నుడి-16 ఫలితాలు, జవాబులు, వివరణలు
పాఠకులకు నమస్కారం.
ఈసారి ‘నుడి’ని ఎవ్వరూ ఆల్ కరెక్ట్ గా పూరించలేదు. ఒక తప్పుతో పూరించినవారు నలుగురు. వారు:
1. కార్తీక్ చంద్ర, పి.వి.ఎస్.
2. పి.సి. రాములు
3. యలమంచిలి కేశవ్
4. కామేశ్వరరావు
చాలా మంది 5 అడ్డం, 13 నిలువు, 31 నిలువుల దగ్గర తడబడ్డారు.
కొన్ని ఆధారాలను, వాటికి జవాబులను, వివరణలను చూద్దాం.
5 అడ్డం: దీనికి సమాధానం యద్దేవా. ఈ రోజుల్లో మనం వాడుతున్న ఎద్దేవా పదం పాత శ్లోకంలోని యద్దేవా నుండి వచ్చింది. (?యత్ + దేవా). యద్దేవా దేవం దేవహేళనం…. అంటూ మొదలౌతుంది ఆ శ్లోకం. కొందరు యధవా, యదేవా మొదలైన సమాధానాలను రాశారు.
6 అడ్డం: ఇంతి అంటే స్త్రీ కనుక, అదే సమాధానమౌతుంది. ఇక ఆంగ్ల పజిళ్ల ఆధారాలలో Chiefly, Primarily అని రాసి తర్వాత కొన్ని పదాలను ఇచ్చినప్పుడు, ఆ పదాల మొదటి అక్షరాలను కలిపితే సమాధానం వస్తుంది. అదేవిధంగా ఇక్కడ ప్రధానంగా అంటే ఇంతేలోని ‘ఇం’, ‘తినాలి’లోని ‘తి’ తీసుకుని కలపాలి. అప్పుడు కూడా ఇంతి వస్తుంది. కాబట్టి రెండు విధాలుగా అదే సమాధానం. ప్రామాణిక తెలుగు పజిళ్లలో కూడా మొదటి అక్షరాన్ని సూచించడం కోసం తల, మొదలు, ప్రారంభం అనే పదాలను మానుకునే సమయం ఆసన్నమైందని నా అభిప్రాయం. ఎన్నో దశాబ్దాలుగా తల/మొదలు/ప్రారంభం నరికిన/తొలగించిన/లుప్తమైన అంటూ ఆధారాలను ఇస్తూ వస్తున్నాం. మొదటి అక్షరాలను సూచించడానికి నేరుగా పదాలనే ఇవ్వొచ్చు. ఇంగ్లిష్ పజిళ్లలో ఆ విధంగానే ఇస్తున్నారు. ఈ ప్రతిపాదనకు సమాధానంగా నా తోటి Setters (పజిల్ కూర్పరులు) ఏమంటారో!
7 అడ్డం: అశ్వారావుపేట – ఈ పదంలో 6 అక్షరాలున్నాయి. మధ్యన (సెంటర్లో) వున్న రెండక్షరాల పదం ‘రావు’. ఇది ‘వస్తాయి’కి వ్యతిరేకం!
14 అడ్డం: చిన్న నాటకం = నాటిక. అంతు లేని అన్నాం కనుక ‘నాటి’ సమాధానమౌతుంది. ఇక ఆనాటి లోంచి ‘ఆ’ (ఆకారం) పోతే మిగిలేది నాటి కనుక, రెండు విధాలుగా సమాధానం అదే అవుతుంది.
19 అడ్డం: Camus ను కామూ అని ఉచ్చరించాలి. ఇక Albert అసలు పేరు కాగా, Camus (కామూ) ఇంటిపేరు. పాశ్చాత్యుల పేర్లలో ఇంటిపేరు చివరన ఉంటుంది.
22 అడ్డం: ఆడకోడి = పెట్ట. పెట్టజాలం మైనస్ పెట్ట = జాలం = వల!
28 అడ్డం: ఆ మనుషులు = వారు. ‘తరువాతి’ సెంటర్లో (మధ్యలో) ఉన్న ‘రువా’ను తారుమారు చేయాలన్న మాట!
35 అడ్డం: పవిత్ర జంతువు = గోవు. తోక లేదంటున్నాం కనుక, గో మిగుల్తుంది. గోల్డ్ లేక గోల్డు పరాయి (ఆంగ్ల) భాషలో పసిడి అవుతుంది. కనుక, ఈ ఆధారానికి గోల్డ్, గోల్డు రెండూ సరైన సమాధానాలే.
38 అడ్డం: మన్మథపత్ని = రతి. అటుదిటుగా ఉన్నప్పుడు తిర వస్తుంది. వందనం = నమస్కారం లేక నమస్కృతి. అందులో సగం = స్కారం లేక స్కృతి. కాబట్టి, తిరస్కారం లేక తిరస్కృతి సమాధానం.
4 నిలువు: దుంప = కంద. చరణం = కాలు. కంద + కాలు = కందకాలు = అగడ్తలు!
8 నిలువు: బట్టలుతికే స్థలం = చాకిరేవు. ఇందులోని సగమైన రేవు తారుమారైతే వచ్చేది వురే = కంఠపాశమే!
10 నిలువు: ఘ్రాణేంద్రియము = ముక్కు. అన్నాను = అంటి (అంటిని). ముక్కు + అంటి = ముక్కంటి!
11 నిలువు: ఇక్కడ ఏడు అంటే సప్తస్వరాలైన స,రి,గ,మ,ప,ద,ని. వీటిలో మూడవది గ. రెండవది రి. నాలుగవది మ. వీటిని కలిపితే వచ్చేది గరిమ = గొప్పతనం!
14 నిలువు: రసికంగా నా – ఇందులో 5 అక్షరాలున్నాయి. ఇరవై శాతానికి సమానమైన ఒక అక్షరం (‘గా’) ను తీసేస్తే ‘రసికం నా’ మిగుల్తుంది. వాటిని తారుమారు చేస్తే వచ్చే ‘నాసి రకం’ ఈ ఆధారానికి జవాబు!
16 నిలువు: కుతి = యావ. మరగుపరచితిని = దాస్తి (వ్యవహారంలో). యావ + దాస్తి = యావదాస్తి = మొత్తం సంపద!
18 నిలువు: ఇక్కడ ‘పేరు చీకో’ అన్నది Anagram. అక్షరాలను తారుమారు చేస్తే పేచీకోరు వస్తుంది.
19 నిలువు: కాకినాడ నుండి తెచ్చుకున్నదాన్ని తింటే ఎంతో మజా. ఈ వాక్యంలో 18 అక్షరాలున్నాయి. మొదటి, చివరి అక్షరాలను కలిపితే వచ్చే కాజా సమాధానం. నడుమ ఉన్న పదహారక్షరాలను తొలగించాలన్న మాట!
25 నిలువు: ‘చె’రి సగం = చె. తల కొట్టేసిన కవులు = వులు. చె + వులు = చెవులు!
30 నిలువు: దూషణని = తిట్టుని. తిట్టుకోరని మైనస్ తిట్టుని = కోర = దంష్ట్ర!
31 నిలువు: ఈ ఆధారంలోని చమత్కారాన్ని చాలా మంది పట్టుకోలేక పోయారు. 35 అడ్డంకు గోల్డ్, గోల్డు రెండూ సరైన జవాబులే. కాని, ఈ 31 నిలువుకు బోల్డు మాత్రమే సరైన సమాధానం, బోల్డ్ సరైన జవాబు కాదు. ఎందుకంటే….
చాలా = బోల్డు (బోలెడు). ధైర్యమున్న = బోల్డు (Bold). బోలెడుకు మారురూపమైన పదాన్ని బోల్డు అంటాం కాని బోల్డ్ అనం కదా! దీన్నే మరోవిధంగా ఇట్లా చెప్పుకోవచ్చు: బోల్డ్ అంటే ‘ధైర్యమున్న’ మాత్రమే. దానికి చాలా (బోలెడు) అనే అర్థం లేదు. ‘బోల్డు’కు చాలా, ధైర్యమున్న అనే రెండర్థాలున్న విషయాన్ని గమనించాలి. ఒకరిద్దరు ఈ ఆధారానికి సరైన జవాబును రాశారు కాని, 13 నిలువుకు పుస్తక అని జవాబిచ్చారు.
32 నిలువు: మనుషుల ఆకృతి = మానవాకారం. తల లేదంటున్నాం కనుక నవాకారం జవాబవుతుంది. నవాకృతిని కూడా సరైన జవాబుగా పరిగణించవచ్చు. కాని, ఇటువంటి పజిళ్లలో ఎక్కువ వరకు భిన్నమైన సమానార్థక పదాలనే ఆశిస్తారు సెట్టర్లు (Setters = పజిళ్లను కూర్చేవారు – set చేసేవాళ్లు)
35 నిలువు: గుంత = గొయ్యి. గుంత యొక్క = గోతి. నెమలి నడుము = ‘మ’. గోతిలో ‘మ’ చేరితే వచ్చేది గోమతి. అదే సమాధానం!
**** (*) ****
నా ఎంట్రీ మరోసారి పరిశీలించండి ఎలనాగ గారు. ఒక తప్పు మాత్రమే (27 నిలువు) నింపానని అనుకుంటున్నాను.
“పుస్తిక” పదం తెలుగు నిఘంటువులో నాకెక్కడా కనిపించలేదు, ఎప్పుడూ వినలేదు! సంస్కృతంలో అది స్త్రీలింగ వాచకం తప్ప చిన్న పుస్తకం అనే అర్థం లేదు.
కామేశ్వరరావు గారూ,
‘పుస్తిక’ పదాన్ని కొన్ని చోట్ల చదివినట్టు గట్టిగా జ్ఞాపకం నాకు. అయినా ఆధారాన్ని జాగ్రత్తగా పరిశీలిస్తే పుస్తక కంటె పుస్తిక ఎక్కువ సమంజసమైన సమాధానం అని గమనించవచ్చు. పుస్తక సరైన సమాధానం అవ్వాలంటే ఆధారం అలా ‘చిన్న పొత్తము’ అని కాక, కొస/చివర/అంతు లేని/కత్తిరించిన/లుప్తమైన పొత్తము అని ఉండాలి. లేదా అసంపూర్ణమైన పొత్తము అనైనా ఉండాలి. ఒక పదంలోని చివరి అక్షరాన్ని విలుప్తం చేసి, ఆధారంలో దాన్ని ‘చిన్న’గా ఎప్పుడూ సూచించలేదు నేను. కనీసం అది నా పద్ధతి కాదు. ఒకరిద్దరు మాత్రమే పుస్తక అని నింపారు. మిగతా వాళ్లందరూ పుస్తిక అని నింపారు. అదే జనబాహుళ్యంలోని మాట అని నా ఊహ. ‘పుస్తిక’ పదం ఏ నిఘంటువులోనూ లేదనే విషయాన్ని మీ వలన తెలుసుకున్నాననేది నిజం. అందుకు మీకు నాకృతజ్ఞతలు.
దీప్తి గారూ,
మీరు 27 నిలువుకు భవంతి అని సమాధానం రాయటమే కాక, 13 నిలువును కూడా ఒకసారి పుస్తక అని, మరొకసారి పుటిక అని నింపారు.
పుస్తిక గురించి-
శబ్దార్థ చంద్రిక ప్రకారం పుస్తకం అంటే కోశము, పొత్తము, లిఖితపత్ర సంపుటము. పుస్తము అనే పదానికి ఉన్న నానార్థాల్లో పుస్తకము ఒకటి. శబ్ద రత్నాకరము కూడా ఈ పదాలతో, అర్థాలతో ఇంచుమించుగా ఏకీభవిస్తోంది. విద్యార్థి కల్పతరువులో ఉన్న పర్యాయపదాల పట్టికలో పుస్తకము అనే పదము మాత్రమే ఉంది. పుస్తము, పుస్తి అనే పదాలకు దానిలో చోటు కల్పించబడలేదు. కాగా, జి. ఎన్. రెడ్డి గారి తెలుగు పర్యాయపద నిఘంటువు ప్రకారం గ్రంథము అంటే కితాబు, పుస్తకము, పుస్తి, పొత్తము, వహి, వాణి. అందువల్ల పుస్తకము, పుస్తము, పుస్తి అనే పదాలని మాత్రమే ప్రామాణికాలుగా అంగీకరించవచ్చు.
మనం వ్యవహారంలో నాటిక అనే పదాన్ని చిన్న నాటకము అనే అర్థంలో వాడుతున్నాం. కాని, శబ్దార్థ చంద్రిక; నాటిక అనే పదానికి, నాటకము అన్న అర్థాన్నే ఇస్తోంది. చిన్న నాటకము అనే అర్థాన్ని ఇవ్వటం లేదు. అదే శబ్దార్థ చంద్రిక ప్రకారం కథ, కథానిక అనే పదాలు రెండూ ప్రామాణికాలే. కథానిక అనగా చిన్న కథ అని అర్థం. కథానిక చిన్నది అయినపుడు, నాటిక కూడా చిన్నది కావచ్చు కదా! కాని కాలేదు. నవల అంటే పెద్దది. నవలిక అనే పదాన్ని చిన్న నవల అనే అర్థంలో వాడుతున్నాం. నవలిక అనే పదం శబ్దార్థ చంద్రికలో, పర్యాయపద నిఘంటువులో లేనే లేదు.
ఇన్ని వైరుధ్యాల నేపథ్యంలో నిఘంటువుల్లో లేదు అని అంగీకరించబడిన పుస్తిక అనే పదానికి, చిన్న పుస్తకము అని వ్యవహారంలో ఉన్న అర్థంతో నుడి జవాబుల్లో చోటు కల్పించడం సహేతుకం అనిపించదు. పాఠకుల మెదడుకు పని పెట్టటానికి, పదబంధ ప్రహేళికలకు ఇచ్చిన ఆధారాల విషయంలో ప్రహేళికను కూర్చిన వారు తమ ఊహాశక్తికి ఎంతయినా పదును పెట్టవచ్చు. జవాబుల విషయంలో అలాంటి ప్రయోగాలు కూడదని నా భావన.
టి. చంద్రశేఖర రెడ్డి
ఆంధ్రభారతి 46 నిఘంటువుల సమాహారం. అందులో గాని, ఆచార్య జి.ఎన్. రెడ్డి పర్యాయపద నిఘంటువులో గాని నవలిక అనే పదం లేదు. అంత మాత్రాన నవలిక సమాధానం అయ్యేలా ఆధారాన్ని తయారు చెయ్యకుండా ఉంటామా పజిళ్లలో?! అంతే కాక, ‘పుస్తక’కు ఆధారాన్ని నేనలా తయారు చెయ్యను మొర్రో అంటే అర్థం చేసుకోరేమిటి! కనీసం పొట్టి పొత్తము అనో, పొత్తము పొట్టిదైంది అనో ఇస్తాను. పొట్టికి, చిన్నకు మధ్య భేదం లేదా? పొట్టి నిడివిలో మాత్రమే తగ్గింపును సూచిస్తుంది. ‘చిన్న’ మొత్తం పరిమాణంలో తగ్గింపును సూచిస్తుంది.
చర్చని పొడిగించటానికి కాదని సవినయంగా మనవి చేస్తూ, వాకిలి సహపాఠకుల కోసం ఈ విషయంపై మరింత సమాచారం అందిస్తున్నాను .
పైనున్న నా వ్యాఖ్య తర్వాత, ఇది నేను అంతర్జాలశోధన చేసి సేకరించినది.
-పుస్తిక అనే పదం హిందీలో ఉంది. దీనికున్న అర్థాలు హ్యాండ్ బుక్, మాన్యుయల్, పాంఫ్లెట్. శంకర నారాయణ ఇంగ్లీషు-తెలుగు డిక్షనరీ ప్రకారం; హ్యాండ్ బుక్ అంటే చిన్న పుస్తకం, చేతి పుస్తకం, మాన్యుయల్. మాన్యుయల్ అంటే చిన్న పుస్తకం. పాంఫ్లెట్ అంటే కొన్నిపత్రాలు కల చిన్న పుస్తకం, కరపత్రం, ఎ స్మాల్ బుక్.
-నవలిక అనే పదం గుజరాతీ భాషలో ఉంది.
టి. చంద్రశేఖర రెడ్డి
యెలనాఁగ గారు,
నుడి 16 – నా ఎంట్రీ ని మరొక్క సారి పరిశీలించ గలరు. టైపో వల్ల ఏమైనా పోయిందో, లేక మీరు మరొక్క సారి పరిశీలించడమే కరెక్టో! నా నోట్ బుక్ లో ఆల్ కరెక్ట్!
దేవరకొండ గారూ,
మీ ఎంట్రీ నాకు అందలేదు. Sent mail లో ఒకసారి చెక్ చేసి చూసుకోండి.
దేవరకొండ గారూ,
మీ నుడి – 16 ఎంట్రీ కనిపించింది.
31 నిలువుకు బోల్డ్ అనీ, 32 నిలువుకు నరాకారం అనీ సమాధానాలను నింపారు మీరు. ఆ రెండూ తప్పులే.