నుడి

నుడి – 23

సెప్టెంబర్ 2017

Nudi 22 PDF (ప్రింట్ చేసుకుని తీరిగ్గా పెన్నుతో గడులను నింపుకోవాలనుకుంటే ఈ పి.డి.ఎఫ్ ఫైల్ ని డౌన్లోడ్ చేసుకోగలరు.)


నుడి-22 ఫలితాలు, జవాబులు, వివరణలు


పాఠకులకు నమస్కారం.

ఈసారి ఒక్క తప్పు కూడా లేకుండా పూరించినవారు ఐదుగురు. వారు:
1. హేమనళిని
2. రవిచంద్ర, ఇనగంటి
3. పి.సి. రాములు
4. నాగరాజు రవీందర్
5. టి. సుధేంద్ర రెడ్డి

ఒక తప్పుతో నింపినవారు ముగ్గురు. వారు:
1. వి. దీప్తి
2. మమత
3. టి. చంద్రశేఖర రెడ్డి

విజేతలకు అభినందనలు. ఇక ఆధారాలకు జవాబులను, వాటికి వివరణలను చూద్దాం.

 తా  నీ  షా  X  వి  X  త  ల  చం
 రా  X  X  అ  రి  చా  X  X  దా
 శ  కు  నా  లు  X  క  రి  చిం  దా
 శాం  X  X  క  పా  లి  X  X  రు
 కం  క  టి  X  డు  X  క  త  లు
 X  పు  X  స  మూ  హం  X  మ  X
 మ  లు  పు  X  ట  X  చా  రి  మ
 నో  X  X  కో  లు  పో  X  X  న
 వే  రు  వే  రు  X  దా  త  చే  వ
 ద  X  X  ట  క్క  రి  X  X  రా
 న  ట్టు  వ  X  రి  X  వై  రు  లు

1 అడ్డం: దీనికి జవాబు అయిన తానీషా ఆధారంలోనే చెక్కు చెదరకుండా ఉన్నాడు, చూడండి.

5 అడ్డం: శత్రువు = అరి. మరణం = చావు. శత్రువు మరణం = అరిచావు. కాని, పూర్తి కాలేదు అంటున్నాం కనుక, చివరి అక్షరాన్ని తీసేయాలి. అప్పుడు వచ్చే అరిచా = కేక వేశా. కనుక, అదే సమాధానం.

7 అడ్డం: నాశనం చేసేవారు = నాశకులు. తారుమారు చేస్తే వచ్చే శకునాలు = శుభాశుభ సూచనలు. కాబట్టి, జవాబు శకునాలు.

8 అడ్డం: ఇక్కడ చింక దారి anagram. కరిచిందా అన్నది జవాబు.

9 అడ్డం: ‘కలిపాక’లో శీర్షం (తల) = క. దాన్ని మైనస్ చేసి, వెనుకకు తెస్తే వచ్చే కపాలి సమాధానం.

11 అడ్డం: దీనికి సమాధానం కంకటి. కంకటి అంటే వెదురుమంచం. ‘ఇక’లో రెండక్షరాలున్నాయి. మొదటిదైన ‘ఇ’ పూర్వార్ధమైతే, రెండవదైన ‘క’ ఉత్తరార్ధం (అర్ధం = సగం). ‘క’ ను కంటి అనే అక్షరాల నడుమ చేర్చితే కంకటి వస్తుంది. అదే సమాధానం. పారిజాతాపహరణ కావ్యంలో కోపం, అలుక నిండిన సత్యభామను వర్ణిస్తూ

మాసిన చీర గట్టుకొని మౌనముతోడ నిరస్తభూషయై
వాసెన కట్టుగట్టి నిడువాలిక కస్తురి పట్టు వెట్టి, లో
గాసిలి చీకటింటి కడ కంకటిపై జలదాంత చంద్రరే
ఖా సదృశాంగియై పొరలె గాఢ మనోజవిషాదవేదనన్

అంటాడు తిమ్మన, అద్భుతంగా.

13 అడ్డం: ‘కవితలు’లో ‘వి’ ధ్వంసమైతే మిగిలే కతలు ఈ ఆధారానికి జవాబు.

15 అడ్డం: ‘హంసమూలాలకు’ మైనస్ ‘కులాల’ = హంసమూ. దీన్ని సర్దుబాటు చేస్తే వచ్చే సమూహం జవాబు.

16 అడ్డం: దీనికి జవాబు మలుపు. మెత్తుట = పులుముట. కాబట్టి, మెత్త = పులుమ. దీన్ని తారుమారు చేస్తే మలుపు వస్తుంది.

17 అడ్డం: ఆన = ఒట్టు కనుక, ‘ఆచారి మన’ మైనస్ ‘ఆన’ = చారిమ = సౌందర్యం. జవాబు చారిమ.

19 అడ్డం: ‘పోల్చుకో’ నడుమ తేలికైతే పోలుకో వస్తుంది. దాన్ని రివర్స్ చేస్తే వచ్చే కోలుపో ఇక్కడ జవాబు.

21 అడ్డం: దీనికి జవాబు వేరు వేరు. వేరు = Root. వేరు = Different.

22 అడ్డం: ఇక్కడ చాలా మంది తడబడ్డారు. దాతృక్షమ, దాన చేవ మొదలైన సమాధానాలను రాశారు. నేను మొదట దాత చేవను సరైన సమాధానంగా నిర్ణయించుకున్నాను. కాని, దాతృచేవను కూడా ఎందుకు ఒప్పుకోగూడదు అనిపించింది. చేవ సంస్కృతపదం కాకపోవడం వల్ల దాతృచేవ వైరిసమాసమౌతుంది. అంత మాత్రాన ఒప్పుకోకపోయే అవసరం లేదనుకుని, మొదటి నిర్ణయాన్ని మార్చుకున్నాను.

23 అడ్డం: ‘పాట యొక్క దారి’ – దీన్లోని 2, 4, 6 అక్షరాలను కలుపగా వచ్చే టక్కరి ఇక్కడ జవాబు.

25 అడ్డం: లిఖిస్తే = రాస్తే. ‘రానట్టు వస్తే’ మైనస్ ‘రాస్తే’ = నట్టువ = నాట్యం. జవాబు నట్టువ.

26 అడ్డం: తెలుగులో వైరులు = శత్రువులు. ఇంగ్లిష్ లో వైరులు (wires) = తీగలు. కాబట్టి, వైరులు సమాధానం.

1 నిలువు: ‘రాశాం’కు అటూయిటూ ‘తాకం’ ఉంటే తారాశాంకం వస్తుంది. మధ్యన శ (శకారం) వేస్తే వచ్చే తారాశశాంకం సమాధానం.

4 నిలువు: తోవలు = దారులు. దీనికి ముందు చందా (రివర్సులో దాచం) రాస్తే వచ్చే చందాదారులు ఇక్కడ జవాబు.

5 నిలువు: పులుముట = అలుకుట. కాబట్టి, అలుక సమాధానం.

12 నిలువు: జంటను ఇంగ్లిష్ లో కపుల్ (couple) అంటాము. బూట్ ను బూటు అన్నట్టే కపుల్ ను కపులు అనవచ్చు. ఇక కపి = కోతి. కపులు = కోతులు. కనుక, జవాబు కపులు.

14 నిలువు: ‘మరి తటాకాలు’ లోని మొదటి సగాన్ని మిశ్రమం చేస్తే వచ్చే తమరి = మీ యొక్క. కనుక, అదే జవాబు.

16 నిలువు: No way = నోవే. దీనికి మదన చేర్చి కలగలిపితే వచ్చే మనో వేదన ఇక్కడ జవాబు. నిజానికి మథనపడు అన్నది సరైన పదం. కాని, మదన అనే అక్షరాల సమూహం ‘పడితే’ (కలిస్తే) అని నా ఉద్దేశం.

18 నిలువు: నీ + నా = మన. శాపాలకు విరుద్ధం వరాలు. మన + వరాలు = మనవరాలు = దౌహిత్రి. కనుక, జవాబు మనవరాలు.

19 నిలువు: ఊరు కొస = రు. దీనికి అటూయిటూ ‘కోట’ ఉంటే వచ్చే కోరుట ఇక్కడ సమాధానం.

24 నిలువు: ‘ఒక్కరి’లో మొదటి అక్షరం లేకుంటే ‘క్కరి’ వస్తుంది. రిక్క = చుక్క కనుక, క్కరి సమాధానం.

**** (*) ****