ప్రత్యేకం

చిన్నోడు పెద్దోడయ్యాడు

ఫిబ్రవరి 2016

మా చిన్నోడ్ని చిన్నోడంటే ఒప్పుకోడు. బదులుగా తన మూరెడు కొలతను చూపిస్తాడు. వాడికిప్పటికీ వాడి అన్న వాడికన్నా ముందు ఎందుకు పుట్టాడనేది సహించలేని విషయమే! అదేదో తానే పుట్టవచ్చుగా! అయితే వాడు పెద్దోడయ్యాడని అంగీకరించాల్సిన సందర్భం ఒకటి వచ్చింది.

యూరినరీ బ్లాడర్లో ఉన్న రాయినొప్పి వల్ల మా బాపు మొన్న హైదరాబాద్ రావాల్సివచ్చింది. అల్ట్రాసౌండులు, పీఎస్ఏలు, డిజిటల్ ఎక్సురేలు, రక్త పరీక్షలూ అవీ అయ్యాక- ఈసీజీలూ, 2డీ ఎకోలూ, టీఎంటీలూ చేశాక- ఆపరేషన్ను తట్టుకునే సామర్థ్యం గుండెకు ఉందని తేలాక- ప్రాస్టేట్ ఎన్లార్జ్ అయి ఉందనికూడా నిర్ధారణ కావడంతో ఆ రెంటికీ కలిపి ఆపరేషన్ డేట్ ఫిక్స్ అయ్యాక- బాపు మళ్లీ ఊరెళ్లిపోయాడు.

ఎన్నడూ లేనిది నాలుగైదురోజులు వరుసగా మా దగ్గర ఉండటంతో, ఆ వెళ్లిపోయిన తెల్లారి, నిన్న ఇంట్లో ఉన్న తాతను గుర్తు చేసుకుంటూ, తాత ఊరు ఎందుకు వెళ్లిపోవాలో అర్థం చేసుకోవడానికి ప్రయత్నిస్తున్నట్టుగా పెద్దోడు అడిగాడు: ‘‘నానా, తాత ఊరు నర్సింగాపురం ఎందుకయింది?’’

వాళ్లమ్మ అప్పటికే నిద్ర లేచి నీళ్లు పడుతోంది. మేము ఇంకా మంచం దిగలేదు. ఊరికే పొద్దుటి బద్దకాన్ని ఆనందిస్తున్నట్టుగా అలా సగం పడుకున్నాం. వాడి ప్రశ్నకు ఏం జవాబివ్వాలో తెలియక, ‘‘వాళ్ల నానది అదే ఊరుగద నానా’’ అన్నాను.

ఈ ప్రశ్న పక్కకుపోయి, అంతకుమించిన అనుమానం వచ్చింది వాడికి. ‘‘మరి ఆ తాత ఏడి?’’

మా తాత నేను పుట్టకముందే చనిపోయాడు. నేను కూడా చూడని మా తాత ఉనికితో నా కొడుక్కు పరిచయం కలగడం ఆనందమేగానీ ఏమని జవాబు చెప్పను! ‘‘ఆ తాత ఎప్పుడో చచ్చిపోయిండు నానా’’ అని నెమ్మదిగా చెప్పాను.

ఇక వాడి మెదడులో జీవన్మరణాలకు సంబంధించిన కొత్త ఆలోచనలేవో కలిగివుంటాయి. దాని ఫలితంగా, ‘‘అట్లయితే మన తాత కూడా చచ్చిపోతడా?’’ అని అడిగాడు, చచ్చిపోకపోతే బాగుండు అన్నట్టుగా.

మృత్యువుకు సంబంధించిన మాయ ఎందుకు? అందుకే నిజమే చెప్పేశాను.

‘‘చచ్చిపోతడు నానా; ముసలోళ్లయినంక అందరు చచ్చిపోతరు’’.

అప్పటికే లేచిన చిన్నోడు పెద్దోడిలాగే కాసేపు నిశ్శబ్దంగా ఉన్నాడు. ఆ జవాబులు వాళ్లను నిశ్శబ్దంలోకి జార్చాయి.

ఇక మరింత వాస్తవాన్ని వాడు తేల్చుకోవడానికే సిద్ధపడినట్టుగా చివరి ప్రశ్న వేశాడు పెద్దోడు:

‘‘మరి పెద్దగైనంక నువ్వు కూడా చచ్చిపోతవా?’’

వాడి ప్రశ్నల క్రమం కలిగించిన ఆనందంతో, ‘‘ఊ’’ అన్నాను, ‘‘చచ్చిపోత బిడ్డ’’.

ఈ జవాబు వినగానే, అప్పటిదాకా ఈ ప్రశ్నల్లో వింటూ మాత్రమే భాగస్వామి అయిన నా చిన్నకుమారుడు ఠక్కున అన్నాడు: ‘‘అయితే నానా, నేను పెరుగ’’.

(ఆగస్ట్ 2015)

**** (*) ****