కవిత్వం

రంది రౌస బత్కులు

జనవరి 2017

పందిరిగుంజను కావలిచ్చుకున్న బీరతీగలు
సాలెగూటిలో చిక్కుకున్న తేనెటీగలు
అనుభవిస్తేగాని తెలీని కొన్ని బాధలు
ఇసుకలోకి నీరింకినట్టుగా కొన్ని మనాదులు
మాటల్లో ముంచి ప్రేమల్ని అద్దినా మానని గాయాల గురుతులు
తొర్లిచ్చి తొర్లిచ్చి ఉఫ్ ఉఫ్ మని ఊదుకుంట తాగాల్సిన కొన్ని కన్నీళ్లు
అన్నీ కలెగల్సి గజిబిజి ఆలోచనల సంద్రంపై తేలుతయి

ఎడబాషిన బంధాలను కలిపే దారపుబిండెలు
కులుకుతూ ఎనుకులాడుకున్న నీడల గుత్తులు
ఆ.. యింకెజేత్తనని మర్శిపోయిన మోతకోలు మాటల పనులు
చిన్నాచితకా పుల్లలేరుకొచ్చి
కట్టుదిట్టంగా పేర్సుకున్న గూడుచెదిరి
కంటిసూపుల సూరుకు యాళ్లాడుతున్న కొన్ని కలలు
రందిరౌస బత్కుల అలలపై కొట్టుకొచ్చిన ఆల్చిప్పలైతయి

రాలిన ఎంటికెల యాదినెరుపులు
రాపిడికాలపు కత్తెర్ల మీద తెగిన గూడల చెప్పులు
మెదడు పొరల్లో మాగి మాగి మట్టిమనిషి వెతల కతలనల్లుతూ… సుఖదుక్కాలైతయి

Painting: Annavaram Srinivas