కథ

మిట్టూరు టు మెట్రో: ఐదు కథల మీదుగా

జనవరి 2017

“Imitation is the sincerest form of flattery that mediocrity can pay to greatness.” – Oscar Wilde

ఐదుగురు రచయితలను ప్రేమ కథ రాయమని అడిగారు. ఎవరు ఎలా రాస్తారో అని ఒక చిన్న ఊహ. ఒకరకంగా సాహిత్య మిమిక్రీ…

లవ్ యిన్ లివ్ యిన్

కుప్పిలి పద్మ

ర్షం మెల్లగా కురుస్తోంది. వో పక్క మార్గశిరమాసపు చల్లని శీతలగాలులు నైట్ క్వీన్ పరిమళాలను కలుపుకోని లోపలికి మత్తుని మోసుకొస్తుంటే మరో పక్కనుంచి వినిపిస్తున్న రఫీ పాటలు ఆ మత్తుని మధురంగా మారుస్తున్నాయి. మహి మనసు మాత్రం ఆ వాతావరణానికి వ్యతిరేకంగా వుంది. వొకప్పుడు ఆ నిలువెత్తు కిటికీ దగ్గర నిల్చుంటే ఆమెకు పన్నెండతస్తుల యెత్తు నుంచి పరుచుకోని కనిపించే మెట్రో చీకటి, ఆ చీకటి పైన నిలువుగా అడ్డంగా మెరుస్తూ తిరిగే కార్ల హెడలైట్లు భలే నచ్చేవి. యిప్పుడామె మనసంతా అలజడిగా వుంది. సడన్ గా ఆమె చూపు స్పోర్టీ రెడ్ కలర్ డస్టర్ మీద పడింది. అది అభిరణ్ కారేమో అనిపించింది.

ఆమెకి ఆ కార్ అంటే చాలా ఇష్టం. లోపల బ్లాక్ లెదర్ ఇంటీరియర్ తో హార్మోనియస్ గా వుంటుంది. అభిరణ్ కార్ డ్రైవ్ చేస్తుంటే అతని పక్కన ఫ్రంట్ సీట్లో కూర్చోవడం ఆమెకు ఇంకా ఇష్టం. ఫ్రెండ్స్ అందరితో కలిసి యెప్పుడైనా పబ్ కి వెళ్ళేటప్పుడు ఆ ముందు సీట్లో వేరే యెవరైనా కూర్చుంటే ఆమెకు వళ్ళుమంట. వొకసారి అలాగే జరిగితే వాళ్ళతో గొడవపెట్టేసుకుంది.

“యెలానోలా యెడ్జస్ట్ అవ్వాలి. యట్ లీస్ట్ ఫ్రండ్స్ దగ్గర” అన్నాడు అభిరణ్. యెడ్జస్ట్ అవడం కుదరదు అని చెప్పాలనిపించింది. అప్పుడే ఆమెకు అర్థం అయ్యింది వాళ్ళిద్దరి మధ్య వున్నది ఫ్రెండ్ షిప్ మాత్రమే కాదని.

మొదటిసారి అతన్ని కలిసినప్పుడు బంతిపువ్వు రంగు కాటన్ వరల్డ్ స్లిమ్ ఫిట్ కుర్తా వేసుకోని వున్నాడు. కింద ఆక్వా బ్లూ ఫేడెడ్ లివైస్ జీన్స్. భలే సిల్కీగా మెరుస్తూ, లేయర్స్ లేయర్స్ గా పెరిగిన వొత్తైన జుట్టు. వైశాఖమాసం వెన్నెలంత చల్లగా చూసే కళ్ళు. అతని ఆలోచనలు, పలకరింపులు గమ్మత్తుగా వుంటాయి. కాకపోతే అతనెందుకో మెయిన్ స్ట్రీమ్ లైఫ్ స్టైల్ కి భిన్నంగా వుంటాడు. శాంతినికేతన్ లో చదవటం వల్లో లేకపోతే హంపీలో గడిచిన అతని బాల్యం వల్లో. లివ్ ఇన్ అని డిసైడ్ అయినప్పుడు అభిరణ్ పెట్టిన కండీషన్స్ గుర్తుకొచ్చాయి.

“మనం కలిసి హాలిడేకి వెళ్ళం. నీతో కలిసి నేను షాపింగ్ కి రాను. సినిమాలు చూడను”.

తెల్లబోయింది. అందుకే యీ భయం.

ఫోన్ తీసుకోని వాళ్ళమ్మకి ఫోన్ చేసింది.

“మీరు యీ కాలంలో పుట్టిన పిల్లలమ్మా. అందుకే కాలానికి భిన్నంగా వుండటానికి యిష్టపడుతున్నారు. కానీ అలాంటి వాళ్ళకి వేదన తప్పదమ్మా. నీకు జీవితానుభవం లేదమ్మా. అందుకే యిలాంటివి గుర్తుపట్టలేకపోతున్నావు. నిర్ణయం ఏదైనా నేను సపోర్ట్ చేస్తాను. కానీ నువ్వు మనసుతోనే సాధన చెయ్యాలి. ప్రేమ నీకు దుఃఖాన్ని ఇచ్చినా ఆ ప్రేమనే వద్దనుకునేంత నిరాశావాదివి కాకూడదనే నేను కోరుకుంటాను. చూద్దాం ఈ ప్రయాణంలో యెలాంటి కొత్త ఆవిష్కరణలు జరుగుతాయో” అన్నదామె.

ఫోన్ పెట్టేసి అభిరణ్ కి కాల్ చేసింది. అతను ఫోన్ లిఫ్ట్ చెయ్యకముందే ఆమె కళ్ళు సీతాకోకచిలకల రెక్కల్లా రెపరెపలాడాయి.

***

చంగయ్య మకరాజు అంజిలి మకరాణి

నామిని

నిద్ర లేచిన అల్మేలు తలకాయ నెప్పి అని జెప్పి కాపీ బెట్టుకోని వూదుకొని సగించినట్టు తాగతా వుండింది. అప్పుడే మూతి మూరడు పొడుగు పెట్టుకోని, ముక్కుల గుండా కోపంతో సందిట్లావు గసను విడిస్తా వచ్చింది యెంగటమ్మ

“ఒసే దరిద్రప నా సవితి! ఎనుమును కొట్టంలో కట్టేసుకునేది తెలవదా? దాని మాదిగోళ్ళు దాన్ని కోసుకొని తిననానీ. నా కొట్టంలో కుడితి నీళ్ళను సగం తాగేసింది. దాని దొమ్మ రోగం వచ్చి దాన్ని ఎత్తుకు పోనానీ” అనింది యెంగటమ్మ

“నా ఎనుము యాడా లేనట్టి నీ కుడితే ఎందుకు తాగతదిమే! ఏదో మానస్తురాల్ని గాబట్టి ఊరుకుంటున్నా. మనలో మనకెందుకు జగడాలు” అనింది అల్మేలు.

“పరగడుపున్నే బొంకొద్దు. ఇట్టా కానీ గానీ మాటలు మాట్లాడినావంటే నీ ఇద్దురు బిడ్డలు నీ మొకాన వుండరు!” అని శాపం పెట్టింది ఎంగటమ్మ.

ఇంటి ముందు ఈ గంగ జాతర జరగతా వుంటే ఇంట్లో పండుకోనున్న చంగయ్య మేలుకున్నాడు. “పరగడుపున్నే ఇదేం రచ్చ?” అని కసుకున్నాడు. అల్మేలు అక్క కొడుకే చంగయ్య. తిరప్తి దేవస్తానంలో గార్డనులో నీళ్ళుబోసే ఎన్నెమ్మార్ పని. నెలకు జీతం తొమ్మిది నూర్లు. చేరి మూడు నెలలైంది. పిన్నమ్మని చూసేదానికి మిట్టూరొచ్చినాడు. ఈ రచ్చ ఇట్టా జరగతావుంటే తలగీరుకుంటా బయటికి వచ్చాడు చంగయ్య.

ఆ పక్కన యంగటమ్మ కూతురు అంజిలి చెంబులో పాలు పిండడం మొదలు బెట్టేసింది. లింగులింగుమని సైకిలు బెల్లు మొగించుకుంటా పాలాయన సహదేవరెడ్డి వచ్చి ఇంటి ముందు ఆగినాడు. “యెంగటేస్పర సామి స్నానమాడే పాలు. తేడారాకూడదు మే” అన్నాడు వస్తానే.

“ఏందన్నా! పాలల్లో ఏదన్నా మిస్టీకు గాన వుంటే, నీ ఎడం కాలి చెప్పుతో నా పాపిడి దీసి పదారు యేట్లు కొట్టు” అని బెట్టుగా మాట్లాడతా పాలు పోసింది అంజిలి. పక్కన ఇంట్లో జరుగుతున్న రచ్చ చూసి అక్కడికి ఎలబారింది.

వస్తానే ఇద్దరి మద్దెలోకి పోయి “ఏందమ్మా ఇది. పొద్దున్నే రచ్చ. పక్కపక్కనుండేటోళ్ళం. ఇందమ్మా తియ్యగూర అంటే ఇందమ్మా పుల్లగూర అనుకోవాలిగాని ఇట్టా రచ్చ చేసుకుంటే చుట్టూ పక్కా నువ్వులాడుకోరూ. ఇంగ గమ్మునుండండి” అని జెప్పింది. ఇదంతా చూశాడు చంగయ్య. ఆ యమ్మి మనేద చూసి బిత్తరపోయాడు. ఉత్తరందిక్కుకు మళ్ళుకోని తిరప్తి కొండకి దణ్ణంబెట్టి “ఇట్టాటి పిల్లే నాకు పెళ్ళాం కావాలని” అన్నాడు

ఆ తరువాత రెండు రోజులకు అల్మేలు కయ్యలో ఎండలో వొంటిగా పనిచేస్తా కుశాల మింద వుండినప్పుడు చంగయ్య ఆ మాటా ఈ మాటా మాట్లాడి ఆమెను లొంగేసుకుని “పిన్నమ్మా! నేను ఆ అంజిలిని ప్రేమిస్తన్నామా” అని ముదిగారంగా చెప్పాడు.

***

మెట్రో పబ్

మొహమ్మద్ ఖదీర్‌బాబు

బ్ అంతటి మీదా ఆమె పేరే రాసి ఉందా అని అనిపించింది. అందరూ చూస్తున్నారు. సిగ్గుగా అనిపించింది. గుండెలో దడగా కూడా.

అతను చెయ్యందించేదాకా లేవాలని అనిపించలేదు. చూసింది. ఫుల్ హ్యాండ్స్ ఇన్ చేసుకుని షూ వేసుకొని ఉన్నాడు. ఇట్స్ ఓకే అన్నాడు. అందించిన చెయ్యి వద్దనుకోని లేచి నిలబడింది. నవ్వుతున్నాడు.

వెధవ. జెడ్డి వెధవ. పైకి తిట్టుకుందా లోపల తిట్టుకుందా తెలియదు. అతను కిందపడిన హ్యాండ్ బ్యాగ్ అందిస్తే విసురుగా లాక్కోని గబగబా తన ఫ్రెండ్స్ వున్న టేబుల్ దగ్గరికి వచ్చింది. వాళ్ళంతా వస్తున్న నవ్వుని ఆపుకున్నట్లు ఉన్నారు.

వాటర్ బాటిల్ అందుకుంది. యాభై రూపాలు ఖరీదు చేసే నీళ్లు. ఇల్లు గుర్తొచ్చింది.

బావి ఉండేది. నీళ్ళు తియ్యగా ఉండేవి. కొబ్బరి చెట్లు ఉండేవి. తాగేన్ని నీళ్లు ఇచ్చేవి. అలాంటి నీళ్లు కొనుక్కుంటే తప్ప తాగలేని పరిస్థితి.

అతని వైపు చూసింది. నవ్వుతూనే వున్నాడు. అందరూ నవ్వుతున్నారు. ఎందుకో అందరి అటెన్షన్ ఆమె మీదే వున్నట్లు అనిపించింది. అన్నింటికీ అటెన్షన్. తాగితే అటెన్షన్. తాగకపోయినా అటెన్షన్. గట్టిగా మాట్లాడితే అటెన్షన్. మాట్లాడకపోయినా ఆటెన్షన్. తూలి పడితే… గుండె దడ ఇంకా తగ్గలేదు. ఆ భయం ఈ రాత్రికి దిగదు.

డ్రింక్ అండ్ డ్రైవ్ కి దొరక్కుండా పది లోపలే ఇల్లు చేరాలి అనుకుంది.

తాగిన తరువాత డాన్స్ చెయ్యకుండా వుండాల్సింది. అలవాటు లేని హై హీల్స్. పడిపోవడం గుర్తొచ్చి నవ్వుకుంది. మళ్ళీ అతని వైపు చూస్తే నవ్వుతూనే వున్నాడు. కన్నుకొట్టి ధమ్స్ అప్ చెప్పాడు.

అందరికీ బాయ్ చెప్పి ఇంటికి వచ్చేసింది.

షవర్ ఆన్ చేశాక నీళ్లు తల మీద పడుతుంటే మళ్ళీ గుర్తొచ్చాడు. స్నానం ముగించి నైటీ జార్చుకోని బయటకు వచ్చింది. ఎదురుగా బెడ్. సిక్స్ ఇంటూ సిక్స్ కింగ్ సైజ్ బెడ్ అది. అరవై వేలు పెట్టి కొన్నది. బాంటియాలో సింగిల్ పేమెంట్ తో ఇంటికి తెచ్చుకుంది.

ఫేస్ బుక్ లో పొద్దున పెట్టిన ఫోటోకి లైక్స్ ఏమైనా ఉన్నాయోమో చూద్దామని హ్యాండ్ బ్యాగ్ లో మొబైల్ తీయబోతుంటే విజిటింగ్ కార్డ్ కనపడింది. పబ్ లో బ్యాగ్ చేతికి ఇస్తూ కార్డ్ డ్రాప్ చేసినట్లున్నాడు.

కణతల దగ్గర నొప్పి. మెల్లగా మొదలై పెద్దగా అవుతూ.

కాల్ చేసి థాంక్స్ చెప్పాలా? వద్దా? పోనీ వాట్సప్ లో మెసేజ్ పెడితే.

నిర్ణయం తీసుకున్న తరువాత రిలీఫ్ గా అనిపించింది.

కాని ఒక్క నిమిషమే. మళ్ళీ భయం వేసింది.

పిడికిట్లో సెల్ నలుపుతూ కూచుని ఉంది.

***

డాక్టర్రాజుగారు

వంశీ

పొద్దుటే లేచిపోయే అలవాటున్న డాక్టర్రాజు ఆ రోజు కూడా అలాగే లేచి పొయ్యి దగ్గరకెళ్లి వెలుబూడిద కచ్చికా, తాటాకూ, చెంబుడు నీళ్లి పట్టుకొని లంకని ఆనుకున్న గట్టేంటా ముందుకెళ్ళాడు.

ఆ తరువాతెప్పటికో టీ తాగుదామనిపించి గోదారి గట్టుకి కుడిపక్కననున్న వంతెన దగ్గర్లో వుండే ఆవుల సాంబమూర్తి హోటల్ కి వెళ్ళి టీ చెప్పాడు. అక్కడికి కొంచెం అవతల మూడడుగులు మాత్రం పెరిగిన చిన్ని తాడిచెట్టు మొదలు నరికి మొవ్వుని తీస్తున్నాడు పాలికాపు చీకట్ల మందయ్య. ఓ గూటిపడవ లంక ఒడ్డుకొచ్చి ఆగింది. దాంట్లోంచి దిగిన పెన్మత్స చినవెంకట్రాజు గారి రెండో భార్య మొదటి కూతురు దేవిని చూసి నోటమాట లేని డాక్టర్రాజుగారు నిలబడుండిపోయాడలా.

ఆకుల సాంబమూర్తికి టీ డబ్బులు ఇవ్వాలన్న సంగతి కూడా మర్చిపోయి అదే టీ గ్లాసు చేతిలో పట్టుకోనే దేవి వెనకే నడుచుకుంటా ముందుకెళ్ళిపోయాడా మనిషి. రాజుగారి పాత మేడ దాటి వందేళ్ళ చరిత్రగల జనార్థనస్వామి గుడి మీదుగా వెళ్ళిందామ్మాయి. ఆ తరువాత మళ్ళీ కనిపించలేదు.

ఆయన అసలుపేరు సాగి సూర్యనారాయణరాజైనా ఊర్లో వాళ్ళంతా డాక్టర్రాజనే అంటారు. ద్వారపూడి బట్టలసంతలో కొనుక్కున్న గళ్ళ లుంగి, ఖద్దరు చొక్కా వేస్తాడు. ఎప్పుడన్నా మల్లవరం వెళ్ళినప్పుడో కోటిపల్లెకెళ్ళినప్పుడు ఒక బ్రాందీ సీసా తెచ్చుకోని కొంచెం కొంచెం పుచ్చుకునేవాడు. ఆయనతో పాటు రుద్రరాజు సుబ్బరాజుగారి మనవడు రుద్రరాజు శ్రీనివాస్ రాజు కట్టించిన తెల్ల గోడల టూరింగ్ టాకీస్ లో ఆపరేటర్ గా పనిచేసే తిప్పిరెడ్డి వెంకట్రేడ్డి కూడా కూర్చోని రెండు పెగ్గులు వేసుకుంటాడు. అంతకన్నా పెద్దగా చెడు అలవాట్లేం లేవా మనిషికి.

డాక్టరుగా మాత్రం చాలా పేరు. అటు రధం వీధిలో వాళ్ళు, సుంకరవారి వీధి, కొడిశెట్టివారి వీధి నుంచి కూడా చాలామంది వచ్చి చూపించుకుంటారు. అట్లాంటి డాక్టరు దేవి వెనకాలే వెళ్ళడం ఊర్లో అందరూ చూశారు.

“ఆ పిల్లే అట్టాటిదిలే. అట్టాంటి నవ్వుని నే పుట్టాక చూళ్ళే”దన్నాడు సాంబమూర్తి మందయ్యతో మాట్లాడుతూ.

మర్నాడు పొద్దుట్నుంచి పట్టుకుంది ముసురు. అప్పుడే కాస్త తగ్గి తుంపర్లు పడుతూ వుంది. ఇంక పేషెంట్లెవరు వస్తార్లే అని డాక్టర్రాజు తలుపు వేసెయ్యబోతుంటే అప్పుడే వచ్చిందా అమ్మాయి. అదే ఆ దేవి.

డాక్టర్రాజుగారి దగ్గరగా చేరి “కాస్త పులపరంగా వున్నట్టుందండీ” అంది.

ఆ మనిషి నెవరగంత మీద చెయ్యేసి చూసి, “అట్లపెణంలా కాలిపోతుంటే పులపరం అంటావేంటి” అన్నాడు.

“సందకాడ బానే వుందండీ” అంది

బయట అప్పుడే పెరిగిన వర్షం ఇక కురుస్తానే వుంది. ఏం చెయ్యాలో తెలియని డాక్టర్రాజుగారు కాలక్షేపంగా వుంటుందని రేడియో పెడితే అప్పడే తెలిసింది తుఫాను మొదలైందని. తప్పేది లేక ఆ అమ్మాయికి షోలాపూర్ దుప్పటి ఒకటి ఇచ్చి, హర్యానా రగ్గు తను కప్పుకున్నాడు. ఆ అమ్మాయి దుప్పటి కప్పుకుంటుంటే చేతిమీద గీతలు చూసి అంతటి డాక్టరు కూడా ఖంగారు పడిపోయాడు.

“ఏంటయ్యి?” అన్నాడు.

“ఇయ్యాండీ నిన్న మీరు నా వెనకే వస్తంటే భయం వేసి గుడి పక్కన గుబురు చెట్లలో దాక్కున్నానండీ. అప్పుడు గీరుకున్నాయండీ ఇయ్యి” అంది. డాక్టర్రాజుగారికి ఏమనాలో తెలియక కాటన్లో టించర్ వేసి ఊదుతా అద్దుతా వుండిపోయాడు. “మిమ్మల్నోటడగనాండీ? ఎందుకండీ నా వెనకాలే వచ్చారు?” అడిగింది దేవి.

డాక్టర్రాజు నవ్వాడు తప్ప సమాధానం చెప్పలేదు.

***

కరెంట్ తీగపైన కాకి

కాశీభట్ల వేణుగోపాల్

రిచర్డ్ సీతాపతి…!

రిచర్డ్ బాస్టర్డ్… బాస్టర్డ్ రిచర్డ్ సీతాపతి..!

తల్లి ఏ ముండల ఖానాలో కనిందో అదే ముండల ఖానా వెనుక రొచ్చు మోరి పక్కన ఇల్లు తీసుకోని…

కుంటి రిచర్డ్ సీతాపతి… వేలాడే కుడికాలుని నిలబడ్డెడంకాలుతో ఈడుస్తూ నడిచే రిచర్డ్ గాడు.

ప్రేమతో మాట్లాడేవాళ్ళు కానీ కామంతో ఆట్లాడేవాళ్ళు కానీ లేక… అలాంటి వాళ్ళు దొరకక… కోరికని కాకిని చేసి ఎగరేసుకున్న డిప్రైవ్డ్ సోల్..!

కామకరువులో ఏకాకి కుంటి బాస్టర్డ్…!

రొచ్చుమోరీ పక్కన పగలు పందులు దొర్లాడే చోటుకి దగ్గర్లో రాత్రి పూట పెట్టే పానీపూరీ బండి దగ్గరకు వెళ్ళాడు. దుర్గ బండి సిద్ధం చేసుకుంటున్నాడు. స్టౌకి పంపు కొడుతున్నాడు.

పం..పు.. కొడుతున్నాడు.

కాకి వచ్చి కరెంట్తీగ మీద వాలింది.

సిగరెట్ పెట్టిలో ఆఖరి సిగరెట్ తీసాడు. ప్రేమతో ఆరాధనతో పెదవులకి తగిలించి నాలుకతో తడిమి అంటించాడు. అప్పటిదాకా తాగిన రమ్ము వాసనతో కలిసి సిగరెట్లో వున్న గంజాయి వాసన.

అనసూయ

రాబోయే రాత్రికి మొగుడి వేషం ఎవరు కడ్తారో అన్చూస్తున్న అనసూయ.

తల్తిప్పిందామె….

చీకటి అలల్లాంటి కన్రెప్పల్తో…

లావా లాంటి ఎర్రటి పెదిమెల్తో…

పైకీ కిందకీ చూసాడు…

కావ్.. కావ్.. హుష్.. హు… హు.. ష్..!

చీకటి రోగాల రొచ్చు ముంగిట్లో పాశవిక లిప్స…!

పశుకామం…!

షిట్…!

నన్ను ఒప్పుకుంటుందా? ఈ రిచర్డ్ సీతాపతిని….!

బాస్టర్డ్ సీతాపతిని… అవిటి సీతాపతిని..? నన్ను?

నేనంటే? ఈ చర్మమా….? మాంసమా? రెండువందలారు ఎముకలా…? మరి ఆత్మ సౌందర్యమనేడుస్తారే…?

ఆత్మ సౌందర్మమున్న కుంటినాకొడుకుని ఓ ఆడది కౌగిలించుకుని తీయగా ముద్దు పెడ్తుందా…?

ఫక్..! అంతా మోసం. దగా. కుట్ర.

అబద్దం..!

వున్నదల్లా విశృంఖల తమో కామ ఖేలాహేలమే…!

అయినా కాకి ఎగరదే…!

తెగిపడని కోరిక నరాలకి తగులుకుని వేలాడ్తూనే వుంది… గబ్బిలం లాగా…!!

అనసూయ శరత్నర్సింగ్ హోమ్ వైపు నడుచుకుంటూ వెళ్తుంటే… కరెంట్ తీగ మీద కాకి ఎగిరిపోయింది.

**** (*) ****