కవిత్వం

పసిరిక పిట్టలు

31-మే-2013

సూర్యాస్తమయం తగిలి
కిటికీ మండుతోంది
కాని ఆమె దేన్నీ చూడ్డం లేదు
అసలామె నిజానికి అక్కడ లేదు

తల్పం మీంచి ఆమె గాల్లో పైకి లేచింది
ఆమె స్వప్నాల్ని పట్టుకోవడానికి
పక్కనే నిల్చున్నాడొక హిప్నొటిస్టు
ఆమె వణుకుతోంది
రాత్రి పూట నయనాలను
మూయడానికి జంకుతోంది

ఆమె కనురెప్పలు మండుతాయా
చక్షువుల్లోంచి చిత్తరువులు
తప్పించుకు పోతాయా
పసిరిక పిట్టల వంటి ఆమె కన్నులు
ఎగిరి పోతాయా

అప్పటి దాకా మెలకువగా వున్న హిప్నొటిస్టు
ఆఖరుకు నిద్ర లోకి జారుకున్నాడు
ఆమె గాల్లో తేలుతూ అటూ యిటూ కదుల్తోంది
ఆ గది ఆమెను నిర్బంధించ లేనంత చిన్నదయింది

ఉడుపు అయిన తన శరీరానికతీతంగా
గాల్లో అనాచ్ఛాదితంగా ఎగరాలని ఆమె స్వప్నిస్తోంది

మూలం: రంజిత్ హోస్కోటె (ఆంగ్లభాషా కవి, రచయిత, జర్నలిస్టు)
తెలుగు అనువాదం: ఎలనాగ