కవిత్వం

ఇచ్ఛంత్రం

జూన్ 2016

దినాం…
ఒక్కగోడకే ఒక పక్కే సున్నమేత్తరు
చేతికిచ్చిన కాయితం ముక్కను
తిర్లమర్లదిప్పి సూడనియ్యరు
పానాలు కిందమీదైనా..
ఆయే..పాయే అయ్యేట్టున్నా
ఎలుగుపడ్డ ఇసిరె మీదికి సుత సూపు ఆననియ్యరు

నీడలు…
బరువెక్కిన గుండెలతో
కండ్లల్ల దీపాంతల ఒత్తుల్ని ఎక్కిత్తయి
తునాతునకలు జేషి
ఎల్తురును తూర్పారబట్టి చీకటి రాజ్యమేల్తాంటది

కొండెక్కిన మనిషి దిగొచ్చేనాటికి
కలత నిదురలో..
సగం కాలిన కలలతో
తీరని కోర్కెల కమురువాసనతో
కూసాలు ఇడ్వని నాగుంబాములు బుసలుకొడుతాంటయి

నిజాల నిప్పుకణికెల మీద పొర్కనెగేషి పొగబెట్టితె
కండ్లమంటేషం ఒళ్లంత కాలబెట్టినంక
పాలకంకుల గింజల్ని ఒలిషి పావురాలకు పచ్చులకు తినబెడ్దమంటె
సొప్పబెండ్లు దొరకని కరువున్నదని కతలల్లుతరు

ఇస్త్రీ మడతల జేబుల్లో పెళపెళమని కరుకు కాయితం తళతళమెరుస్తూ ఊరిత్తాంటె
డొక్కలెండిన పేదల పేగుముడుతల్లో మెతుకుల జాడ దొర్కబట్టిద్దామని డేగకళ్లతో దేవులాడుతరు

కూశికూశయిన పానాలు కూలబడితె
బత్కుల్ని కుల్లబొడ్శి
చిల్లంకల్లంజేషి
చీకటి పురాణాల చీరనేషి బాగోతాలాడుతరు

నెత్తురు
ఒత్తుల కుండల నీళ్లలెక్క మసులుతాంటది
కొర్రాయి మర్రేసుకుంట
చిట్టుపొయ్యి వేదాంతంజెప్పుకొత్తది
ఎందుకు తండ్లాడుతానవ్ బిడ్డా ?
గిదైతే.. ఇచ్ఛంత్రంగాదు సుమా అని!