వ్యాసాలు

యుక్త వాక్యం – చివరి భాగం

ఫిబ్రవరి 2018

*మినీ బస్సుల ద్వారా గుర్తించిన మార్గాలనుండి రవాణా సేవలు అందిస్తాము.
*మార్గాలను మినీ బస్సుల ద్వారా గుర్తించారా?! కాదే. ఇక్కడ ‘మినీ బస్సుల’ను ‘రవాణా సేవలు’కు వర్తింపజేయాలి. కాని, ‘గుర్తించిన’కు వర్తింపజేశారు. కాబట్టి, ‘గుర్తించిన మార్గాల నుండి మినీ బస్సుల ద్వారా రవాణా సేవలు అందిస్తాము’ అని రాస్తేనే వాక్యం సవ్యంగా ఉంటుంది.

*నయీం సొంత టీవీ చానెల్ ను ఏర్పాటు చేసుకున్నాడు. దానికి సీఈవో గా తనను తొలుత వ్యతిరేకించిన వ్యక్తినే నియమించుకున్నాడు.
*ఈ వాక్యం చెప్తున్నదేమంటే, ఒక వ్యక్తి నయీం చానెల్ కు సీఈవోగా – అంటే సీఈవో హోదాలో – ఉండి నయీంను వ్యతికేకించాడనీ, తర్వాత అతడినే నయీం నియమించుకున్నడని. కాని, వాక్యరచయిత మనసులో ఉన్నది వేరే. తనను మొదట వ్యతిరేకించిన వ్యక్తినే తర్వాత సీఈవోగా నియమించుకున్నాడు, అన్నది చెప్పదల్చుకున్న భావం. ఏ గందరగోళానికీ తావివ్వకుండా ఉండాలంటే ఈ వాక్యాన్ని, ‘నయీం సొంత టీవీ చానెల్ ను ఏర్పాటు చేసుకున్నాడు. తనను తొలుత వ్యతిరేకించిన వ్యక్తినే దానికి సీఈవోగా నియమించుకున్నాడు’ అని మార్చాలి.

*పోలీసుల చేతిలో హతుడైన గ్యాంగ్ స్టర్ ఎన్నో హత్యలు చేశాడు.
*ఈ వాక్యంలో వ్యాకరణపరంగా పెద్ద దోషం లేనప్పటికీ, అర్థప్రసరణ అనే కోణం లోంచి చూసినప్పుడు, వాక్యనిర్మాణం కొంత అన్వయ రాహిత్యానికి దారి తీసినట్టు కనిపిస్తుంది. ఇంగ్లిష్ లో కూడా కొందరు ఈ విధంగానే రాస్తున్నారు, The slain gangster had committed many murders – అని. కాని, మొదటి నాలుగు పదాలను (పోలీసుల చేతిలో హతుడైన గ్యాంగ్ స్టర్) కలిపి ఒకటిగానే పరిగణించాల్సి వుంటుంది కనుక, హతుడయ్యాక హత్యలు చేసే అవకాశమే ఉండదు కదా అనిపిస్తుంది. కాబట్టి, ఏ అయోమయమూ లేకుండా ఉండాలంటే (ఫలానా) గ్యాంగ్ స్టర్ పోలీసుల చేతిలో హతుడు కాకముందు ఎన్నో హత్యలు చేశాడు అని రాయాలి. లేదా వాక్యాన్ని ఇట్లా రెండుగా విరగ్గొట్టి తికమకను నివారించవచ్చు: (ఫలానా) గ్యాంగ్ స్టర్ ఎన్నో హత్యలు చేశాడు. అతడు పోలీసుల చేతిలో హతుడయ్యాడు.

*ఈ ఫోటోలను రహస్యంగా నయీం అంగరక్షకులుగా వ్యవహరించే అమ్మాయిలే తీసేవారు.
*ఈ వాక్యంలోమొదటి మూడు పదాలు (ఈ ఫోటోలను రహస్యంగా) ‘వ్యవహరించే’కు వర్తిస్తాయి. కాని, అవి ‘తీసేవారు’కు వర్తించాలి. కాబట్టి, ఆ మొదటి మూడు పదాలను అక్కణ్నుంచి తీసి, ‘తీసేవారు’కు ముందు పెట్టాలి. నయీం అంగరక్షకులుగా అని కాక నయీంకు అంగరక్షకులుగా అని రాస్తేనే సవ్యంగా ఉంటుంది. అంతిమంగా వాక్యం ఇలా ఉండాలి: నయీంకు అంగరక్షకులుగా వ్యవహరించే అమ్మాయిలే ఈఫోటోలను రహస్యంగా తీసేవారు.

*ప్రభుత్వం నుంచి అనుమతి లభించగానే నయీంకు సహకరించిన రాజకీయ నేతలకు నోటీసులను జారీ చేయనున్నారు.
*ఇది కూడా పై వాక్యం లాగానే ఉంది. రాజకీయ నేతలు ప్రభుత్వం నుంచి అనుమతి లభించగానే నయీంకు సహకరించారా? కాదు కదా. అనుమతి లభించగానే నోటీసులు జారీ చేయడమన్నది ఈ వాక్యంలోని అసలైన ఉద్దేశం. ‘లభించగానే’ తర్వాత కామా ఉంటే అయోమయానికి అంతగా అవకాశముండేది కాదు. కనుక, ‘నయీంకు సహకరించిన రాజకీయ నేతలకు, ప్రభుత్వం నుంచి అనుమతి లభించగానే నోటీసులను జారీ చేయనున్నారు’ అనే వాక్యమే సరైనదిగా ఉంటుంది. కానీ ఈ వాక్యంలో కూడా ‘నేతలకు’ తర్వాత కామా పెట్టకపోతే ‘రాజకీయ నేతలకు ప్రభుత్వం నుంచి అనుమతి’ అన్నది గందరగోళాన్ని సృష్టిస్తుంది. కాబట్టి, అక్కడ కామా ఉండటం చాలా అవసరం.

*పౌర్ణిమ నాడూ, కొత్త చంద్రుడు ఉదయించే రోజూ ఈ రకమైన మానసిక వ్యాధుల రోగులు తమవద్దకు ఎక్కువగా వస్తున్నారని డాక్టర్లు చెబుతున్నారు.
*ఇది ఒక ఆంగ్లవాక్యానికి చేసిన అనువాదమని గుర్తించడం కష్టమైన పని కాదు. ఈ వాక్యంలోని భాషాపరమైన అపసవ్యత New moon day ను కొత్త చంద్రుడు ఉదయించే రోజు అని తప్పుగా అనువదించడం వల్లనే ఏర్పడింది. ఇంగ్లిష్ లో పౌర్ణిమని Full moon day అనీ, అమావాస్యను New moon day అనీ అంటారు (No moon day, Nil moon day అనరు). కాని, New moon day ను ‘కొత్త చంద్రుడు ఉదయించే రోజు’ అంటూ ముక్కస్య ముక్కగా అనువదించడంతోనే పప్పులో కాలు వేయటం జరిగిందిక్కడ. కాబట్టి, పౌర్ణిమ నాడూ అమావాస్య నాడూ….. అని రాయాలి. కొందరు పౌర్ణిమకి బదులు పౌర్ణమి అని రాస్తారు. కాని, అది తప్పు. పౌర్ణిమ లేక పూర్ణిమ సరైన పదాలు.

*ఈ ప్రయత్నంలో ప్రతి ఒక్కరూ భాగస్వామ్యం కావాలి.
*ఈ వాక్యంలోని భాషాదోషం ప్రాథమిక స్థాయికి చెందింది. ఇక్కడ ‘భాగస్వామ్యం కావాలి’కి బదులు ‘భాగస్వామి కావాలి’ అని ఉండాలి. లేదా, ప్రతి ఒక్కరూ భాగస్వామ్యాన్ని పంచుకోవాలి అనొచ్చు.

*మరింత ముందున్న సమాజ్ వాది పార్టీ సంక్షోభం.
*ఈ వాక్యం అసంపూర్ణంగా ఉంది. శీర్షికగా లేక ఉపశీర్షికగా రాసినప్పుడు దానికేం అభ్యంతరం లేదు. కాని, ‘సంక్షోభం’కు ‘మరింత ముందున్న’ వర్తిస్తుందిక్కడ. ఫలితంగా వాక్యంలో అపసవ్యత ఏర్పడింది. ఎందుకంటే, అంతకు ముందు ఏదైనా కొంత గురించి చెప్పకుండా మరింత అనే పదాన్ని వాడలేము. ‘మరింత ముదరనున్న …..’ అని రాస్తే అయోమయం ఉండదు. కాని, ముదరడం ఇక్కడ చెప్పదల్చుకున్న విషయం కాదు. ‘ముందుంది’ అన్నదే ప్రధానమైతే ‘మరింత’ను తీసేసి, సమాజ్ వాది పార్టీ ముందున్న సంక్షోభం అనవచ్చు.

*ఆలయ భూముల అన్యాక్రాంతాన్ని అడ్డుకోవాలి.
*‘అన్యాక్రాంతం’ విశేష్యమైతే (నామవాచకమైతే) ఈ వాక్యం సరిగ్గానే ఉందని ఒప్పుకోవచ్చు. కాని, అది నామవాచకం కాదు, విశేషణం (Adjective). ఆక్రాంతము పదం విశేషణము అని శబ్ద రత్నాకరము స్పష్టంగా చెప్తోంది. మరప్పుడు అన్యాక్రాంతాన్ని అడ్డుకోవాలి అన్నది ఎట్లా పొసగుతుంది? ‘మనమందరం మనసులలో స్వచ్ఛను నింపుకోవాలి’ అన్నట్టుంటుంది ఆ వాక్యం. కాని, స్వచ్ఛతను నింపుకోవాలి అని రాయాలి కదా. స్వచ్ఛత విశేష్యం, స్వచ్ఛ విశేషణం. There is beauty in her face అనాలి తప్ప There is beautiful in her face అంటామా?! కాబట్టి, పై వాక్యాన్ని ‘ఆలయ భూములు అన్యాక్రాంతం అవడాన్ని అడ్డుకోవాలి’ అని రాస్తేనే కరెక్టు. ఈ వాక్యంలో ‘అవడం’ క్రియాత్మక నామవాచకం కనుక, అపసవ్యత చోటు చేసుకునే అవకాశం లేదు.

*ఉగ్ర కుట్ర, ఉగ్ర దాడి, ఉగ్ర పోరు.
*ఈ పదబంధాలు తెలుగు లిపిలో మనకు తరచుగా కనిపిస్తుంటాయి. ఉగ్ర(ము) అన్నది తత్సమం (సంస్కృతసమ శబ్దం). కుట్ర, దాడి, పోరు అచ్చతెలుగు పదాలు. సంస్కృతసమం కాని పదాలను సంస్కృతసమ శబ్దాలతో కలిపి పదబంధాలను/సమాసాలను ఏర్పరచినప్పుడు వైరి (దుష్ట) సమాసాలు తయారై, వాటిలో తప్పక ఎబ్బెట్టుతనం చోటు చేసుకుంటుంది. భాషపట్ల, శబ్దంపట్ల మమకారం లేనివాళ్లకు ఏ ఎబ్బెట్టుతనమూ కనిపించదేమో! అసలు సమాసాలే వద్దు అనుకుంటున్న ఈ రోజుల్లో వైరి సమాసం అంటూ ఈ గోలేమిటండీ, అని కొందరు విసుక్కోవచ్చు. కాని, వాక్యం అందరికీ వినసొంపుగా ఉండాలంటే, వైరిసమాసాలను మానుకోవడం అవసరం. ఉగ్రకుట్ర అనే బదులు ఉగ్రవాదుల కుట్ర అనొచ్చు కదా. అదే విధంగా ఉగ్రవాదుల దాడి, ఉగ్రవాదుల పోరు అని రాయవచ్చు. ఎంతమాత్రం పొసగని కొన్ని దుష్ట సమాసాలను చదివినప్పుడు, విన్నప్పుడు కొత్తకోటు మీదికి పైజామా తొడుక్కున్నట్టుంటుంది అని ఇంతకు ముందొక వ్యాసంలో రాశాను నేను. మరి ఉగ్రవాదుల దాడి అంటే అట్లా అనిపించదా? అని ఎవరైనా ప్రశ్నిస్తే, అనిపించదు అన్నది నా సమాధానం. అప్పుడది కొత్తకోటునూ, పైజామానూ హ్యాంగర్లకు తగిలించి పక్కపక్కన పెట్టినట్టుంటుంది, సమాసం చేసినప్పుడు మాత్రం తొడుక్కున్నట్టగా ఉంటుంది – అంటూ అదనపు వివరణను కూడా ఇవ్వొచ్చు! ఎందుకంటే ఉగ్రదాడి సమాసమవుతుంది కాని, ఉగ్రవాదుల దాడి సమాసం కాదు. సమాసం కానప్పుడు భాషాపరమైన అపసవ్యత చోటు చేసుకోదు. ఇక భూపంపిణీ అని రాసేబదులు భూమి పంపిణీ అని రాయొచ్చు. అట్లాగే భూసర్వేకు బదులు భూమి సర్వే అనీ, భూకబ్జాకు బదులు భూమి కబ్జా, అనీ, భూజగడంకు బదులు భూమి జగడం అనీ రాయొచ్చు.

*ఎన్నికలకు ముందు చేసిన వాగ్దానాలన్నీ వంద శాతం నెరవేర్చుతాం.
*ఈ వాక్యంలో ‘వాగ్దానాలన్నీ’ అంటేనే మొత్తం వాగ్దానాలు అని అర్థం కనుక, మళ్లీ వంద శాతం అనే అవసరం లేదు. కాబట్టి, ‘ఎన్నికలకు ముందు చేసిన వాగ్దానాలను వంద శాతం నెరవేర్చుతాం’ అన్నది సరైన వాక్యం. లేదా, ‘ఎన్నికలకు ముందు చేసిన అన్ని వాగ్దానాలనూ నెరవేర్చుతాం’ అని రాస్తే ఇంకా బాగుండదా?

*భార్యను ఏలుకునేందుకు నిరాకరిస్తున్న ప్రభాకర్, తల్లిదండ్రులను అరెస్ట్ చేసి శిక్షించాలి.
*ఇక్కడ ప్రభాకర్ నూ, అతని తల్లిదండ్రులనూ (పోలీసులు) అరెస్టు చేయాలనేది అసలైన ఉద్దేశం. కాని, ఈ వాక్యంలో పోలీసులకు బదులు ప్రభాకర్ కర్త అవుతున్నాడు! ఎందుకంటే, తన తల్లిదండ్రులను ప్రభాకర్ అరెస్టు చెయ్యాలి అనే అర్థం వస్తోంది, వాక్యాన్ని చదివితే! కాబట్టి, ఏ విధమైన గందరగోళమూ ఉండొద్దనుకుంటే, ఇట్లా తిరగ రాయాలి ఈ వాక్యాన్ని: భార్యను ఏలుకునేందుకు నిరాకరిస్తున్న ప్రభాకర్ ను, అతని తల్లిదండ్రులను అరెస్ట్ చేసి, శిక్షించాలి.

*పోలీస్ ఇన్ఫార్మర్ నెపంతో మాజీ సర్పంచ్ ను కాల్చి చంపారు.
*ఈ వాక్యంలో పోలీస్ ఇన్ఫార్మర్, నెపం – ఈ రెండు పదాలూ నామవాచకాలే. అయితే వీటి మధ్యన ‘అనే’ లేక ‘అన్న’ లేకపోతే కొంచెం ఏదోలా ఉన్నట్టనిపించడం లేదా? కొన్ని సందర్భాల్లో అటువంటి రెండు నామవాచక పదాల మధ్య అనుసంధానక పదమేదీ లేకపోయినా బాగానే ఉంటుంది. ఉదాహరణకు, మనిషి యొక్క కోరిక అనకుండా మనిషికోరిక అన్నప్పుడు అపసవ్యత కనిపించదు. కాని, ఇన్ఫార్మర్ నెపంతో అన్నప్పుడు తప్పక అపసవ్యత తోస్తుంది. ‘ఇన్ఫార్మర్ అనే నెపంతో’ అని రాస్తేనే అపసవ్యతను నివారించినవాళ్లమౌతాం.

*విషజ్వర పీడితులను ఆదుకోవాలని ఫిర్యాదు.
*ఆదుకోవాలని విజ్ఞప్తి/విన్నపం చేసుకుంటారు గాని, ఫిర్యాదు చేస్తారా? ఆదుకోనందుకు మాత్రం ఫిర్యాదు చేసే అవకాశముంది. కాబట్టి, ఈ వాక్యాన్ని ‘విషజ్వర పీడితులను ఆదుకోవాలని విజ్ఞప్తి/విన్నపం’ అని కాని, ‘విషజ్వర పీడితులను ఆదుకోనందుకు ఫిర్యాదు’ అని కాని మార్చాలి.

*పార్టీలో బలోపేతం కోసం కృషి.
*‘బలోపేతం’ నామవాచకం కాదు. అది విశేషణం (చూ. శబ్ద రత్నాకరము). ఆమె గానంలో శ్రావ్యత ఎక్కువ అని రాసే బదులు ఆమె గానంలో శ్రావ్య ఎక్కువ అని రాసినట్టు తప్పక అనిపిస్తుంది, ఈ వాక్యాన్ని చదివితే! అయితే బలోపేతం నామవాచకం అని భ్రమపడే వాళ్లకు మాత్రం అట్లా అనిపింకచ పోవచ్చు! కాబట్టి, ‘పార్టీని బలోపేతం చేయడం కోసం కృషి’, లేక ‘పార్టీలో బలం నిపండం కోసం కృషి’ అని రాస్తేనే వాక్యం సవ్యంగా ఉంటుంది.

*లక్షకు 25 నుండి 30 శాతం కమీషన్ వసూలు చేసిన నకిలీ కరెన్సీ గ్యాంగ్.
*శాతం అంటే వందకు. మళ్లీ లక్షకు ఏంటి? ఇక్కడ గందరగోళం ఏర్పడలేదా? లక్షకు 25 వేలనుండి 30 వేల వరకు – అని రాస్తే ఎంత అయోమయ రహితంగా ఉంటుంది వాక్యం! లేదా, ‘లక్షకు’ తీసేసి, సింపుల్ గా 25 నుండి 30 శాతం కమిషన్ వసూలు చేసిన నకిలీ కరెన్సీ గ్యాంగ్ – అంటే సరిపోతుంది.

*సాంకేతిక లోపంతో డౌన్ లోడ్ కాని హాల్ టికెట్లు.
*హాల్ టికెట్లు సాంకేతిక లోపంతో డౌన్ లోడ్ కావలసి ఉండిందా? ఏ లోపమూ లేకుండా డౌన్ లోడ్ కావడమే ఆశిస్తాం కదా. ఈ వాక్యంలో ‘లోపంలో’ తర్వాత కామా ఉన్నా కొంత బాగుండేది. ఎందుకంటే, అప్పుడు అయోమయం కొంచెం తగ్గుతుంది. వాక్యం మరింత సవ్యంగా ఉండాలంటే ‘సాంకేతిక లోపం కారణంగా (లేక మూలంగా, లేక వలన) డౌన్ లోడ్ కాని హాల్ టికెట్లు’ అని రాయాల్సి ఉంటుంది.

*కమ్యూనిస్ట్ శిఖరం (ఫిడెల్ కాస్ట్రో) ఒరిగింది.
*ఒరగడంకూ నేలకొరగడంకూ మధ్య భేదం ఉంది. ‘ఒరుగుట’ పూర్తిగా కింద పడిపోవడాన్ని సూచించదు, కేవలం పక్కకు వంగడాన్ని మాత్రమే తెలుపుతుంది. కాబట్టి, ఇక్కడ ఒరిగిందికి బదులు నేలకొరిగింది అని రాస్తేనే సరిగ్గా ఉంటుంది.

*(ఫిడెల్ కాస్ట్రో) అమెరికా గుండెల్లో సింహస్వప్నమై గర్జించిన యోధుడు.
*ఎవరైనా సింహమై గర్జిస్తారు కాని, సింహస్వప్నమై గర్జించరు. కాబట్టి, ఇక్కడ సింహమై గర్జించిన యోధుడు అంటేనే బాగుంటుంది. లేదా, సింహస్వప్నంగా మారిన యోధుడు/మారి భయపెట్టిన యోధుడు అనొచ్చు.

*నగదు రహితం కోసం కమిటీ.
*ఈ వాక్యంలో కూడా నామవాచకంకు బదులు విశేషణం ఉండటంవల్ల వాక్యంలో అపసవ్యత చోటు చేసుకుంది. ‘రహితం’ విశేషణం, ‘రాహిత్యం’ నామవాచకం. కనుక, నగదు రాహిత్యం కోసం కమిటీ అని రాస్తేనే కరెక్టుగా ఉంటుంది. లేదా, నగదురహిత లావాదేవీల కోసం కమిటీ అనొచ్చు.

*జి.హెచ్.ఎమ్. సి. వసూళ్లు 2500 శాతం పెరిగాయి.
*అర్థశాస్త్రం చదివిన గణకుల భాషను అనుసరిస్తూ 2500 శాతం అని చెప్తే మామూలు పాఠకులకు ఎలా తెలుస్తుంది? వాళ్లకు సులభంగా అర్థం కావడం కోసం ‘25 రెట్లు పెరిగాయి’ అనొచ్చు కదా. కనీసం బ్రాకెట్లలోనైనా అదనంగా రాయవచ్చు.

*ప్రపంచంలోనే ఎత్తైన భవనం.
*‘నే’ ను సాధారణంగా ‘మాత్రమే’ అనే అర్థంలో వాడుతాము. రైల్లోనే వెళ్తాను అన్నప్పుడు వేరేదాంట్లో వెళ్లను అని అర్థం. పోనీ, ఈ వాక్యంలో ‘నే’ ను ఉంచినా, ఎత్తైనకు ముందు అత్యంత/అన్నిటికన్న అని రాస్తే సవ్యంగా ఉంటుంది. ప్రపంచంలో అత్యంత ఎత్తైన భవనం అని కాని, ప్రపంచంలో అన్నిటికన్న ఎత్తైన భవనం అని కాని రాస్తే అపసవ్యతను నివారించినవాళ్లమౌతాము.

*ఈ వార్త వాట్సప్ లో దావానలంలా వ్యాపిస్తోంది.
*వాట్సప్ అంటే What’s up (What is up) అని! కాని ఇక్కడ చెప్పదల్చుకున్నది What’s App గురించి! App అనేది Application కు పొట్టి రూపం. కాబట్టి, వాట్సాప్ అని రాస్తేనే కరెక్టు.

*ఆ రెండు సినిమా కథల మధ్య సారూప్యత ఉంది.
*సారూప్యత, తాదాత్మ్యత నైపుణ్యత మొదలైన పదప్రయోగాలు మనకు చాలానే తారస పడుతుంటాయి. ఇవి కొంత వరకు వివక్షత వంటివే. సారూప్యం, తాదాత్మ్యం, నైపుణ్యం అన్నవే నామవాచకాలైనప్పుడు, వాటికి మళ్లీ ‘త’ అనే ప్రత్యయాన్ని చేర్చి కంగాళీ చేయడమెందుకు? సారూప్యంకు బదులు సరూపత అనీ, నైపుణ్యంకు బదులు నిపుణత అని కూడా రాయొచ్చు. ‘వివక్ష’ నామవాచకం కనుక దానికి ‘త’ చేరిస్తే తప్పవుతుంది.

*ఆమె హ్రిదయం గుబగుబలాడింది.
*తెలుగు భాషలో హ్రిదయం అనే పదమే లేదు. ‘హృదయం’ ఉంది. అయితే కొందరు దాన్ని హ్రుదయం అని పలుకుతారు. అది తప్పు. హ్రిదయం అని పలకాలి. కాని, ఇది పలకడం కోసం మాత్రమే. రాయడం మాత్రం హృదయం అనే రాయాలి. తమ పేరును క్రిష్ణ కుమార్ అని రాసుకునేవాళ్లు కూడా ఉంటారు కొందరు.

*కూల్చివేతల కారణంగా ఆగిన వృద్ధగుండె.
*ఇక్కడ వృద్ధగుండె వైరి సమాసం. వైరి సమాసాలను ఉచ్చరించినప్పుడు పొసగనితనం సులభంగా తెలుస్తుంది. కాబట్టి, వృద్ధుని/వృద్ధురాలి గుండె అని రాస్తే చిక్కే ఉండదు కదా. హృదయం ‘వృద్ధ’లాగా సంస్కృతసమ శబ్దం కనుక, ఆ రెండు పదాలతో పదబంధాన్ని తయారు చేస్తే ఎటువంటి అపసవ్యతా ఉండదు.

*కాసేపయ్యక బజారుకు వెళ్లిన పిల్లవాడు తిరిగి వచ్చాడు.
*ఈ రకానికి చెందిన అపసవ్య వాక్యాల గురించి ముందు కూడా చెప్పుకున్నాం. అయినా మళ్లీమళ్లీ చెప్పుకుంటే మంచిదే. పిల్లవాడు కాసేపయ్యాక బజారుకు వెళ్లాడా? కాదే. కాసేపయ్యాక తిరిగి వచ్చాడు అన్నది చెప్పదల్చుకున్న అర్థం. కాబట్టి, బజారుకు వెళ్లిన పిల్లవాడు కాసేపయ్యాక తిరిగి వచ్చాడు అని రాయాలి.

*ఇది ప్రారంభించడానికి ముందు నేనెంతో ఆలోచించాను.
*ఈ రకమైన వాక్యాలు కూడా నేటికాలంలో తరచుగా దర్శనమిస్తున్నాయి. ఈ వాక్యంలో ‘నేను’ కర్త. కాబట్టి, నేను దీన్ని ప్రారంభించడానికి ముందు ఎంతో అలోచించాను అంటే సరిగ్గా ఉంటుంది.

*మెరీనా బీచ్ లో జల్లికట్టుపై నిషేధం ఎత్తివేయాలని విద్యార్థుల ఆందోళన.
*మెరీనా బీచ్ లో జల్లికట్టు జరిగినట్టు/జరుగుతున్నట్టు సూచిస్తోంది ఈ వాక్యం! కాని, అక్కడ జరుగుతున్నది ఆందోళన – జల్లికట్టు కాదు. కనుక, ఈ వాక్యం ఇలా ఉండాలి: జల్లికట్టుపై నిషేధం ఎత్తివేయాలని మెరీనా బీచ్ లో విద్యార్థుల ఆందోళన.

*భర్తను ప్రియుడితో హత్య చేసిన భార్య
*ఇక్కడ ‘తో’ అనే ప్రత్యయం అసంబద్ధంగా ఉండటమే మొత్తం తికమకకు దారి తీస్తోంది. ‘ప్రియుడి సహాయంతో భర్తను హత్య చేసిన భార్య’ అంటే సజావుగా ఉంటుంది. లేదా ‘భర్తను ప్రియుడి చేత/ప్రియుడితో హత్య చేయించిన భార్య’ అనొచ్చు.

*మంత్రిగారు తమ శాఖను సమర్థవంతంగా నిర్వహిస్తున్నారు.
*ప్రభావవంతంగా, బలవంతంగా, ధనవంతుడు, గుణవంతుడు, తేజోవంతమైన, బలవంతమైన – మొదలైన పదాల్లో వంతంగా/వంతుడు/వంతమైన ఏ పదాలకైతే వచ్చి చేరుతున్నాయో అవి (ప్రభావం, బలం, ధనం, గుణం, తేజస్సు) నామవాచకాలు. కాని, సమర్థం నామవాచకం కాదు. అది విశేషణం. దాని నామవాచక రూపం సామర్థ్యం, లేక సమర్థత. నామవాచకంతో ప్రత్యయం సంయోజనం చెందుతుంది కాని విశేషణంతో చెందదు. కాబట్టి, ‘సమర్థం’కు ‘వంతం’ అతుక్కోదు. ఒకవేళ అతుక్కునేట్టుగా రాస్తే అది భాషాదోషానికి దారి తీస్తుంది. అందుకే సమర్థవంతంగా అని కాక సమర్థంగా అని రాయాలి. అంటే, మంత్రిగారు తమ శాఖను సమర్థంగా నిర్వహిస్తున్నారు అని రాయటం సరైందన్న మాట. వ్యాకరణ సముద్రపు లోతుల్ని ముట్టినవారు దీనిగురించి మరింత సమగ్రమైన వివరణను ఇవ్వగలుగుతారు. ‘సామర్థ్యవంతంగా’ అన్నది ఎందుకు ఉపయోగంలో లేదో చెప్పలేము. ఇక ప్రభావములోని ‘ము’ ను విలుప్తం చేసి ‘వంతం’ను కలిపినట్టే సమర్థతలోని ‘త’ ను విలుప్తం చేసి ‘వంతం’ ను కలుపవచ్చు కదా అనే సందేహం రావడం సహజం. కాని, ఇక్కడ ‘ము’ ప్రథమా విభక్తి ప్రత్యయం ‘త’ విభక్తి ప్రత్యయం కాదు, మామూలు ప్రత్యయం. అయితే, ఇది పూర్తిగా సంతృప్తికరమైన వివరణ కాకపోవచ్చు. సరైన వ్యాకరణ సూత్రాన్ని చెప్పి వివరిస్తేనే కరెక్ట్ గా ఉంటుంది.

*అతనిలో ఊహాశాలీనత మెండు.
*శాలిత లేక శాలిత్వమును an affix denoting possession అని వివరించడం జరిగింది బ్రౌణ్య నిఘంటువులో. గుణశాలిత అంటే the possession of virtue. ధీశాలిత్వమును ధీశాలిత అనీ, బుద్ధిశాలిత్వమును బుద్ధిశాలిత అనీ అనవచ్చు. అదే విధంగా ఊహాశాలిత్వమును ఊహాశాలిత అనడం సరైనదే. శాలి కూడా ఒక affix. బలశాలి, ధీశాలి, ధైర్యశాలి అంటే ఆ గుణాలను కలిగినవాడు అని అర్థం. ఇక శాలీనత వేరే పదం. దానికి అర్థం బిడియం, త్రప, వ్రీడ మొదలైనవి. కాబట్టి ఊహాశాలీనత తప్పు. ఊహాశాలిత, శాలీనత సవ్యమైన పదాలు.

*ఎంత ఆలోచించినా అతని మెదడుకు తరుణోపాయం తట్టలేదు.
*ఈ వాక్యంలో తరుణోపాయం తప్పు, తరణోపాయం సరైనది. తరణము అంటే దాటుట. తరణోపాయం అంటే గండం నుండి గట్టెక్కించే ఉపాయమన్న మాట. తరుణముకు సమయము, వయస్సు అనే అర్థాలున్నాయి. దీన్ని సాకుగా చూపి, సమయానికి తోచిన ఉపాయం అనే అర్థంలో తరుణోపాయం కూడా సరైనదేనని ఎవరైనా వాదించే అవకాశముంది. కాని, తరణోపాయముకు means, expedient అనే అర్థాలు కనపడుతాయి తెలుగు – ఆంగ్లం బ్రౌణ్య నిఘంటువులో. మళ్లీ ఇక్కడ ఓ సందేహం కలుగవచ్చు భాషాప్రియులకు. అదేమిటంటే, Brown ను తెలుగులో బ్రౌన్ అని ఉచ్చరిస్తాము, బ్రౌణ్ అని పలకం. మరి బ్రౌన్య నిఘంటువు అనాలి కదా? దీనికి వివరణ ఏమిటో తెలియదు. మొదట్నుంచీ పండితులు అంగీకరిస్తూ వస్తున్న పదం కనుక, గట్టిగా ఆక్షేపణ తెలుపలేము. ఇటువంటి కొన్ని పదబంధాలను ‘అనింద్య గ్రామ్యాలు’గా నిర్ణయించారు పెద్దలు. అంటే, మహాపండితులకు మినహాయింపుల వెసులుబాటు ఉంటుందన్న మాట. గర్భగుడి అన్న పదబంధం నిజానికి వైరిసమాసం అవుతుంది కాబట్టి, భాష/వ్యాకరణం ప్రకారం అది తప్పు. అయినా పూర్వం పండితులే దాన్ని ఆమోదిచిన కారణంగా, ఆక్షేపణ తెలుపక మనమూ అంగీకరించాలనేది చెప్పకనే చెప్పబడిన విషయం. అయితే ఇక్కడ ఒక విషయాన్ని గమనించాలి. ‘గర్భదేవాలయం’కన్న ‘గర్భగుడి’ ఉచ్చారణ పరంగా సాఫీగా, హాయిగా ఉంటుంది. అదేవిధంగా జీవగర్ర కూడా వైరి/దుష్ట సమాసమే. ఎందుకంటే, జీవము సంస్కృతసమ శబ్దం కాగా, కర్ర అచ్చతెలుగు పదం. కర్రకు బదులు కాష్ఠము అనే తత్సమాన్ని కలిపి జీవకాష్ఠము అని రాయొచ్చు. కాని, ఉచ్చారణ పరంగా జీవకాష్ఠముకన్న జీవగర్రనే హాయిగా, సాఫీగా ఉంటుంది. జీవగర్ర కూడా అనింద్య గ్రామ్యమే. అయితే మహాపండితులే అట్లా రాసినప్పుడు మనమెందుకు రాయకూడదు అని తర్కించకూడదు.

*కోర్టు ఇచ్చిన ఆ తీర్పు హిందూత్వ శక్తులకు చెంపపెట్టు.
*పశువుతో పశుత్వం, మృదువుతో మృదుత్వం, శత్రువుతో శత్రుత్వం ఏర్పడినప్పుడు హిందువుతో హిందుత్వం ఏర్పడాలి తప్ప, హిందూత్వం కాదు.

*పుట్టిన పాప పురిటిలోనే చనిపోయింది.
*పురిటి (పురుటి) అంటే పురుడు యొక్క అవుతుంది. కనుక, పురుడు తాలూకు వాసనను పురిటి (పురుటి) వాసన అంటాం. పై వాక్యంలో ‘యొక్క’ అన్వయం లేదు కనుక, పురుడులోనే చనిపోయింది అనాలి. అదే విధంగా ‘నీ చేయిని చాచు’ సరైన వాక్యం. ‘నీ చేతిని చాచు’ అవసవ్యమైనది. చేతిబలం, చేతివేళ్లు అనొచ్చు. ఎందుకంటే, ఆ పదాలు చేయి యొక్క బలాన్ని/వేళ్లను సూచిస్తాయి. గోతిని తవ్వారు అనకుండా గొయ్యిని తవ్వారు అని రాయడమే ఎక్కువ సమంజసంగా ఉంటుంది. మళ్లీ గోతిలోతు, గోతివెడల్పు అనొచ్చు – గోతి యొక్క లోతు, గోతి యొక్క వెడల్పు అనే అర్థాలను సూచించే విధంగా.

*జైలుకెళ్లి వచ్చాకా అదే తీరు.
*వచ్చాక బదులు వచ్చాకా అని రాయటం అప్పుడప్పుడు చూస్తుంటాం మనం. మొన్నమొన్నటి దాక ఆ దీర్ఘంవల్ల అర్థంలో మార్పు ఉండేది కాదు. ‘దాకా’, ‘లాగా’ మొదలైన పదాలలాగ అన్నమాట. కాని, పై వాక్యంలో ‘క’ కు ఆ దీర్ఘం అర్థంలో మార్పును సూచిస్తోంది. ఈ వాక్యంలో జైలుకెళ్లి వచ్చాకా అంటే వచ్చింతర్వాత కూడా అన్నది ఉద్దేశిత భావం. కాని, జైలుకెళ్లి వచ్చింతర్వాత కూడా అదే తీరు – అని రాస్తేనే సవ్యంగా ఉంటుంది. అయితే, ఆధునిక వ్యవహారంలో కొందరు కొన్ని పదాల అంతాలకు దీర్ఘాన్ని కలిపి వాడుతున్నారు, ఉదాహరణకు, ‘గురించి’కి బదులు ‘గురించీ’ అని వాక్యం మధ్యలో రాసేవాళ్లెందరినో నేనెరుగుదును.

*హోటల్ పరిసరాల్లో అపరిశుభ్రం.
*ఈ వాక్యాన్ని ‘హోటల్ పరిసరాలు అపరిశుభ్రం’ అని గానీ, ‘హోటల్ పరిసరాల్లో అపరిశుభ్రత’ అని గానీ మార్చి రాస్తే కరెక్టుగా ఉంటుంది. ఎందుకంటే అపరిశుభ్రం నామవాచకం కాదు. అది విశేషణం. ఇంట్లో dirty ఉంది అనడం తప్పు. Dirtiness ఉంది అనడమే రైటు. లేదా, ఇల్లు dirty గా ఉంది అనాలి.

*అధికారులు వ్యాపారులు కుమ్మక్కు.
*ఈ వాక్యం ద్వారా చెప్పదల్చుకున్నది, రెండు వర్గాలవారు కలిసి ఏదో తప్పు చేశారు/చేస్తున్నారు అని. కాని, ఎటువంటి గందరగోళమూ లేకుండా ఉండాలంటే, ‘అధికారులు వ్యాపారులతో కుమ్మక్కయ్యారు’ అని మార్చాలి ఈ వాక్యాన్ని. ఈ రకానికి చెందిన మరికొన్ని దోషాలను ఉదాహరించవచ్చు. ఉదాహరణకు, మనిషికీ జంతువుకూ భేదం ఉండాలి అని రాస్తారు చాలా మంది. మనిషికీ జంతువుకూ మధ్య భేదం ఉండాలి అనేదే సరైన వాక్యం.

*కాస్త పెదవులకు కోల్డ్ క్రీమ్ రాసుకో.
*ఈ వాక్యంలోని ‘కొంచెం’ (కాస్త) కోల్డ్ క్రీమ్ కు వర్తించాలి. కాని, ఇక్కడ కోల్డ్ క్రీమ్ ను మొత్తం పెదవులకు కాకుండా ‘కాస్త పెదవులకు’ మాత్రమే రాసుకో అనే అర్థం వస్తోంది! అంటే, మొత్తం పెదవులకు కాదన్న మాట. కనుక, పెదవులకు కాస్త కోల్డ్ క్రీమ్ రాసుకో – అని రాస్తేనే వాక్యం సరిగ్గా ఉంటుంది.

*అమెరికాకు భారత్ నిజమైన మిత్రుడు.
*మన దేశాన్ని భరత మాత, భారత మాత అని పిల్చుకుంటున్నాం మనం. అంటే అది స్త్రీ లింగమన్న మాట. మరిక్కడ మిత్రుడు అన్నప్పుడు పుల్లిగమవుతోంది! ఇంగ్లిష్ లో India is a true friend of U.S. అనే వాక్యంలో ఎబ్బెట్టుతనమేదీ గోచరించదు. కాని, మన దేశం వేరొక దేశానికి మిత్రుడు అనగానే ఆ ‘డు’ వల్ల ఏదోలా అనిపిస్తుంది. ఈ ఎబ్బెట్టుతనాన్ని నివారించాలంటే అమెరికాకు భారత్ నిజమైన మిత్రదేశం అనవచ్చు. మళ్లీ పాకిస్తాన్ భారత్ కు శత్రువు అని రాస్తే అందులో ఏ ఎబ్బెట్టుతనమూ స్ఫురించదు. ఎందుకంటే, ‘శత్రువు’ ఉభయ లింగం కనుక. ‘డు’ వల్లనే వచ్చింది ఈ తంటా అంతా! అమెరికాకు భారత్ నిజమైన నేస్తం అని రాస్తే కూడా ఎలాంటి ఇబ్బందీ ఉండదు.

*పరాకాష్టకు చేరిన వికృతం.
*ఈ వాక్యభాగం (ఉపశీర్షిక) లో ముందు పరాకాష్ట తప్పు. పరాకాష్ఠ సరైన పదం. ఇక ‘వికృతం’ నామవాచకం కాదు, అది విశేషణం. వికృతం అంటే Ugly. కాని, మనం ఇక్కడ Ugliness ను తెలుగులో రాయాలి. కాబట్టి, పరాకాష్ఠకు చేరిన వికృతత్వం అనాలి. లేదా, పరాకాష్ఠకు చేరిన వికృత చేష్టలు అనొచ్చు. ‘తం’తో అంతమయ్యే ఎన్నో పదాలు నామవాచకాలు కావడం వలన, వికృతం కూడా నామవాచకం అని భ్రమిస్తాం మనం. ఫలితం, మారుతం మొదలైన చాలా పదాలు నామవాచకాలే. అలాగే నైపుణ్యం, శౌర్యం, సోయగం, దుండగం – ఈ పదాలన్నీ సున్నతో ముగుస్తాయి. ఇవి కూడా నామవాచకాలు. సున్నతో, ‘తం’తో ముగిసే ఇటువంటి పదాలెన్నటినో చాలా సార్లు నోటిద్వారా విని, అచ్చులో చూసి, వికృతం కూడా నామవాచకం అని మనసులో ఒక ఊహను బలపరచుకుంటాం. అదే ఈ తికమకకు కారణమౌతుంది.

*ఆ పాత మధురాలు
*ఆపాతము అనే ఒక పదముంది. దాని అర్థం మంచి చెడ్డలాలోచించక అనుభవించుట. కాని, ఇక్కడ ఆనాటి పాత (old) – అని చెప్పడం ప్రధానోద్దేశం. కాబట్టి, అట్లా విడిగా రాయడం సరైనదే. అయితే మధురం నామవాచకం కాదు, విశేషణం. విశేషణాలకు బహువచనాలుండవు. ఉదాహరణకు wonders ఉంటుంది కాని wonderfuls అనే పదం ఉండటానికి వీల్లేదు. అదే విధంగా beautifuls ఉండదు, beauties ఉంటుంది. కనుక పై వాక్యాన్ని ఆ పాత మాధుర్యాలు (అంటే ఆ పాత పాటలలోని తియ్యదనాలు) అని సవరించాలి. మోహనాలు, మనోజ్ఞాలు, విశాలాలు, శీతలాలు మొదలైన పదాలను చాలా మంది వాడుతుంటారు. కాని, అవన్నీ విశేషణాలు కనుక, అట్లా రాస్తే అవి తప్పులవుతాయి. మోహనత్వాలు, మనోజ్ఞతలు, వైశాల్యాలు, శీతలత్వాలు అని రాస్తేనే కరెక్టు.

*జల పిడుగు
*కావ్యరచనకు బదులు కావ్య రాత అని రాసినట్టుగా ఉంది ఈ పదబంధం. లేదా తాళపత్రాలుకు బదులు తాళ ఆకులు అన్నట్టుగా…! ఎబ్బెట్టుతనాన్ని సంతరించుకున్న ఇటువంటి వైరి సమాసాలను మానుకోవడం అసాధ్యమైన పనేం కాదు. జల పిడుగు అనే బదులు ‘పిడుగై తగిలిన జలసమస్య/నీటి సమస్య’ అనొచ్చు.

*ఆల్టర్నేట్ రూట్లు
*Alternate కు alternative కు మధ్య ఉన్న భేదాన్ని గమనించకపోవటం వల్ల వచ్చిన చిక్కు ఇది. Alternate అంటే ఒకటి విడిచి ఒకటి. ఉదాహరణకు సోమ, బుధ, శుక్ర వారాలు alternate days. అదేవిధంగా జనవరి, మార్చ్, మే నెలలు alternate months. కాని, ఈ వాక్యభాగంలో ఉద్దేశింపబడిన భావం ప్రత్యామ్నాయం అని. ఈ తెలుగు పదాన్ని ఇంగ్లిష్ లో alternative అనాలి. కాబట్టి ఆల్టర్నేటివ్ రూట్లు అనటం సరైనది. ఈ విషయాన్ని నేను భాషాసవ్యతకు బాటలు వేద్దాం అనే నా పుస్తికలో ఇదివరకే ప్రస్తావించాను. ఇక ఈ శీర్షిక కింద ఇచ్చిన విషయంలో రూట్లను రహదారులు అన్నారు. ఇది తప్పని భావిస్తారు కొందరు. రహదారి highway కు మాత్రమే సమానమైన పదమని తలుస్తారు. కాని, నిఘంటువుల ప్రకారం రహదారి అంటే అందరూ పోయేందుకు ఉద్దేశింపబడిన దారి అని అర్థం. రాచమార్గం/రాచబాట బహుశా రాజులు మాత్రమే వెళ్లేందుకు ఉద్దేశింపబడిన దారి కావచ్చు.

*చురుకైన మెదడుకు….
*మెదడు చురుకుగా ఉండాలంటే ఏమేం తినాలో కింద వివరించారు. అయితే శీర్షికలో మెదడుకు బదులు మెదడు కోసం అని రాస్తే మరింత సవ్యంగా ఉంటుందని నా అభిప్రాయం. ‘కు’ ఆంగ్లంలో to ను మాత్రమే కాకుండా for ను కూడా సూచిస్తుంది. ఈ శీర్షిక కింద రాయబడిన వస్తువుల జాబితా కేవలం మెదడు కోసం అవసరమైన తినుపదార్థాలనే తెలుపుతుంది. అంటే for అనే అర్థం అన్వయం కావాలన్న మాట. అటువంటప్పుడు ‘చురుకైన మెదడు కోసం’ అని రాస్తే అది కేవలం for ను మాత్రమే సూచిస్తుంది.

*దిక్కు మాలిన శరణార్థులను జైళ్లలో పెట్టాలని అమెరికా భావిస్తోంది.
*దిక్కు మాలిన అనే ప్రయోగం తిట్టులాంటి దాన్ని సూచిస్తుంది. ఉదాహరణకు దిక్కు మాలిన వెధవ, దిక్కు మాలిన ఉద్యోగం, దిక్కు మాలిన సినిమా మొదలైనవి. కాని, పై వాక్యం ద్వారా చెప్పదల్చుకున్న భావం అది కాదు. నిస్సహాయులైన వాళ్లకు అనేదే చెప్పదల్చుకున్న భావం. కనుక దిక్కు లేని/దిక్కు కరువైన శరణార్థులను….. అని రాయటమే కరెక్టు.

*మూత్రం బాగా రావాలంటే సక్రమంగా పని చెయ్యాల్సింది కిడ్నే.
*మీరు వేసింది మంచి ప్రశ్నే అనే వాక్యంలో చివరి పదం ఎట్లా ఏర్పడింది? ప్రశ్న + ఏ = ప్రశ్నే అవటం వల్లనే కదా! బావిలోకి దిగడానికి మెట్లే లేవు అనే వాక్యంలో మెట్లు + ఏ = మెట్లే అయింది. అదే విధంగా సాంబారులో నాకు ఇష్టమైనది క్యారెటే అన్నప్పడు క్యారెట్ + ఏ = క్యారెటే అయింది. ఆయన మంచి మనిషే అన్నప్పుడు మనిషి + ఏ = మనిషే అయింది. అంటే అకార, ఉకార, ఇకారాలతో అంతమయ్యే హ్రస్వ పదాలు, లేక దృతము (నకారపు పొల్లు)తో ముగిసే పదాలు ‘ఏ’తో కలిసి ఏకారాంత పదాలను (ప్రశ్నే, మెట్లే, క్యారెటే, మనిషే) ఏర్పరుస్తాయన్న మాట. వీటిలోని మూలపదాలైన ప్రశ్న, మెట్లు, క్యారెట్, మనిషి హ్రస్వాంతాలు. కాని, దీర్ఘాంతాలైన పదాలకు ‘ఏ’ కలిసినప్పుడు ఏకారాంత పదం రాకుండా ‘యే’ లేక ‘నే’ చేరడం సరైనది. ఉదాహరణకు, నాకు ఇష్టమైన చెప్పుల దుకాణం బాటాయే/బాటానే అనాలి. బాటే అనకూడదు. ఆ పాటను పాడింది బాలూయే/బాలూనే అనాలి. బాలే కూడదు. అదే విధంగా, నువ్వు చెప్పాల్సింది సారీయే/సారీనే అనాలి తప్ప సారే అనకూడదు. ఈ సూత్రం ప్రకారం పై వాక్యంలో చివర కిడ్నే అని కాకుండా కిడ్నీయే/కిడ్నీనే అని ఉండటమే సమంజసం.

ఆంగ్ల పదాలను తెలుగు లిపిలో రాసేటప్పుడు ఏర్పడే గందరగోళం అంతా యింతా కాదు. ఉదాహరణకు, గోడకు ఉన్న పటాన్ని చూడు అనకుండా గోడకు ఉన్న మాప్ ను చూడు అన్నప్పుడు, మాప్ (mop) అనే మరో ఆంగ్ల పదం స్ఫురణలోకి వచ్చి గందరగొళాన్ని కలిగిస్తుంది. మాప్ (mop) అంటే తుడిచే గుడ్డ, లేక చివరన తుడుపు గుడ్డ కట్టబడి వున్న పొడవైన కర్ర. ఈ అయోమయాన్ని నివారించాలంటే మాప్ అనకుండా మ్యాప్ (map) అనక తప్పదు. ఆంగ్లంలో map, mop అనే పదాలున్నాయి కాని, భిన్నమైన అర్థానికి దారి తీసే myap అనేది లేదు. నిజానికి map కు మ్యాప్ సరైన ఉచ్చారణ కాదు. కాని, కనీసం అది మరో భిన్నమైన ఆంగ్ల పదాన్ని సూచించదు. అదే విధంగా cap ను క్యాప్ అనక తప్పదు. కాప్ అని రాస్తే అది పోలీసు (cop) ను సూచించే ప్రమాదముంది!

*ఆస్పత్రి అమానుషం
*Inhumanity of the hospital అనేది చెప్పదల్చుకున్న భావమైతే ఈ ప్రయోగం సరైనది కాదు. ఎందుకంటే అమానుషం నామవాచకం కాదు, అది విశేషణం. అక్కడ నామవాచకాన్ని ఉద్దేశించాలనుకుంటే అమానుషంకు బదులు అమానుషత్వం సరిపోయే పదం. Inhuman hospital అనదల్చుకుంటే అమానుష(మైన) ఆస్పత్రి అని రాయాలి.

*కనీసం ప్రతి మండలానికి ఒక గ్రంథాలయం ఉండాలి.
*ఇక్కడ ‘కనీసం’ ప్రతి మండలానికి అనే పదాలకు వర్తిస్తున్నది. కాని, అది ‘ఒక గ్రంథాలయం’కు వర్తించే విధంగా ఉండటమే కరెక్టు. కనుక, ప్రతి మండలానికి కనీసం ఒక గ్రంథాలయం ఉండాలి అనే వాక్యమే సరైనది. ఈ భాషాదోషం దాదాపు అన్న పదాన్ని వాడేటప్పుడు తలెత్తే దోషంలాంటిదే.

*మనిషినీ సంస్కృతినీ వేరు చేసే ధోరణులు ప్రమాదకరమైనవి.
*ఈ వాక్యం ఏం చెప్తోంది? విడివిడిగా మనిషిని దేని నుండో, సంస్కృతిని దేని నుండో వేరు చేసే ధోరణులు……. అని కదా. కాని, నిజంగా చెప్పదల్చుకున్న భావం అది కాదు. చెప్పాలనుకున్న భావాన్ని సరిగ్గా వ్యక్తీకరించాలంటే, ఈ వాక్యాన్ని ఇలా తిరగ రాయాలి: మనిషిని సంస్కృతినుండి వేరు చేసే ధోరణులు ప్రమాదకరమైనవి.

*శాఖాహారం తేవాలన్నది బీజేపీ కుట్ర.
*‘శాఖాహార, మాంసాహార భోజన హోటల్’ అనే బోర్డులను మనం తరచుగానే చూస్తుంటాం. వెజిటేరియన్ ను శాఖాహార/శాఖాహారి అనటం సరి కాదు. శాఖ అంటే కొమ్మ. మరి ఆ హోటల్లో కొమ్మలు కలిపిన భోజనాన్ని వడ్డిస్తారా? నాన్ వెజిటేరియన్ కరీ (curry) కి సరైన పదం శాకం. ఉత్తర తెలంగాణ జిల్లాలో ఈ పదం ఎక్కువగా వాడుకలో ఉంది. వెజిటేరియన్ ను శాకాహార/శాకాహారి అనటమే కరెక్టు.

*తొలి అణుప్రయోగం ఇక్కడే.
*అణ్వస్త్ర ప్రయోగం ఉంటుంది కాని, అణుప్రయోగం ఉండదు. ఒకవేళ ఉన్నా ఇక్కడ చెప్పదల్చుకున్న పదం అది కాదు. కాబట్టి, అణ్వస్త్ర ప్రయోగం అని రాయాలి.

*శూన్యంలోంచి అడిగిన వస్తువును తీసిచ్చే బాబా.
*ఈ వాక్యంలో రెండు క్రియలున్నాయి. మొదటిది అడగటం (అడిగిన), రెండవది తీసివ్వటం (తీసిచ్చే). ‘శూన్యంలోంచి’ని మొదటి క్రియకు ముందు ఉంచితే కర్త శూన్యంలోంచి మొదటి క్రియను చేశాడనే అర్థం వస్తుంది. కాని చెప్పదల్చుకున్న భావం అది కాదు. బాబా శూన్యంలోంచి వస్తువును తీసిస్తాడనేది అసలైన భావం. దాన్ని ఏ గందరగోళమూ లేకుండా చెప్పాలంటే, ‘శూన్యంలోంచి’ని రెండవ క్రియ ముందు ఉంచాలి. అంటే, అడిగిన వస్తువును శూన్యంలోంచి తీసిచ్చే బాబా, అని రాయాలన్న మాట.

*శతృ దుర్బేధ్యమైన కోట గోలకొండ.
*ఇక్కడ వాక్యనిర్మాణంలో లోపమేమీ లేదు కాని, మూడు చోట్ల అక్షరాలు తప్పుగా ఉన్నాయి. శత్రువును శతృవు అని, మిత్రుడిని మితృడు అని కొందరు రాయటం అక్కడక్కడా చూస్తుంటాం మనం. అదేవిధంగా ధ్రువాలు అనేబదులు ధృవాలు అనీ, ధ్రువపరచడంకు బదులు ధృవపరచడం అనీ రాయటం అంత అరుదైన విషయమేం కాదు. కాని, అవి తప్పులు. ఇక దుర్భేద్యముకు బదులు దుర్బేధ్యము అనటం కూడా తప్పే. భేదము అని కాక బేధము అని తప్పుగా రాసేవాళ్లు చాలా మందే ఉంటారు. కాబట్టి, శత్రుదుర్భేద్యమైన కోట అని రాయడమే సరైనది. అంటే తృ, ర్బే, ధ్య – ఈ మూడు అక్షరాలు తప్పన్న మాట.

*ఇంటివద్దనే అవసరమైన పత్రాలను స్వీకరించి నల్లాలను మంజూరు చేస్తామని అధికారి చెప్పారు
*ఈ వాక్యంలో చెప్పబడిన పత్రాలు కేవలం ఇంటివద్దనే అవసరమైనవా? బయట ఆఫీసుల్లో వీటి అవసరం లేదా? ఇటువంటి అనుమానాన్ని కలిగిస్తున్నది ఈ వాక్యం. కనుక, అవసరమైన పత్రాలను ఇంటివద్దనే స్వీకరించి…..అని రాస్తే ఏ గందరగోళమూ ఉండదు.

*దిగజారిన ఎగుమతులు
*దిగజారడం అంటే సాధారణంగా నైతికంగా పతనమవటం అనే అర్థం వస్తుంది కనుక, తగ్గిన ఎగుమతులు అని రాస్తేనే సరిగ్గా ఉంటుంది. అదే విధంగా దిగజారిన బంగారం ధర అనకుండా దిగిన లేక తగ్గిన బంగారం ధర అనడమే సరైనది.

*ప్రాణాలను ఫణంగా పెట్టి పోరాడిన సిపాయి.
*ఫణము అంటే పడగ. ఫణి అంటే పాము (ఫణమును కలిగినది). పణము అంటే పందెం. ప్రాణాన్ని పణంగా ఒడ్డటమంటే/పెట్టటమంటే వేరొకరి ప్రాణాలకొరకు తన ప్రాణాన్ని అడ్డంగా పెట్టటం కనుక, ప్రాణాలను పణంగా పెట్టి పోరాడిన సిపాయి అని తిరగరాయాలి ఈ వాక్యాన్ని.

*గన్ మెన్ లు అవసరం లేదంటూ తిప్పి పంపిన ఎమ్మెల్యే.
*పోస్ట్ మన్ (postman) అంటే తపాలా బంట్రోతు. బ్యాట్స్ మన్ (batsman) అంటే బ్యాటింగ్ చేసే క్రికెట్ ఆటగాడు. గ్యాంగ్ మన్ (gang man) అంటే రోడ్డును కానీ రేల్వే లైన్ ను కానీ సంరక్షించే ఉద్యోగులలోని ఒకడు. ఇవన్నీ ఏకవచన నామవాచకాలు. వీటికి బహువచనాలు పోస్ట్ మెన్ (postmen), బ్యాట్స్ మెన్ (batsmen) గ్యాంగ్ మెన్ (gang men). కాబట్టి గన్ మెన్ లు, బ్యాట్స్ మెన్ లు అనకూడదు. గన్ మెన్, బ్యాట్స్ మెన్ అనాలి.

*కాశ్మీర్ లో ఉద్రిక్తం
*ఈ వాక్యాన్ని ఎన్నో రకాలుగా సరైన రీతిలో రాయొచ్చు. కాశ్మీర్ లో ఉద్రిక్తత అనొచ్చు. లేదా కాశ్మీర్ లో ఉద్రిక్త పరిస్థితి అనొచ్చు. కాశ్మీర్ లో పరిస్థితి ఉద్రిక్తం అనేది కూడా బాగానే ఉంటుంది. ఇక ఈ మధ్య కాశ్మీర్ అని కాక కశ్మీర్ అని రాస్తున్నారు. ఇది సబబే.

*నీలాగా గట్టిగా పెళ్లి చేసుకోమని ఎవ్వరూ నాకు సలహా ఇవ్వలేదు సురేశ్! (సవరణల కోసం నాకు వచ్చిన ఒక కథలోని వాక్యం)
*ఇక్కడ ‘నీలాగా పెళ్లి చేసుకోవడం’ అనే భావమూ, ‘గట్టిగా పెళ్లి చేసుకోవడం’ అనే భావమూ – రెండూ స్ఫురిస్తున్నాయి. కాని, నిజానికి ఈ రెండింటిలో ఏదీ ఉద్దేశింపబడిన అర్థం కాదు. ‘నీలాగా సలహా ఇవ్వలేదు’ అనేదే అసలు ఉద్దేశం. కనుక, ఈ వాక్యాన్ని ఇట్లా తిరగ రాస్తే సవ్యంగా ఉంటుంది: పెళ్లి చేసుకోమని ఎవ్వరూ నీలాగా గట్టిగా సలహా ఇవ్వలేదు సురేశ్.

*అక్షయ త్రితీయ నాడు బంగారం ఎందుకు కొంటారు?
*తృతీయను ‘త్రుతీయ’ అని పలకకూడదు, త్రితీయ అని పలకాలనేది నిజమే. కాని, త్రితీయ అని రాయకూడదు, తృతీయ అనే రాయాలి. మరొక చోట అచ్చులో హ్రిదయం అనే పదాన్ని చూశాను. ఇక్కడ కూడా పైన చెప్పిందే వర్తిస్తుంది. హృదయం అని రాయాలి, హ్రిదయం అని ఉచ్చరించాలి.

*ఎంక్వైరీ జరుగుతోంది. నివేదిక రాగానే సంఘటన ఎలా జరిగిందో తెలుస్తుంది.
*నివేదిక రాగానే (వచ్చిన వెంటనే) సంఘటన జరిగిందా? అట్లా జరగటానికి వీల్లేదే! కాబట్టి, ‘సంఘటన ఎలా జరిగిందో నివేదిక రాగానే తెలుస్తుంది’ అని రాయాలి.

*స్వచ్ఛతకు ప్రజా మద్దతు
*ప్రజ సంస్కృతసమపదం కాగా, మద్దతు అన్యదేశీయం. కనుక, ప్రజామద్దతు వైరిసమాసమవుతుంది. దాన్ని నివారించాలంటే, ‘స్వచ్ఛతకు ప్రజల మద్దతు’ అని రాయాలి.

*రత్నఖచిత కుటీరం రంగులీనుతోంది.
*ఈ వాక్యంలో అర్థప్రసరణ సరిగ్గా లేదని అర్థమవడానికి ఎక్కువ సమయం పట్టదు. కోటీరంకు బదులు కుటీరం అనే పదం వచ్చిందిక్కడ. దానికి కారణం ఎడిటింగ్ చేసేవాళ్లో, డి.టి.పి. చేసేవాళ్లో అయివుండాలి. ‘ఒక మెరిసే స్వప్నవైడూర్యాన్ని పొదిగిన సొంత కోటీరం కోసం…’ అని నేను ఒక కవితలో రాస్తే, బహుశా డి.టి.పి. చేసే వ్యక్తి కోటీరంను కుటీరంగా మార్చాడు. కవిత అట్లానే తప్పుతో ప్రచురితమైంది. ఇది తెలంగాణ మీద రాసిన కవిత. కోటీరం అంటే కిరీటం. అది పరిపాలనాధికారానికి సంకేతం. అయితే, డి.టి.పి. చేసే వ్యక్తి ఆ పదాన్ని బహుశా అంతకు ముందెప్పుడూ వినలేదేమో!

**** (*) ****