కవిత్వం

ఓ.. వుల్లా, గిటు సూడున్రి

మార్చి 2016

పానం వున్నా కొన్ని వస్తువులకు ఫకరుండదు
మనిషి వస్తువుగా మారినంక
వస్తువు మనిషిపై పెత్తనంజేత్తున్నదన్క

గలగలలాడే చెల్లని సత్తుపైసల గొంతుకలు మూగబోతయి
కళకళలాడే రూపాయిని గతచరిత్రపు పునాదులపై నిల్పి పట్టంగట్టినంక
అంతర్జాతీయ అంగట్లో మారకపు మాంజాతో కరెన్సీ నోట్ల పతంగిని ఎగరేషినంక

నిండైన నీళ్లపట్వలు పటుక్కున పల్గిపోతయి
బతుకంటే పల్గిపోయే నీటిబుడగలని ఎరుకైనంక
గోసలువడ్డ పెయిల మబ్బులపిట్టలు రెక్కల్నిసాపి ఎగిరిపోయినంక

తరతరాల ఆలోచనల గూనపెంకలు ఇరిగిపోతయి
ఇత్తునం బద్దలయ్యే సప్పుడుతో నరాలు చిట్లినంక
షిలుంబట్టిన నెత్తురు నొసట్ల తిలకంబొట్టుబెట్టినంక