కవిత్వం

గొంతు తడిపిన చెయ్యి

మార్చి 2017

నెలపొడుపును జూసిన ప్రతీసారి
కాంతుల్ని నింపుకుని
కండ్లుమూసుకుని
చేతులతో నన్ను వెదికి పట్టుకుని
చూపుల్ని నా మొఖం మీదికి
చిరునవ్వుతో గుమ్మరించేది
గప్పుడు నా ముందు
నెలపొడుపు సుత దిగదుడుపే.

తానమాడితె
నున్నగ నిగనిగలాడుతవని
అట్టగట్టిన పెయ్యిమీది మట్టికి
గిర్నికాడ పట్టిచ్చిన సున్నిపిండికి పందెం గట్టేది
ఒత్తుల కాగిన ఉడుకునీళ్లుబోసుకుంటె
పానం అల్కగుంటదని
వాయిలి ఆకేసి మర్గబెట్టిన నీళ్లు
మొఖంమీద గుప్పిత్తె
పడిశం పరారయ్యేది

అలుకు జల్లిన వాకిట్ల ముగ్గేసి
గడపలు పుదిచ్చి
బాయినీల్లు చేది
గోలెం నింపి
బోల్లు కడిగి
పొయ్యి ముట్టిచ్చేది
ఉడుకునీళ్లు జల్లుకుంట
మూడు కాళ్ల పీట మీద తెల్లని గుడ్డేసి
బియ్యపు రొట్టె జేసేది

వొట్టిబోయిన కాలంల
ఉట్టిమీది సద్ది కూడు దించుకుని
నపరింత నంజుకుతినమనేది
అరుగుమీద కూసోని
దిగులుగుండె బరువుదీర
ఉప్పోసకు నాల్గుముచ్చట్లు పంచుకొమ్మనేది

కాలం కలిసొచ్చేదాక
కట్టమెప్పటికీ తీరందేనని
గుడ్లల్ల నీల్లు దీసుకుంట
గట్ల రందిపడితె ఎట్టనని గదుమాయించేది
మాపటేల పొద్దుగుంకిందని
తెల్లారి పొద్దుపొడవకుండుంటదా..అని
మనసు కుదుటపడితె
లోకాన్ని జయించినట్టేనని
తత్వం బోధించేది

దోసిలి పట్టి గొంతు తడిపిన చేతులవి
దేవిదేవి గూగం పంచిపెట్టిన తీపి మూటలవి
తవ్వితోడిపోసుకున్న
జ్ఞాపకాల ఊట మా నాయనమ్మ.