నేను ఈ కథ చెప్పను.
చెప్పకూడదు.
చెప్పట్లేదు కూడా. మీరు కూడా వినకండి. చదవకండి.
అయినా చెప్పేడానికేముంది? ఇలాంటివి మీరు ఎన్నో చూసుంటారు. మీ చుట్టుపక్కలే జరుగుతుండచ్చు కూడా. మీకే జరుగుతుండచ్చు. కాకపోతే నాకు అనుభవంలోకి వచ్చింది కాబట్టి నేను ఆశ్చర్యపోయాను. నోరు కట్టేసుకోవాలని అనుకున్నా నా వల్ల కావటం లేదు.
అయినా చెప్పకూడదు. చెప్పాలని వుంది కాని చెప్పను. మీరు కూడా చదవకండి. ప్లీజ్.
నేను వద్దన్నా చదువుతున్నారు మీరు. నేను కూడా చెప్పకూడదని అనుకుంటూనే చెప్పేస్తున్నాను. వద్దండి. ఒకళ్ళ సంగతి మనకెందుకు చెప్పండి. ఇక ఇక్కడి నుంచి చదవటం ఆపేయండి. సరేనా?
వినరన్నమాట. సరే. ఎలాగూ చదువుతున్నారు కాబట్టి చెప్తాను వినండి. నేను ఊహించినదాంట్లో తప్పే ఉ౦దో ఒప్పే ఉ౦దో మీకే తెలుస్తుంది.
ఆ పాప పేరు.. వద్దులెండి పేరెందుకు. పాప అనే అనుకోండి. చిన్నదే – యల్కేజి. నాకు అప్పటికింకా ప్రమోషన్ రాలేదు. నర్సరీ పిల్లలకి టీచర్ గా వున్నాను. మొదటిసారి ఆ పాపని చూసినప్పుడు భలే అనిపించింది. అసలు చిన్నపిల్లలా బిహేవ్ చేసేదే కాదు. ఏం పద్ధతి! ఏం శుభ్రత! మాటల్లో కూడా ఎంతో స్పష్టత? భలే ఆశ్చర్యం వేసింది. మొదట్లో నేను ఇంటికి వచ్చాక మా ఆయనకి పిల్లలకి ప్రతి రోజూ చెప్పేదాన్ని. మా పిల్లల సంగతే చెప్పాలి ఇక. ఇంటి నిండా బొమ్మలు పడేయటం. అటూ ఇటూ పరుగులు. అరిచినట్లు మాట్లాడటం. అయినదానికి కానిదానికి అలకలు, చాక్లెట్ లంచాలు. చచ్చిపోతుంటాను. ఆ పాప అలా కాదు. అసలు ఆ లక్షణమే లేదు. అమ్మో ఎంత పద్ధతోనండి.
స్కూల్ కి వస్తుందా. బ్యాగ్ నీట్ గా టేబుల్ మీద పెడుతుంది. పుస్తకాలు తీస్తే మొదటి రోజు కొత్తగా అట్టలేస్తే ఎలా వున్నాయో అలాగే వుంటాయి. చెక్కు చెదరకుండా. నెక్స్ట్ పిరియడ్ ఏ క్లాస్ వుంటే ఆ క్లాస్ పుస్తకాలు తీసి పెట్టుకుంటుంది. పక్కన పెన్సిల్ ఇరేజర్ సెట్ చేసినట్లు పెడుతుంది. క్లాసుల మధ్యలో లేవటం, మిగతా పిల్లల్లాగా కిటికీ దగ్గరకు వెళ్ళి బయటకి చూడటం, బోర్డ్ మీద ఏదో రాయటం ఇలాంటివేవి వుండవు. అసలు మిగతావాళ్ళతో ఆడుకోవటం కూడా చూడలేదు నేను. ఎక్కువగా మాట్లాడటం కూడా చూడలేదు. నిజం చెప్పాలంటే ఎవరో ఇంటర్మీడియట్ చదువుతున్న పిల్ల యూకేజిలో కూర్చున్నట్లుగా వుండేది బిహేవియర్. ఏదో అంటారు… యా… మెచ్యూరిటీ. చాలా ఎక్కువ ఆ పిల్లకి.
ఏదో చెప్దామని మొదలుపెట్టి ఏదేదో వాగేస్తున్నాను. అందుకే చెప్పనన్నాను. మీరు కూడా ఇక్కడిదాకా చదివేసారు. ఇంక చాలు. నన్నేమీ అడక్కండి. మీరు ఇంకేమీ చదవకండి. ఇంక చెప్పడానికి కూడా ఏం లేదు. నిజం.
ఇంకేం లేదన్నాను కదా? ఇంకా ఎందుకు చదువుతున్నారు.
సరే. మీ మొండిపట్టు మీదే. కానివ్వండి.
ఆ పిల్ల… అదే ఆ యల్కేజి పిల్ల ఏడవడం కూడా చూళ్ళేదు నేను. అహ! కాదు కాదు ఒకసారి ఏడ్చింది లెండి. తరువాత సంవత్సరం. పాప క్లాస్ కి నేనే క్లాస్ టీచర్ని అయ్యాను. ఒక మూడు నెలల తరువాత పేరెంట్ టీచర్ మీటింగ్ ఆ రోజు. శనివారం. మధ్యాహ్నం పిల్లల స్కూల్ మూడున్నరకి అయిపోతుందని ఆ టైమ్ కి మీటింగ్ అని చెప్పాం. సాయంత్రం నాలుగున్నర దాకా వెయిట్ చేశా. అందరి పేరెంట్స్ వచ్చారు కానీ ఈ పాప పేరెంట్స్ రాలేదు.
“మీ పేరెంట్స్ వస్తారా? నువ్వు చెప్పావా ఈ రోజు పీటీయే అని” అని అడిగాను. పాప చెప్పానని తలాడించింది.
“డాడీ వస్తారా?” అంటే తల అడ్డంగా ఊపి తల దించుకుంది.
“మమ్మీ?” – “వస్తుంది” అని వెళ్ళి బెంచి మీద కూర్చోని ముందుకు వంగి డెస్క్ మీద చేతులు చుట్టుకోని వాటి మీద తల పెట్టుకుంది.
దగ్గరగా వెళ్తే కానీ ఆ పాప ఏడుస్తోందని తెలియలేదు నాకు. ఎందుకు ఏడుస్తోందో అర్థం కాలేదు. అందరి పిల్లల పేరంట్స్ వచ్చారు కానీ తన పేరెంట్స్ ఇంకా రాలేదని ఫీల్ అయ్యిందేమో. పిల్లలన్న తరువాత మిగతా పిల్లలతో కంపేర్ చేసుకోవడం మామూలే కదండి. పైగా ఆ రోజు సెకండ్ సాటర్డే కావటం వల్లేమో దాదాపు అందరి పిల్లల ఫాదర్ మదర్ ఇద్దరూ వచ్చారు. చాలా మంది పిల్లలు పీటీయే తరువాత ఇటు నుంచి ఇటే సినిమాకి వెళ్తాం అనీ, మెక్ డీ కి వెళ్తామని చెప్పుకోవడం కూడా విన్నాను నేను. ఇవన్నీ విని కంపేర్ చేసుకుందేమో. పాపం. సముదాయించే సరికి కాస్త తేరుకుంది. చెప్పానుగా చాలా మెచ్యూర్డ్ బిహేవియర్.
వాళ్ళ అమ్మ వచ్చింది. పాప చాలా ఫార్మల్ గా నిలబడి గుడ్ ఈవినింగ్ మమ్మీ అంది తప్ప మిగతా పిల్లల్లా పరుగెత్తుకుంటూ వచ్చి కాళ్ళను చుట్టేసుకోలేదు. చాలా డిసిప్లిన్డ్. అదీ పదం. ఇందాకట్నుంచి చెప్పాలనుకున్నది అదే. ఎంత డిసిప్లిన్డ్ గా వుంటుందో ఆ పిల్ల.
డిసిప్లిన్డ్ అంటే గుర్తొచ్చింది. వాళ్ళమ్మ కూడా అలాగే వుంటుంది. ఏ రోజూ డైరీలో సైన్ చెయ్యడం మర్చిపోదు. పాపని టైమ్ కి దించేస్తుంది. మళ్ళీ తీసుకెళ్ళేటప్పుడు కూడా అంతే. టైమ్ అంటే టైమ్. ఊరికే వచ్చి టీచర్లతో మాట్లాడటం కానీ, మిగతా పేరెంట్స్ తో కబుర్లు చెప్పడం కానీ చెయ్యదు. తల్లి పోలికే అయ్యింటుంది అనుకున్నాను. మరి అంత డిసిప్లిన్డ్ గా ఉ౦డే ఆమె ఆ రోజు పీటియేకి లేటుగా రావటమేంటి?
“లేటైనట్లుంది మేడం” అన్నాను నేను ఆమె రాగానే.
“సారీ అండీ, నిద్రపోయాను. టైమ్ తెలియలేదు” అందామె నా ఎదురుగా కూర్చుంటూ. ఆమె ముఖం చూస్తేనే అర్థం అవుతోంది. జుట్టంతా రేగిపోయి. కళ్ళంతా ఉబ్బిపోయి. నాలుగైదు గంటలు నిద్రన్నాపోయి వుండాలి, నాలుగైదు గంటలు ఏడ్చన్నా వుండాలి. ఏదీ కళ్ళలోకి చూడనిస్తే కదా తెలిసేది. తల దించుకొనే వుంది.
గబగబా టేబుల్ మీద వున్న ప్రోగ్రస్ రిపోర్ట్ తీసుకోని చూసింది. నా చేతిలో వున్న పెన్ను “ప్లీజ్” అంటూ లాగేసుకుని బరబరా సంతకం పెట్టేసి తిరిగి ఇచ్చేసింది.
“మీరు ఇంటికి తీసుకెళ్ళచ్చు మేడం. మండే పంపించండి” అన్నాను నేను అప్పటికీ.
“అవసరం లేదు లెండి. చూశానుగా” అంటూ లేవబోయింది. అప్పుడు గమనించాను ఆమె చేతి మీద కాలిన గాయం కనపడుతోంది.
“మేడమ్ చేతికి ఇంజూరీ వున్నట్లుంది” అన్నాను నేను.
“యా. పొద్దున కుకింగ్ చేస్తుంటే… ఆయిల్.. యు నో… హాట్ ఆయిల్” అంటూ చున్నీ కిందకి చేతిని పోనిచ్చింది. ఆమె ఆ మాటలు చెప్తుంటే చూశాను ఆమె ముఖంలోకి. ఆమె నవ్వింది. నవ్వాలని ప్రయత్నించింది. నవ్వలేకపోయింది. అంత వరకే నాకు అర్థం అయ్యింది.
పాప పరుగెత్తుకుంటూ వచ్చి వాళ్ళమ్మ పక్కన నిలబడింది. చున్నిలో నుంచి చేతి వైపు చూసి తల ఎత్తి వాళ్ళ అమ్మ ముఖంలొకి చూసింది. పాప కంట్లో నుంచి కన్నీళ్ళు కారుతున్నాయి. ఆమె లేచి పాప చేతిని గట్టిగా పట్టుకొని లాక్కెళ్ళిపోయింది. వెళ్తుంటే ఆమె వీపు మీద చూశాను.
ఎర్రగా…
ఓహ్ మై గాడ్! మీరు ఇంకా చదువుతున్నారా?
ఎందుకు చదువుతున్నారు? ఏం చదవాలనుకుంటున్నారు? వద్దు వద్దు అని చెప్పానా? ఎందుకు నాతో ఈ విషయం మాట్లాడించారు అసలు. తల్చుకుంటే ఏడుపు తన్నుకొస్తుంది నాకు. ప్లీజ్. నేను చెప్పింది ఎక్కడా చెప్పకండి. ఈ విషయం ఎవరికీ తెలియకూడదనే నేను చెప్పను, చెప్పను అన్నాను. చెప్పకుండా వుండలేక చెప్పాను. నా మాట వినండి. ఎందుకు అని అడక్కండి. ఈ విషయం ఎవరి దగ్గరా అనకండి. అసలు నేను ఈ సంగతి మీకు చెప్పానని తెలిస్తే ఇంకేమన్నా వుందా? తల్చుకుంటేనే భయం వేస్తోంది.
**** (*) ****
వద్దనుకుంటూనే మొత్తం చదివేశా. చదివి తప్పే చేశా. ఎందుకో గానీ కాల్చిన ఎర్రటి మరక దగ్గరే ఆగాలనిపించలేదు ఇంకాస్త దూరం నడిచాను. నడుస్తున్న కొద్దీ ఆ గాయం పెద్దదౌతూ నాతోనే వస్తుంది. ఇప్పుడు నాముందే చెరువంత గాయం. గాయంలోకి దూకి ఆ అమ్మనూ, పాపనూ కాపాడలేనప్పుడు ఎందుకు చదివానో.
మీరింకా బాగా రాయొచ్చు
Very good narration .. hence, readability.. is there Sir.. I would like to read your other stories also.
ధన్యవాదాలు భారధ్వాజగారు. కింద ఇచ్చిన లింకులో వాకిలిలో నేను రాసిన కథలు అన్నీ వున్నాయి.
http://tinyurl.com/zt4s6d9