అనువాద కథ

పాతకోటు

మార్చి 2017

డైరెక్టర్ క్యూ పాడిపంటల బ్యూరో డైరెక్టర్ గా రిటైరై వెళ్ళిపోతున్న రోజు అతని కొలీగ్స్ చాలా బాధపడ్డారు. కొంతమంది అధికారులైతే ఆయన వెళ్ళిపోడాన్ని చూడలేమంటూ కన్నీళ్ళు పెట్టుకున్నారు. ఆయనకున్న పేరు అలాంటిది. తన పనేదో తను చేసుకునే రకం. నిజాయితీపరుడు, అజాతశత్రువు, మర్యాదస్థుడు అని అందరూ ఆయన గురించి అనేవారు. పైగా అతను డైరెక్టరుగా పని చేసినంత కాలం బ్యూరోలో అవినీతి జరగలేదనే పేరుండటంతో అందరూ ఆయన్ని చాలా గౌరవంగా చూసేవారు.

డెప్యూటీ ఛీఫ్ గా మొదలై డైరెక్టరు అయ్యేదాకా అన్ని దశాబ్దాల సర్వీసులో ఆయనకు అంత మంచి పేరు రావడానికి, ఆయన వేసుకునే దుస్తులు ఒక ముఖ్యమైన కారణం. బాగా మురికిపట్టి, మరకలు పడిన బట్టలు వేసుకునేవాడు. ఎప్పుడో విప్లవం కాలం నాటి షూస్, పైన ఆర్మీ వాళ్ళు వేసుకునే తరహా పాత కాటన్ కోటు వేసుకునేవాడు. ఆ కోటు మీద పడ్డ చిరుగులును కుట్టగా ఏర్పడ్డ దారాలు ఒక మ్యాప్ లా కనిపించేవి. ఆయన వాడుతూ వుండిన సైకిల్ ఒక శతాబ్దం కిందటి దానిలాగా కనిపించేది.

డిపార్ట్మెంట్ లో పెద్దపెద్ద వాళ్ళు, మరో డైరెక్టర్ ఫెంగ్, డెప్యూటీ డైరెక్టర్లు అందరూ కలిసి ఆయనకు ఒక వీడ్కోలు సభ ఏర్పాటు చేశారు. డైరెక్టర్ ఫెంగ్ ఒక ప్యాకెట్ తెచ్చి ఇచ్చి చెప్పాడు – “డైరెక్టర్ క్యూ, నీతో పనిచేసే డైరెక్టర్లమంతా కలిసి నీ కోసం ఒక సూట్, ఒక జత లెదర్ షూస్, టై కొనుక్కొచ్చాము. రేపట్ననుంచి ఆ మురికి బట్టలు వేసుకోడానికి వీల్లేదంతే! మనం బతుకుతున్నది ఇరవై ఒకటో శతాబ్దంలో. ఇంకా కూలీ వెధవల్లాగా బట్టలు వేసుకుంటానంటే ఎలా చెప్పు?” అన్నాడు.

డైరెక్టర్ క్యూ బలవంతంగా నవ్వాడు.

“ఇవి విప్లవం కాలం నాటి బట్టలు. కొన్ని దశాబ్దాలుగా విప్లవందుస్తులనే ధరిస్తూ వస్తున్నాను. ఇప్పుడు మార్చుకోవాలంటేనే ఏదో ఇదిగా వుంది” అన్నాడు.

“భలేవాడివే క్యూ, నువ్వు ఇంత కాలం కష్టపడి పని చేశావు. ఇన్నేళ్లుగా ఎంతో నిరాడంబరంగా ఉంటూ వచ్చావు. మనస్ఫూర్తిగా ప్రజలకి సేవ చేశావు. ఇప్పుడెలాగూ రిటైర్ అవుతున్నావు కాబట్టి, ఇకనైనా నీ ఇమేజ్ మార్చుకోవాలి” అంటూనే కంట్రీ డెప్యూటీ డైరెక్టర్ డింగ్ –

“అన్నట్లు నువ్వు వాడే సైకిల్ వుందే, అది మ్యూజియంలో వుండాల్సింది. అందుకే కొత్త సైకిల్ కూడా కొన్నాం” అన్నాడు.

“ఇవన్నీ మార్చేస్తే నేను నేనే కాకుండా పోతానేమో” అని ఖంగారు పడ్డాడు క్యూ.

మర్నాడు మరో ఫేర్వెల్ పార్టీ జరిగింది. ఈ పార్టీ నిర్వహించింది పాడిపంటల బ్యూరో డెప్యూటీ డైరెక్టర్. అతను ఉద్యోగంలో చేరిన కొత్తలో డైరెక్టర్ క్యూ నుండే ట్రైనింగ్ ను పొందాడు. ఆ పార్టీ కోసమని డైరెక్టర్ క్యూ తాను ఎప్పుడూ వేసుకునే వెలిసిపోయిన బట్టలు, మాసికలు పడ్డ కాటన్ కోట్ వదిలేసి, ముందు రోజు డైరెక్టర్లు బహుమతిగా ఇచ్చిన బట్టలు వేసుకున్నాడు. సహజంగానే ఒక కొత్త కళ వచ్చింది. చూడటానికి కొత్త మనిషిలా వున్నాడు. ఆయన స్థానంలోకి రాబోతున్న డైరెక్టర్ గుయ్, క్యూను చూసి ఆశ్చర్యపోయాడు.

“మీ కింద పని చేసిన వాళ్ళంతా కలిసి మీకు బహుమతిగా ఇవ్వాలని కొత్త కోట్ కొన్నారు. మీరు ఈ పార్టీ కోసం మీ పురాతనమైన కోటుని వదిలేస్తారని మేము అసలు ఊహించలేకపోయాము” అన్నాడాయన.

“నా అంతట నేనే మార్చుకున్నానని అనుకుంటున్నారా? నాతో పని చేసిన డైరెక్టర్లందరూ కలిసి నాకు ఈ బట్టలిచ్చారు. ఇన్నేళ్ళుగా విప్లవంతో అనుబంధం వున్న వాణ్ణి. అందుకే అవే బట్టలు ప్రతిరోజూ వేసుకుంటూ వచ్చాను. ఇప్పుడింక రిటైర్ అవుతున్నాను కాబట్టి అలాగే వుండటానికి వీల్లేదట. నా భార్య కూడా ఇదే మాట అంది. నిన్న రాత్రి ఇంటికి వెళ్ళగానే నా బట్టలు తీసి పడేసింది. ఈ కొత్త బట్టలనే కట్టుకోమని ఇచ్చింది” అన్నాడు క్యూ కొంత బాధ ధ్వనిస్తున్న గొంతుతో.

“ఇక ఆ పాత జాకెట్, బట్టలు తీసి అవతల పారేయాలి మీరు. ఏదో ఒకరోజు ఏదైనా మ్యూజియం వాళ్ళు విప్లవం గురించి బోధించాలనుకున్నప్పుడు వాటిని తీసుకోని పురావస్తు ప్రదర్శనలో పెడతార్లెండి. ఆదర్శవంతుడైన పార్టీమెంబరుగా, మచ్చలేని బ్యూరో డైరెక్టర్ గా మీ ఖ్యాతిని  ముందుతరాలకు చూపించాల్సిన అవసరం ఎంతైనా వుంది మరి” అన్నాడు డెప్యూటీ డైరెక్టర్ హువా వెటకారంగా.

“ఏమిటో రాత్రికి రాత్రే మొత్తం మారిపోయింది. రేపు నేను చనిపోయి పై లోకాలలో వున్న మార్క్స్ నో ఛైర్మెన్ మావోనో కలిస్తే ఏమని సమాధానం చెప్పాలో ఏమిటో” అంటూ బాధపడ్డాడు డైరెక్టర్ క్యూ.

ఆనవాయితీ ప్రకారం క్యూ గౌరవార్థం అతని సబార్డినేట్స్ అందరూ  ఆయనకు శుభకామనలు చెప్పి మందు తాగారు. ఇల్లు చేరేసరికి మత్తులో జోగుతూ వున్నాడు క్యూ. అతను కాస్త కుదుటపడతాడని అతని భార్య టీ చేసి ఇచ్చింది. ఇంకో జత బట్టలు కూడా వచ్చాయని తెలుసుకోని చాలా సంతోషించింది. కాస్త తేరుకున్నాక చుట్టూ చూశాడు డైరెక్టర్ క్యూ. ఇల్లంతా చక్కగా సర్ది అమర్చిపెట్టి వుంది. పాత బట్టలు, షూస్ ఎక్కడా వున్న జాడ లేదు.

“నా పాత బట్టలు, పుస్తకాలు కనపడటంలేదు. ఏమయ్యాయి?” అంటూ అరిచాడు.

“రిటైర్ అయ్యారు కదా. ఇంకా ఆ చింకి బట్టలు ఎందుకు చెప్పండి. మనకేమన్నా డబ్బులకు కొదవా? కొనుక్కోలేమా? అందుకే మీరు మధ్యాహ్నం అటు వెళ్ళగానే పాత వస్తువులన్నీ అమ్మేశాను. ఇరవై యెన్లు వచ్చాయి తెలుసా?” అంది ఆ అమాయకురాలు. ఆ దెబ్బకి క్యూ మత్తు మొత్తం ఎగిరిపోయింది.

“ఏమిటీ? ఆ పాత కోట్ కూడా అమ్మేశావా?” అడిగాడతను వణుకుతున్న గొంతుతో.

“అవును. ఇంకా ఆ పాత గుడ్డలు ఏం చేసుకుంటాం చెప్పండి? ఖంగారు పడకండి. మీ సర్టిఫికెట్లు, అవార్డులు మాత్రం తీసిపెట్టాన్లెండి” అంటూ సమాధానం ఇచ్చింది ఆవిడ.

“సర్వనాశనం అయిపోయిందే…” అని అరుస్తూ కింద కూలబడ్డాడు డైరెక్టర్ క్యూ. “లక్షల యెన్లు ఇంతలోనే మాయమైపోయాయా” అంటూ అరవసాగాడు.

“లక్షల యెన్లేమిటండీ?” ఆమెకు అర్థం కాలేదు.

“ఆ కాటన్ జాకెట్లో రెండు లక్షలకి తక్కువ కాకుండా డబ్బు వుందే” నీరసంగా పలికాడతను.

“రెండు లక్షల యెన్లా? మీ దగ్గర అంత డబ్బు ఎక్కడిది? నెల నెలా జీతం మొత్తం నా చేతికే ఇస్తున్నారు కదా. మీకు మందు ఎక్కువైనట్లుంది. అందుకే తిక్కతిక్కగా మాట్లాడుతున్నారు” నమ్మకం లేదన్న విషయాన్ని నవ్వుతూ ప్రకటించిందామె.

“నాకేం ఎక్కువ కాలేదు. మొత్తం దిగిపోయింది. ఆ కోట్లో నా పై సంపాదన అంతా దాచుకున్నాను. ఎవరైనా ఇచ్చినవి, తప్పు లెక్కలు వేసి నేను మిగుల్చుకున్నది. అంతా కలిపి రెండు లక్షలకు పైనే. ఇంటి దగ్గర పెడదామంటే దొంగల భయం. బ్యాంకులో వేద్దామంటే అదేం సక్రమమైన సంపాదన కాదు కదా!” బలహీనంగా అన్నాడు.

“నయాపైసా లంచం తీసుకోరని మీకు పేరుంది కదా. రెండు లక్షలు ఎవరిస్తారు? అసలు ఎందుకిస్తారు?” అడిగిందామె అనుమానంగా.

“ఓసి మొద్దు. గుర్రాలు వంకరగా పరుగెత్తినా బండి ముందుకే పోతుంది. పాడుపడిన పాత గుళ్ళో వుండే స్వామీజీనే ఎక్కువ సంపాదిస్తాడు. నీకు ఇంకా అర్థమవలేదా?” అతని గొంతులో బాధ, కోపం కలగలిసి వినిపిస్తున్నాయి. “నా ముతక బట్టలు నేను నిజాయితీపరుడిననీ, విధేయుడైన గవర్నమెంట్ ఉద్యోగినని నమ్మించడానికే. ఇంత చేస్తే చివరికి ఒకే దెబ్బలో అంతా పోయింది. నాతో ఒక్క మాట చెప్పి వుండచ్చు కదా” అంటూ భోరుమన్నాడు.

ఆమె కూడా గుండెలు బాదుకోని, కాళ్ళని నేల మీద కొడుతూ – “ఇన్నేళ్ళు ఇన్ని తెలివితేటలు ప్రదర్శించి, ఈ ఒక్కసారి మీ బుద్ది ఎందుకు గడ్డి తిన్నది?” అంటూ ఏడవసాగింది.

***

చైనా మూలం: జెంగ్ రెన్కువాన్

తెలుగు అనువాదం: అరిపిరాల సత్యప్రసాద్

**** (*) ****