ప్రత్యేకం

చిన్నప్పటి ఒక సరసపు వాక్యం

జనవరి 2016

విషయం విన్నప్పుడు నేను పెద్దగా ఆశ్చర్యపోకపోవడానికి కారణం, ఇలాంటిదొకటి జరగడం అనూహ్యం కాదనుకోవడమే!

మావాడి క్లాసులో ఉండే అక్షయ్‌రాజు అనే పిల్లాడు, అదే క్లాసులో చదివే ఒకమ్మాయిని పెద్దయ్యాక పెళ్లి చేసుకుంటాడట! అలా అని మావాడితో చెప్పాడట! వాడు ఆ మాటను మోసుకొచ్చి వాళ్లమ్మ చెవిలో వేశాడు.

సాధారణంగా, నేను ఆఫీసునుంచి ఇంటికెళ్లాక, చిన్నోడు చంకనెక్కి నా బ్యాగు వెతుకుతాడు, ఏ పళ్లు తెచ్చివుంటానోనని! నేను కూరగాయలు కిచెన్లో ఇచ్చేసి, పళ్లు తినడానికి వీలుగా, కడగాల్సినవైతే గిన్నెలో నానబెడుతుండగానే ముక్కోణఫు ఫిర్యాదులు వెల్లువెత్తుతాయి. ‘నానా, అమ్మ నన్ను…’ ‘పెద్దోడు ఏం జేసిండో తెలుసా?’ వాళ్లమ్మ మీద చిన్నోడు, చిన్నోడి మీద పెద్దోడు… ఆ పూటకు ఆ పంచాయితీలు తీర్చి, భోజనాలు కానిచ్చి, ఆ పళ్లు పిల్లలకు కోసిచ్చి, ‘నువ్వుంటే నా జతగా – నేనుంటా ఊపిరిగా’ అని పాట వినే విరామంలో ఉన్నప్పుడు- రెండోవైపు విషయాలు మాట్లాడుకునే అవకాశం ఉంటుంది. ‘‘చూశినవా, ఒకటో తరగతి పిలగాడు ఎట్ల మాట్లాడిండో?’’ అని సంభాషణ ప్రారంభిస్తుంది నా భార్య.

అమ్మాయిల ఆంతరిక ప్రపంచాన్ని నేను ఎరుగను. వాళ్ల ఆలోచనలు అక్షయ్‌రాజు వయసులో ఎలా ఉంటాయి? నాకైతే వాడి వయసులోనే ఆడ-మగ మధ్య ఉండగల రహస్యం గురించి కొంతైనా తెలుసు.

అప్పుడు నేను కూడా మా పెద్దవాడి వయసులోనే ఉన్నానేమో! మా అమ్మతో మా ఊళ్లోనే ఒక పెళ్లికి, లేదా వివాహానంతర కార్యానికి వెళ్లాను. చింతకుంటోళ్లు మా వాడకట్టులోనే ఉంటారు. అయితే, కులానికి పెరుక వాళ్లు కాబట్టి, వాళ్ల పద్ధతులవీ వేరే జరిగినై. కొత్త కోడలితో బహుశా వడ్లు దంచిస్తూ, ఆమెతో సహా నలుగురైదుగురు ముత్తైదువలు కుందెన పెట్టిన రోటిలో పోట్లు వేస్తూ ‘అల్లో నేరెడళ్లో’ పాట ఎత్తుకున్నారు. అలా ఒక పెళ్లిలో పాట వినడం నేను అదే మొదటిసారి; తర్వాత కూడా నేను ఏ పెళ్లిలోనూ ఎవరూ పాడగా వినలేదు. కాపురానికి వచ్చిన ఆ కొత్తమ్మాయిని మానసికంగా శృంగారానికి సంసిద్ధం చేయడంలో భాగంగా అనుకుంటా, ఆ పాటలో ఈ వాక్యం హఠాత్తుగా జారిపడింది: ‘అల్లిచ్చి గుల్లిచ్చి గోడకొరిగిచ్చి అల్లోనేరెడళ్లో’.

నా బుల్లి గుండె గుబగుబలాడింది. సిగ్గు కూడా కలిగింది. ఏంటీ ఈ అమ్మలక్కలు ఇట్ల బాజాప్త పాడుకుంటున్నారు, అనుకున్నాను. ఆ పాడిన గొంతు ఎవరిదో గుర్తులేదు; ఇంక ఆ పెళ్లి తాలూకు ఏ ఇమేజీ నాకు స్పష్టంగా గుర్తులేదు; కానీ ఈ వాక్యం మాత్రం నన్ను పట్టుకుంది; చింతకుంటోళ్ల మల్లయ్య జ్ఞప్తికి రాగానే నాలో ఈ వాక్యం తటిల్లుమని మెరుస్తుంది.

ఆ వయసుకు అలాంటి వాక్యాన్ని వినడమూ, ఆ భావాన్ని నేను అప్పటికే గ్రహించగలగడమూ నాకు ఇప్పటికీ ఆశ్చర్యంగానే ఉంటుంది.

మా పెద్దాడి స్నేహితుడు ఆ పాపను పెళ్లి చేసుకుంటానంటే నేను ఆశ్చర్యపడనిది అందుకే!

(ఆగస్ట్ 2015)

**** (*) ****