పదాల కచ్చితత్వం పట్ల పట్టింపు ఉన్నవాళ్లకు ఏదైనా పదం తాలూకు సరైన రూపం గురించిన సందేహం వస్తే, దాన్ని నివృత్తి చేసుకునేదాకా అశాంతితో వేగిపోతారు. ఇది సాహితీపరులకు ఉండాల్సిన మంచి లక్షణమని అందరూ ఒప్పుకుంటారనుకుంటాను. భాషకు సంబంధించిన జ్ఞానం బలంగా ఉంటే, అది రచన చేసేవాళ్లకు మంచి పునాదిగా పని చేస్తుందనటంలో అనుమానం లేదు. పదాల కచ్చితత్వాన్ని నిర్ధారణ చేసుకునే క్రమంలో ఎన్నో మలుపులు ఏర్పడవచ్చు, ఎంతో శ్రమ కలుగవచ్చు, ఎంతో కాలం పట్టవచ్చు. ఈ వ్యాసకర్త అటువంటి అశాంతిని ఎదుర్కున్న సందర్భాల్లోంచి కొన్నింటిని పేర్కొని, విపులంగా చర్చించడమే ఈ రచన ముఖ్యోద్దేశం.
మేధోమథనం: మేధోమథనం, మేధోసంపత్తి, మేధోశక్తి మొదలైన పదాలను మనం అచ్చులో తరచుగా చూస్తుంటాం. అయితే అవి సరైన పదరూపాలేనా? ఈ విషయం గురించిన సందేహాన్ని నివృత్తి చేసుకోవాలంటే ఆ పదాల సరైన అర్థాన్ని, భాష ప్రకారం వాటి కచ్చితమైన స్వభావాన్ని నిర్ధారణ చేసుకోవాలి. అంటే కొంచెం లోతుగానే పరిశీలించాలన్న మాట. తెలుగు భాషలో మేధస్సు అనే పదం లేనే లేదు. మేధ, మేదస్సు – ఈ రెండు పదాలు మాత్రం ఉన్నాయి. అయితే వీటి అర్థాల మధ్య గల భేదాన్ని గుర్తించాలి. మేధ అంటే ధారణాశక్తి గల బుద్ధి అనే అర్థం కనబడుతుంది ప్రామాణిక నిఘంటువుల్లో. దీన్నే వ్యవహారంలో స్థూలంగా తెలివి అనీ, ఆంగ్లంలో intelligence అనీ అంటాము. ఇక మేదస్సుకు అర్థం మెదడు. అంటే కన్ను, చెవి, కాలు, కాలేయము, గుండెకాయ, శ్వాసకోశము వంటి శరీరావయవం అన్నమాట. మేధ చేయితో స్పృశించలేనిది కాగా, మేదస్సును మనం స్పృశించవచ్చు. ఎందుకంటే అది భౌతిక పదార్థం. మేదస్సు ఉకారాంత నపుంసకలింగ పదం. డెబ్భయ్యేళ్ల వయసొచ్చినా ఆయన కళ్లు ఇంకా బాగానే ఉన్నాయి అనే వాక్యం ఉందనుకోండి. ఇందులో కళ్లు అంటే కంటిచూపు అని అర్థం. అదే విధంగా మేదస్సు (మెదడు) పదం కొన్నిసార్లు మేధాశక్తిని కూడా సూచిస్తుంది. మేధ సంస్కృతసమ శబ్దం. అది ఆకారాంత స్త్రీ లింగ శబ్దం కనుక, మరొక సంస్కృతసమ శబ్దంతో కలిసినప్పుడు మేధామథనం, మేధాసంపత్తి, మేధాశక్తి వంటి పదబంధాలు ఏర్పడుతాయి. ఇవి వ్యాకరణం ప్రకారం సవ్యమైనవి. వైరి/దుష్ట సమాసాలు కూడా కావు. ఇక మేదస్సు అచ్చ తెలుగు పదం అనిపిస్తుంది కాని, అది కూడా సంస్కృత విశేష్యమే. కాబట్టి, దీనితో కూడా సంస్కృతసమ శబ్దాలు సంయోజనం చెందినప్పుడు, భాష రీత్యా సరైన సమాసాలు ఏర్పడుతాయి. ఆ విధంగా మేదోమథనం, మేదోసంపత్తి మొదలైన పదాలు రూపొందే అవకాశముంది. కాని మేధోమథనం లాంటి పదాలు ఏర్పడే ప్రశ్నే లేదు. అసలు మేధస్సు అనే పదమే లేనప్పుడు మేధో అనేది ఎలా సాధ్యం? మేధా మాత్రమే సాధ్యం. ‘మేదస్సు’ ఉంది కాబట్టి మేదో సాధ్యం. లలితా సహస్రనామ స్తోత్రావళిలోని 105 వ స్తోత్రపు మొదటి పంక్తి ఇలా ఉంటుంది: మేదోనిష్ఠా మధుప్రీతా బందిన్యాది సమన్వితా. ఇక్కడ మేదోనిష్ఠా అని ఉండటం, మేధోనిష్ఠా అని లేకపోవటం మనం గమనించాలి. ఎందుకు లేదంటే, అది వ్యాకరణపరంగా తప్పు కనుక. ఈ పదానికి సంబంధించిన వివాదాన్ని భాషాపండితులెవరైనా అంతిమంగా పరిష్కరిస్తే సరైన రూపమే ముందు ముందు వాడుకలో ఉంటుందని నా ఆశ.
సమిష్టి: కొన్ని సంవత్సరాల క్రితం నేను నా గేయసంపుటిని ప్రచురిస్తున్న సందర్భంలో సమిష్టి అనే పదాన్ని వాడటం జరిగింది. అయితే పుస్తకం అచ్చుకు పోకముందు ఒకాయన సమిష్టిని సమష్టిగా సవరించాడు. పుస్తకం అచ్చయింతర్వాత మరొక పెద్దాయన సమష్టి తప్పు, సమిష్టి సరైన పదం అన్నాడు. నేను మొదట అనుకున్నదే సరైన రూపమని ఉబ్బిపోయాను. కాని, తిరుమల రామచంద్ర గారు రాసిన ‘పలుకుబడి’ గ్రంథాన్ని తర్వాత చదివినప్పుడు, అందులో సమష్టి అన్నదే సరైన రూపమని రచయిత సోపపత్తికంగా నిరూపించిన విషయాన్ని గ్రహించాను. అంటే నా అవగాహనే తప్పు అని నిరూపితమైందన్న మాట. ఆ విధంగా ఈ పదానికి సందేహ నివారణ చేసుకునే క్రమంలో ట్విస్టులు (మలుపులు) సంభవించాయి.
యదార్థం: కొన్ని సంవత్సరాల క్రితం నేను ఒక కవితలో యదార్థం అనే పదాన్ని వాడాను. నా సమిష్టిని సమష్టిగా సవరించిన కవే యదార్థం తప్పు, యథార్థం సరైన పదం అని చెప్పడంతో నాకు కొంచెం అభిమానం దెబ్బ తిన్నట్టనిపించి, యదార్థం కరెక్టు అని చిన్నగా వాదించాను. నా ఆత్మవిశ్వాసానికి కారణమేమంటే, సాధారణంగా ఒకే పదంలో పక్కపక్కన వున్న అక్షరాలు వత్తులతో కూడుకున్నవి (మహా ప్రాణాక్షరాలు) కావటం చాలా అరుదు. అటువంటి పదాలకోసం ఎంత ఆలోచించినా ఝంఝ, అంభోధరము వంటి కొన్ని పదాలనే గుర్తించగలిగాను. కాని, ఈ పదం విషయంలో కూడా నా అవగాహన తప్పు అని నిరూపితమైంది. నిఘంటువులను పరిశీలిస్తే, యదార్థం తప్పు అనీ, యథార్థం కరెక్టు అనీ తేలిపోయింది. ఈ రెండు పదాల సరైన రూపాలను (సమష్టి, యథార్థం) నాకు తెలిపినవారు అమ్మంగి వేణుగోపాల్ గారు.
జగదోద్ధారణ: పురందర దాసు రచించి స్వరబద్ధం చేసిన ‘జగదోద్ధారణ ఆడిసిదళెశోదె’ అనే కీర్తన (పదము) ప్రసిద్ధమైనది. ఇది హిందుస్తానీ కాపీ రాగంలో ఉంది. అయితే జగదోద్ధారణ కరెక్టేనా? జగత్ + అంబ = జగదంబ. జగదాంబ కాదు. అదే విధంగా జగత్ + ఉద్ధారణ = జగదుద్ధారణ కావాలి. ఇవి జశ్త్వసంధులు. ‘జగద(ము)’ ఉంటే దానితో ఉద్ధారణ కలిసి జగదోద్ధారణ (గుణసంధి) అయ్యే అవకాశముంది. కాని, తెలుగులో జగదము పదం లేదు. అయితే ఇక్కడ ఒక తిరకాసు వుంది. పురందర దాసు ఆ కీర్తనను రచించింది కన్నడంలో – తెలుగులో కాదు. అందువలన, కన్నడంలో ఉన్న పదాల ప్రకారం జగదోద్ధారణ సరైనదే కావచ్చు – ఒకవేళ ఆ భాషలో జగద అనే పదం ఉంటే. కన్నడం తెలిసిన ఒకరిద్దరు మిత్రులను (అందులో ఒకరు కన్నడభాషలో నిష్ణాతులు) కోరితే వారు కన్నడ నిఘంటువులలో వెతికి, ఆ భాషలో కూడా తెలుగులోలాగా జగతి, జగత్, జగత్తు మాత్రమే ఉన్నాయని చెప్పారు. అంటే ఏమిటి? తెలుగులో అయినా కన్నడంలో అయినా, జగదుద్ధారణ మాత్రమే సరైన పదమన్న మాట. జగదుదర అనే పదం కన్నడ నిఘంటువుల్లో ఉంది. ఈ పదానికి కూడా తెలుగులో లాగానే జగత్ + ఉదర = జగదుదర సంధి విచ్ఛేదం అవుతుంది. ఉకారంతో మొలయ్యే ఉదర, జగత్ తో కలిసి జగదుదర ఏర్పడినప్పుడు, ఉకారంతో మొదలయ్యే ఉద్ధారణ జగత్ తో కలిసి జగదుద్ధారణ ఏర్పడవలసిందే. ఎందుకంటే ఉదర, ఉద్ధారణ – ఈ రెండూ ఉకారంతో ప్రారంభమయ్యే సంస్కృత విశేష్యాలే. రెండూ నపుంసక లింగానికి చెందిన పదాలే. పాణ్యం రామశేష శాస్త్రి గారు పురందర దాసుల వారి 125 పదములను తెలుగులోనికి అనువదించారు. ఆ గ్రంథంలో పేర్కొనబడిన మూలకృతులను – కన్నడభాష లోనివి – పరిశీలిస్తే ఈ పదం (కీర్తన) మొదటి పంక్తి జగదుద్ధారన ఆడిసిదళెశోదె అనే ఉంది. జగదోద్ధారణ అని లేదు. జగదోద్ధారణ పదం వ్యాప్తిలోనికి రావడానికి మనం రెండు మూడు వివరణలను ఇచ్చుకోవచ్చు. పురందర దాసు జగదుద్ధారణ అనే రాసి, పాడి ఉండవచ్చు. తర్వాతి గాత్రసంగీత విద్వాంసులలో ఎవరో ఒకాయన జగదోద్ధారణ అని పాడితే అనంతరం అందరూ అట్లానే పాడుతూ ఉండవచ్చు. లేదా, జగదుద్ధారణ సరైన పదమని పురందర దాసుకు తెలిసినా గాయనసౌలభ్యం కోసం జగదోద్ధారణ అని మార్చి పాడి ఉండవచ్చు. దీన్ని కూడా పండితులెవరైనా పరిష్కరిస్తే బాగుంటుంది. శాస్త్రీయ సంగీతం ప్రస్తావనకు వచ్చింది కాబట్టి, దాన్ని పాడేటప్పుడు విరుపుల కారణంగా భాషకూ, భావప్రకటనకూ భంగం వాటిల్లడం గురించి కొంచెం రాయాలనిపిస్తున్నది. అంటే పదాల ఉచ్చారణ పద్ధతిలో కచ్చితత్వం గురించి అన్నమాట. తెలుగువారు కానటువంటి గాత్రసంగీత కళాకారులు కర్ణాటక సంగీతంలోని కృతులను పాడినప్పుడు, విరుపుల దగ్గర ఎబ్బెట్టు అయిన పదరూపాలు ఏర్పడటం కొన్నిసార్లు జరుగుతుంది. ఉదాహరణకు త్యాగరాజ స్వామి వారి ‘ఏ తావునరా నిలకడ నీకు’ అనే కల్యాణి రాగంలోని కృతిలో ‘శివమాధవ బ్రహ్మాదుల యందా’ అన్నచోట బ్రహ్మా తర్వాత విరుపు కారణంగా దుల యందా అంటూ అక్కడనుండి మొదలు పెట్టి పాడుతారు. అదే విధంగా త్యాగరాజ స్వామి వారిదే అయిన శ్రీ రాగంలోని ‘ఎందరో మహానుభావులు’ ఉంది కదా. అందులోని ‘ఎందరో మహానుభావులందరీకీ’లో భావు తర్వాత విరుపు కారణంగా లందరీకీ నుండి మొదలు పెట్టి పాడుతారు. దీనికి ఆ గాయకులను ఎంతమాత్రం తప్పు పట్టలేము. ఎందుకంటే, అట్లా పాడేవారిలో దాదాపు అందరూ తమ మాతృభాష తెలుగు కానివాళ్లే. బాలమురళీ కృష్ణ గారు ఎప్పుడూ ఎందరో మహానుభావులు, అందరీకీ వందనములు అనే పాడేవారు. అదేవిధంగా సామరాగంలోని ‘మానస సంచరరే’ పాడినప్పుడు (ఇది సదాశివ బ్రహ్మేంద్ర కీర్తన), మదశిఖి పింఛ(ఛా), అలంకృత చికురే అని ఉచ్చరించారు తప్ప మదశిఖి పింఛాలంకృత చికురే అని పాడలేదు. ‘మదశిఖి పింఛాలంకృత’ భాష దృష్ట్యా సరైనదే కాని, కీర్తనగా పాడుతున్నప్పుడు పింఛా తర్వాత విరామం ఇచ్చి లంకృత నుండి పాడాల్సి ఉంటుంది కనుక, అక్కడ ఎబ్బెట్టుతనం చోటు చేసుకుంటుంది. ఎమ్మెస్ సుబ్బులక్ష్మి అమ్మ పాడేటప్పుడు కూడా కృతులలోని, కీర్తనలలోని పదాలను ఉచ్చరించే విధానం చాలావరకు దోషరహితంగా ఉంటుంది. తెలుగును క్షుణ్ణంగా నేర్చుకోవడం కోసం ఆమె ప్రత్యేకంగా ఒక తెలుగు భాషాపండితుణ్ని నియమించుకుని, సరైన ఉచ్చారణానైపుణ్యాన్ని సొంతం చేసుకున్నదట! శాస్త్రీయసంగీత గాయకులు ప్రాచీన కావ్యాలను బాగా చదివి ఉండాలి అని విదుషి కిశోరీ అమోన్కర్ వ్యాఖ్యానించడాన్ని మనమిక్కడ గమనించాలి. నళినకాంతి రాగంలో ‘మనవి యాలకించ రాదటే’ అని ఒక కృతి ఉంది. ఇది కూడా త్యాగరాజ కృతే. దీన్ని చాలామంది మనవ్యాలకించరాదటే అని పాడుతారు. త్యాగరాజ స్వామి అట్లా రాసివుంటాడని అనుకోలేము. కాబట్టి, ఆ విధంగా మార్చి పాడటానికి గల కారణాలు జగదోద్ధారణ విషయంలోని కారణాల వంటివే అయివుండాలి. శాస్త్రీయ సంగీతాన్ని వింటున్నప్పుడు సంగీతాన్ని ఆస్వాదించాలి తప్ప, సాహిత్యపరమైన సవ్యతకోసం వెతకవద్దు అనే వాదన చేస్తారు కొందరు. అయితే భాషను బాగా ప్రేమించేవారికి సంగీతాస్వాదన చేసే క్రమంలో అపశబ్దాలు ఆటంకాలుగా పరిణమించవచ్చు. సంగీతం రాని నేను నన్ను ఆ గాత్రసంగీత విద్వాంసుల ముందు సూర్యుని ముందు దివిటీతో, పర్వతం ముందు గులకరాయితో సమానుడిగా భావిస్తాను. భాషాపరమైన చర్చను చేసి, తద్వారా భాషాప్రేమికుల్లో ఉత్సాహాన్నీ ఉత్సుకతనూ రేకెత్తించడానికి ప్రయత్నించాలనే తప్ప, ఎవరినీ తప్పు పట్టడం ఈ వ్యాసకర్త ఉద్దేశం కాదు.
**** (*) ****
వ్యాసం చాలా బాగుంది.వివరణ సమ్మోదంగా ఉంది.మొన్నెవరో వ్యాహ్యాళి అని పెట్టారు.నాకు అనుమానం వచ్చి నిఘంటువులో చూస్తే వాహ్యాళి అని ఉంది.తెలియబరిస్తే సవరించుకుచన్నారు.ఋత్వంతో ఏర్పడే శబ్దాలను గురించి కూడా రాస్తే బాగుంటుంది.
మేధోమథనం, మేధోవలస అనే పదాలు సరియైనవి కావు. నిజమే, కానీ, మేధావి, మేధావిన్, మేధానిధి అన్న పదాలు సరియైవనే అయినప్పుడు మేధామథనం, మేధావలస అనే పదాలు తప్పెలా అవుతాయంటారు?
చాలా వివరణాత్మకంగా ఉంది మీ వ్యాసం. ధన్యవాదాలు.
-భాస్కర్ కూరపాటి.
రామ్మోహన్ గారూ, భాస్కర్ గారూ,
నా వ్యాసం మీకు నచ్చినందుకు సంతోషం, కృతజ్ఞతలు. భాష పరమైన రచనలను బాగా నచ్చేవాళ్లు ఈ రోజుల్లో కొంచెం అరుదే. మీరు స్పందించినందుకు ఆనందం కలిగింది.
అయ్యా, శ్రీనివాసుడు గారూ,
మీరు నా వ్యాసాన్ని మనసు పెట్టి ధ్యాసతో, కూలంకషంగా చదవలేదని తెలుపడానికి చింతిస్తున్నాను. దయచేసి, మళ్లీ ఒకసారి జాగ్రత్తగా చదవండి. మేధామథనం, మేధావలస అనే పదబంధాలు తప్పు అని నా వ్యాసంలో నేను చెప్పలేదు. పైగా అటువంటివి సవ్యమైనవే అన్నాను. మేధోమథనం, మేధోవలస అనేవే తప్పు అన్నాను. మీరు సూచించిన మరో సమాసం మేధానిధి వ్యాకరణపరంగా సరైనదే. ఇక ‘మేధావి’లో సంధివిచ్ఛేదం సాధ్యం అవుతుందా? మీరే చెప్పండి. శిరస్సు అనే పదం తెలుగుభాషలో ఉంది కనుక, దానికి సంస్కృతధాతువు అయిన శిరః, రత్నంతో కలిసి శిరోరత్నం ఏర్పడగలదు. అదేవిధంగా వయస్సుకు సంస్కృతధాతువైన వయః తో భేదము కలిసి వయోభేదం ఏర్పడుతుంది. వీటిని విసర్గసంధులు అంటారని నేను మీకు చెప్పే అవసరం లేదు. ఇవి మొత్తం తొమ్మిది రకాలో పదకొండు రకాలో ఉన్నాయి. వేరేరకం విసర్గసంధులలో రెండు ఉదాహరణలను మాత్రమే పేర్కొంటాను. అవేమిటంటే, మనః + సాక్షి= మనోసాక్షి కాదు, మనస్సాక్షి. ఇక వయః + పరిపాకము = వయోపరిపాకము కాదు, వయఃపరిపాకము. శిరస్సు, వయస్సు, మనస్సు అన్నవి తెలుగుభాషలో ఉన్నవి కనుక, వాటి ధాతువులతో వేరే పదాలు కలిసి సమాసాలు ఏర్పడటం సమంజసమే. కాని, మేధస్సు అన్న పదం తెలుగులో లేనే లేదు. మరోవిధంగా చెప్పాలంటే దానికి ధాతువైన రూపం సంస్కృతంలో లేదు. అటాంటప్పుడు మేధోమథనం, మేధోశక్తి వంటివి ఏర్పడటం ఎలా సాధ్యం? ‘మేధోవలస’ భాషాసవ్యత దృష్ట్యా ఇంకా దారుణం. ఎందుకంటే, ‘వలస’ తత్సమం (సంస్కృత సమమైన పదం) కాదు. కాబట్టి మేధోవలస వైరిసమాసమవుతుంది.
మేధస్సు
ఈ రెండింటిలో ఏ నిఘంటువు సరియైనదంటారు? మేధస్సు అనే పదం వున్నదని ఒక నిఘంటువు చెబుతోంది, రెండో నిఘంటువు ’మేదస్సు‘ అనే పదం వున్నదంటోంది.
మేధస్సు : శబ్దార్థ చింతామణి తెలుగు-ఉర్దూ (తాటికొండ తిమ్మారెడ్డిదేశాయి) 1906
[తె.] మెదడు -[ఉ.] భేజా
‘‘‘‘‘‘‘‘‘‘‘‘‘‘‘‘‘‘‘‘‘‘‘‘‘‘‘‘‘‘‘‘‘‘‘‘‘‘‘‘‘‘‘‘‘‘‘‘‘‘‘‘‘‘‘‘‘‘‘‘‘‘‘‘‘‘‘‘‘‘‘‘‘‘‘‘‘‘‘‘‘‘‘‘‘‘‘‘
మేదస్సు
మేదస్సు : శబ్దరత్నాకరము (బహుజనపల్లి సీతారామాచార్యులు) 1912
సం. వి. స్. న.
మెదడు.
మేధ, మేదస్సు – ఈ రెండు పదాలు ఎంత మాత్రం వివాదాస్పదాలు కావు. అవి దాదాపు అన్ని నిఘంటువుల్లో ఉన్నవి. కాబట్టి, మేదోమథనం, మేధాశక్తి మొదలైన పదబంధాలు భాష పరంగా సరైనవే. ‘మేధస్సు’ లేదు కనుక మేధోమథనం, మేధోశక్తి మొదలైనవి సరైనవి కావు. ఇదీ, ఇంత వరకు మనం చర్చించినది. అయితే, మేధస్సు అనే పదం శబ్దార్థ చింతామణి నిఘంటువులో ఉన్నదని మీరు తెలిపారు. నేను ఆంధ్రభారతి నిఘంటువును సంప్రదిస్తే నిజంగానే మీరన్నట్టుగానే ఆ నిఘంటువులో ఆ పదం ఉన్నదని విదితమైంది. అయితే, ఏ ఇతర నిఘంటువులో లేకుండా కేవలం శబ్దార్థ చింతామణిలో ఉన్నప్పుడు ఆ పదాన్ని సరైనదిగా అంగీకరించాలా వద్దా అనే సందేహం కలగడం సహజం. నిఘంటువులు కూడా మన సందేహాన్ని నివృత్తి చేయనప్పుడు భాషాజ్ఞానం బాగా ఉన్నవాళ్లను సంప్రదించడమే శరణ్యం కనుక, ఆచార్య రవ్వాశ్రీ హరి గారితో ఫోన్ లో మాట్లాడి సందేహాన్ని నివృత్తి చేసుకోగలిగాను. ఆ నిఘంటువులో ఉన్నంత మాత్రాన దాన్ని సరైనదిగా ఒప్పుకోలేమని జవాబిచ్చారు వారు. ఈ పదం గురించిన వివాదం అంతిమంగా పరిష్కృతమైనట్టే. మేధోమథనం, మేధోశక్తి,, మేధో వలస మొదలైన పదాలు దాదాపు అన్ని పత్రికలలో దర్శనమివ్వడం, ఆ కారణంగా దాదాపు అందరు కవులూ, రచయితలూ వాటిని యథేచ్ఛగా వాడటం నిజంగా విచారకరం. ఈ పదం గురించిన సందేహాన్ని నివృత్తి చేసుకోవడం పైన నాకుండిన కోరిక మీ వ్యాఖ్య కారణంగా మరింత బలపడి, ఈ విధంగా సత్ఫలితాన్నిచ్చింది. అందుకు మీకు నా కృతజ్ఞతలు.
Dr.Elanaga garu wrote a beautiful article. I’m a trianed journalist. Even though I didn’t know these things. Thanks to author and Vakili.
నాకు ఏ వ్యాకరణమూ తెలియదు. భాషా జ్ఞానమూ లేదు. మనస్సు, వయస్సు, ఉషస్సు, తమస్సు, రజస్సు లాగా మేధస్సు కూడా సరియైన పదమేమోనని నా అనుమానం.
మనం ఆచార్య రవ్వా శ్రీహరి గారి దగ్గరే ఆగనక్కరలేదేమోనని నా భావన. శబ్దార్థ చింతామణి వ్రాసినవారు చెప్పింది కూడా ఆలోచిద్దాం. నిఘంటువులలో వున్నంత మాత్రాన సరైనదిగా ఒప్పుకోనక్కర లేదు, అలాగని తప్పుగా భావించనక్కరా లేదు. పరిశీలన కొనసాగించడమే సరియైనది.
मेधस् m. medhas knowledge
मेधस् m. medhas understanding
मेधस् m. medhas intelligence
मेधस् n. medhas sacrifice
Many thanks Rajendraprasada Reddy garu, for your nice comments
.
చాలా ఉపయోగకరమయిన వ్యాసం. ధన్యవాదాలు ఎలనాగగారూ!
మొదట్లో జగదుధ్ధారణ అనే పాడివుంటారు. కాలక్రమేణా సాహిత్యానికీ, అర్థానికీ విలువ నివ్వనివాళ్ళవల్ల ఆ మార్పు కలిగి ఉంటుంది. అలాంటిదే ఇంకొకటి: రఘూత్తమరావు కు బదులు రఘోత్తమరావు అని పేరు చూడడం సాధారణం అయిపోయింది.
స్పందించినందుకు కృతజ్ఞతలు, శివకుమార శర్మ గారూ.
మీరు సూచించిన మరొక భాషాదోషం కూడా గమనించతగిందే. అట్లా సవర్ణదీర్ఘసంధికి బదులు గుణసంధితో పదాలను రాయడం అక్కడక్కడ చూస్తాం మనం. ఉదాహరణకు, భానూదయముకు బదులు భానోదయము అని రాసేవాళ్ల సంఖ్య మరీ తక్కువేం కాదు. అదేవిధంగా గురోత్తముడు తప్పు, గురూత్తముడు రైటు. ఇక పితృూణము అనే పదంలో సవర్ణదీర్ఘసంధి (పితృ + ఋణము = పితృూణము) ఉన్నదని తెలియనివాళ్లు కూడా తక్కువేం కాదు. అయితే, ఇది తెలియని తెలుగు భాషాపండితులుండరు బహుశా.
నా వ్యాసంలో కొన్ని సంధులను జశ్త్వసంధులుగా పేర్కొన్నాను. కొన్ని వ్యాకరణ గ్రంథాల్లో ఆ పదాన్ని చదివాను. కాని, ఎక్కువ వరకు జస్త్వసంధి అనే రాయబడింది ఇతర వ్యాకరణ పుస్తకాల్లో. ఎంత జాగ్రత్తా ఉన్నా అరుదుగా తప్పులు దొర్లడమనేది జరుగుతుంది. అయితే చాలా జాగ్రత్తను వహిస్తున్నామా లేదా అన్నది ముఖ్యమని నా అభిప్రాయం. గొప్పలు చెప్పుకోవడం కాదు గాని, పత్రికలకు పంపే ముందు రచనను దాదాపు వందసార్లు చెక్ చేసుకున్న సందర్భాలు కోకొల్లలు, నా విషయంలో. అయినా కొన్నిసార్లు ఇదిగో, ఇట్లా తప్పులు దొర్లుతుంటాయి.
మేధా శబ్దమున్నట్లే మేధస్ శబ్దమూ ఉంది. దాని సమమే మేధస్సు.
“కావ్యాన్యపి యదీమాని
వ్యాఖ్యాగమ్యాని శాస్త్రవత్।
ఉత్సవః సుధియామేవ
హంత! దుర్మేధసో హతాః॥” దండి.
ఇందులో ‘దుర్మేధసః’ అనే ప్రయోగంవల్ల ‘బుద్ధి’ అనే అర్థంలోనే ‘మేధస్’ శబ్దమున్నట్లు స్పష్టం.
मेधस्
मेधस्^2 medh-ás, -° = medhā, intelligence, understanding. -Mecdonell dictionary.
కాబట్టి, మేధోమథనం వంటివి సరియైన ప్రయోగాలే అని నా అభిప్రాయం.
భగవద్గీత
అన్తవత్తు ఫలం తేషాం తద్భవత్యల్పమేధసామ్|
దేవాన్దేవయజో యాన్తి మద్భక్తా యాన్తి మామపి|| 7-23 ||
నిత్య మసిచ్ ప్రజామేధయోః. 5-4-122 అనే అష్టాధ్యాయీ సూత్రంవల్ల కేవలం బహువ్రీహి సమాసంలో మాత్రమే మేధా శబ్దం మేధస్ గా మారుతున్నట్లు తెలుస్తుంది. మేధోమథనం తప్పే కావచ్చు.