కథ

మాటల మధ్య ఖాళీలు

మే 2016

“ఎలక్ట్రీషియన్ మేడమ్. సాబ్ చెప్పారు” ఇంటర్ కామ్ లో వినపడింది.

“పైకిరా. సెవన్నాటూ”

జీవన్ ఈరోజు కూడా మర్చిపోతాడనుకున్నాను. ఫర్లేదు మూడు రోజుల తరువాతైనా గుర్తు పెట్టుకోని పంపించాడు.

ఏం చేస్తోందో మేడమ్. బెల్ కొట్టినా తీయట్లేదు. ఫోన్లో రమ్మనమని అందిగా!

తలుపు ధడాల్న తెరుచుకొని – “మేడమ్ నేను ఎలక్ట్రీషి…” మాటలు రావటం ఆగిపోయింది. ఆమే కదా! ఆమే. నన్ను గుర్తుపట్టిందా?

తలుపు తెరవగానే ఎదురుగా – వినయ్ కదూ అతను? గుర్తుకువచ్చిన ఒక్క క్షణంలోనే సంతోషం, ఉలికిపాటు.

“లోపలికిరా వినయ్” ఎలక్ట్రీషియన్ గా పని చేస్తున్నాడన్నమాట. అయినా వినయే దొరికాడా జీవన్ కి.

పేరు పెట్టి పిలిచిందంటే గుర్తుపట్టిందనేగా అర్థం. పాత విషయాలు మాట్లాడాలా వద్దా? “గీజర్ రిపేర్ అని చెప్పారు”

“అవును. మాస్టర్ బెడ్ రూమ్ లో” వెనక్కి తిరిగి మాస్టర్ బెడ్ రూమ్ వైపు నడుస్తుంటే పదిహేడేళ్ళ క్రితం ఇలాగే తన వెనుకే అతను కూడా నడుచుకుంటూ బెడ్ రూమ్ లోకి వచ్చిన జ్ఞాపకం. వెనక నుంచి ఏం చూస్తున్నాడో.
పక్కకి జరిగి అతన్నే ముందు పంపిస్తే?

ఇల్లు పెద్దదే. ఈ గేటెడ్ కమ్యూనిటీలో అందరూ బాగా ఉన్నవాళ్ళేగా. ఎప్పుడో ఇంటర్మీడియట్లో ఆఖరుసారి కలిసిన మధ్యతరగతి అమ్మాయి కాదన్నమాట. వాళ్ళాయన బాగానే సంపాదిస్తున్నట్లున్నాడు.

ఇల్లంతా చూస్తాడేమిటి? పోనీలే. ఇప్పుడు నా హోదా అర్థం అయితే పాత విషయాలను దూరంగా పెడతాడు. ఇప్పుడు పలకరించచ్చు. “ఎలా వున్నావు వినయ్? ఎలక్ట్రీషియన్ అయ్యావన్నమాట”

“అవును భావనా. మీరు బాగున్నారా?” మీరు అని ఎందుకు అన్నాను? అప్పటి చనువు ఏమైందో. అయినా ఆమె గొంతులో నా పని పట్ల ఏమాత్రం గౌరవం ఉన్నట్లు లేదు. అందుకేనేమో మీరు అన్నాను.

“నాకేం. చూస్తున్నావుగా. ఆయనకి రెండు కంపెనీలు వున్నాయి” వీడికి తెలియాలిలే. ఇంకా ఏం మాటలు మాట్లాడతాడో. “రిపేర్ సంగతి చూస్తావా?”

“పదండి” బెడ్ చూస్తుంటే ఆ రోజే గుర్తుకు వస్తోంది. అందమైన ఆహ్వానం. మొదటిసారి. తెలియనితనం. తెలుసుకోవాలన్న తొందరతనం.

తెలియనితనం అనుకోడానికి లేదులే. తెలిసే! కావాలనే! ఛీ ఛీ అవన్నీ ఇప్పుడెందుకులే. నేను బెడ్ రూమ్ లో పెళ్ళి ఫోటో పెట్టడం వెనుక ఆ సంఘటన తాలూక గిల్ట్ వుందా? ఏమోలే!

ఆమెకు గుర్తుందా? మర్చిపోయే విషయమేమీ కాదుగా. బాల్యం గోడ దూకి యవ్వనం రోడ్డు పైన అలుపు, అలసట తెలియకుండా పెట్టిన పరుగు. గుర్తుందా ఆమెకు?

“కవిత్వం ఇంకా రాస్తున్నావా?” బాగానే రాసేవాడు. అంత గొప్ప ఏం కాదులే కానీ వాటికే పడిపోయాను అప్పట్లో.

“రాయడానికి టైమ్ ఎక్కడ భావనా?” మోటివేషన్ కూడా లేదు. పదహారేళ్ళ వయసులో ఒక మిట్టమధ్యాహ్నం నా కవిత్వమంతా సొమ్మసిల్లి మూసుకున్న ఓ అమ్మాయి కళ్ళలో బందీ అయిపోయింది. ఇన్ని రోజుల తరువాత ఇప్పుడు మళ్ళీ అలాంటి వాక్యాలు వస్తున్నాయేమిటో.

అతన్ని చూడగానే నాకు గుర్తొచ్చినట్లు అతనికి కూడా అదే గుర్తుకువచ్చుంటుందా? ఏం చెయ్యాలో ఎలా చెయ్యాలో తెలియక… తాను చెప్తే వాడు నవ్వుతూ – ’దారి చూపిన దేవత’ అంటూ పాడుతూ! ఛీ ఛీ! పాడు! కానీ మొదటి అనుభవం కదా! ఓహ్! ఆ విషయం గురించి ఇప్పుడు వాడు మాట్లాడితే? ఎందుకు అలా నిలబడి వాణ్ణే చూస్తున్నాను? చూస్తే ఏమైందిలే?

“కాయిల్ కాలిపోయింది. ఆరొందలౌతుంది.”

“సరే” నిజం చెప్పు. వాడితో ఆ అనుభవం వర్సెస్ జీవన్ తో…! వాట్ ద హెల్. ఏమిటీ పాడు ఆలోచన? మళ్ళీ అవకాశం ఇస్తే వాడుకుంటాడా? ఎలక్ట్రీషియన్ వినయ్. అప్పుడు? అందరూ యూనిఫార్మ్ లో కనిపించే రోజుల్లో అందరిలోకి అందగాడు. ఎట్ లీస్ట్ నా కళ్ళకు.

ఏమిటలా బెడ్ మీద కూర్చోని నా వైపే చూస్తోంది. ఏం ఆలోచిస్తోందో. చూసీ చూడనట్లు నేను చూస్తున్న విషయం గమనిస్తోందా? ఏమనుకుంటోందో? పాత పుస్తకంలో నెమలీక అనుకుంటోందా, పగుళ్ళిచ్చిన సమాధిలో నుంచి మొలిచిన పిచ్చి మొక్క అనుకుంటోందా? ఫర్లేదు కవిత్వం మళ్ళీ మొదలుపెట్టచ్చు. మళ్ళీ కనపడిందిగా మరి.

“ఏంటి వినయ్ నీలో నువ్వే నవ్వుకుంటున్నావ్?” మొదటిసారి చేసిన తప్పులు మళ్ళీ గుర్తొచ్చాయా? మళ్ళీ తప్పు చెయ్యాలని అనిపించిందా? అసలు చేసిన పని తప్పు అని నీకెప్పుడైనా అనిపించిందా అని అడగాలని వుంది. నేను మొదట భయపడ్డాను. తరువాత మర్చిపోవాలని ప్రయత్నించాను. గుర్తుకొచ్చిన ప్రతిసారి నీ లాగే నవ్వుకున్నాను.

“ఏం లేదులే. కాయిల్ తెమ్మంటావా?”

ఎప్పుడూ పని మీదే ధ్యాస. పనే మారింది అప్పుడు ఇప్పుడు. నవ్వు ఆపుకోలేకపోతున్నాను. ఏమిటి దగ్గరగా వస్తున్నాడు. కొంపదీసి?

“ఏంటి?”

“ఏంటి?”

“కాయిల్ తెమ్మంటావా?”

“వద్దులే. ఎండాకాలమేగా. వర్షాలు పడ్డాక చూద్దాం” ఇంక వెళ్ళిపొమ్మని చెప్పాలా? చెప్పాలని అనిపించట్లేదు.

“వస్తాను మరి. నా నెంబర్ తీసుకో. ఏదైనా కావాలంటే ఫోన్ చెయ్యి.” నేను చెప్పిన మాటలో వేరే అర్థం అర్థం చేసుకుంటుందేమో.

“ఊ.. చెప్పు” ఫోన్ మోగింది. జీవన్. “హా జీవన్. వచ్చాడు. ఏదో కాయిల్ పోయిందట. ఆరొందలౌతుందంటే…” వెళ్ళిపోతున్నాడు. ఏమనుకున్నాడో. వెళ్ళడమే మంచిదిలే. లేనిపోని గొడవ.

నీతో ఒకటే చెప్పాలనుకున్నాను. ఆ రోజు మొదట భలే ఎంజాయ్ చేశాను. తరువాత అవకాశమున్నప్పుడల్లా నెమరు వేసుకోని మళ్ళీ మళ్ళీ అనుభవించాలని ప్రయత్నం చేశాను. గుర్తుకొచ్చిన ప్రతిసారి చాలా గిల్టీగా ఫీల్ అయ్యాను.

“వెళ్ళిపోయాడులే. వాడికి పెద్దగా పని వచ్చినట్లు లేదు. ఇంకెవరైనా వుంటే చూడు జీవన్”

మళ్ళీ కవిత్వం మొదలుపెట్టగలనా?

**** (*) ****