ్యేయంగా మారింది.

సెప్టంబర్ 12, 1944 లో నార్త్ డకోట రాష్ట్రంలోని గ్రాండ్ ఫోర్క్స్ అనే వూరిలో పుట్టాడు లియొనార్డ్. 1960ల్లో వాషింగ్టన్ రాష్ట్రంలోని సియాటిల్ నగరానికి తరలి వెళ్లి అక్కడ ఒక ఆటో బాడీ షాప్ ఓనరయ్యాడు. సియాటిల్ లో వున్నప్పుడు నేటివ్ అమెరికన్ పౌర హక్కుల మీద పని చేస్తూ త్వరలోనే ఎయిమ్ లో కలిశాడు. 1970ల్లో సౌత్ డకోట రాష్టృంలోని పైన్ రిడ్జ్ రిజర్వేషన్లో అంతర్గత (ఫాక్షన్స్) గొడవల గురించి తెలుసుకున్నాడు. లకోట తెగకు చెందిన పైన్ రిడ్జ్ రిజర్వేషన్లో ప్రభుత్వానికి అనుకూలంగా వుంటూ ప్రజలను భయభ్ర్రాంతులకు గురి చేస్తున్న ట్రైబల్ చైర్మన్ రిచర్డ్ విల్సన్ మద్దతుదార్లకు, ట్రైబ్ పెద్దలకు మధ్య జరిగిన ఫాక్షన్ గొడవల్లో విల్సన్ కు వ్యతిరేకులైన ఎంతోమంది ప్రాణాలు కోల్పొయ్యారు. 1973లో విల్సన్ కు వ్యతిరేకంగా పోరాడుతున్న క్రమంలో వూండెడ్ నీ అనే ప్రాంతాన్ని ఎయిమ్ సభ్యులు ఆక్రమించుకున్నారు. ఫెడరల్ సైన్యం ఆ ప్రాంతాన్ని ముట్టడించి, 71 రోజులపాటు ఎయిమ్ సభ్యులను వూండెడ్ నీ బయటకు రానివ్వకుండా దిగ్భందం చేసింది. ఆ ఆక్రమణలో లియినార్డ్ పాలు పంచుకోలేదు. వూండెడ్ నీ సంఘటన తరువాత విల్సన్ మరింత పేట్రేగాడు. తెగ ప్రజల పట్ల ఎన్నో దౌర్జన్యాలు చేశాడు. ఎప్పుడు ఎవరు ప్రాణాలు కోల్పోతారో, ఎవరిల్లు ఎప్పుడు తగలబడిపోతుందో తెలియనంత భయానక వాతావరణాన్ని సృష్టించాడు. తెగ పెద్దలు మళ్లీ ఎయిమ్ ను ఆశ్రయించారు. ఎయిమ్ సభ్యులు వంతులవారిగా పహారా కాస్తూ గస్తీ తిరిగేవాళ్లు. ఇది తెగ ప్రజలకు బాగా వుపయోగపడింది. అయితే విల్సన్ ;దృష్టి తెగ ప్రజల మీద నుంచి ఎయిమ్ సభ్యుల మీద పడింది. వూండెడ్ నీ సంఘటన తరువాత ఫెడరల్ సైన్యానికి చెందిన పోలీసులు చాలా ఎక్కువ సంఖ్యలో రిజర్వేషన్లలో కనిపించసాగారు. మూడేళ్లలో 61 మంది తెగ పెద్దలు, ఎయిమ్ సభ్యులు పైన్ రిడ్జ్ రిజర్వేషన్లో హత్యకు గురయ్యారు.

1975లో లియొనార్డ్ పెల్టియర్ పైన్ రిజర్వేషన్ లో గస్తీ తిరిగే ఎయిమ్ సభ్యుల్లో ఒకడయ్యాడు. అదే సంవత్సరం జూన్ 26న జాక్ కోలర్, రోనల్డ్ విలియమ్స్ అనే ఇద్దరు స్పెషల్ ఏజంట్లు జిమ్మి ఈగిల్ అనే ఒక యువకుడిని అరెస్టు చెయ్యడానికి వెతుకుతున్నారు. జిమ్మి ఈగిల్ కు చెందిన ఎర్ర పికప్ ట్రక్కును అనుసరిస్తుండగా ఆ ట్రక్కునుంచి కాల్పులు జరిగి స్పెషల్ ఏజంట్లిద్దరూ మరణించారు. సరైన ఆధారాలు లేకపోయినా ఆ స్పెషల్ ;ఏజంట్లను లియొనార్డే కాల్చి చంపాడని పోలీసులు ఆరోపించారు. తన మీద నేరం ఆరోపించారని తెలియగానే లియొనార్డ్ కెనడా పారిపొయ్యాడు.

లియొనార్డ్ ను ఎలాగైనా అరెస్ట్ చెయ్యాలని పోలీసులు ప్రయత్నించారు. కెనడానుంచి లియొనార్డ్ ను రప్పించేందుకు మర్టిల్ పూర్ బేర్ అనే లకోటా యువతిని స్పెషల్ ఏజంట్ల హత్యకు సాక్షిగా చిత్రించారు. తాను లియొనార్డ్ గర్ల్ ఫ్రెండ్ అని, ఆ ఏజంట్లను తానే హత్య చేశానని లియొనార్డ్ తనకు చెప్పాడని ఆమె సాక్ష్యం ఇచ్చింది. ఈ సాక్ష్యం వల్ల లియొనార్డ్ ను అమెరికా ప్రభుత్వానికి అప్పగించింది కెనడా ప్రభుత్వం. దొంగ సాక్ష్యాలతో, లియొనార్డ్ ప్రవేశపెట్టిన సాక్ష్యాలను పరిగణించకుండా అతనికి రెండు జీవితాల యావజ్జీవ కారాగార శిక్ష విధించారు. ప్రభుత్వం ప్రవేశపెట్టిన ముఖ్య సాక్ష్యం ఏజంట్లను చంపడానికి ఉపయోగించిన తుపాకీ లియొనార్డ్ కు చెందిందని. అయితే కొన్నేళ్ల తరువాత లియొనార్డ్ డిఫెన్స్ కమెటీ డిమాండ్ చేసి సంపాదించిన ప్రాసిక్యూటర్ల డాక్యుమెంట్లను రివ్యూ చేస్తున్నప్పుడు ఆ తుపాకీలో వుండిన పిన్ లియొనార్డ్ తుపాకీకి చెందినది కాదని పేర్కొని వుంది తెలిసింది. ఈ సాక్ష్యంతో లియొనార్డ్ పై కేసు ఎత్తివెయ్యాలని డిఫెన్స్ కమిటీ వేసిన అప్పీల్ దావాలో కోర్టు ఆ సాక్ష్యాన్ని పక్కన పెట్టింది. అలాగే కొన్నేళ్ల తరువాత మర్టిల్ పూర్ బేర్ ముందుకు వచ్చి పోలీసుల పెట్టిన భయంవల్ల వత్తిడి వల్ల తప్పుడు సాక్ష్యం చెప్పానని, తనకసలు లియొనార్డ్ తో పరిచయమేలేదని కోర్టులో ఒప్పుకోవడానికి సిద్ద పడింది. ఆమె మానసిక స్థితి సరిగ్గా లేదని ఆ సాక్ష్యాన్ని కూడా పరిగణలోకి తీసుకోలేదు. ఎన్ని సాక్ష్యాలు ప్రవేశ పెట్టినా అన్నిటికీ ఏదో ఒక లీగల్ లంకె పెట్టి కోర్టు తోసి పుచ్చింది. అరెస్టయినప్పటినుండి ఇప్పటి దాకా, ప్రెసిడెంట్ క్లెమెన్సీకి కూడా నోచుకోలేదు లియొనార్డ్. సరైన ఆధారాలు లేకుండానే హత్యానేరం కింద యావజ్జీవ ఖైదులో ఇన్నేళ్లు వుంచడం అన్యాయమని, రాజకీయ కారణాలతోనే జైల్లో వున్నాడని ఆమ్నెస్టీ ఇంటర్నేషనల్ ప్రకటించింది.

ప్రభుత్వ దౌర్జన్యానికి ఒక సజీవ ప్రతీక లియొనార్డ్. జైల్లో వున్నా ఎయిమ్ కు తన వంతు సపోర్ట్ ఇస్తుంటాడతడు. తన అనుభావలతో ‘జైలు రచనలు- నా జీవితం నా సూర్య నృత్యం’ (ప్రిజన్ రైటింగ్స్ – మై లైఫ్ ఈజ్ మై సన్ డాన్స్) అనే పుస్తకాన్ని వెలువరించాడు. ఇందులో ఆయన జీవిత కథతో పాటు కవిత్వం కూడా వుంది. దాని లోంచి ఒక చురకత్తి…

నా మనస్సనే చురకత్తి

ఈ క్షణం నాది కాదు.
నాకున్నది ఒక నిన్న మాత్రమే
కొంత భవిష్యత్తు కూడా వుందేమో.
ఈ క్షణాన్ని నా నుంచి కత్తిరించి వేశారు.

నేను ఒక ఖాళీలో మిగిలి పోయాను, దాని అంధకారాన్ని
నేను నా మనస్సు అనే చురకత్తితో చెక్కుతుంటాను.
నాకు అడుగడుగునా ఎదురయ్యే పదునైన శూన్యంలోంచి
నన్ను నేను కొత్తగా చెక్కుకోవాలి.

అప్పుడు తెలుస్తుంది నాకు
పారవశ్యం అంటే ఏమిటో
స్వేచ్చ నుంచి వచ్చే
నొప్పి అంటే ఏమిటో.
నేను మళ్లీ మామూలు మనిషినవుతాను.
అవును, మామూలు తనం,
ప్రతిదీ సాధ్యమయ్యే స్థితి,
భయపెట్టే స్థితి,
ఎదుర్కొనక తప్పని క్షణం,
వర్తమానం.

**** (*) ****