కబుర్లు

సినిమాల గురించి కొన్ని పిల్ల ఆలోచనలు

19-జూలై-2013

(త్వరలో రాబోతున్న ‘పలక పెన్సిల్’ పుస్తకం నుంచి.)

ఒక పిల్లవాడి ఊహా శక్తి ఎలా ఉంటుంది! బహుశా, నాకు నేనే విడివడి గమనించుకుంటే, ఇలా ఆలోచిస్తారా పిల్లలు అనిపిస్తుంది.
కొత్తగా అక్షరాలు నేర్చుకునేటప్పుడు, కనబడే ప్రతి కాగితమూ చదువుతాం. సినిమా పోస్టర్ల లో కింద నిర్మాత, దర్శకుల పేర్లు విధిగా చదువుతుండే వాణ్ణి. అయితే, పైన బొమ్మలో ఉన్న మనుషుల పేర్లే కింద వేస్తారనుకునేవాణ్ణి. . అయితే,. ఈ తర్కాన్ని రెండు పోస్టర్లు దెబ్బ కొట్టాయి.

‘కిరాతకుడు’ టైటిల్ కింద ఎ. కోదండ రామి రెడ్డి అని ఉంది.. అయితే, అప్పటికి నాకు తెలిసిన ఏకైక హీరో చిరంజీవి. మరి పేరు ఇలా ఎందుకుంది.? ఓహో, ఈ సినిమాలో చిరంజీవి పేరు కోదండ రామిరెడ్డి కావచ్చు. అని సర్ది చెప్పుకున్నా.

ఇక రెండో పోస్టరు ‘తెలియదు’, అందులో పైన మూడు క్యారెక్టర్స్ ఉన్నాయి. కింద రెండు పేర్లే ఉన్నాయి. ఈయన రామోజీరావు. ‘ఈమె’ మౌళి. మరి ఈ మూడో మనిషి ఎవరు?

అంటే, నేను ఆలోచిస్తున్న దాంట్లో ఏదో తేడా ఉంది. పేర్లు ఇలా వేయట్లేదు. దీనికి ఇంకో పద్దతి ఏదో ఉందని నిశ్చయమైంది. (చాలా ఏళ్ళు ఈ రెండో పోస్టరు ప్రతి ఘటన అనుకున్నా. కానీ దీనికి దర్శకుడు టి. కృష్ణ. నేను చదివిందేమో మౌళి. అంటే నా జ్ఞాపకాలు కలగా పులగం అయిపోయాయి.)

  • సినిమా పాటలు ఇక అయిపోతాయేమో, అనే ఒక వినూత్న అందోళన ఉండేది నాకు. అదేదో కొండ కరిగిపోతుందన్నట్టుగా బాధపడే వాణ్ణి. సినిమాకు ఆరు పాటలుండటం సమంజసం. ఎవరైనా మా సినిమాలో ఎనిమిది పాటలున్నా యంటే, నాకు కోపమొచ్చేది. అనవసరంగా రెండు పాటలు వృధా చేస్తున్నారనుకునే వాణ్ణి.
  • అన్నీ యాక్టర్ల కే తెలుసు కదా, మరి డైరెక్టరెందుకు అనుకునేవాణ్ణి. వాళ్ళే అటూ ఇటూ నడుస్తారు. డైలాగ్లు చెబుతారు. అన్నీ వాళ్లకు వాళ్ళు నిర్ణయించు కుంటారు. అలాంటప్పుడు ఈ దర్శకుని పాత్ర ఏమిటో ఎంతకీ అంతు పట్టేది కాదు.
  • ఎన్ని డబ్బులున్నా, ఒకే డ్రెస్సు వేసుకోవడం, ఒకే వాచీ పెట్టుకోవడం ఏంటీ అనిపించేది. రెండున్నర దశాబ్దాల క్రితం మా ఊరి మర్రి చెట్టే ఒక్కోసారి సినిమా హాల్ మాకు. ఆ ఓపెన్ థియేటర్లో సినిమా ప్రారంభం కాక ముందు, ఏదో ‘అవార్డు ఫంక్షన్’ తాలూకు క్లిప్పింగ్ వేసారు. ఇందులో నాకు గుర్తున్న ఒకే ఒక్క దృశ్యం, అర్జున్ వైట్ షర్టు, బ్లూ జీన్స్ (అది జీన్సు అని నాకు అప్పటికే ఎలా తెలుసో!) వేసుకుని, ఏదో అందుకున్నాడు. అరె, సినిమా నటులంటే ఇలాగే ఉంటారా? ఇన్ని డబ్బులున్న వాళ్ళు ఒకే ప్యాంటు వేసుకోవాల్సిందేనా? అని ఆలోచించాను. ఒక దాని మీద ఒకటి రెండు మూడు ప్యాంట్లు, రెండు మూడు అంగీలు, రెండు చేతులకూ మోచేయి దాకా వచ్చేన్ని వాచీలు, నాలుగైదు గొలుసులు….ఇలా ఉంటారనుకున్న/ఉండాలనుకున్న నా ఊహేదో చెదిరి పోయింది.
  • హీరో హీరోయిన్లు నిజంగా ఒకరినొకరు తాకరట. మధ్యలో అడ్డు లుంటాయట., వాళ్ళను వేరే , వీళ్ళను వేరే షూటింగ్ తీసి, దగ్గరగా ఉన్నట్టు కలుపుతారట. అని ఒకటే వాదనలు జరిగేవి. ఒకవేళ తాకే పరిస్థితే వస్తే, హీరోలకు ఉద్రేకం కలగకుండా దానికి ఇంజెక్షన్ వేస్తారుట అని చెప్పుకునే వాళ్ల్లం. ఉద్రేకం స్థానం లో తేలికైన చక్కటి తెలుగు మాటను వాడేవాళ్ళం. దాన్నిక్కడ రాయలేకపోతున్నా, ఖర్మ.
  • నేను ఆరో క్లాసుకి మామయ్య వాళ్ళింటికి మేడ్చల్ రావడం వల్ల, అప్పుడే కొత్త కొత్తగా టీవీ తెలుసు. ఎదురుగా ఉండే సలీం వాళ్ళింట్లో టివి ఉండేది. ‘చిత్రలహరి’కి వాళ్ళింటికి వెళ్ళడానికి మామయ్య అనుమతించే వాడు. అయితే, నాకో పెద్ద ధర్ సందేహం ఉండేది. ఎవరో ఆ సమయానికి చిరంజీవిలాగానో, ఇంకెవరిలాగానో వేషం వేసుకొచ్చి టీవీ లో డ్యాన్స్ చేసి వెళ్లి పోతారనుకునే వాణ్ణి. ఇంత సరిగ్గా, వాళ్ళ లాగే వేరే మనుషులు ఎలా చేస్తారబ్బా అనుకునే వాణ్ని.
  • ఎనిమిది, తొమ్మిది క్లాసుల్లో, హైదరాబాద్, సికింద్రాబాద్ లోని థియేటర్స్ లో చాలా సినిమాలు 1.50 టికెట్ కు చూసాను. పైసలు కొన్ని మిగుల్చుకుందామని కొంతా, మన దగ్గర ఉండేవి అంతకే రావడం కొంతా… దీనికి కారణాలు. అయితే, నేల క్లాసు వాళ్లకు ఎప్పుడూ ముందు టికెట్స్ ఇవ్వరు. బాల్కనీ, డీలక్స్ అన్నీ అయిపోయాక, ఇక సినిమా స్టార్ట్ అవుతోందనగా మొదలు పెట్టేవాళ్ళు. నాకు తాపీగా వెళ్లి , న్యూస్ రీల్ నుంచి చూస్తే తప్ప సినిమా చూసినట్టుండదు. నేనే గనక భవిష్యత్ లో ధియేటర్ కడితే, బుకింగ్ రివర్స్ ఆర్డర్ లో ఇప్పిస్తాను, అనుకునేవాణ్ణి.
  • అనుపమ్ ఖేర్ నన్ను ఎన్ని చీకటి రాత్రులు భయపెట్టాడో! ‘నిగాహే’ ఎఫెక్ట్! నేను చూసిన మొట్టమొదటి హిందీ సినిమా. దెయ్యాలూ, ఈవిల్ డెడ్లూ, ఇంకా ఇటీవలి ఎర్ర గులాబీలు మీనాక్షమ్మలు కూడా అప్పుడప్పుడూ కిటికీ లోంచి నా కోసం చేయి సాచుతూనే ఉంటాయి.
  • హిందీ మాట్లాడే వాళ్ళంతా ముస్లింలేనేమో అనుకునేవాణ్ణి. సినిమాల్లో బొట్టు పెట్టుకుని హిందీలో మాట్లాడే ఆడవాళ్ళను చూసినప్పుడు, ‘అరె, వీళ్ళు ఇల్లా ఉన్నారేమిటి? ఇలా మాట్లాడుతున్నారేమిటి?’ అనుకునేవాణ్ణి.
  • సినిమాకు సంబంధించి నా బాల్యంలో ఎక్కువ వాటా ఆక్రమించింది చిరంజీవి. ఐదో క్లాసులో మా కుటుంబం అంతా వేములవాడ గుడికి వెళ్ళాం. అమ్మ, బాపు, చెల్లి, తమ్ముడు, మా అక్క, అక్కంటే పెద్దమ్మ కూతురు. అంతా అయ్యాక, సినిమా చూద్దామా ? ఫోటో దిగుదామా? అని ధర్మసందేహంలో పెట్టాడు బాపు. ఏదో ఒకటి ఎంపిక చేసుకోవాలి. వేములవాడలో ఉన్న మూడు థియేటర్స్ లో, ‘శివరామకృష్ణ’లో అనుకుంటా, మగధీరుడు ఆడుతోంది. నేనూ, తమ్ముడూ ఉత్సాహంగా సినిమా అన్నాం. అమ్మాయిలిద్దరూ ఫోటో దిగుదామన్నారు. చూడండి. వాళ్ళది ఎంత ప్రణాలిళికా బద్దమైన, కాలానికి నిలబడగలిగే ఆలోచన! అయితే, ఆ రోజు అటు ఫోటో దిగామూ, ఇటు సినిమా కూడా చూసామూ. నా (మా) చిన్నతనం లో దిగిన మొదటి, ఏకైక ఫోటో అదే. మేం పిల్లలం నలుగురం ఉంటాం అందులో. ఆ ఫోటో చూస్తే, మగధీరుడు గుర్తొస్తుంది. చిరంజీవి గుర్తొస్తాడు.
    చిరంజీవి మీద పీక్ అభిమానం ఎప్పుడంటే, ముగ్గురు మొనగాళ్ళు స్టేజ్ లో. ఆ సినిమా ఇంకా విడుదల కావట్లేదేంటబ్బా, ఒకవేళ ఇంటర్వెల్ వరకు గనక షూటింగ్ అయివుంటే, అంతవరకు విడుదల చేసేస్తే అయిపోతుంది కదా! అనుకునే వాణ్ని. ఇప్పుడు ఆ అభిమానాలన్నీ ఎక్కడ కరిగి, ఎలా అవిరైపోయయో!

అప్పటి అభిమానం సత్యమా? ఇప్పటి తటస్థత సత్యమా?