కవిత్వం

వెతికి వేసారి

31-మే-2013

నిశ్చలమైన ఉపరితలానికి
ఓ గాలి చిరు స్పర్శ
వలయాలు వలయాలుగా
పులకరింతలను పొటమరిస్తుంటే
ఆవిరైపోతున్న ఉనికి
నీడలు నీడలుగా
చూపుకందని దూరాలకు తరలిపోతూ ….

నిలువెల్లా కరిగి కరిగి
ప్రవహించటం మర్చిపోయిన నదినై
ఆకాశానికీ బీటలు వారిన భూమికీ మధ్యన
అదృశ్య రూపాలతో
కట్టిపడేసిన హరిత వనాన్నై
శూన్యంలో చూపులనూ చూపుల్లో శూన్యాన్నీ
భూమధ్య రేఖ నట్ట నడి భాగాన
విత్తనాన్ని చేసి పాతేస్తూ …

ఉదయానికీ అసుర సంధ్యకూ మధ్యన
ఊసుపోని చింపిరి జుట్టు గతంలోకి
వేసవి సాయంకాలాలు వేడికి సుళ్ళుతిరిగిన
వడగాలి సుడి గాలుల్లోకీ
ఎండిన గుండె చెమ్మ తగలగానే
బెండ విత్తనాల్లా విస్ఫోటించే
ఊహల ఎక్కిళ్ళకు
సేద దీర్చే మెత్తని భుజం కోసం
గుడ్డిగా పరుగులు పెడుతూ …

అలసి సొలసి కొడిగట్టిన ఓపిక
నిష్క్రమించాక
ఊపిరి దారుల్లో తలలు వాల్చిన కలలు
ద్రవీభవించి
మసక వెలుతురు మత్తులో
నాలోనే సమస్తం