ప్రత్యేకం

క్రాస్ వర్డ్ పజిళ్లు – నా ప్రస్థానం

అక్టోబర్ 2017

“ఆలేస్తు కంది”

“ఏం కూర వండమంటారు?”

“టటమా రకూ”

“ఈరోజేం వారం?”

“శురవా ముక్ర” (లేదా బువాధరం)

“ఇప్పటిదాకా ఫోన్లో మాట్లాడింది ఎవరితో?”

“లక్ష్మీ జరాం”

“ఆయనెక్కడుంటున్నాడిప్పుడు?”

“రామం జడ్రి”

ఇట్లాంటి సంభాషణ నాకూ నా శ్రీమతికీ మధ్య అప్పుడప్పుడు జరుగుతుందంటే మీరు నమ్ముతారో లేదో కానీ, తారుమారు మాటల వ్యవహారం మొదట్నుంచీ నాకెంతగానో నచ్చే విషయం! పై సంభాషణలోని 1, 3, 5, 7, 9 వాక్యాలకు సరైన రూపాలు ఆకలేస్తుంది, టమాట కూర, శుక్రవారము (బుధ వారం), లక్ష్మిరాజం, రాజమండ్రి అని మీరిప్పటికే గుర్తు పట్టి వుంటారు.

1965 ప్రాంతంలో – అంటే నేను ఆరవ తరగతిలోనో, ఏడవ తరగతిలోనో ఉన్నప్పుడు – పుస్తక ప్రపంచం అనే పత్రిక వచ్చేది. అందులోని చిన్న క్రాస్ వర్డ్ పజిల్ ను ఎంతో ఇష్టంగా పూరించే వాడిని. అది జటిలంగా ఉండేది కాదు. వేరు తెగిన వేరుశనగ, తల తారుమారైతే వచ్చే తీగ – ఇట్లా ఉండేవి ఆధారాలు. ఆ విధంగా నాకు తెలియకుండానే పజిళ్ల మీద Love at first sight ఏర్పడింది.

చాలా కాలం తర్వాత – అంటే నేను ఎం.బి.బి.ఎస్. లో ఉన్నప్పుడు – ఇంగ్లిష్ క్రాస్ వర్డ్ పజిళ్ల మీద నాకు మమకారం మరింతగా మొగ్గ తొడగటం మొదలైంది. ఎట్లా అంటే, నా సహాధ్యాయులైన రఘు, రాజేందర్ రెడ్డి, జయంతి నాయుడు క్లాస్ రూములో హిందు పత్రికలోని క్రాస్ వర్డ్ ను నింపుతుండేవారు. రఘు ఇప్పుడు కార్డియాలజిస్ట్. రాజేందర్ రెడ్డి పీడియాట్రిషన్. జయంతి నాయుడు కూడా ఏదో స్పెషలిస్ట్ అనుకుంటా. రఘు తప్ప మిగిలిన ఇద్దరు ఇప్పుడు USA లో ఉంటున్నారని నా ఊహ. అయితే, వాళ్లద్వారా నేను మరీ అంతగా నేర్చుకున్నదేం లేదు. వాళ్లు గడులను నింపుతుంటే కేవలం గమనిచేవాడిని – అంతే. కాని, తర్వాతి కాలంలో రఘు, నేను పక్కపక్క గదుల్లో ఉంటున్నప్పుడు, వాడు నాకు ఇంగ్లిష్ క్రాస్ వర్డ్ లను గురించిన ప్రాథమిక అవగాహనను కలిగించాడు. తర్వాత చాలా సంవత్సరాల అనంతరం నేను కాకతీయ మెడికల్ కాలేజ్ లో పీడియాట్రిక్స్ పి.జి. కోర్సు చేస్తున్నప్పుడు డాక్టర్ విఠల్ జనరల్ మెడిసిన్ పి.జి. విద్యార్థి. ఇప్పుడు కార్డియాలజిస్ట్ అయ్యాడు. అతను కూడా హిందు క్రాస్ వర్డ్ లను నింపుతుండేవాడు. మేం హాస్టల్లో ఉండేవాళ్లం కనుక ఉదయం, మధ్యాహ్నం తిండి కోసం డైనింగ్ హాల్లోకి వచ్చినప్పుడు కలిసి ఆ పజిల్ ను నింపటం మొదలు పెట్టాము. డాక్టర్ శ్రీరామ్ అనే ఒక తమిళుడు అప్పుడే రేడియాలజీలో పి.జి. కోర్సు చేస్తూ మా హాస్టల్లోనే ఉండేవాడు. అతనికి ఆంగ్లభాష మీద మంచి పట్టు ఉన్నా కూడా హిందు పజిల్ ను అసలే నింపలేక పోయేవాడు. ఒకసారి నా దగ్గరికి వచ్చి “సార్, ఎట్లా నింపుతారు మీరు అవన్నీ? నాక్కొంచెం వివరించరా ప్లీజ్” అని అడిగాడు. నేను అతనికి అవగాహన కలిగే విధంగా సాధ్యమైనంత వరకు తెలియజెప్పాను. తర్వాత అతను పుంజుకున్న తీరు నాకు చాలా ఆశ్చర్యాన్ని కలిగించింది. వారం రోజుల్లోనే ఎంతో నేర్చుకున్నాడు. ఉదయం కొంత మధ్యాహ్నం కొంత నింపి, సాయంత్రం టీ కోసం డైనింగ్ హాలుకు వచ్చినప్పుడు పజిల్ ను పూర్తి చేసేవాళ్లం. కొన్నిసార్లు నాకు రాని ఒకటి రెండు సమాధానాలను శ్రీరామ్ సాధించేవాడు. ఇక అప్పుడతని ఆనందానికి అవధులుండేవి కావు. నన్ను గట్టిగా కౌగిలించుకుని “కమాన్, లెటజ్ సెలెబ్రేట్ సర్” అంటూ బలవంతంగా రెస్టరాంట్ కు తీసుకుపోయి, బిస్కెట్లూ కేకులూ తినిపించి, టీ తాగించేవాడు. ఇప్పుడతను బెంగళూరులో స్థిరపడ్డాడని విన్నాను.

ఈ లోగా నేను ‘రచన’ మాసపత్రికలో రెండు దఫాలుగా పజిలింగ్ పజిల్ అనే శీర్షికన నిగూఢ ఆధారాలు గల పజిళ్లను దాదాపు నాలుగైదేళ్ల పాటు కూర్చాను. అయితే అవి మరీ అంత జటిలంగా ఉండేవి కావు. కాని, పాఠకాదరణను బాగానే చూరగొన్నాయి. క్రాస్ వర్డ్ పజిళ్లను గురించిన నా అభిప్రాయమేమంటే, మూసిన నా పిడికిలిలో ఏముందో చెప్పుకో అన్నట్టుగా ఆధారాలు జటిలంగా ఉండటం కాక, పజిల్ను పూరించింతర్వాత పాఠకులకు తృప్తి, త్రిల్ కలిగించే విధంగా ఉండాలి, అని. అక్షరక్రీడకు/పదక్రీడకు (word play కు) అవకాశం ఉన్నప్పుడే తృప్తి, త్రిల్ కలిగే ఆస్కారం ఎక్కువగా ఉంటుందని అనిపిస్తుంది నాకు. ఆధారంలోనే జవాబు దాగి వుండి, బాగా ఆలోచిస్తే అది మెదడుకు తట్టాలి. అట్లాంటి ఆధారాలను వర్ణించడానికి మన తెలుగు భాషలో అంతర్లాపి అనే ఒక పదమున్నదని నా అన్నయ్య (నాగరాజు రామస్వామి) చెప్తే తెలిసింది నాకు. ‘ద హిందు’ ఆంగ్లపత్రికలో వచ్చే క్రాస్ వర్డ్ పజిళ్లలో అటువంటి లక్షణాలు పుష్కలంగా ఉంటాయి. అయితే వాటిని ఛేదించాలంటే ఆంగ్లభాష బాగా రావటమే కాకుండా పదునైన ఊహాశక్తి, చురుకైన మేధ అవసరం. హిందు పత్రికలోని క్రాస్ వర్డ్ పజిళ్లను నేను కొన్ని దశాబ్దాలుగా దాదాపు ప్రతిరోజూ నింపుతూ వస్తున్నాను. అయినా ఇప్పుడు కూడా ఒక్కో పజిల్ను నింపటంకోసం గంటల తరబడి శ్రమించాల్సి వుంటుంది. సాధారణంగా 60 నుండి 99 శాతం వరకు కరెక్టుగా వస్తుంది. చాలా అరుదుగా – అంటే సరాసరిన నెలకొకసారి మాత్రమే – వంద శాతం కరెక్ట్ గా పూరించ గలుగుతాను. దీన్ని బట్టి ఆ పజిళ్లు ఎంత జటిలంగా ఉంటాయో మనం అర్థం చేసుకోవచ్చు. అయినా ప్రతిరోజూ పూరించడానికి ప్రయత్నించటం మానను.

సుడోకు లాగానే ఈ క్రాస్ వర్డ్ పజిళ్ల పట్ల ఆసక్తి కూడా వ్యసనంగా మారే అవకాశముంది. అయితే అది లాభాన్నే చేకూరుస్తుంది తప్ప హానిని కలిగించదు కదా. పజిల్ను పూరించేటప్పుడు పర్యాయ పదాలకోసం బాగా ఆలోచించాల్సి వస్తుంది, నిఘంటువుల్లో వెతకాల్సి వస్తుంది. తద్వారా కొత్తకొత్త పర్యాయ పదాలనెన్నింటినో నేర్చుకుంటాం. ఇక మరుసటి రోజు జవాబుల్ని చూసుకున్నప్పుడు కూడా కొత్త వాటిని నేర్చుకుంటాం. ఇదంతా మెదడుకు వ్యాయామం లాంటిది కనుక, దీనివల్ల జ్ఞాపకశక్తి తప్పక పెరుగుతుంది.

నిగూఢ ఆధారాలతో కూడుకున్న పజిల్ ప్రక్రియను నేను సాహిత్య ప్రక్రియతో సమానంగా భావిస్తాను.

***

ఈ నెలతో ‘వాకిలి నుడి’ శీర్షిక రెండు సంవత్సరాలు పూర్తి చేసుకుంది. ఇక ఈ శీర్షికను నేను నిర్వహించ బోవటం లేదు. వేరొకరి చేత నిర్వహింపజేయాలా వద్దా అనే విషయాన్ని ప్రధాన సంపాదకులు నిర్ణయిస్తారు. ద్వైపార్శ్వ సౌష్ఠవం కలిగిన గ్రిడ్లు, నవ్యత చమత్కారం వైవిధ్యం కలిగిన ఆధారాలు – వీటిని సంతృప్తికరంగా తయారు చేయడం చాలా శ్రమతో కూడుకున్న పని. అయినా, దీన్ని నడిపినంత కాలం నేను మాత్రం బాగా ఆనందించాను.

చాలా ఎక్కువ మంది పోటీలో పాల్గొనేలా పజిళ్లను రూపొందించక పోవడానికి కారణం ప్రమాణికతను నిలుపుకోవాలనే నా తపన మాత్రమే. మామూలు రకం పజిళ్లను చాలా పత్రికలు నిర్వహిస్తూనే ఉన్నాయి. వాటికి భిన్నంగా శీర్షికను ఉన్నత స్థాయిలో నడపాలని నాకొక బలమైన కోరిక ఉండింది. ఆధారాలు జటిలంగా ఉండాలా లేక సులభంగా ఉండాలా అన్నది ముఖ్యం కాదు. వాటిలో తెలుగు నుడికారం తాలూకు చమత్కారాన్ని మేళవిస్తున్నామా లేదా, వాటిని సరిగ్గా పూరించిన తర్వాత పాఠకుడు ఒక త్రిల్ ను పొందుతున్నాడా లేదా అన్నదే ముఖ్యమని నా అభిప్రాయం. ఇక ఆధారాలను రూపొందించడంలో నవ్యతను, వైవిధ్యాన్ని చూపాలన్నదే నాతపన.

నా ఈ ఆధారాలలోని కిటుకులను మొదట్లో చాలా మంది పట్టుకోలేక పోయినా, పజిల్ ప్రియులైన కొందరు పాఠకులు మెల్లమెల్లగా మెళకువలను నేర్చుకుని, సరిగ్గా పూరించే నైపుణ్యాన్ని సంపాదించుకున్నారు. అట్లా సంపాదించుకోలేని వారు ఈ పజిళ్లలో పస లేదని పెదవి విరిచారు. ఇప్పటిదాకా వచ్చిన, ఇప్పుడు వస్తున్న తెలుగు పజిళ్లలో ఉన్న నవ్యత కంటె, వైవిధ్యం కంటె నా పజిళ్లలో ఆ లక్షణాలు కొంచెమైనా ఎక్కువ పాళ్లలో ఉన్నాయని పాఠకులెవరైనా భావిస్తే, నేను నా లక్ష్యసాధనలో కృతకృత్యుడినయ్యానని అనుకుని ఆనందిస్తాను.

**** (*) ****