ప్రత్యేకం

ఒకటీ రెండూ ఐదూ పదీ ఇరవై

డిసెంబర్ 2016

ఒక రోడ్డు, పార్కు, గుడి, హాస్పిటల్, ఆఫీస్, బాంక్, పబ్, చివరికి స్మశానం…

ఒక రచయితకి ముడిసరుకు దొరకని చోటేదైనా ఉంటుందా? అలాంటి చాలా చోట్లకి తిరిగారు రాజిరెడ్డి. రచయితగా కాదు, జనంలో ఒకడిగా. ముడిసరుకుని పోగుచేసుకుని వాటిని కథలుగా మలుచుకునేందుకు కాదు. రచయిత తాలూకూ లోలోపలి వ్యాఖ్యానాన్ని అదిమిపెట్టి ఒక కెమెరాలాగా, ఒక టేప్ రికార్డర్ లాగా తనకి ఎదురైన అనుభవాల్ని నమోదు చేసుకునేందుకు. ఆయా చోట్లలో తారసపడ్డ విషయాల్ని ఉన్నదివున్నట్టు పాఠకుల ముందు ఉంచేందుకు. ఇదొక సెల్ఫ్ చెక్, సోషల్ చెక్, రియాలిటీ చెక్. మనకి సీదా సాదాగా ఒకే డైమెన్షన్ లో కనిపించేదే రాజిరెడ్డికళ్ళతో చూసినపుడు బహుమితీయంగా, ఫిలాసాఫికల్ లోతులు తొడుక్కుని కనిపిస్తుంది. మనం రోజూ చూసే అవకాశమున్నా దారిపక్కనుంచీ తప్పిపోతున్న ప్రదేశాల్ని, మనుషుల్నీ, జీవితాల్ని కాస్త దగ్గరగా చూపించిన పుస్తకం పూడూరి రాజిరెడ్డి ‘రియాలిటీ చెక్‘. ‘రియాలిటీ చెక్’ పుస్తకానికి తెలుగు యూనివర్సిటీ పురస్కారం ప్రకటించిన సందర్భంగా అందులోంచి గుప్పెడు రియాలిటీ… మీకోసం.




త్వరగా ఇల్లు చేరాలన్న తొందరలేని ఒక ఒంటరి ఆదివారం పూట–
అసెంబ్లీ నుంచి రవీంద్రభారతి మీదుగా ట్యాంక్‌బండ్‌ వైపు సోమరి నడక సాగిస్తుండగా–
రిజర్వ్‌బ్యాంకు ప్రహారీకి కొట్టిన ఈ నోటీస్‌ బోర్డు కనిపించింది.

‘బ్యాంకు ఆవరణలో మరియు పరిసరములలో నోట్లు అమ్మడం, కొనడం నిషిద్ధం’.

ఒకటి చేయకూడదు, అని ఎవరైనా ఎక్కడైనా హెచ్చరిక పెట్టారంటే, అదేదో జరుగుతోందని అర్థం!
మరేం జరుగుతోందిక్కడ? నోట్లు అమ్మడమేంటి? కొనడమేంటి?
అది తెలుసుకోవడానికి బ్యాంకు పనిదినాల్లో ఒకరోజైన శుక్రవారం వెళ్లాను.

***

ఉదయం పదిన్నర అయింది. బయట జనం ఎవ్వరూ కనబడలేదు. బ్యాంకు గేట్లు తెరిచివున్నాయి. కాపలాగా పోలీసులున్నారు. లోపలికి వెళ్లొచ్చా? వెళ్లకూడదా? రిజర్వ్‌ బ్యాంకంటే ఏవో గంభీరమైన కార్యకలాపాలు చేస్తూవుంటుందన్న ఊహ ఒకటి ఉంటుంది కదా!
పావు క్షణం తటపటాయించి గేటు దగ్గరకు వెళ్లాను. ఏ కారణం కోసమని అడక్కుండానే, డిటెక్టర్‌తో చెక్‌ చేసి పోలీసు లోనికి పంపాడు. నేను నాకు ఒక్కణ్ని. నాలాంటివాళ్లు ఆయనకు చాలామంది అని అర్థమవడానికి అరనిమిషం పట్టలేదు. పాము మెలికల ఇనుప బ్యారికేడ్లలో ఇరుక్కుంటూ, తోసుకుంటూ, కొత్త సినిమా మార్నింగ్‌ షో టికెట్‌ కోసం నిలబడ్డట్టు… మనుషులే మనుషులు!

‘నేను వారానికి ఒక్కసారే వస్త సార్, లోపలికి పంపించు సార్‌’ ఒక యువకుడు ఒక పోలీసును బతిమాలుతున్నాడు.

‘లోపల్కి జరుగు, బొక్కలు ఇరుగుతయ్‌’ మరోచోట మరో పోలీసు ఇంకొకతణ్ని అదుపు చేస్తున్నాడు.

ఏం జరుగుతోందబ్బా?

నేను బిత్తరపోయి చూస్తుండగా, తొక్కిడిలో నిల్చున్న ఒకాయన, వయసులో కాస్త పెద్దాయనే, ‘కొత్తగొచ్చినట్టుంది కదా, మధ్య లైన్లోంచి వెళ్లిపో’ అని సూచించాడు. ఊహించని ఆత్మీయత!

ఈ మధ్య లైనేమిటి? ఫిజికల్లీ ఛాలెంజ్‌డ్‌ మనుషుల్ని పంపే వరుస. చేతుల్లేనివాళ్లు, ఊతకర్రల సాయంతో నడుస్తున్నవాళ్లు, గుడ్డివాళ్లు ఇందులో నిలబడివున్నారు. వాళ్ల చేతుల మీద వాళ్లు వచ్చిన క్రమాన్ని బట్టి పోలీసు 1, 2, 3 అని అంకెలు వేశాడు. చివరగా ఉన్న వ్యక్తి చేతిమీద 26 అని ఉంది. ఇది కొంత ఫ్రీగా ఉంది. మిగిలిన రెండు వరుసలు ఒకటి మగవాళ్లకోసం, మరొకటి ఆడవాళ్ల కోసం. అవి క్రిక్కిరిసి వున్నాయి. కొందరి చేతుల్లో కరెన్సీ నోట్లు… వందలు, ఐదు వందలు, వెయ్యి రూపాయలు! చాలామంది చేతిలో సంచీలు… అందులోనూ నోట్లే ఉన్నాయని ఇట్టే గ్రహించేట్టుగా!

ఆ పెద్దాయన పక్కనున్న గడ్డపు వ్యక్తి అంతకుముందటి వాక్యాన్ని ఓన్‌ చేసుకుని, దానికి కొనసాగింపుగా అంటున్నాడు: ‘‘నువ్వు ఉట్టిగ టైమ్‌ ఎందుకు వేస్ట్‌ చేసుకుంటవని చెప్పినం. మేమంతా రోజూ ఇక్కడ పడి చచ్చెటోళ్లమే’’

పాపం వాళ్లు నాకోసమని చెప్పారుగానీ, అసలు నేను లోపలికి దేనికోసమని వెళ్లాలి?

నాలో ఏ ఇమడనితనాన్ని గుర్తించిందో ఒక పెద్దశిఖావిడ అడిగింది: ‘‘ఏం పనికచ్చినవ్‌ నాయినా?’’

నేను పేపర్ల పనిచేస్తనమ్మా, రియాలిటీ చెక్‌ అని ఒక ఫీచర్‌ రాయాలమ్మా, అనే చెత్తంతా ఆమెకెలా చెబుతాను? పైగా ఒక రిపోర్టర్‌ అనే ట్యాగ్‌తోకన్నా, వాళ్లలో కలిసిపోయి చూసినప్పుడే జీవితచిత్రం తన సహజ స్వరూపంలో కనబడుతుందని నాకో భ్రమ కూడా ఉంది. కాబట్టి ఓసారి ఎత్తైన ఎంట్రెన్సులో కనీకనపడకుండా ఉన్న బోర్డులు చదివాను.

‘పబ్లిక్‌ కౌంటర్లు పనిచేయు వేళలు ఉదయం 10.15 నుంచి మధ్యాహ్నం 2.45.

చలామణీలో లేని నాణేల కోసం ఫలానా నంబరు కౌంటరు, చిరిగిన నాణేల మార్పిడి కోసం ఫలానా కౌంటరు, నోట్ల మార్పిడి కోసం ఫలానా కౌంటరు’…

అయితే నేను కూడా ఒక ఐదు వందల రూపాయలకు చిల్లర తీసుకుందామనుకున్నాను. ఐదు వందల నోటుకు ఐదు వందల రూపాయి బిళ్లలు!
అబ్బా, ప్రవాహంలో కలిసిపోవడానికి అనువైన హేతువు దొరికాక నేను మరింత మామూలుగా ఉండగలిగాను. అయితే అప్పటికి మరింత రద్దీ పెరిగింది. ఇందాకటి మధ్యలైను కూడా పూర్తిగా నిండిపోయింది. రణగొణధ్వని. కాకిరి బీకిరి మాటలు. ఎప్పుడైనా ఒకసారి ‘ఎందుకువయా తోస్తరు?’, ‘ఉండవమ్మా, ఓ… మీదవడుతున్నవ్‌’, ‘తేరీ మాకీ…’లాంటి మాటలు మాత్రం వినబడుతున్నాయి. ఒకదాంట్లో బాగా రాటుతేలాక వచ్చే గాయితనం ఆడవాళ్లలో, మొరటుతనం మగవాళ్లలో.

ఆ మాటల్ని వినుకుంటూ, పాతిక మంది చొప్పున ‘మరింత లోనికి’(అసలైన బ్యాంకులోకి) పంపుతున్న పోలీసుల్ని చూసుకుంటూ, పని జరిగిపోవాలన్న తొందర లేనప్పుడు ఉండే నిశ్చింతతో నేను వరుసలో నిల్చున్నాను.

అయినా పక్క వరుసలోని ఒకావిడ అంటూనే ఉంది: ‘‘ఏడ పనిజేస్తవ్‌ నాయినా, ఐడీ కార్డు చూపించి డైరెక్టు లోపల్కి వో’’
ఇంతమంది నేను ఈ సమూహంలోకి కొత్తగా వచ్చానని గుర్తించగలిగారంటే, వీళ్లంతా ఎంత పాతవాళ్లు!

అక్కడే తచ్చాడుతున్న మరొకామె ఇదే అదనుగా ‘‘నువ్వు డైరెక్టు లోపల్కి వోతవు గదా! నాయో పదివేలిస్తా అవ్విటిగ్గూడా చిల్లర తీస్కరా’’ అంది.

సినిమా క్యూలో మనం నిల్చున్నప్పుడు, లైన్లో లేని వ్యక్తి వచ్చి కొంచెం టికెట్‌ తీసివ్వమని అడగటం లాంటిదిది.

ఏం చెప్పాలో అర్థంకాక ‘‘నేనెట్లా తేనమ్మా…’’ అన్నాను.

‘‘నీకు ఐదు వందలకు చిల్లర్నేగదా గావాలె, పదివేలది వాళ్లమీద ఎందుకు వోగొడుతవ్‌?’’

‘‘వద్దమ్మా అట్ల నేను తేగూడదు’’

కాసేపాగాక నామీద తుది బాణం వేసింది: ‘‘నీకో యాభై రూపాయలిస్తతియ్యి’’

తప్పొప్పుల మీమాంసలోకి దిగలేదుగానీ, నేను వెళ్లిన సందర్భంలో అమె పని మానసికంగా నా పనికి ఆటంకంగా తోచింది. అందుకే నిరాకరించాను.

‘‘హుషార్‌ లెవ్‌ నువ్వు, పిల్లగాండ్లు ఎట్లుండాలె, చెడుగులోలుండాలె’’ అంది. నిందకన్నా నేను ఎలా బతుకుతానో అన్న బాధే ఎక్కువ ధ్వనించిందందులో.

లైను నెమ్మదిగా కదులుతోంది.

కాసేపటి తర్వాత, వరుసల్ని పర్యవేక్షిస్తున్న పోలీసొకామె నన్నూ, నాలాంటి మరొకతణ్ని(‘‘మా ఫ్యామిలీ మొత్తం షిరిడీ పోతున్నం, పదుల నోట్లు చేతులుంటే మంచిదిగదాని వొస్తే ఇక్కడ ఇంత రష్షుంది’’) కొత్తవాళ్లుగా గుర్తుపట్టి, వరుసలో అందరికంటే ముందు నిలబడే అవకాశం కలిగించింది.

కాసేపటికి లోపలికి వెళ్లాను. వివిధ కౌంటర్లతో విశాలంగా ఉన్నా, మామూలుగా చూసే బ్యాంకులాగే ఉంది.

అయినా ఇది బ్యాంకులాగా ఉండటమేంటి? ఇదే బ్యాంకులకు అమ్మయితే!

చిల్లరని చెప్పి టోకెన్‌ తీసుకుని, నాలుగో నంబర్‌ కౌంటర్‌ కెళ్తే, రూపాయి బిళ్లల్ని మూటగట్టిన ప్లాస్టిక్‌ కవర్‌ చేతిలో పెట్టారు.

***

కవర్ని ప్యాంటు జేబులో కష్టంగా కూరుకుంటూ బయటకు వచ్చాక–
లైన్లలో ఇందాక కనిపించినవాళ్లు, నన్ను మధ్యలోంచి వెళ్లమని సూచించినవాళ్లు సహా చిల్లర్లు తీసుకున్న చాలామంది బ్యాంకును ఆనుకొనివున్న ఆ ఫుట్‌పాత్‌ మీద ఒంటరిగా, జంటగా, నలుగురైదురుగా, పదిమందిగా నిలుచుని, కూర్చుని, కాలు ప్రహారీకి ఆనించి ఉన్నారు. చేతుల్లో, చేతిసంచీల్లో కొత్త పది, ఇరవై రూపాయల నోట్ల కట్టలు! ఒకటి, రెండు, ఐదు రూపాయల బిళ్లల మూటలు!

కొందరు అట్లో, గుంటపొంగనాలో టిఫిన్లుగా తెచ్చుకుని తింటున్నారు. ఒకామె కట్టలు ముందర పెట్టుకుని బ్లౌజుకు చేతికుట్టు వేస్తోంది.
స్కూటర్ల మీద, లూనాల మీద వచ్చినవాళ్లు వీళ్లతో బేరాలు చేస్తున్నారు.

‘పదివేలిట్లుస్తున్నవ్‌?’

‘నూటిరువై’

‘నూరు జేస్కో’

‘ఇగ పది జూడు’

సెటిల్‌. పదుల నోట్ల కట్టలు అటు, పది వెయ్యి రూపాయల నోట్లు ఇటు. లాభం 110.

రిజర్వ్‌బ్యాంకు జన సౌకర్యం కోసం కల్పించిన ఒక వీలులోంచి ఒక చిత్రమైన వ్యాపారం ఇక్కడ రూపుదిద్దుకుంది. బ్యాంకులో పదివేల రూపాయలిచ్చి బదులుగా అంతేమొత్తాన్ని పదులు, ఇరవై నోట్లుగా పొందవచ్చు. అలాగే ఐదు వందలిచ్చి అంతే విలువైన సొమ్మును ఒకటి, రెండు, ఐదు రూపాయల బిళ్లలుగా తీసుకోవచ్చు. ఒక మనిషి ఒక పర్యాయం రెండు టోకెన్లలో గరిష్ఠంగా 10,500 రూపాయల విలువైన నోట్లకు చిల్లర విడిపించుకోవచ్చు. దీనికోసమే ఈ జనమంతా ఎగబడుతున్నారు. ఈ చిల్లరను ఏం చేస్తారు వీళ్లు?
అమ్ముతారు.

ఎవరు కొంటారు?

షాపులవాళ్లు. ముఖ్యంగా రోజూ రూపాయి, రెండ్రూపాయలు, పదులనోట్లు వ్యాపారపరంగా అవసరమైనవాళ్లు.

మరి వాళ్లే వరుసలో నిల్చోవచ్చుకదా?

ఈ క్యూలో నిల్చుని ఆర్జించేదానికన్నా, షాపును వదిలేసి వాళ్లు పోగొట్టుకునేది ఎక్కువ. అదిగో, ఆ అవసరాన్ని వీళ్లు తీర్చుతున్నారు. ధాన్యమార్పిడి, వస్తుమార్పిడిలాగా, ఇది చిల్లర మార్పిడి. గృహిణులు, చిరుద్యోగాల్లోంచి రిటైర్‌ అయినవాళ్లు, సాయంత్రాలు ఏ పల్లీబండో నడుపుకునే యువకులు, వేరే పనుల్లో చేరలేని వికలాంగులకు ఇది పార్ట్‌టైమ్‌ జాబ్‌ అయిపోయింది. (పది, ఇరవై నోట్ల) వెయ్యికి పది, (1, 2, 5 బిళ్లల) వందకు పది–పన్నెండు చొప్పున ఒక దఫాలో అటూఇటూగా ఓ నూటాయాభై దాకా సంపాదించుకోవచ్చు. నిర్దేశిత సమయంలో రెండుసార్లు లైన్లో నిలబడి నెగ్గుకురాగలిగితే ఆదాయం రెట్టింపు అవుతుంది. ఆదివారాలు, సెలవురోజులు పోను రోజూ రాగలిగితే ‘ఒక జీతం సొమ్ము’కు అవకాశం ఉంది.

‘‘వొంట జేసి పిల్లల్ని స్కూలుకు పంపించినంక ఇక్కడికొస్త, ఉట్టిగ ఇంట్ల ఉండి ఏం జెయ్యాలె’’

‘‘మూడునెళ్ల కిందట దీని రూటు దొరికింది. మంచిగనేవుందిగదాని వొస్తున్న’’

‘‘రోజుకు రెండొందల దాకా మా పడుతున్నయ్, అన్నిరోజులు ఒక్కతీరుగుంటయా, ఓసారి రెండ్రూపాయలు తక్వకే ఇయ్యాల్సొస్తది’’
మళ్లీ వీళ్ల దగ్గర కొని, షాపులకు తిరిగి అమ్మేవాళ్లున్నారు. మారు బేరం.

ఇక్కడ గుమికూడిన రద్దీకి అనుగుణంగా ఒక పుచ్చకాయల ముక్కల బండి వచ్చి చేరింది. ఉపాధిలోంచి ఉపాధి.

అప్పుడే పరిచయమైన ఒకతను అన్నాడు: ‘‘ఐదు వందలకే తెచ్చినవా? పదివేలది గూడా తేవద్దా? వేస్టుగ వంద రూపాయలు పోగొట్టుకున్నవ్‌’’

ఇక, ఒక కుడిచేయి లేని వ్యక్తయితే, ‘‘ఇవి అమ్ముకొని మళ్ల లైన్లకు వో. భయపడకుండ జేసుకో’’.

కొత్తవ్యక్తిగా ప్రవేశించిన నన్ను వీళ్లు పోటీగా భావించకపోవడం ఆనందం కలిగించింది. పైగా వాళ్ల ఆత్మీయత కదిలించింది.

నిబంధనల సంగతి పక్కన పెడితే, ఏటీఎంలు ఎక్కువైపోయి వందలు, ఐదువందలు, వెయ్యినోట్లే చలామణీలోకి వస్తున్న ఈ రోజుల్లో అన్నిరకాల వ్యాపారాలు జరగడానికి అనువైన చిల్లరను బ్యాంకునుంచి జనంలోకి తేవడంలో వీళ్లు ప్రధాన పాత్ర పోషిస్తున్నారనుకోవచ్చు.

***

తిరిగి బస్సులో వస్తుంటే, కండక్టర్‌ విసుక్కుంటున్నాడు: ‘‘అందరు నోట్లే ఇస్తే, నేనెక్కడికేలి తేవాలి చిల్లర?’’

కొన్ని రోజుల్దాకా నాకు నిశ్చింత. ‘‘థాంక్యూ అన్నా, నువ్వొక్కనివి కరెక్టుగా ఇచ్చినవ్‌’’ అన్నాడు.

నాల్రూపాయలు అవసరమైనప్పుడు, మీ దగ్గర ఐదొందలుంటే మాత్రం ఏంలాభం?

అదీ చిల్లర ఘనత.

(రచనాకాలం: ఫిబ్రవరి 2012 )

**** (*) ****

పుస్తకం: రియాలిటీ చెక్
రచయిత: పూడూరి రాజిరెడ్డి
పబ్లిషర్: తెనాలి ప్రచురణలు
వెల: రూ. 250 (హార్డ్‌బౌండ్ ఎడిషన్)
ప్రతులకు: అన్ని ప్రధాన పుస్తక కేంద్రాలు
వివరాలకు: 9705553567