ప్రత్యేకం

బాడ్ ఇమేజ్

మే 2016

లాంటిదొకటి జరిగే అవకాశం ఉందని మీరు నమ్ముతారా?

మనం ప్రయాణిస్తున్న ఆటో ఏ బైకునో అలా తగులుతూ వెళ్లిందనుకోండి; ఆ బైకువాలా ఆటోడ్రైవర్‌ను ఉద్దేశించి- ‘నీ యమ్మ’ అంటూ కోపంగా చూడబోతాడు; కానీ ఈలోపు ఆటో ఎటూ దాటిపోతుంది; కానీ బైకు అతనికి ఏమైందోనన్న కన్సెర్న్‌తో కూడిన కుతూహలంతో మనంగానీ ముఖాన్ని అతడి వైపు పెట్టామా– ఆ ఆటోడ్రైవర్ స్థానంలో మన ప్రతిరూపాన్ని కూర్చోబెట్టుకుంటాడు. ఎందుకంటే, ఆటోడ్రైవర్ అనే ఖాళీ స్థానంలోకి ప్రవేశపెట్టగలిగే అత్యంత దగ్గరితనపు సంభావ్యత ఉన్న ఇమేజ్ మనదే కాబట్టి! ఇంకేం, ఆ బూతులన్నీ మనకు తెలియకుండానే మనకు ‘తగులుతాయి’; జీవితంలో ఏ పరిచయమూ లేని వ్యక్తికి మసగ్గానైనా మనం ఒక చెత్త ముఖంగా ‘గుర్తుండిపోతాం’.

‘ఆరోజు నిన్ను తాకిన ఆటోకి నేను డ్రైవర్‌ను కాదు; నేను కేవలం ప్రయాణీకుడినే,’ అని ఆ బైకువాలాకు మనం జీవితంలో ఎప్పటికైనా చెప్పడం వీలవుతుందా?

***

ఇప్పటికీ అతడి పేరు తెలియదు; కానీ ఐటీ విభాగంలో పనిచేస్తాడనుకుంటాను; అతణ్ని మొదటిసారి చూసినప్పుడు మధ్యాహ్నం పూట ఆఫీసు దొడ్డిలోంచి బయటికొస్తున్నాడు. ఆ అపసమయపు అవసరానికి ఏ అనారోగ్యమో కారణం కావొచ్చు; ఏ అనవసరపు తిండో కారణం కావొచ్చు; ఏమైనా కావొచ్చు; అసలు నాలాంటి చెత్తమనిషికి తప్ప అది ఇంకొకరికి ఇష్యూ కానేకాదు.

అది జరిగి కూడా, ఏ ఏడాదో ఏడాదిన్నరో కూడా అయివుంటుంది. ఈ మధ్య కాలంలో కూడా అతను నాకు పరిచయం కాలేదు. కనీసం ఎక్కువసార్లు తటస్థపడుతున్నప్పుడు ఊరికే అలా ఒక పలకరింపు నవ్వుతామే, అలా కూడా నవ్వుకునేంత పరిచయం ఏర్పడలేదు. కానీ అతణ్ని చూసినప్పుడల్లా అతడు ఆ దొడ్డిలోంచి బయటికి వస్తున్న ఇమేజే గుర్తొస్తుంది. అతడి మొత్తం జీవితాన్ని, అతడి చదువును, అతడి సంస్కారాన్ని, అతడి ప్రతిభను, అతడి ఆలోచనలను, అతడి ఇష్టాయిష్టాలను అన్నింటినీ కుదించి, నేను కేవలం అతడిని ఆ నాలుగు మూలల గదిలోంచి బయటికి వస్తున్నవ్యక్తిగా గుర్తుంచుకోవడం అనే కొద్దిబుద్ధి పట్ల నాది నాకే సిగ్గవుతోంది. కానీ ఆ ఇమేజ్‌ను ఎలా తొలగించుకోవడం!

***

ఇది కూడా జరిగి ఏడాదిపైనే అయినట్టుంది: మా వాడి స్కూల్లోనే చదువుతున్న ఒక పాపను దిగబెట్టడానికి ఒకాయన బండి మీద వచ్చేవాడు; ఎప్పుడూ నైట్ ప్యాంట్, టీ షర్ట్ ఉండేవి ఒంటిమీద; సాటి పేరెంట్ అని తెలుసు తప్ప, ప్రత్యేకంగా పరిచయం ఏమీలేదు. ఒకరోజు ఆ స్కూలు ప్రహరీ పక్కన పిల్లి ఏదో చచ్చిపోతే, ‘దాన్ని ఇంకా ఎందుకు తీసేయలే’దని వాచ్‌మన్ మీద అరుస్తున్నాడు. దానికి ఆ వాచ్‌మన్- ‘నామీద ఒర్రుతే ఏమొస్తుంది సార్? ప్రిన్సిపాల్‌కు జెప్తే ఎవరినన్న పెట్టి తీపిస్తరు’ అని బదులిచ్చాడు. అంటే, నేను వెళ్లేప్పటికి ఇతను అరవడం, వాచ్‌మన్ బదులివ్వడం జరుగుతోంది. నిజానికి ఆయన బాధ్యతగల పేరెంట్ కిందే లెక్క. అయితే, వాచ్‌మన్ సూచించినట్టుగా రియాక్ట్ కాలేక, అతడు మౌనం వహించాడు. పైగా నేను అప్పుడే అక్కడికి వెళ్లడం ఆయన్ని ‘చిన్నతనానికి’ గురిచేసివుండాలి! ఎందుకంటే, అతడి ‘పరువు నిలబడని’తనమేదో నాకు దొరికిపోయినట్టయింది కదా! అందువల్ల మేము ఆ తర్వాత ఎన్ని ఉదయాలు ఎదురుపడినా కూడా ఆయన చూపుల్లో ఒక ఇబ్బందిని నేను గమనించేవాణ్ని. కానీ అది పెద్ద విషయం కాదని చెప్పాలనిపించేది; కానీ ఎలా చెప్పడం!

(ఈ సంఘటన వల్ల చనిపోయిన కుక్కల్నీ, పిల్లుల్నీ తీసుకెళ్లి ఊరవతల ఎక్కడో పడేసే విభాగం మున్సిపాలిటీలోనే ఒకటి ప్రత్యేకంగా ఉందని తెలిసింది; అది వేరే విషయం.)

***

సంబంధం లేని విషయాలను లింకు చేసుకునే మనిషి సంకుచిత దృష్టిలోపం ఇదని నాకు తెలుసు. అయినాకూడా, దృశ్యంగా ఎవరికైనా ఆడ్‌గా తారసపడటంలోని ఈ పరిమితి నన్ను భయపెడుతుంది. మనల్ని అభిమానంగా ఎవరైనా చూద్దామని వస్తే, తీరా మనం బనీన్ ఎత్తి పొట్టగీరుకుంటూ కనబడ్డామనుకోండి; ఇంకంతే, ఆ దృశ్యానికి తాళం పడిపోతుందేమో! కానీ దీన్ని నివారించడానికి ఏది మార్గం?

***

మొన్న- పెద్దమామయ్యకు ‘బియ్యం ఇస్తున్నామంటే’ మేడ్చల్ వెళ్తే, బస్సులో అనుకోకుండా కండక్టర్‌గా ‘ఎల్.శివకుమార్’ ఉన్నాడు.

కీసరగుట్టలో ఉన్నప్పుడు పాలగ్లాసుతో పరుగెత్తుతూ చూడకుండా ఇతనికి తగిలాను; అతడు ఏమాత్రమూ ఆలోచించకుండా సీనియర్ పొగరుతో అంతే వేగంగా నన్ను తన్నాడు. అదే మా మొదటి తారసపాటు. చాలాకాలం అతన్ని నేను ద్వేషించాను. అతడు ‘మేడ్చలోడు’ అని తెలిశాక మరింత ఎక్కువ బాధేసింది. కొంతకాలానికి ఇతడు లక్ష్మమ్మ స్కూల్లో నా క్లాస్‌మేట్ ఎల్.అనిల్‌గాని అన్న అని తెలిసింది. అదింకా ఎక్కువ బాధ కదా! వీడు ఎప్పుడైనా సెలవుల్లో కనబడ్డా వాడి అన్న కూడా గుర్తొచ్చేవాడు.

సరే, బస్సులో శివా నేనూ మామూలుగానే పలకరించుకున్నాం. బస్సు ఖాళీగానే ఉంది. ఉన్నవాళ్లకు టికెట్లు ఇష్యూ చేశాక, వచ్చి నా పక్కనే కూర్చున్నాడు. పిల్లల గురించీ, ఉద్యోగాల గురించీ మాట్లాడుకున్నాం. తనకు కవలలు; ఒక పాప, ఒక బాబు. నాక్కూడా అట్లా పుడితే బాగుండేదని పెళ్లికి ముందు ఒక కోరిక ఉండేది! తర్వాత సాంసారిక విషయాలు, పిల్లల చదువులు, తనకు సీనియర్సూ, నాకూ తెలిసిన వేణు, వినోద్ గురించీ, వాళ్ల బ్యాచ్ వాళ్ల గెట్ టుగెదర్ గురించీ, మా బ్యాచ్‌వాళ్లం మేము పరిగిలో కలిసిన సంగతీ, రాఘవేందర్‌కు బ్రెయిన్ స్ట్రోక్, హార్ట్ స్ట్రోక్ ఒకేసారి రావడమూ; లక్కీగా బతకడమూ; రాఘవేందర్ వాళ్ల తమ్ముడు పురుషోత్తం గురించీ – ఈ ఇద్దరన్నదమ్ములూ ఒకే క్లాసు చదివేవాళ్లు- వీళ్ల తమ్ముడు లక్ష్మీకాంత్ గురించీ- వీడొక చిత్రమైన క్యారెక్టర్. స్కూల్లో నాకు జూనియర్ అయినా, ఒక క్లాసు తగ్గి చేరడం వల్లనేమో, సేమ్ ఏజ్ అడ్వాంటేజ్‌తో నన్ను ఒరేయ్ అనేవాడు. ‘మన గురించి ఎవ్వనికీ ఏమీ తెల్వొద్దురా, అన్నీ సీక్రెట్‌గా ఉండాలె; చూశినవా, నా అసలు పేరు రత్నాకర్; కానీ ఎవ్వనికన్న జెప్తనా!’ అనేవాడు. ఎవరైనా అంత రహస్యంగా ఎందుకు బతకాలో నేను వాణ్ని అప్పుడు అడగలేదు. కానీ వాడు చెప్పినదానికి పూర్తి విరుద్ధంగా, నేను నా జీవితాన్ని తెల్లకాగితాల పాలు చేస్తున్నాను- నాచురల్‌గానే అనిల్‌గాని గురించి కూడా ఏవేవో మాట్లాడుకున్నాం. మధ్యలో ఫోన్ రింగయినా, తర్వాత చేద్దామని తీయకుండా ఉండిపోయినన్ని మాటలు!

కానీ ఈ సంభాషణకు ఏమైనా ప్రాధాన్యత ఉందా? దీనివల్ల అతడి తన్ను నొప్పి ఏమైనా తగ్గుతుందా? నేననుకోవడం, అతణ్ని నేను మళ్లీ మళ్లీ రీప్లే చేసుకుని చూసుకునే ఇమేజ్‌లోంచి బయటపడేయగలిగే ఊతం ఇది కాగలదేమో! అంటే, కనీసం ‘శివ’ అనుకున్నప్పుడు- నాకు వాళ్ల కవల పిల్లలు కూడా ఇకనుంచీ గుర్తొస్తారేమో! ఆ బస్సుప్రయాణమూ, లక్ష్మీకాంత్‌గాడు కూడా గుర్తురావచ్చేమో! అంటే, ఆయా మనుషులే మనకు ఇంకోరకంగా పరిచయమై, ఆ పరిచయపు నిడివిలో మరికొన్ని మంచి దృశ్యాలు కూరగలిగితే ఆ మరక కొంతైనా చెరిగిపోగలదేమో!

**** (*) ****