ప్రత్యేకం

దేవుడు ఆడే ఫుట్‌బాల్

ఆగస్ట్ 2016

యితే నేను ఫిల్టర్ ఎత్తేయడం మంచిదే అయింది. అందుకేగదా కొత్త క్యాండిల్స్ కోసం వెతుక్కుంటూ బజార్‌కు వెళ్లాల్సివచ్చింది; అప్పుడే కదా అక్కడ ‘చోటు’ ఫుట్‌బాల్ చూశాడు. పిల్లలు మాత్రమే దాన్ని ఫుట్‌బాల్ అని నమ్మగలరు! ఫుట్‌బాల్ కాని ఫుట్‌బాల్ లాంటి ఫుట్‌బాల్ అది. లేతాకుపచ్చ రంగులో ఉంది. నాలుగుసార్లు గట్టిగా తంతే నలభై సొట్టలు పడిపోతుంది! అయినాగూడా పొద్దున పార్కులో ఆడుకోవడానికి బాగానే పనికొస్తుంది! ఓ, ఇదొక పెద్ద పార్కు! పార్కు కాని పార్కు లాంటి పార్కు! కానీ పొద్దున మేము ముగ్గురమే వెళ్తాం కాబట్టి, మేము ముగ్గురం వెళ్లడం వల్లే బాగుంటుంది!

అయితే, సాయంత్రం బాల్ తెచ్చాం కాబట్టి, పొద్దుటి కోసం ఆత్రంగా చిన్నోడు ఎదురుచూసేవుంటాడు! కానీ తీరా లేవడంతోటే వినగూడని ఫోనొచ్చింది. లక్ష్మారెడ్డన్న అప్పటికే అనారోగ్యంతో ఉన్నాడు. అవకాశం లేదని చూచాయగా తెలుసు. కానీ శరీరం నుంచి విముక్తుడయ్యే ఆ వార్త ఏ రోజు వస్తుందో మనకు ఎలా తెలుస్తుంది? అందుకే గుంటపొంగటాలు చేయడానికి నా భార్య రాత్రి మినప పిండి పులియబెట్టింది; దాన్లోకి తనదైన పద్ధతిలో ఉలవ సాంబారు చేద్దామని ఉలవలు వేయిస్తోంది, ఒక హాఫ్ కప్ టీ నాకిచ్చి. అదిగో, ఆ టీ తాగుతున్నప్పుడు ఆ ఫోనొచ్చింది. ఇప్పుడీ టీ పూర్తిచేయాలా? వదిలేయాలా? జీవితం ప్రాక్టికల్‌గా ఉండమనే శాసిస్తుంది. రేపు అనేది కూడా ఒకటుందికదా! అందుకే, ఆరోజు తొమ్మిదింటికట్లా నీళ్లొస్తాయి కాబట్టి, మూడు ఖాళీ బిందెల్ని ఓనర్‌వాళ్లింట్లో పెట్టేసి, పాలను పక్కింటి వదన మేడమ్ వాళ్లకిచ్చి సాయంత్రం మరోసారి కాచమని చెప్పేసి, ఆ పిండి కూడా వీలైతే వాడుకొమ్మని ఇచ్చేసి, పిల్లలకు ఎలాగో త్వరత్వరగా బ్రెడ్డుతో పాలు తాగించేసి, హుటాహుటిన రామన్నపల్లెకు బయలుదేరిపోయాం. కానీ పిల్లల్ని తరుముతున్నప్పటినుంచీ చిన్నోడు ఏడుస్తూనే ఉన్నాడు: ‘ఫుట్బాల్ ఆడినంక పోదం నానా’.

***

మేము వెళ్లేసరికి ఆడవాళ్లు శోకాలు పెట్టి ఏడుస్తున్నారు; రావాల్సిన బంధువులు వస్తున్నారు; మాదిగోళ్లు తాటికమ్మల్తో పాడెను కడుతున్నారు; ఆ డప్పుల చప్పుడు, ఆ అంతిమ యాత్ర, అంతా తెలిసినట్టే ఉండికూడా ప్రతిసారీ కొత్త అనుభవాన్నిస్తూ పలకరించే మృత్యువు, వారం రోజుల క్రితం నేను చూసినప్పుడు చైతన్యంతో ఉండిన శరీరం కట్టెల్లో కట్టెగా దహనమైపోవడం, మంచికో చెడుకో ఆశకో నిరాశకో ప్రతీకగా నిలిచిన ఒక మనిషి; కొడుకుగా, అన్నగా, భర్తగా, తండ్రిగా ఏదో మేరకు తన పాత్ర పోషించిన ఒక ఐదు పదుల మనిషి మళ్లీ వచ్చే ఆషాఢం కల్లా మొలిచే మక్కచెట్లకు ఎరువైపోవడం… అంతా ఒక భౌతిక రసాయనిక లీల!

***

రానూపోనూ సుమారు మూడు వందల కిలోమీటర్లు! తిరిగి, సిద్దిపేట దాటేప్పటికే సాయంత్రమైంది. పిల్లలు అదో ఇదో తిని కడుపు నింపుకున్నారు కానీ మేము అంతసేపూ నిరాహారంగానే ఉన్నాం. అందుకే ‘స్నానం’ గురించి పట్టించుకోకుండా నేను అల్పాహారం విషయంలో ప్రాక్టికల్‌గానే ఉండాల్సివచ్చింది; కానీ తను మాత్రం ససేమిరా అంది. ఎవరి ఆకలికి ఎవరు బాధ్యులు! ఇల్లు చేరే సరికి ఎనిమిదైంది. మాట్లాడితే, ఇల్లునే కడిగి బోర్లేస్తుందని తెలుసు కాబట్టి, మేము ముగ్గురం చెప్పినట్టుగా విని, తిని, పడుకున్నాం.

సాధారణంగా తను ముందు లేస్తుంది; తర్వాత నేను, తర్వాత పెద్దోడు, చివర్న చిన్నోడు! ఈరోజు నేనే అందరికంటే ముందు లేచాను. నిన్నంతా అలసట ప్రయాణం కాబట్టి, పిల్లల రోజువారీ టైమును ఉదారంగా దాటనిచ్చాకే, చిన్నోడు నిన్న మిస్సయిన అనుభవాన్ని ఇవ్వాళైనా ఇద్దామన్నట్టుగా, వాణ్ని కొద్దిగా కదిపాను.

వాడు నిన్నటి దృశ్యాల్ని ఏ మేరకు ఎలా జీర్ణించుకున్నాడో! బహుశా రాత్రంతా వాడి చిట్టిబుర్రలో ఏదో చిన్నపాటి మథనమే జరిగిందన్న సంకేతాన్ని ఇస్తూ, కళ్లు మిటకరిస్తూనే వాడు అడిగిన మొదటి ప్రశ్న: ‘‘చచ్చిపోయినోళ్లను దేవుడు తీస్కపోతడుగద నానా; మరి అందరు ఏడ్సుకుంట అద్దంటే గూడ దేవుడు ఎందుకినడూ?’’

**** (*) ****