కథ

వీ ఆర్ లైక్ ఫ్రెండ్స్

జనవరి 2016

అంకుర్

మొదటిసారి అలా అనిపించగానే భయం వేసింది.

నేను వాళ్ళింటికి వెళ్ళిన తరువాత చాలాసేపు రష్మీ గురించే మాట్లాడిందావిడ.

“పేరుకే కూతురు. వీ ఆర్ లైక్ ఫ్రెండ్స్” అంటుంటుంది ఎప్పుడూ. “ఎలా వుందో ఏమిటో మలేషియాలో” అని కూడా అంటూ వుంది. అప్పటికి రష్మీ మలేషియా వెళ్ళి రెండు రోజులే అయింది.

కొద్దిసేపటి తరువాత నా కళ్ళముందు వున్న మాధవి స్థానంలో రష్మీ కనపడటం మొదలైంది. అప్పుడే భయం వేసింది.

నాలుగు నెలల క్రితం రష్మీ ఇంటికి రమ్మని చాలా బలవంతం చేసింది. అప్పటికి మేము ప్రపోజ్ చేసుకోని వారం కూడా కాలేదు. అంత త్వరగా ఇంట్లో వాళ్ళకి తెలియడం ఎందుకు అంటే – “నువ్వు ప్రపోజ్ చేసిన రోజే మమ్మీకి చెప్పాను” అంది.

ఆఫీస్ అయిపోగానే ఇంటికి వెళ్ళాము. మొదటిసారి మాధవిని చూసింది అప్పుడే. ఆవిడే తలుపుతీసింది.

“ఓ మై గాడ్… వచ్చేశారా!! నేను ఇంకా రెడీ అవలేదు. జస్ట్ ఫైవ్ మినిట్స్” అంటూ బెడ్ రూమ్ వైపు పరుగెత్తింది. వెళ్తూనే – “బేటా… అంకుర్ కోసం పాన్ కేక్స్ చేశాను. పెడుతూ వుండు వచ్చేస్తా..” అంటూ కూతురికి చెప్పేసి లోపలికి వెళ్ళిపోయింది.

పాన్ కేక్స్ నాకిష్టమని రష్మీనే చెప్పి వుంటుంది అనుకున్నాను. హడావిడిలో గమనించలేదు కానీ ఆమె వేసుకున్న షర్ట్ రష్మీది. నేను సింగపూర్ నుండి తెచ్చిన గిఫ్ట్.

ఆ తరువాత ఇలాంటివి చాలా సార్లు గమనించాను. రష్మీ వస్తువులు చాలా వరకు ఆమె కూడా వాడేస్తుంటుందట. అడిగితే “నేను కూడా మమ్మీవి వాడుతుంటాను. వీ ఆర్ లైక్ ఫ్రెండ్స్ యూ నో” అంది రష్మి.

అంత వరకు ఫర్లేదు. ఫేస్ బుక్ లో రష్మీకి ఫ్రెండ్ అయిపోతే రెండు రోజుల్లో మాధవి నుంచి ఫ్రెండ్ రిక్వెస్ట్ వస్తుందట. కొలీగ్ చెప్పాడు. రష్మీ ఫ్రెండ్స్ అందరూ ఆమెకు తెలుసు. కలిసినప్పుడు చొరవగా నిక్ నేమ్ తో పిలుస్తుంది. నేను కలిసినప్పుడు నీ ఎక్స్ జయ ఎలా వుంది? అని అడిగేసింది. రష్మీతో కలిసి పబ్ కి వస్తుంది, మూవీకి వస్తుంది, మాల్ కి వస్తుంది. వాళ్ళిద్దరూ ఎప్పుడూ కలిసే తిరుగుతారు.

ఇంతకీ ఇప్పుడేమైందంటే– రష్మీ మలేషియా వెళ్ళిన రెండు రోజులకి మాధవి ఫోన్ చేసింది.

“బేటా, చిన్నారి లేదు కదా బోర్ కొట్టేస్తోంది. వీకెండ్ ఖాళీగా వుంటే ఇంటికి రావచ్చు కదా” అంది. నేను వెళ్ళాను.

ఆమె సోఫాలో కూర్చోని మాట్లాడుతోంది. నేను దీవాన్ పైన వున్నాను. అదిగో అప్పుడే నాకు మాధవి స్థానంలో రష్మీ కనపడటం మొదలైంది. లోపల ఎక్కడో భయం కూడా!

మాధవి

రష్మీ నాకు చెప్పకుండా ఏమీ చెయ్యదు. అసలు చెప్పకుండా వుండలేదు. ఇప్పుడు కాదు. చిన్నప్పటి నుంచీ అంతే. స్కూల్లో జరిగిన ప్రతి విషయం నాకు చెప్పాల్సిందే. లేకపోతే దానికి నిద్రపట్టదు.

అంకుర్ గురించి కూడా నాకు ముందే చెప్పింది. “ఈ మధ్య నన్నే చూస్తున్నాడు” అంది ఒకరోజు. నేను మొదట కొంచెం భయపడ్డాను కానీ అదంతా సహజమే కదా అనుకున్నాను. “ఐ థింక్ ఐ యామ్ ఆల్సో లైకింగ్ హిమ్” అన్నప్పుడు మాత్రం పార్టీ చేసుకున్నాం.

అతను గిఫ్ట్ లు ఇచ్చాడు. ఒక డ్రెస్ ఇచ్చాడు, పర్ఫ్యూమ్, ఇంకా ఒక హేండ్ మేడ్ పేపర్ తో చేసిన డైరీ. అన్నీ నా టేస్ట్ కి తగ్గట్టే వున్నాయి. అవున్లే నాదీ రష్మీది ఒకటే టేస్ట్ కదా.

ఇద్దరం కలిసి షాపింగ్ కి వెళ్తామా? ఇద్దరికీ ఒకటే నచ్చుతుంది. కొనేసి ఇద్దరం వాడేస్తాం. అసలు మా ఇద్దరిని వేరు వేరుగా షాప్ లోకి పంపించి చూడండి. ఇద్దరం ఒకటే కొనుక్కోని బయటికి వస్తాం. మేము తల్లీ కూతుర్లం అంటే ఎవరూ నమ్మరు. వీ ఆర్ లైక్ ఫ్రెండ్స్. అందుకే తనతో కలిసి పార్టీలకి వెళ్తాను. నాకు తెలియని రష్మీ ఫ్రెండ్స్ ఎవరూ లేరు. అందరినీ పరిచయం చేస్తుంది. నేను కూడా వాళ్ళతో కలిసిపోతాను. దే లైక్ మీ ఆల్సో.

ఎక్కడో మొదలుపెట్టి ఎక్కడికో వెళ్ళిపోయాను. ఇంతకీ ఏం చెప్తున్నాను? ఆ గుర్తొచ్చింది. అంకుర్ గురించి. చాలా బాగుంటాడు. చాలా మంచివాడు. రష్మీకి ఎలాంటి వాడు కావాలనుకున్నానో సరిగ్గా అలాంటి వాడే దొరికాడు.
అతను ఆ రోజు ప్రపోజ్ చేస్తాడని రష్మీకి ముందే తెలిసిపోయింది. నిజం చెప్పాలంటే నాక్కూడా తెలిసిపోయింది. వాళ్ళ మధ్య జరిగిన ప్రతి విషయం రష్మీ నాకు చెప్పేస్తుంది కదా. అలాగన్నమాట! ఈవినింగ్ అతను కాఫీకి పిల్చినప్పుడు రెస్టారెంట్ పేరు మెసేజ్ చేసింది రష్మీ. అతను ప్రపోజ్ చేస్తున్నప్పుడు నేను వాళ్ళ వెనకాల రెండు టేబుల్స్ అవతల వున్నాను. ష్! ఈ విషయం అతనికి చెప్పకండి. అతనికి తెలియకూడదని నేనూ, రష్మీ అనుకున్నాము.

ఆ తరువాత అతన్ని ఇంటికి తీసుకొచ్చింది. అతనికి ఇష్టమని పాన్ కేక్స్ చేశాను. ఆ తరువాత అతను కూడా మాతో కలిసిపోయాడు. వీ త్రీ ఆర్ లైక్ ఫ్రెండ్స్ నౌ!

రష్మీ ఆన్ సైట్ అసైన్మెంట్ అని మలేషియా వెళ్ళింది. అంతకు ముందు కంబోడియా వెళ్ళినప్పుడు నేను కూడా తనతో వెళ్ళాను. ఈసారి వద్దంది. రెండు రోజులకే పిచ్చి పట్టినట్లు అయిపోయింది. అంకుర్ కి ఫోన్ చేశాను. వచ్చాడు. ఎన్ని కబుర్లు చెప్పుకున్నామో! ఉన్నట్టుండి అతను నా వైపు అలాగే చూస్తూ వుండిపోయాడు. ఆ తరువాత అన్నాడు –
“ఆంటీ, నాకు మీరు కనపడట్లేదు. మీ ప్లేస్ లో రష్మీ కనపడుతోంది” అని.

రష్మీ

అంకుర్ ఫోన్ చేశాడు.

“మీ ఇంట్లోనే వున్నాను. జస్ట్ కేమ్ అవుట్ ఫర్ ఫ్యాగ్” అని ఆ తరువాత జరిగిందంతా చెప్పాడు. అతను మాట్లాడినంత సేపు మమ్మీ దగ్గర్నుంచి ఫోన్ వస్తూనే వుంది.

మమ్మీ అని అనాలి కాబట్టి అనటమే కానీ మేము ఎప్పుడూ అమ్మా కూతురు లాగా వున్నది లేదు. నేను ప్రతి విషయం మమ్మీకి చెప్పేస్తాను. చెప్పకపోతే ఆమె ఒప్పుకోదు. ఈ రోజు చెప్పిన విషయాలన్నీ గుర్తుపెట్టుకోని రేపు అడుగుతుంది. ఇప్పుడు కాదు చిన్నప్పటి నుంచి అంతే. నాకు కూడా అలవాటైపోయింది. ఫ్రెండ్స్ లాగే మాట్లాడుకుంటాం. ఫ్రెండ్స్ దగ్గర కూడా ఫ్రీగా చెప్పలేని విషయాలు మమ్మీ దగ్గర దాచకుండా చెప్పేస్తాను. ఈ విషయం నా ఫ్రెండ్స్ అందరికీ తెలుసు. నా ఫేస్ బుక్ లో నా ఫ్రెండ్స్ అందరికీ ఆమె కామన్ ఫ్రెండ్. ఆమె వుందని ఎవరూ కాన్షియస్ గా వుండరు. ఫేస్ బుక్ లో ఎలా వుండాలో అలాగే వుంటారు.

అంకుర్ చెప్పిన తరువాత ఇవన్నీ ఆలోచిస్తే అతను చెప్పింది నిజమే అనిపించింది.

అంకుర్ ని మొదటిసారి చూసిన దగ్గర్నుంచి ప్రతి చిన్న విషయం ఆమెతో చెప్తూనే వున్నాను. అతని హెయిర్ స్టైల్ నుంచి షర్ట్ కలర్స్ దాకా! ఇంకా చెప్పాలంటే షీ నోస్ హిమ్ బిఫోర్ షి మెట్ హిమ్. కానీ ఎందుకు చెప్పావు అని అడిగాడు అంకుర్.

“ఎందుకు చెప్పాను అంటే! చెప్పకుండా వుండలేను కాబట్టి. చెప్పకపోతే మమ్మీ అడుగుతుంది కాబట్టి.” అన్నాను.

“ఆమె అడిగి అడిగి నీకు అలవాటు చేసింది. అదేదో కన్సర్న్ తో చేసింది కాదు. అంత కన్నా వేరే ఆప్షన్ లేక” అన్నాడు అంకుర్.

“వాట్ డూ యూ మీన్?” కొంచెం కోపం వచ్చింది.

“సీ, ఆమెకి వేరే జీవితం అంటూ లేదు. నువ్వే ఆమె లైఫ్. ఇంకా చెప్పాలంటే, షీ ఈజ్ ఆక్చువల్లీ లివింగ్ యువర్ లైఫ్. నీలో తనని తాను చూసుకోని, నీ జీవితంలోనే సంతోషాన్ని వెతుక్కుంటోంది. నీ బట్టలు ఆమె వేసుకుంటుంది, నీ ఫ్రెండ్స్ తో ఫ్రెండ్షిప్ చేస్తుంది. నీ జాబ్ గురించి ఆలోచిస్తుంది. ఆమె మాట్లేడేది నీ గురించి. ఆలోచించేది నీ గురించి. అన్నింటికి నువ్వు, నువ్వు, నువ్వు. ఇలా ఎంత కాలం నీ లైఫ్ లో బతుకుతుంది? ఆమె ఎక్కడుంది? మాధవి ఎక్కడ తప్పిపోయింది?” అంకుర్ మాటలు మళ్ళీ మళ్ళీ గుర్తొచ్చాయి.

మమ్మీ ఇంకా కాల్ చేస్తూనే వుంది.

**** (*) ****