కథ

తెల్లతాచు

జూలై 2017

ర్రపంచె గుర్తుకొచ్చింది విశ్వనాథానికి.

“ఎందుకు కట్టుకోవు నాన్నా” అంటాడుశేఖరం. పన్నెండేళ్ళు లేని పిల్లవాడికి తను ఎందుకు కట్టుకోకూడదో చెప్పినా అర్థం కాదు. “అవును నాన్నా. కట్టుకో. ఆచార్లుగారు కట్టుకుంటే ఎంత బాగుంటుందో” అంటుంది వాడి అక్క ప్రియంవద.

ఆయనతో తనకి వంతేమిటి? మంత్రం నోరు తిరిగినవాడు. చక్రాలేసి జాతకం చెప్పే నేర్పు వున్నవాడు. మరి తనో?
అరటిఆకు దొన్నెలోకి గుచ్చిన దర్భపుల్ల వేలికి గుచ్చుకోని విరిగింది.

“మడి బట్ట ఆరేశారుట. స్నానం చేసి సిద్ధమైతే మొదలుపెడదాం. రావుగారు కూడా వస్తున్నానని ఫోన్ చేశారు” గోపాలకృష్ణ పిలుపుతో తేరుకోని దొన్నెలు, పవిత్రాలు లెక్క చూసుకోని లేచాడు.

కడుపులో వికారంగా వుంది. అప్పటికే మూడు కాఫీలు పడ్డాయి. అయినా ప్రాణం నిలబడటం లేదు. ఇంకో కాఫీ అడిగే ధైర్యం లేదు. వంటగదిలో నుంచి వస్తున్న వంటల వాసనకి మరింత చిరాకుగా వుంది.

“అట్లా లఖంణాలు చెయ్యకోపోతే ఉదయాన్నే రెండిడ్డెనలు తినేసి రావచ్చు కదా” అంటాడు గోపాలకృష్ణ. తద్దినం పెట్టిస్తున్న యజమానిని మోసం చెయ్యడానికి మనస్కరించదు విశ్వనాథానికి.

నీళ్ళు కుమ్మరించుకోని ఆరేసిన పంచె అందుకున్నాడు. బాగా పాతబడిన పంచె. అంచు రంగు అరచేతి పొడవు పైకి పాకింది. చిన్న చిరుగు కూడా కనిపించింది. తప్పేదేముంది? ఇచ్చింది కట్టుకోవాలి అనుకుంటూ సిద్ధమయ్యాడు.

పన్నెండున్నర దాటింది. రావుగారింట్లో ఎప్పుడూ ఆలస్యమే. తద్దినానికి కూడా శెలవు పెట్టడాయన. ఉదయం ఆఫీసుకి వెళ్ళినట్లే వెళ్ళి లంచ్ టైమ్ లో వస్తాడు. వచ్చిన దగ్గర్నుంచి “త్వరగా త్వరగా” అంటూ ఒకటే హడావిడి. “సాయంత్రం మళ్ళీ ఆఫీస్ కి వెళ్ళాలి” అంటాడు.

మొదటి భోక్తగా ఎవరో కొత్తాయన. గోపాలకృష్ణగారి తాలూకేమో, ఆయనతో తప్ప మాట్లాడట్లేదు. మనిషి పల్చగా వున్నాడు. రంగు అదీ బాగానే వున్నాడు. మంచి అంచు వున్న కొత్త పంచె కట్టుకున్నాడు. ఈ పనికి అలా వుంటే చెల్లదని ఇంకా తెలియనట్లుంది.

ఒకప్పుడు విశ్వనాథం కూడా అలాగే వుండేవాడు. తద్దినాలు, మాసికాలు, శ్రాద్ధకర్మలు, శని దానాలు ఒకటేమిటి, అన్ని అశుభాలలో నిలబడ్డాడు. దాని ప్రభావం ఒంటి మీద, ఇంటి మీద కూడా వుందని స్పష్టంగా తెలుసతనికి.

“ఇప్పుడనేముందిలే. ఎన్ని సంవత్సరాల నుంచో నాన్న కూడా ఇదే పని చేశాడాయే” అనుకున్నాడు.

తండ్రి శివయ్య జ్ఞాపకం వచ్చాడు. ఆయనకూడా ఇలాగే తద్దినం భోజనాలు చేసి ఇబ్బంది పడేవాడు. రాత్రంతా పొట్ట పట్టుకోని కూర్చునేవాడు. కనీసం ఆయనకు మంత్రం చెప్పడం అన్నా వచ్చు. అపరకర్మల తద్దినాలకు మాత్రమే వెళ్ళేవాడు. పెళ్ళిమంత్రాలు సహా నేర్చుకున్నాడు కానీ, ఆంబోతుకి అచ్చేసినట్లు ఆయనకి తద్దినం బ్రాహ్మడని పేరు తగిలించారు. ఇక ఆ పనులకు తప్ప వేరే పనులకు పిలిచేవారు కాదు. కుటుంబం చాలా కష్టాలు పడింది. మొదట్లో రాజమండ్రిలో వుండేవాళ్ళు. రోజూ గోదావరి స్టేషన్ కు వెళ్ళి ట్రైన్ వచ్చీరాగానే పెట్టె పెట్టె మధ్య పరిగెడుతూ – “అపరకర్మలు చేయించాలా బాబూ” అంటూ అరుస్తూ తిరిగేవాడు. ప్లాట్ ఫారం మీద శెనక్కాయలమ్మే వాడి అరుపులకీ, ఆయన అరుపులకీ మధ్య పెద్ద తేడా కనపడేది కాదు.

ఓ సారి శివయ్య తోటి విశ్వనాథం కూడా వెళ్ళాడు. పది పన్నెండు ఏళ్ళు వుంటాయేమో అప్పుడు. తండ్రి ప్లాట్ఫారమ్ మీద మొత్తం ఆశగా పరిగెత్తడం చూసి సాయం చేయాలనిపించింది.

“బాబూ, పిండప్రదానం చేయిస్తారా? అపరకర్మలు చేయిస్తారా?” అని అరుస్తూ తనూ పరిగెట్టాడు. ఆమడ దూరంలో అటూ ఇటూ పరుగెడుతున్న శివయ్య ఆ దృశ్యం చూసి ఆగిపోయాడు. పరుగులు పెడుతూ వచ్చి విశ్వనాథం గూబ అదిరేలా ఒక్కటి కొట్టాడు.
“వెధవకానా… ఫో ఇంటికొఫో… దరిద్రప్పీనుగా” అంటూ అరిచాడు. ముందు బిత్తరపోయి, ఆ తరువాత నొప్పి తెలిసి ఏడుస్తూ ఇంటికి పరుగెత్తాడు. తరువాత ఆలోచిస్తే అర్థం అయ్యింది. తాను నడిచిన నిప్పుల గుండంలోకి విశ్వనాథం రాకూడదని ఆయన తపన. ఎవరు ఎలా తలచినా విధి ఇంకోలా నడిపించింది.

అదే వారసత్వం విశ్వనాథానికి కూడా వచ్చింది. అయితే తండ్రి శివయ్య ఎంత చెప్పినా మంత్రం మాత్రం పట్టుబడలేదు. దాంతో శివయ్యగారి శిష్యుడు గోపాలకృష్ణ దగ్గరే పనివాడుగా చేరాడు. ఎక్కడ అశుభం జరిగినా ముందు గోపాలకృష్ణకే తెలుస్తుంది. మంత్రం ఆయనే చెప్తాడు. ఫోన్ చేస్తే భోక్తగానో, వాహకుడిగానో వెళ్ళాలి. ఇప్పుడు ఈ తద్దినం సంగతి కూడా అతనే చెప్పాడు.

“ఏమయ్యా విశ్వనాథం, అలా కూర్చోనే కలలు కంటుంటావా ఏం? పాదప్రక్షాళన చెయ్యాలి. పెరట్లోకి నడువ్” గోపాలకృష్ణ అరిచినంత పని చెయ్యడంతో తేరుకోని రెండో పవిత్రం, నువ్వులు అందుకోని యజమాని రావుగారి వెంటే నడిచాడు.

ఈ మధ్య ఇలా ఎక్కడపడితే అక్కడ ఆలోచించడం ఎక్కువైపోయింది. ఎప్పుడూ అదే ఎర్రపంచె కనిపిస్తుంటుంది. పడుకుంటే తెల్ల తాఛు కల ఒకటి. రాత్రి కూడా వచ్చింది. పొట్ట మీద ఎక్కి ఎడమ భుజం మీదుగా వీపు మీదకు జారే తెల్లతాచు కల. అది కాటు వేస్తుందేమోనన్న భయంతో కదలకుండా వుంటాడు. అది అలా నడుము చుట్టూ తిరిగి మళ్ళీ పొట్ట మీదుగా భుజం మీదకు పాకుతుంది. మెలకువ వచ్చేదాకా అలాగే జారుతూ వుంటుంది.

“పిలుస్తున్నారు” వీపు మీద తట్టి చెప్పాడు మొదటి భోక్త. బోర్లించిన దొన్నె పక్క నుంచి తప్పుకోని లోపలికి నడిచాడు.
ఎర్రపంచె నిజంగా చాలా బాగుంటుంది. ఎప్పుడో పిల్ల సమర్తాడినప్పుడు బావమరిది పెట్టాడు. ఖరీదు ఎక్కువే వుంటుంది. వాడికి అంత తాహతెక్కడిది? వాడి సంపాదనంతా కొబ్బరి చిప్పలు, ఖర్జూరాలు, వక్కలు, ఆకులు. ఇంటి నిండా అవే. వాడికి కూడా గుళ్ళో ఎవరో పెట్టి వుంటారు. అది తెచ్చి నా ముఖాన కొట్టాడు.

అది కడితే ఆ రోజుతో తన సంపాదనంతా తగలబడిపోయినట్లే. చేజేతులా నోటికి అందుతున్న కూడుని కాలదన్నినట్లే.

నెత్తిన నువ్వులు పడ్డాయి. ఇప్పుడు విశ్వనాథం విశ్వనాథం కాదు. రావు గారి తల్లి, ఆమె అత్తగారు, ఆమె అత్తగారి అత్తగారు. వసు రుద్ర ఆదిత్య రూపాలలో. శారదమ్మ, పద్మావతమ్మ, సుబ్బాయమ్మ. ఆ ముగ్గురూ ఏ లోకంలో వున్నా అతను తినే భోజనం తోనే వాళ్ళ కడుపు నిండుతుంది. తద్దినం భోజనానికి కూర్చున్న ప్రతిసారీ అనుకుంటాడు – ఆ ముగ్గురు పార్వతి, ప్రియంవద, శేఖరం అయితే ఎంత బాగుంటుందని. తాను ఒక్కడు భోజనం చేస్తే ఇంట్లో వాళ్ళ కడుపు కూడా నిండే విధానం వుంటే బాగుండేది.

వడ్డన పూర్తైంది. రావుగారు నిలబడి నమస్కరించి ఆలస్యమైంది, భోజనం చెయ్యండంటూ ప్రకటించాడు. మూడు దాటిందని అప్పుడే గుర్తించాడు విశ్వనాథం.

పిండాలు పెట్టారు. మూడింటి మీదా పసుపు కుంకుమ పూలు చల్లారు.

“ముగ్గురూ అదృష్టవంతులే. పసుపు కుంకుమలతో పోయారు” అనుకున్నాడు విశ్వనాథం. తన తల్లి తద్దినంలో నల్లటి నువ్వులు తప్ప ఏ రంగూ వుండని తెల్లటి పిండాలు పెట్టడం గుర్తుకొచ్చింది. తల్లి గుర్తుకొచ్చింది. చాలా కష్టాలు పడిందామె. ఆమెని ఏముందిలే, ఆ ఇంట్లో అడుగుపెట్టిన ప్రతి ఆడమనిషి కష్టాలు పడాల్సిందే. మగవాళ్ళు తద్దినమనో, కర్మలనో ఎక్కడో ఒక చోట కడుపుకి ఇంత అన్నం తినేవాళ్ళు. తెచ్చిన కాస్త డబ్బు, దానాలు పట్టిన పప్పు ఉప్పులతో సర్దుకు బతికేది ఆడవాళ్ళు.

తండ్రి తడిగుడ్డలతో మడి కట్టి కట్టి న్యుమోనియా వచ్చి పోయాడు. అప్పటికి విశ్వనాథానికి పదిహేనేళ్ళు కూడా లేవు. అక్కడ వుండలేక మహలక్ష్మమ్మ పిల్లాణ్ణి తీసుకోని గుంటూరు చేరింది. బ్రాడీపేట శివాలయంలో ఆమె అక్క భర్త పూజారి. ఆయన్ను బతిమిలాడుకుంటే వంటలు చేయడానికి కుదిర్చిపెట్టేవాడు.

నెత్తిన జుట్టు వున్న విధవరాలు తద్దినం వంటకి పనికిరాదని తన భర్త పోయిన మూడేళ్ళకు శిరోముండనం చేయించుకుందామె. సంప్రదాయం అంటే ఆమెకి కూడా గౌరవమే. కాకపోతే సంప్రదాయం కోసం కాకుండా పొట్టకూటికోసం అలా చేయాల్సిరావడం ఆమెను అతలాకుతలం చేసేసింది. విశ్వనాథం తల్లిని అలా చూడలేక ఎన్నో రాత్రులు భోరుభోరున ఏడ్చాడు. ఎలాగైనా సంపాదించాలన్న ఆలోచన ఆ దుఃఖంలో నుంచే పుట్టింది. శనిదానాలతో అతని సంపాదన ప్రారంభం అయ్యింది. మొదటిసారి నువ్వులు మోసుకొచ్చినందుకు మహలక్ష్మమ్మ అతన్ని చావగొట్టింది. ఆ దెబ్బలూ, ఆ రోజు గోదావరి స్టేషన్లో తండ్రి కొట్టిన దెబ్బలు ఒకేలా అనిపించాయి విశ్వనాథానికి. కుటుంబ అవసరాలకి సరిపోయేంతలా ఏనాడు సంపాదించలేకపోయాడు. మహలక్ష్మమ్మ చివరి రోజు వరకూ వంటలు చేస్తూనే పోయింది.

పిండాలకు అందరూ దండాలు పెట్టారు.

రావుగారి హడావిడి మరీ ఎక్కువైంది. ఆఫీసుకి టైమ్ అయ్యింది వడ్డించమంటూ అరుస్తున్నాడు. గోపాలకృష్ణ తను చదువుతున్న అభిశ్రవణ మంత్రాలను ఆపాడు. “చిన్న తంతు మిగిలింది వుండండి రావుగారు. భోక్తలు తృప్తిగా తిన్నామని ప్రకటించిన తరువాత, ఇంకా పదార్థాలు మిగిలిపోయాయి కాబట్టి వీటిని ఏం చెయ్యమంటారు అని వాళ్ళని మీరు అడగాలి. మీరు, మీ బంధువులు కలిసి భుజించమని వారు చెప్తే కానీ మీరు తినకూడదు” అంటూ మంత్రోక్తంగా ఆ పని మొదలుపెట్టాడు.

మిగిలింది మాకివ్వండి తీసుకెళ్తాం అంటే ఏం చేస్తాడో? నాలుగు గారెలు తీసుకెళ్తే పిల్ల, పిల్లాడన్నా తింటారు కదా!

“ఇదిగో మాలోకం విశ్వనాథం. తృప్తాస్మా అనవయ్యా…”

“తృప్తాస్మా”

***

ఇంటికి వెళ్ళబుద్దెయ్యలేదు విశ్వనాథానికి. శివాలయం చేరి నాగేంద్రుడి చెట్టు పక్క వేపచెట్టు నీడలో కూర్చున్నాడు. ఓ గంట గంటన్నరకి శంకరశాస్త్రి వచ్చి కూర్చున్నాడు. తెల్ల తాచు కల గురించి చెప్పాడతనికి.

“ఇంకేముంది, ఆ నాగేంద్రుడే దర్శనమిస్తున్నాడు. ఆయనకి కాస్త పాలు పోసి నూగుచిమ్మిడి పెట్టవయ్యా. నేను శాంతి జరిపిస్తాను” అన్నాడు. విశ్వనాథం నవ్వి ఊరుకున్నాడు.

“ఏమిటయ్యా అలా నవ్వుతావు? నీ కూతురికి జాతకంలో కుజదోషం వుందా? నీ జాతకంలో కాలసర్ప దోషం సరే సరి. ఇంకా ఏం కావాలేం. అందుకు కాదూ నీ బతుకు ఇట్టా ఏడ్చింది. నా మాట విని సర్పశాంతి జరిపించవయ్యా”

“అంతేనంటావా శాస్త్రులూ” అడిగాడు సగం నమ్మకం కుదిరాక. మిగిలిన సగం నమ్మకం కలిగిలించడం పెద్ద కష్టం కాలేదు శంకరశాస్త్రికి. తద్దినం భోక్తగా చేతికందిన సంభావన అతని చేతిలో పోశాడు విశ్వనాథం.

శంకరశాస్త్రి లేచి “రేపు వచ్చే చవితి రోజు పెట్టకుందాం కార్యక్రమం. పిల్లల్ని, మీ ఆవిడని తీసుకోని రా” అంటూగుళ్ళోకి వెళ్ళిపోయి తన కార్యక్రమాలు మొదలుపెట్టాడు.

విశ్వనాథం అక్కడే కూర్చున్నాడు. అప్పటిదాకా పంచె దోపుకున్న చోట ఎత్తుగా తగిలిన ఆరొందలు లేకపోవటంతో ఏదో వెలితిగా అనిపించింది. అయినా తప్పదు. ఈ శాంతితో పిల్లకు పెళ్ళికి, పిల్లాడి చదువుకి ఇబ్బంది లేకుండా పోతే అదే పదివేలు. కనీసం వాడన్నా ఈ శ్రాద్ధకర్మలకు దూరంగా వుంటే ఈ జన్మకి ఇంక కోరుకునేది ఏమీ లేదు. నాగేంద్రుడి పుట్టవైపు నమస్కారం చేశాడు.
చీకట్లు ముసురుకోని గుళ్ళో వున్న నాలుగు దీపాలు వెలిగాక కూడా ఇంటికి వెళ్ళ బుద్దెయ్యలేదు. వచ్చేపోయే వాళ్ళను గమనిస్తూ వుండిపోయాడు. ఎర్రచీర కట్టుకోని వచ్చినావిడని చూశాక మళ్ళీ ఎర్రపంచె గుర్తుకొచ్చింది. అది కట్టుకునే యోగం తనకు ఎలాగూ లేదు. నేను చస్తే కూడా తెల్ల చిరుగుల పంచే కడతారు. అనుకున్నాడు. తల విదిలించి ఇంటి దారి పట్టాడు.

***

“మన సత్యం పెళ్ళట. మీకేమన్నా తెలిసిందా?” అడిగింది పార్వతి ఆయన ఇంట్లోకి అడుపెడుతుండగానే.

విశ్వనాథం తల ఊపి ఊరుకున్నాడు. జాగ్రత్తగా వెతికితే భార్య అన్న మాటల్లో వ్యంగ్యంమో వెటకారమో కనపడుతుందని అతనికి తెలిసినా ఆ ప్రయత్నం అనవసరం అనుకున్నాడు.

“మనం ఏమన్నా కానివాళ్ళమా? స్వయానా మీ పెదనాన్నగారి మనవడే కదా కనీసం మీకు చెప్పాలని కూడా అనిపించలేదా మీ అన్నయ్యగారికి?” అంది నిష్టూరం ధ్వనించాలన్న ప్రయత్నం ప్రత్యేకంగా చేస్తూ.

“ఎవరు చెప్పారు?” అన్నాడు విశ్వనాథం భుజానికి వున్న కండువాని గోడకి కొట్టిన మేకుకి తగిలిస్తూ. ఆ మేకుకి తగిలించిన రెండు సంవత్సరాల క్రితం కేలండర్ మీద వున్న లక్ష్మీదేవి అభయహస్తాన్ని ఎప్పటిలాగే ఆ కండువా కప్పేసింది.

“మన సరోజనమ్మ లేదూ… ఆవిడని మాట్లాడుకున్నారట వ్రతం రోజు వంటకి. వచ్చేవారమే పెళ్ళి”, చెప్పిందామె అతని సమాధానం ఎదురుచూస్తున్నట్లుగా.

“కార్డు వేసే వుంటారులేవే. రేపోమాపో వస్తుందిలే” అన్నాడు అతను. అది నిజం అన్న భావన కన్నా నిజం అయితే బాగుండు అన్న ధ్వని వుంది అతని సమాధానంలో.

“మీవాళ్ళ మీద ఎంత నమ్మకమో! ఒక్క మాట పడనీరు కదా” అంది అస్త్రసన్యాసం చేస్తూ.

“నిన్నెవరు ఆపారు. అనదల్చుకుంటే ఒక్క మాటేమీ వంద మాటలను. వద్దన్నానా?” విశ్వనాథం గొంతులో కాస్త చిరాకు కనపడేసరికి వదిలేసిన అస్త్రాలని మళ్ళీ అందుకుంది పార్వతి.

“మరేం… మాట అనడానికి మీ సంపాదనేమన్నా ఖర్చైపోతోందా. పెదనాన్న కొడుకైనా, ఆ రాఘవేంద్ర చుట్టూ అన్నయ్య అన్నయ్య అంటూ తిరిగితిరి. ఆఖరుకి మనమ్మాయి సమర్తాడినప్పుడు కూడా ఇంటికి పొయ్యి మరీ పిలిచొచ్చామే.. కనీసం ఆపాటి ఆలోచన వుండద్దు ఆయనగారికి? డబ్బులేకపోయే సరికి కనీసం కళ్ళకి కూడా ఆనట్లేదు మనం” ఈసారి తీవ్రత ఎక్కువవడంతో విశ్వనాథం సమాధానం చెప్పక తప్పలేదు.

“తెలుసుగా ఆ సంగతి? మళ్ళీ అడుగుతావే?నేను చేసే పనులు తెలియదా నీకు? శవాలు, తద్దినాలు, శనిదానాలు… మన సంగతి తెలిసీ మనల్ని పిలుస్తారని ఎలా అనుకుంటున్నావు” అన్నాడు.

ఆ సమాధానం ఆమెకు తెలిసిందే. అయినా అతను అంత సూటిగా చెప్తాడనీ, ఆ విషయాన్ని అంత తేలిగ్గా తీసుకుంటాడనీ ఆమె ఊహించలేదు. ఇంక మాట్లాడటానికి ఏమీ లేదని అర్థం అయ్యింది.

“బియ్యం పడేద్దునా?” అంది.

“వద్దు. రావుగారింట్లో తద్దినం ఆలస్యం అయ్యింది. భోజనాలయ్యేసరికి నాలుగు. ఆకలి లేదు” అన్నాడు.

“మీకు షుగర్ వుంది. అంత ఆలస్యంగా భోజనం చేస్తే ఎలా?” అందామె.

“మన చేతుల్లో వుందట్నే? భోక్తగా వెళ్ళాక తప్పుతుందా?” అన్నాడు మంచం మీద నడుం వాలుస్తూ. ఆమె సమధానం చెప్పకుండా లోపలికి వెళ్ళిపోయింది.

షుగర్ సంగతిని ఆమె జ్ఞాపకం చేయడంతో ఆ రోజు తను తిన్న తీపి పదార్థాలన్నీ జ్ఞాపకానికి వచ్చాయి. రవ్వలడ్డు అంటే రావుగారి తల్లిగారికి చాలా ఇష్టమేమో, ఒకటికి నాలుగుసార్లు వడ్డించారు. చివరగా అరటిపండు ఒకటి.

“ఇదిగో, ఆ షుగర్ మాత్తర్లు రెండు తీసుకురా, ఆ చేత్తోనే మంచి నీళ్ళు కూడా” అన్నాడు విశ్వనాథం.

“ఏమిటి? మళ్ళీ స్వీట్లుగానీ తిన్నారా?” అంది మందులు నీళ్ళు అందిస్తూ.

“తప్పలేదే… తద్దినంలో భోక్తగా కూచున్నాక బాగా తినకపోతే వాళ్ళకి తృప్తి వుండదు. మళ్ళీ పిలిచి చావరు” అన్నాడు సంజాయిషీగా. రెండు మాత్రలు వేసుకోని నీళ్ళు తాగి చెంబు ఆమె చేతిలో పెట్టాడు.

“ఆరోగ్యం జాగ్రత్త. మిమ్మల్ని నమ్ముకోని ఇక్కడో రెండు బతుకులు వున్నాయి. మర్చిపోకండి” అంటూ వంటింట్లోకి నడిచిందామె.
“ఏమౌతుంది. ఇవాళ చస్తే రేపటికి రెండు” అన్నాడతను మళ్ళీ మంచం మీదకు ఒరుగుతూ.

“ఛ.. ఆపండా పాడు మాటలు. అసురసంధ్య వేళ…” ఆమె ఇంకేదో అనబోతుంటే విశ్వనాథం సెల్ ఫోన్ మోగింది.

ఫోన్ తీసి చూశాడు. ఫోన్ పైన అద్దం పగిలిపోయి వుండటంతో ఎవరో తెలియలేదు. అరిగిపోయిన బటన్ ని బలంగా నొక్కి “హలో” అన్నాడు. ఓ నిమిషం మాట్లాడి పెట్టేశాడు.

“రేపటికి వాహకుడి అవతారం. గాంధీనగర్ లో ఎవరో పోయార్ట” అన్నాడు క్లుప్తంగా.

ఆమె ఆయన వైపు ఓ క్షణం చూసి వెళ్ళిపోయింది. ఆ చూపులోనే కాస్త నిరసన, ఇంకాస్త నిరాశ వున్నాయన్న సంగతి విశ్వనాథానికి అర్థం అయ్యింది. అయినా మారు చెప్పలేదు. మంచం మీద మళ్ళీ పడుకున్నాడు కానీ నిద్ర పట్టలేదు. కడుపులో ఏదో వికారంగా వుంది. వేళకాని వేళ భోజనం. అది కూడా మామూలుగా తినేదానికన్నా ఎక్కువ తినడం. నాలుగు కూరలు, నాలుగు పచ్చళ్లు, గారెలు, రవ్వలడ్డు – ఒకప్పుడు మూడు వాయల గారెలు తినేవాడు. భోక్త అంటే ఇలా తినాలని చెప్పుకునేవారు. అలా తింటాడన్న కారణంతోనే ఇప్పటికీ పిలుస్తుంటారు. అందుకే అంతలా తినడం తప్పడంలేదు. వయసు మీద పడుతుండటంతో కొంచెం కష్టంగా వుంటోంది. కళ్ళు మూసుకోని పడుకున్నాడు. మళ్ళీ తెల్లతాచు కల వస్తుందేమోనని భయం భయంగా వున్నాడు.

పక్కనే గడప దగ్గర చాప పరుచుకోని పార్వతి పడుకుందన్న సంగతి విశ్వనాథానికి అర్థం అవుతూనే వుంది. ఆమె ఏమీ తినలేదని కూడా తెలుసు. ఒక పూట మానేస్తే ఇంకో పూటకు వుంటుందని ఆమె అనుకుంటోందనీ తెలుసు. అడిగితే పక్కింట్లో సరోజనమ్మ ఎక్కడో వంట చేసి వస్తూ గారెలు, భక్ష్యాలు తెస్తే తిన్నాని చెప్తుందనీ తెలుసు. అన్నీ తెలిసి అడగటం ఎందుకని నిద్ర నటిస్తూ ఊరుకున్నాడు విశ్వానాథం. ఆయన నిద్ర నిజం కాదనీ, అతని మనసులో ఆలోచనలు తిరుగుతుంటాయనీ ఆమెకు తెలుసు. అందుకే ఆమె మాట్లాడదు.

“అమ్మా ఆకలేస్తోందే” శేఖరం వాళ్ళమ్మతో అనడం వినపడింది.

“ష్..! ఈ రోజు నాన్నగారు లేస్తారు సంభావన తెచ్చుంటారు. రేపు పొంగలి చేసిపెడతా. సరేనా” పార్వతి మాటలు వినపడుతుండగా విశ్వనాథం కల్లోని తెల్లతాచు అతని మీద నుంచి జారి కిందపడింది.

“లక్ష్మీగారింట్లో నందికేశుల నోముకి వెళ్తానంటే వద్దన్నావు. ఆ ఉండ్రాళ్లైనా తిని వచ్చేవాణ్ణి”

తెల్లతాచు శేఖరం వైపు పాకడం తెలిసినా కదలలేక వుండిపోయాడు విశ్వనాథం. భుజం మీద తెల్లతాచు కాటు వేసిన చోట నుంచి రక్తం స్రవిస్తోంది.

**** (*) ****

 

మొదటి ముద్రణ: తానా తెలుగు పలుకు 2017