తలుపు మీద దబదబమని చప్పుడైంది. ఉలిక్కిపడి లేచాడు లవ్. కళ్ళు పూర్తిగా తెరిపిడి పడలేదు. మళ్ళీ దబదబమని చప్పుడైంది. రెండు క్షణాలు అలాగే వుండిపోయాడు. తరువాత అర్థమైంది. ఆ రోజు ఆదివారమనీ, తాను తొమ్మిదైనా ఇంకా నిద్రపోతూనే వున్నాడనీ.
ఆ తలుపు కొడుతోంది తన అత్తగారేనని కూడా అతనికి తెలుసు. వెళ్లి బెడ్ రూమ్ తలుపు తీసాడు.
“క్యా హై మాజీ?” అన్నాడు కళ్ళు నలుపుకుంటూ.
అతనికి తెలుగు అర్థం కాదు. ఆమెకు తెలుగు తప్ప వేరే భాష రాదు. “టిఫిన్… టిఫిన్… రెడీ..” అంది చేత్తో తింటున్నట్లు అభినయిస్తూ. నిజానికి ఆమె మాట్లాడిన రెండు పదాలు ఇంగ్లీషు పదాలే కాబట్టి అతనికి అర్థం అవుతుంది. కానీ ఆమెకు అతనితో మాట్లాడటం అంటే సైగలు చెయ్యడమే అని మనసులో స్థిరపడిపోయింది.
“అభీ??” అన్నాడతను ఆశ్చర్యంగా “సండే… సండే… నో ఆఫీస్…” అంటూ సైగలు చేశాడు.
ఆమె గోడ మీద వున్న గడియారం వైపు వేలు చూపించి, అదే వేలిని బెడ్ రూమ్ లో వున్న మంచం వైపు చూపించి, చేతులు రెండు కుడి చెవి కింద పెట్టి, నిద్రపోతున్నట్లు నటించి “నహీ… నహీ..” అంటూ చెప్పింది. అతను విసుగ్గా చూశాడు. ఆమె తనతో చెప్పడానికి పడుతున్న ఇబ్బందిని గమనించి చిన్నగా నవ్వాడు.
“ఠీక్ హై… ఆతా హూ” బ్రష్ చేస్తున్నట్లు అభినయించి, బెడ్ రూమ్ లోకి నడిచాడు. ఆమె తలాడించి హాల్లోకి వచ్చింది.
టీవీలో భక్తి ఛానల్ నడుస్తోంది. తెల్లవారుఝామునే లేచి సంధ్యావందనం చెయ్యాలి అని చెప్తున్నారు. ఆ ఛానల్ అల్లుడు వచ్చేదాకే అని ఆమెకు తెలుసు. అతను వచ్చాక ఏవేవో ఛానల్స్ తిప్పుతుంటాడు. హిందీ పాటలు పెడతాడు, బిజినెస్ న్యూస్ వింటాడు, ఒకోసారి వంటల కార్యక్రమాలు చూస్తుంటాడు. నాన్ వెజ్ వంటలు. అలాగని ఆమెకి అతనితో పెద్ద ఇబ్బందేమీ లేదు.
“మాజీ..?” అని ప్రశ్నార్థకంగా పిలిచి రిమోట్ అందిస్తాడు. ఆమె చెయ్యి అడ్డంగా ఊపి, నువ్వే చూడు అన్నట్లు సైగ చేస్తుంది. ఇద్దరూ చిరునవ్వు నవ్వుకుంటారు. అతను టీవీలో పడిపోతాడు. ఆమె వంటలో మునిగిపోతుంది.
అతనితో ఆమెకు వున్న చిక్కల్లా అతని పేరే.
“లవ్ టాండన్” అని కూతురు చెప్పినప్పుడు “అదేం పేరే? మేమంతా ఎలా పిలవాలి” అంది. కూతురు నవ్వేసి ఊరుకుంది. ఆ పేరు వల్లే ప్రేమ పుట్టిందేమో మరి. గుర్గావ్ లో ఉద్యోగం చేస్తున్నప్పుడు కొలీగ్ ట.
ఆలోచనలు ఆపి మళ్ళీ బెడ్ రూమ్ వైపు చూసింది. అతను ఇంకా బయటికి రాలేదు. ఆమె నిట్టూర్చి, సోఫా మీద బలమంతా పెట్టి పైకి లేచింది. మోకాళ్ళ నొప్పులు వచ్చాక సోఫాలో కూర్చోవటం లేవటం కష్టంగా వుంటోంది.
ఎప్పటికప్పుడు సోఫాలో కూర్చోకూడదు అనుకుంటూనే వుంటుంది కానీ మర్చిపోతుంటుంది.
మళ్ళీ తలుపు కొట్టింది. ఆమె అనుకున్నది నిజమే. అతను మళ్ళీ పడుకున్నాడు. చిరాగ్గా వచ్చి తలుపు తీసాడు.
“పాంచ్ మినిట్ మాజీ” అన్నాడు కుడి చేతివేళ్ళను చూపిస్తూ. ఆమె మళ్ళీ టిఫిన్ తినమన్నట్లు సైగలు చేసింది. టిఫిన్ చల్లారిపోతుంది అని చెప్పాలనుకుంది కానీ ఎలా సైగలు చెయ్యాలో అర్థం కాలేదు.”ఓకే.. ఓకే” అన్నాడతను.
***
ఆమె హాల్లోకి వెళ్ళిపోయిన తరువాత తన బెడ్ వైపు చూసి, అపురూపమైనదేదో కోల్పోయినట్లు, చిరాకు పడుతూ బాత్ రూమ్ లోకి వెళ్ళాడు. “ఈ విషయం గౌతమితో మాట్లాడాలి” అనుకున్నాడు. “పాపం రాత్రంతా డ్యూటీ చేసి వస్తుంది. నాతో మాట్లాడే తీరికే వుండదు.” అని కూడా అనుకున్నాడు.
గౌతమిని ప్రేమించినప్పుడు రోజుల్లో భాష పెద్ద అడ్డంకిలా అనిపించలేదు అతనికి. ఇప్పుడు కూడా వాళ్ళిద్దరూ ఇంగ్లీషులో, హిందీలో మాట్లాడుకుంటారు. తను తెలుగు నేర్చుకోవాలని చాలాసార్లు అనుకున్నాడు కానీ కుదర్లేదు.
‘మాజీ’తోనే సమస్య. గౌతమికి నైట్ షిప్ట్ మొదలైన తరువాత మాజీ ఇంట్లో వుంటే బాగుంటుందని అనుకున్నారు. అనుకున్నట్లే సొంత ఊరు వదిలి వచ్చి వుంటోంది.
తమకు సహాయంగా వచ్చి వుంటున్న మనిషితో కనీసం మాట్లాడలేకపోతున్నానన్న భావన అతనిలో వుంది. అయినా మాట్లాడటానికి అవకాశం ఎక్కడుందిలే అనుకున్నాడు. ఉదయం ఎనిమిదికి బయల్దేరితే రాత్రి పదికి తక్కువ కాదు. అతను బయల్దేరడానికి ఓ అరగంట ముందు గౌతమి వస్తుంది. కాబట్టి ఉదయం ఉన్న కాస్త టైమ్ గౌతమితోనే గడుపుతాడు. గౌతమికి శనివారం వీక్లీ ఆఫ్. మిగిలింది ఆదివారం.
తనకి ఆదివారం అపురూపం. ఇంతకు ముందు పన్నెండు దాకా నిద్రపోయేవాడు. లేచి, ఒకేసారి బ్రంచ్ చేసి టీవీలో ఏ సినిమానో, స్పోర్ట్సో చూస్తూ గడిపేసేవాడు. అత్తగారు వచ్చాక అదేమీ కుదరట్లేదు. ఆదివారమైనా ఏడూ ఎనిమిదింటికి లేపేస్తుంది. ఈ ఒక్క విషయంలో ఆమె అంటే అతనికి చిరాకు, కోపం. ఇది ఆమెకి చెప్పాలనుకున్నా చెప్పలేడు. గౌతమికి ఫోన్ చేసి ఈ సంగతి ఒకసారి చెప్పాలి. ఆదివారం పది దాకా లేపద్దని చెప్పించాలి అనుకున్నాడు.
మళ్ళీ బెడ్ రూమ్ తలుపు చప్పుడైంది. అప్పటికే లవ్ బ్రష్ చేసుకోవడం అయిపోయింది. ఆమె కాఫీ అందించింది. తెలుగు అమ్మాయిని పెళ్ళి చేసుకోవడంలో వున్న అతిపెద్ద లాభం ఉదయాన్ని దొరికే ఫిల్టర్ కాఫీ అని అతని నమ్మకం. ఆమె చేతిలో నుంచి అందుకోని “థాంక్యూ” అన్నాడు. ఆమె మోకాళ్ళ నొప్పులవల్ల వంగని కాళ్ళతో అటూ ఇటూ ఊగుతూ నడుస్తూ హాల్లోకి నడిచింది. అలా నొప్పులు పడుతూ వచ్చి కాఫీలు టిఫిన్లు అందించకపోతే ఏం? నేనే వచ్చి తీసుకుంటాను అని చెప్పాలని అతనికి అనిపించింది. కానీ ఎలా చెప్పాలో తెలియక ఊరుకున్నాడు.
కళ్ళు ఇంకా మగతగానే వున్నాయి. కాఫీ తాగితేకానీ నిద్ర మత్తు పూర్తిగా వదలదు అనుకోని ఒక సిప్ చేశాడు. బెడ్ మీద వున్న ఫోన్ అందుకోని గౌతమికి కాల్ చేస్తూ హాల్ లోకి, అక్కడ్నుంచి కామన్ బాల్కనీలోకి నడిచాడు.
“గుడ్ మార్నింగ్” అంది గౌతమి. “క్యా హో రహాహై యార్” అంది.
అతను చెప్పాడు.
“ఎందుకు ‘మాజీ’ ప్రతి ఆదివారం నా నిద్ర చెడగొడుతుంది?” అన్నది అతని ఆఖరు వాక్యం.
“నేను మాట్లాడతాను ఒకసారి అమ్మకు ఫోన్ ఇవ్వు” అంది గౌతమి.
అతను హాల్లో కి వచ్చి చూశాడు. ఆమె లేదు. టీవీ ఆపేసి వుంది. “మాజీ” అన్నాడు.
వంటింట్లో కూడా కనపడలేదు. మళ్ళీ హాల్లోకి నడుస్తూ కామన్ బాత్ రూమ్ తలుపు కొట్టాడు. సమాధానం లేదు. తలుపు తోస్తే తెరుచుకుంది. అతను ఆ బాత్ రూమ్ ఎప్పుడూ వాడింది లేదు. ఇండియన్ స్టైల్ అతనికి అలవాటు లేదు.
ఆమె బెడ్ రూమ్ లో చూశాడు. అక్కడ కూడా లేదు.
గౌతమి ఫోన్ లో “హలో హలో” అంటోంది. అతను విషయం చెప్పాడు.
“బాత్ రూమ్ లో వుందేమో” అంది.
“చూశాను, అక్కడ కూడా లేదు” అన్నాడతను.
“కామన్ కాదు… వెస్ట్రన్… మన బెడ్ రూమ్ లో” అంది.
అతను అక్కడికి నడిచాడు. నీళ్ళ చప్పుడు వినిపించింది.
“హై?”
“హా”
“బయటికి వచ్చాక ఫోన్ చెయ్యి” అంది.
“అవసరం లేదులే. ఇంక ఆ విషయం ఆమెతో మాట్లాడకు.. నాకు అర్థం అయ్యింది” అన్నాడతను హిందీలో.
**** (*) ****
Painting Credit: Diana Ong
మన్నించాలి అర్ధం కావటం లేదు, చాల సార్లు చదవాలేమో
కథ బాగుందండీ , పెద్ద వయసు వాళ్లకి ఏర్పడే ఒక సమస్య గురించి సున్నితంగా చర్చించారు .
ఆలోచింపజేసే విభిన్నమైన కథ ఇది. ఆదివారం అల్లుడిని పొద్దున్నే లేపడానికి కారణం, ఆ కారణానికి కారణం తెలియాలంటే కథను రెండుసార్లు చదవాల్సి రావచ్చు కొందరికి. కథలోని subtlety నాకు నచ్చింది.
బావుందండి . పెద్ద వాళ్ళయ్యాక వచ్చే ఇబ్బంది చాలా సున్నితంగా కథని చెప్పేశారు . .
ఏవేవో ఊహిస్తూ వచ్చాను. ముగింపు క్లుప్తంగా బావుంది. >>తమకు సహాయంగా వచ్చి వుంటున్న మనిషితో కనీసం మాట్లాడలేకపోతున్నానన్న భావన అతనిలో వుంది>> కుటుంబసభ్యులతో పంచుకోవలసిన విషయాలు ఎన్నో ఉంటాయి. భాష రాకపోవడమన్నది పెద్ద సమస్యే.
బావుంది. కథ ముగింపు చూసి రచయిత్రిగా ‘అరే’ అని నవ్వుకున్నాను… మనిషిని కూడా కనుక వెంటనే ఆ నవ్వు కాస్తా బాధగా మారిందనుకోండి. కథ పేరు కూడా బాగా కుదిరింది. సత్యప్రసాద్ గారికి అభినందనలు.