కవిత్వం

ఖాళీచేయాల్సిన సమయం

అక్టోబర్ 2017

రాత్రి తెగిపడిన అవయవాలన్నీ
ఉదయపు నడకలో
గడ్డిమైదానంపై మంచుబిందువుల్లా మారి
నీ పాదాల కింద చిట్లిపోయి
నెత్తుటి పారాణి దిద్దిపోతయినీకు నువ్వు ఇక కనిపించవు
ప్రకృతిలో దొంగలుపడి
పగటి అద్దం కళాయిని ఎత్తుకపోతరు

గాయాల తాలూకు మచ్చల్ని తడిమి
ఎర్రగా పండిన నీచేతి మైదాకు కలల్ని
జోరుగా కురిసిన వాన సుట్టం
వెళ్తూ వెళ్తూ తోడు తీసుకపోతది

పేరుకుపోయిన దుక్కపుమంచు పొరల్ని
తొలగించుకున్నంక
వేళ్లసందుల్లోంచి జారిపోయే
గతకాలపు పీడకలల ఉశికెధారల్ని సంతర్పణం జేసినంక
యాష్టపడని సుతిమెత్తని ఎండపొడలో
నిలువెల్లా తడ్వడానికి
ఒక కొత్త పొద్దును కలగన్న రాత్రి
ఈ ఇంటిని ఖాళీచేయాల్సిన సమయమొచ్చిందని
రేపటికి తనను తాను
దానంచేసుకుని తప్పుకుంటది