కథ

కోపకచ్చ

ఏప్రిల్ 2016

ర్థాలు అడగకుండా వుంటానంటే ఒక కథ చెప్తాను.

వాతాపి అని ఒకడుండేవాడు. వాడు చేసేది ఓ పెద్ద కంపెనీలో పెద్ద వుద్యోగం. పెద్ద వుద్యోగం చేసేవాడిని వాడు వీడు అనకూడదు కదా. అందుకని ఆయన, వారు లాంటి పదాలు వాడదాం ఇక నుంచి.

ఏం? ఆయనగారు ఉద్యోగం చేస్తున్నారు కదా. అందువల్ల నెల నెలా జీతం వస్తోంది. ముఫై వేల ఐస్ క్రీమ్ లు జీతంగా ఇచ్చేవాళ్ళు. నెల ముఫై రోజులు అది కొంచెం కొంచెంగా కరిగిపోతూ వుండేది. శనాదివారాలు కాస్త ఎండ ఎక్కువ కాసేది. ఓ నాలుగు ఐస్ క్రీములు ఎక్కువ కరిగిపోయేవి. నెలాఖరుకు వచ్చేసరికి రెండో మూడో పుల్లైసులు మిగిలేవి.

ఇలా జరుగుతూ వుండగా వుండగా ఒకసారి ఏప్రిల్ వచ్చింది. బోనస్ వస్తుంది, బోనస్ వస్తుంది అప్పటికే నాలుగు నెలలుగా భార్య చింతామణికి చెప్తూనే వున్నాడు వాతాపి. ఆ వచ్చే రోజు రానే వచ్చింది. బోనస్ కూడా వచ్చింది. రెండు కుల్ఫీలు ఇచ్చారు. బ్యాంకు నుంచి మెసేజ్ రాగానే ఆత్రంగా చూసుకున్నాడు వాతాపి. వచ్చినది చూసుకోని స్పృహ తప్పి పడిపోయాడు.

వంట చేస్తున్న చింతామణి వచ్చి “లే” అంది. లేస్తే కదా? “లేరా మగడా” అని కాల్తో కొట్టింది. లేవలేదు. చేతిలో వున్న వేడి వేడి అట్లకాడ చెంప మీద పెట్టి “లేస్తావా లేవవా?” అంది.

వాతాపి లేచాడు. బోనస్ గా వచ్చిన కుల్ఫీల గురించి చెప్పాడు.

“నాకదంతా తెలియదు. ఇంట్లోకి కావాల్సిన సరుకులు తీసుకురా” అంది. లిస్ట్ రాసుకున్నాడు వాతాపి. ఒక లాంగ్ చైను, ఒక చిన్న చైను, పెద్ద వుల్లిపాయలు, చిన్న వుల్లిపాయలు, ఒక ఫారిన్ వెకేషను, ఒక ఫారిన్ విస్కీ (ఇది ఆమె చెప్పలేదు, వాతాపే రాసుకున్నాడు), ఒక మిక్చెర్ గ్రైండరు, ఒక మిక్స్చర్ పొట్లాం (ఇది వాతాపికి), బాత్రూములు కడిగే యాసిడ్ బాటిల్, కూల్ డ్రింక్ బాటిల్, బియ్యం పది కిలోలు, భయం ఆరు కిలోలు … ఇలా సాగింది. అన్నీ తెచ్చాడు. గ్రైండర్ సంగతి మర్చిపోయాడు.
“మళ్ళీ తే ఫో” అంది. చెప్పులు విప్పనేలేదు వాతాపి. వెళ్ళి తెచ్చాడు.

“బియ్యం లేవు” అంది ఈసారి తిరిగి వచ్చేసరికి.

“పది కిలోలు తెచ్చాను కదా” అన్నాడు.

“మొత్తం వండేసాను. పిల్లలు ఆకలని తినేశారు. నీకు, నాకు తీసుకురా.” అంది.

ఏటీయంకి వెళ్తే కుల్ఫీలు కరిగిపోగా మిగిలిన పుల్లలు వచ్చాయి. వాటితో బియ్యం కాదు కదా ఒక డూప్లే ఇల్లు కూడా రాదు. ఏం చేస్తాడు. నేరుగా ఫోన్లో దూరి ఆఫీసులో బాసు ప్రజాపతి దగ్గరకు వెళ్ళాడు.

“బోనస్ అంటే కనీసం ఒకట్రెండు గులకరాళ్ళు అయినా ఇవ్వాలా? ఏంటీ ఈ కుఫ్లీ కుల్ఫీలు?” అని అరిచేశాడు. ప్రజాపతి భోరు భోరున ఏడ్చి, “నీకు కుల్ఫీలన్నా ఇచ్చారు నాకు చుస్కీలు ఇచ్చారు. నేనెవరికి చెప్పుకోను” అన్నాడు. “కావాలంటే నువ్వు ముంబై వెళ్ళి చైర్మెన్ గారితో మాట్లాడుకో” అని సలహా కూడా పడేశాడు.

పడేసిన సలహా ఏరుకోని ముంబై బయల్దేరాడు వాతాపి. ఇక్కడ మిసెస్ చింతామణి వాతాపి ఆకలి తట్టుకోలేక సోఫా సెట్టు, డబల్ కాట్ బెడ్ తినేసింది. మొబైల్ ఫోన్ నోట్లో వేసుకోని నమలబోతుంటే అది కుయ్యో అని మొరిగింది. తీసి చూస్తే వాతాపి ఫోన్ కాల్.

“ఇలాగిలాగ జరిగింది. నేనట్లా బాంబే దాకా పోయస్తా” అన్నాడు. సరే అని చెప్పి చింతామణీ మొబైల్ మళ్ళీ నోట్లో వేసుకోని మింగేసింది.

చైర్మన్ కలిసాడు వాతాపిని. కాదు కాదు ఛైర్మెన్నూ, వాతాపి కలిసారు. కాదులే వాతాపే ఛైర్మన్ ని కలిసాడు.

“చైర్మన్ గారూ, చైర్మెన్ గారు. నాకిలాగ కుల్ఫీ ఇచ్చారు. పుల్లలు మిగిలాయి. వీటిని ఏం చేసుకోమంటారు” అన్నాడు.

“వాట్ డామిట్, దిస్ ఈస్ రిడికులస్. ద స్ట్రాటజీ ఆఫ్ ప్లానింగ్ అండ్ క్యూ ఎండ్ ఆర్ అండ్ పీ ఎమ్ ఎస్ ఇన్ వేరియబుల్లీ ఇన్ యువర్ వేరియబుల్.” అని ఏదో చెప్పబోయాడు. వాతాపి కుల్ఫీ పుల్లలతో తల గోక్కుంటుంటే తెలుగులోకి అనువాదమయ్యాడు. “అసలు నిన్ను గొంతు పిసికి చంపేద్దామనుకున్నాను. పోనీలే అని, నువ్వు నీ కుటుంబం చల్లగా వుండాలని ఐస్ లు పడేస్తుంటే, నన్నే ప్రశ్నిస్తావా? ఢాం ఢూం ఢకారం” అని అరిచాడు. అసలే కోపంతో వున్న వాతాపి రెండు కుల్ఫీ పుల్లల్నీ గట్టిగా పట్టుకోని ఛైర్మెన్ గారి కళ్ళు పొడిచేయాలని నిర్ణయించుకున్నాడు. ఆయన పెట్టుకున్న కూలింగ్ గ్లాసులు తీసి పడేశాడు. ఇంతా చూస్తే ఛైర్మెన్ గారికి అసలు కళ్ళే లేవు.

“కళ్ళు లేని ఛైర్మెన్, కళ్ళు లేని ఛైర్మెన్” గోల గోలగా అరవసాగాడు వాతాపి. ఛైర్మెన్ పొట్ట చెక్కలయ్యేలా నవ్వేసి – “ఓరేయ్ సన్నాసి వాతాపి, ఏప్రిల్ మేలలో నీలాంటోళ్ళు వందల మంది వస్తారని నాకు ముందే తెలుసు. ప్రతివాడు ఇలాగే పుల్లలు పట్టుకోని బెదిరిస్తుంటాడు. అందుకే కళ్ళు బ్యాంక్ లాకర్లో పెట్టి మరో వచ్చా. చెవులు కూడా పడేసేవాడినే కానీ గాగూల్స్ నిలబడవని తెచ్చుకున్నా” అని చెప్పి, చెక్కలైన పొట్ట ముక్కలు ఏరుకోని కిటికీలో నుంచి దూకేశాడు.

దూకేసిన ఛైర్మెన్ వెనకాలే వాతాపి కూడా దూకాడు. ఇరవై అంతస్తులు దిగడానికి టైం పడుతుంది కదా అని దారిలో వున్నప్పుడు పెళ్ళానికి ఫోన్ చేశాడు. ఫోన్ కొడుకు జీనోమి ఎత్తాడు.

“ఫోన్ అమ్మకి ఇవ్వరా” అన్నాడు వాతాపి.

“పిచ్చి నాన్నా. అమ్మ ఫోన్ మింగేసి చాలాసేపైంది. నన్ను కూడా మింగేసింది. ఇప్పుడు అమ్మ పొట్టలోనే వున్నాను” అన్నాడు.

“అమ్మ కడుపు చల్లగా అక్కడే వుండు నాయనా” అని ఆశీర్వదించాడు వాతాపి. అప్పటికే చింతామణి అరుపులు వినపడుతున్నాయి. ఆమె కడుపుమంట తెలుస్తోంది. ఫోన్ పెట్టేశాడు.

దారిలో తనలాగే పుల్లలు పట్టుకుని కొంతమంది, ఖాళీ ఐస్ క్రీమ్ కప్పులు పట్టుకోని కొంతమంది కనపడ్డారు. అందరూ ఛైర్మెన్ తో మాట్లాడటానికి ఆయన వెనకాలే బయల్దేరారు.
ఎవరికి ఏం దొరికిందో చెప్పుకున్నారు. ఒకళ్ళిద్దరికి బండరాళ్ళు దొరికాయని ఆశ్చర్యంగా చెప్పుకున్నారు. అలా దొరికినవాళ్ళు అడా? మగా? అని ఆరాలు తీసుకున్నారు. వాళ్ళు ఏ ఏ శరీరభాగాలతో ఏ ఏ పనులు చేస్తే వాళ్ళకి రాళ్ళు రప్పలు దొరికాయో ఊహించుకోని చెప్పుకున్నారు.

వాళ్ళు దిగేసరికి ఛైర్మెన్ గారి ప్రసంగం మొదలైంది. ఎవరూ కొట్టకూడదనేమో ఆయన అప్పటికే కాషాయం కట్టాడు.

“కాబట్టి యంప్లాయీస్ లారా నేను చెప్పొచ్చేదేమిటంటే, నా దగ్గర పెద్ద పెద్ద బండరాళ్ళు వున్నాయి. నేను వుండేదే జంబారా కొండల్లో. ఇన్ని రాళ్ళు నా వెనక పెట్టుకోని నేను తెలుసుకుందేమిటంటే రాళ్ళన్నీ చివరికి మట్టి కావాల్సిందే. కాబట్టి రాళ్ళ కోసం వెంపర్లాడటం ఆపండి. జీవితంలో చల్లదనాన్ని ఆస్వాదించండి. ఐస్ క్రీమే జీవిత పరమార్థం. జీవితాన్ని చప్పరించండి, చీకండి, పీల్చండి. ఈ సంస్థ మీరంతా అలా చెయ్యాలనే కోరుకుంటుంది. అందుకే మీకు ఐస్ క్రీములు, కుల్ఫీలు ఇస్తుంది. మీరు కూడా ఈ సంస్థ అభివృద్ధి కోసం పని చేస్తూ వుండాలి” అని ఇంకా ఏదో చెప్పబోయాడు.

“కాదు” అన్న అరుపు వినపడింది. “వీడు పని చేసేది నీ సంస్థ కోసం కాదు, నా కోసం, నా పిల్లల కోసం” అంది చింతామణి.

“తప్పమ్మా వీళ్ళంతా ఈ సంస్థ కుటుంబ సభ్యులు. నాకు బిడ్డల్లాంటి వాళ్ళు. నువ్వు కోడలివి. వీళ్ళు నా కోసం, నా కంపెనీ కోసం పని చెయ్యాలి. నీ కోసం నీ బిడ్డల కోసం దేవుడున్నాడు” అంటూ నోరు తెరిచి వాతాపిని మింగబోయాడు ఛైర్మెన్.

చింతామణికి పిచ్చి కోపం వచ్చింది. తనూ నోరు తెరిచింది. ఒకవైపు ఛైర్మెన్ ఇంకో వైపు చింతామణి. వాతాపికి ఎవరి నోట్లోకి దూకాలో అర్థం కాలేదు. ఇంతలో ఒక విచిత్రం జరిగింది.

చింతామణి ఛైర్మన్ ని మింగేసింది.

“ఓరినాయనో” అని అరుచుకుంటూ వాతాపి కూడా ఛైర్మన్ వెనకాలే చింతామణి నోట్లోకి దూకేశాడు. వాతాపిని కూడా మింగేసిందామె.

లోపలకి వెళ్ళి చూస్తే మనుషులు ఎవ్వరూ కనపడలేదు. కాకపోతే ఆమె మింగేసిన సోఫా, టేబుల్, విస్కీ బాటిల్, బూందీ మిక్స్చర్ పాకెట్, జీనోమి స్కూల్ నోట్ పుస్తకాలు కనపడ్డాయి. తరువాత వాతాపి ఏం చేశాడనుకున్నారు?

సోఫాలో కూర్చోని, విస్కీ మొత్తం తాగేసి జీనోమి నోట్ పుస్తకంలో ఈ కథ రాయడం మొదలుపెట్టాడు.

**** (*) ****