కథ

అద్భుతాల్రావు వాచి

జూలై 2016

మొదటిసారి జూబ్లీహిల్స్ చెక్ పోస్ట్ దగ్గర కనిపించాడతను.

నీ కోసం ఒక ఉద్యోగం వుంది చేస్తావా? అనడిగాడు. ఏం వుద్యోగం అంటే సంబరంగా చెప్పాడు – నక్షత్రాలు వెదజల్లే ఉద్యోగమని.

నీకేమైనా పిచ్చి పట్టిందా? అన్నాడు నాన్న. రిటైర్డ్ లెక్చరర్ ఆఫ్ కామర్స్ అండ్ ఎకనామిక్స్. ఊరూ పేరూ లేని ఓ కాలేజిలో. అలాంటి ఉద్యోగం ఒకటి వుందంటే నేను నమ్మను. నువ్వూ నమ్మకు అన్జెప్పాడు.

అప్పట్నించి నేను చెక్ పోస్ట్ తప్పించుకోని మెహదీపట్నం మీదుగా పోతున్నా.

ఒకసారి రోడ్ నెంబర్ టెన్ దగ్గర కూడా కనిపించాడు. వస్తానంటే చెప్పు. నిన్ను ఆల్రెడీ షార్ట్ లిస్ట్ చేసేశారు. అంటూ నా బైక్ కి అడ్డంగా నిలబడ్డాడు. నీ కోసం ఏం తెచ్చానో చూడు అంటూ సంచిలో నుంచి ఒక వాచి తీసి ఇచ్చాడు. అద్భుతాల్రావు చేశాడిది అన్నాడు నా చేతికి తొడుగుతూ.

ఆఫీసులో అందరూ అడగటమే. ఎక్కడిదీ వాచి? ఎక్కడి నుంచి వచ్చింది?

అద్బుతాల రావు. చెప్పాను నేను. ఆ రావుగారిని మాకు కూడా పరిచయం చెయ్యమని ఒకటే గొడవ.

అంతకన్నా పెద్ద గొడవ పోస్ట్ లంచ్ మొదలైంది. చాలామంది కూర్చుంటున్న కుర్చీలు తీయించి చెక్కబల్లలు వేయించారు. నాకు కూడా ఒక బల్ల వేశారు. అవి వేసిన మొదట్లో బాగానే వుండేవి కానీ తర్వాతర్వాత తెలిసింది. అవి చెదలు పట్టేసి వున్నాయని. చేతికి వున్న వాచ్ లో టైమ్ చూసుకున్నా. బ్యాడ్ టైమ్.

నాన్నా! బాల్కనీ బయట గబ్బిలాలు తిరుగుతున్నాయి నాన్నా అన్నాడు చిన్నాడు. కర్టన్లు వేసేశాను. కానీ ఏదో భయం. ఏదో ఒకటి చెయ్యాలి. ఎలా?

మరో వారం అతని కోసం వెతికాను. కనపడలేదు. ఫిలిమ్ నగర్ లో కూడా వెతికా. అందరూ నటీనటులే తప్ప అతను మాత్రం కనపడలేదు. వెతుకుతూనే వున్నా.

ఈ లోపల నాకు ఒక ఆర్డర్ వచ్చింది. మూడువందల నలభై రెండు గులాబిరంగు కాగితాలు ఇండెంట్ చెయ్యమని. వెండర్ ఎవరు? పర్ కాగితం ఎంతౌతుంది? కాగితం చేతికి ఇస్తే ఇంపాక్ట్ ఏంటి? ఇళ్ళకి కొరియర్ చేస్తే ఇంపాక్ట్ ఏమిటి? బోర్డ్ రూమ్ లో, మీటింగ్ రూముల్లో ఆఖరికి ట్రైనింగ్ రూమ్ లో కూడా మీటింగులే మీటింగులు.

వాచి వైపు చూసుకున్నా. అది పని చెయ్యడం మానేస్తానని ముద్దుగా చెప్పింది. గిరగిరా తిప్పాను. హ్యాంగోవర్ వదిలేట్టు టపటపా రెండుసార్లు కొట్టాను. ముందు కుయ్యో ముయ్యో అంది కానీ నడవటం మొదలుపెట్టింది.

అలా నడుచుకుంటూ నా ఎక్స్ బాస్ దగ్గరకు వెళ్ళింది. జరిగింది జరుగుతున్నది జరగబోయేది. మూడుకాలాలలో వాచి నడిచింది. అయ్యో అన్నాడతను. సీవీ పంపించు అన్నాడు. ఆ తరువాత కాలేజ్ క్లాస్ మేట్స్. అందరికీ కలిపి ఒకేసారి మూకుమ్ముడిగా వాట్సప్ లో – గైస్, నీడ్ హెల్ప్ అంటూ ప్రకటించింది.

పోనీ నేను మా కాలేజీలో ఎవరితోనైనా మాట్లాడనా అని నాన్న ఏదో చెప్పబోతుంటే ఒప్పుకోలేదు. సరే నీ ఇష్టం అన్నాడాయన. అవును నా ఇష్టం అనుకున్నాను నేను.

వాచీ కొంచెం ఫాస్ట్ గా నడవటం మొదలుపెట్టింది. క్రమంగా ఊపందుకుంటోంది. గులాబిరంగు గుబాళింపులు మొదలైయ్యాయి.

తార్నాక దగ్గర ఒక ఇరానీ కేఫ్ లో మళ్ళీ కలిశాడతను అనుకోకుండా.

జేడీ వుందా?

జేడీ వుందా కాదు. జేడీ వున్నాడా అని అడగాలి. నేనే జేడి. జీవన్ ధరమ్.

అదికాదు బాసూ. డిజిగ్నేషన్ ఏంటి? ఏం ఉద్యోగం? పని ఏం చెయ్యాలి? ఇవన్నీ.

డిజిగ్నేషన్ స్టార్ వెదజల్లర్. రిపోర్టింగ్ టు యువర్ సెల్ఫ్. ఇంక పని అంటే చాలా వుంది. నా కన్నా మా దోస్త్ అద్భుతాల్రావు బాగా చెప్తాడు. కాకపోతే ఆయనిప్పుడు మబ్బుల మీద వున్నాడు. లాతూర్ లో వర్షం కురిపించాలని వెళ్ళాడు.

అయితే స్కైప్ ఇంటర్వ్యూ చేస్తారా? అని అడిగితే మా దగ్గర స్కైప్ లేదు. స్కై వుంది అని నవ్వాడు. ఆ తరువాత చాలాసేపు మాట్లాడలేదు. కప్పులో వున్న టీ రెండు సిప్పుల్లో లాగేసి – నేనే చెప్తాను విను అన్నాడు.

సాయంత్రం అవగానే పని మొదలౌతుంది. సంచి నిండా నక్షత్రాలను ఇస్తారు నీకు – ఎవ్రీ డే. వెలుతురు తగ్గిపోతుండగా బయల్దేరాలి. చీకటి పడనీకుండా ఆపాలి. నక్షత్రాలను తీసి ఆకాశం మొత్తం చల్లాలి. అంటే మరీ పిచ్చి పిచ్చిగా చల్లడం కాదు. కాస్త ఆర్టిస్టిగ్గా కొంచెం కొంచెంగా పేర్చాలి. అయినా చీకటి పడే లోపల అయిపోవాలి. కొన్ని పాత నక్షత్రాలు ఆకాశానికి అతుక్కోమని మొరాయిస్తాయి. వాటిని వదిలేయాలి. జుయ్ మంటూ రాలిపోతూ వుంటాయి. రాలిపోయే వాటిని చూసుకోడానికి ఇంకొకళ్ళు వుంటార్లే. అతను నీకే రిపోర్టింగ్. ఇంతే పని.

ఏం చెప్పాలో అర్థం కాలేదు నాకు. మరి గ్రోత్ ప్రాస్పెక్ట్స్? అడిగాను నసుగుతూ.

మా దగ్గర చాలా పోస్ట్ లు వున్నాయి. అన్నీ పర్మనెంట్ జాబ్సే. మూన్ రైజర్, సన్ పుల్లర్, క్లౌడ్ బ్లోయర్. ప్రమోషన్ వస్తే వీటిల్లో ఏ పోస్ట్ కైనా వెళ్ళచ్చు. అన్నింటికన్నా పెద్ద డిపార్ట్మెంట్ ఒకటుంది. రెయిన్ బో అరెంజ్మెంట్ గ్రూప్. సెవన్ సెవన్స్ ఫార్టీనైన్ ప్లస్ ఒక హెడ్. యాభై మంది పనిచేస్తున్నారు అక్కడ. అక్కడికి కూడా వెళ్ళచ్చు. వేకెన్సీ వస్తే.

నేను ఏ సమాధానం చెప్పలేదు. అతను నా వైపే చూస్తూ వుండిపోయాడు. ఒక్క ఫోన్ చేసుకుంటానని ఇంటికి ఫోన్ చేశాను. ఏదో ఒకటిలేరా అన్నాడు నాన్న. పగటిపూట షాపింగ్ బాగానే వుంటుందని కూతురంది. జీతం కనుక్కోవటం మర్చిపోవద్దని గుర్తుచేసింది బెటర్ హాఫ్.

ఈ జాబ్ నచ్చిందా లేదా చెప్పు. అయినా చూడు – ప్రజల జీవితాలలో వెలుగులు నింపే ఉద్యోగం. రోజూ రాత్రి డాబా మీద పడుకునేవాళ్ళకి ఆనందాన్ని ఇచ్చే ఉద్యోగం. దారి కనపడని వారికి తోడుగా వుండే వుద్యోగం. భూమి మీద కాదు. ఆకాశంలో ఉద్యోగం. చెప్పు చేస్తావా?

నేను నా చేతికి వున్న వాచ్ వైపు చూసుకున్నాను. గుడ్ టైమ్.

సంతకం పెట్టాను.

కానీ ఆ వాచ్ ఆయనిచ్చిందే అని మర్చిపోయాను. అన్నట్టు మా ఆవిడేదో అడగమంది. మర్చిపోయా.

**** (*) ****